పాకిస్తాన్: ‘సైన్యం మమ్మల్ని చితకబాదింది, ఏ మొహంతో డ్యూటీ చేయగలం’ అని అక్కడి పోలీసులు ఎందుకు వాపోతున్నారు?

పాకిస్తాన్

ఫొటో సోర్స్, PUNJAB POLICE

    • రచయిత, తుర్హాబ్ అస్గర్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

“పోలీస్ స్టేషన్‌లో మమ్మల్ని దుస్తులు విప్పి కొట్టారు. మాకు అవమానం జరిగింది. మా ఐజీ మాకు మద్దతుగా ఉంటే బాగుండేది. నాతో పాటు ఎవరూ ఇక్కడ డ్యూటీ చేయాలని అనుకోరు. ఇన్ని దెబ్బలు, అవమానాలు చూసిన తర్వాత ప్రజలకు ఇక పోలీసులంటే భయం ఉండదు. మా ఉన్నతాధికారులు మమ్మల్ని చేతగాని వాళ్లను చేశారు"

పాకిస్తాన్‌లోని బహవల్‌నగర్‌ జిల్లాలోని 'పోలీస్ స్టేషన్ డివిజన్ ఏ'లో తమను ఆర్మీ అధికారులు హింసించారని ఆరోపించిన పోలీసులలో ఒకరు ఈ వ్యాఖ్యలు చేశారు.

పంజాబ్‌లోని బహవల్‌నగర్‌లోని ఒక పోలీస్ స్టేషన్‌పై సైనికులు దాడి చేసి, అక్కడి పోలీసులను తీవ్రంగాకొట్టి వారం రోజులయింది.

ఆ ఘటన ఇప్పటికీ పాకిస్తాన్ మీడియాతో పాటు సోషల్ మీడియాలోనూ చర్చనీయాంశంగానే ఉంది.

అక్కడి పంజాబ్ పోలీసులు బీబీసీతో తమ ఆవేదనను వెళ్లబోసుకున్నారు. వారు చెప్పిన దాని ప్రకారం బహవల్‌నగర్ సంఘటన పోలీసులను బాగా ప్రభావితం చేసింది.

ఈద్ రోజున ఘటనకు సంబంధించిన చాలా వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి, ఇందులో యూనిఫాం ధరించిన ఆర్మీ అధికారులు పోలీస్‌ స్టేషన్‌లో పోలీసులను కొట్టడం కనిపించింది.

ఈ సంఘటన జరిగిన రెండు రోజుల తర్వాత, పాకిస్తాన్ ఆర్మీ పబ్లిక్ రిలేషన్స్ డిపార్ట్‌మెంట్ 'ఐఎస్పీఆర్', పంజాబ్ ప్రభుత్వం, పోలీసులు పారదర్శకమైన ఉమ్మడి దర్యాప్తు చేస్తామని ప్రకటించారు. ఇందుకోసం జాయింట్ ఇన్వెస్టిగేషన్ టీమ్‌ (జేఐటీ)ను ఏర్పాటు చేశారు.

హోం మంత్రి మొహ్సిన్ నఖ్వీ సోమవారం లాహోర్‌లో విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ “ఇది అంత పెద్ద సమస్య కాదు. కొంతమంది ఈ విషయాన్ని ఎక్కువ చేశారు” అని అన్నారు.

ఈ ఘటన వల్ల పోలీసుల నైతిక స్థైర్యం దిగజారదని ఆయన అభిప్రాయం వ్యక్తంచేశారు. భారత్‌లో ఇలాంటి ఘటనే జరిగిందని నఖ్వీ గుర్తుచేశారు.

పోలీసుల నైతికత, వారి భయాందోళనల గురించి పంజాబ్ ఐజీ ఉస్మాన్ అన్వర్‌ను బీబీసీ సంప్రదించినప్పుడు ఆయన మాట్లాడుతూ "జేఐటీ ఏర్పాటు చేశాం, ఇతర ప్రశ్నలపై స్పందించాలనుకోవడం లేదు" అని అన్నారు.

పాకిస్తాన్

ఫొటో సోర్స్, PUNJAB POLICE

'సైన్యాన్ని దోషిగా నిలబెట్టే ధైర్యం ఉందా?'

జాయింట్ ఇన్వెస్టిగేషన్ టీం ఏర్పాటయినప్పటికీ చాలామందికి ఈ ఘటనపై ఆందోళనలున్నాయి. బహవల్‌నగర్ పోలీసులు విధులు నిర్వహించేందుకు విముఖత చూపుతున్నారని పలువురు పోలీసు అధికారులు అంటున్నారు.

“బహవల్‌నగర్ ఘటన పోలీసులను ఇబ్బంది పెట్టింది. ఐజీ వీడియో సందేశంతో పోలీసుల్లో మనోధైర్యం పోయింది. సైన్యం తన బలాన్ని చూపించడానికే ఇష్టపడుతుందని తెలుసు, కానీ అది దేశంలోని ఇతర సంస్థలను గౌరవించకూడదని కాదు. చట్టం అందరికీ సమానమే'' అని పేరు చెప్పడానికి ఇష్టపడని ఒక పోలీసు అధికారి బీబీసీతో అన్నారు.

“ఇప్పుడు నా సబార్డినేట్లను సమర్ధవంతంగా పని చేయాలంటూ ఎలా చెప్పగలను, నాకు ఇబ్బందిగా అనిపిస్తుంది. ఈ ఘటన తర్వాత పోలీసుల్లో అశాంతి, ఆగ్రహం, అపనమ్మకం నెలకొనడంలో సందేహం లేదు. జరిగినదాన్ని మర్చిపోయేలా చేసేందుకు అత్యున్నత స్థాయిలో ప్రయత్నాలు జరుగుతున్నాయి'' అని ఆయన ఆరోపించారు.

‘ఆల్ ఈజ్ వెల్, మేం బ్రదర్స్’ అని చెప్పినంత మాత్రాన అంతా సవ్యంగా సాగదని మరో పోలీసు అధికారి అన్నారు. ఐజీ పోలీసులకు మద్దతుగా నిలబడి ఉంటే బాగుండేదని, వారి వెనకే పోలీసు యంత్రాంగం ఉండేదని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.

“ఏడాది కాలంగా సైన్యం, పోలీసులు కలిసి పనిచేస్తున్నాయి. ఈ దేశంలో వారు(సైన్యం) ఏం చేయగలరో చెబుతూనే ఉన్నారు'' అని ఒక స్టేషన్ హౌజ్ ఆఫీసర్ (ఎస్‌హెచ్‌వో) అన్నారు.

''జేఐటీ విచారణలో పోలీసులే దోషులుగా తేలుతారు. సైన్యాన్ని దోషిగా నిలబెట్టే ధైర్యం ఎవరికి ఉంది?” అని ఎస్‌హెచ్‌వో చెప్పారు.

డాక్టర్ ఉస్మాన్ (ఐజీ) పోలీసు శాఖ కోసం చాలా కృషి చేశారని, అయితే, ఈ ఘటన తర్వాత ఆయన వెనక్కి తగ్గుతారని ఊహించలేదని సీనియర్ అధికారి ఒకరు బీబీసీతో తెలిపారు.

“గత రెండేళ్లలో పోలీసులలో నైతికత పెరిగింది, దీనికి కారణం పోలీసు ఉన్నతాధికారుల మద్దతు. కానీ, ఐజీ ఇపుడు పోలీసులకు అండగా నిలబడకపోవడం అందరినీ నిరాశపరిచింది'' అని అన్నారు.

పాకిస్తాన్

ఫొటో సోర్స్, TAHIR KARIM/BBC URDU

గతంలోనూ ఇలాంటి ఘటనలు..

ఇలాంటి ఘటన బహవల్‌నగర్‌లో మొదటిది కాదు. ఇంతకు ముందు కూడా జరిగాయి. 2020లో సింధ్ ఐజీని రేంజర్లు కిడ్నాప్ చేశారని ఆరోపణలు వచ్చాయి.

ముస్లిం లీగ్ (నవాజ్) నాయకురాలైన మరియం నవాజ్ భర్త, కెప్టెన్ సఫ్దర్‌పై కేసు నమోదుచేసి, అరెస్టు చేయాలని పోలీసులపై ఒత్తిడి పెరిగింది.

దీంతో ఐజీ, ఇతర పోలీసు అధికారులు పది రోజుల పాటు సెలవుపై వెళ్లేందుకు ఉన్నతాధికారుల వద్ద దరఖాస్తు చేసుకున్నారు. అనంతరం బాధ్యులపై చర్యల కోసం అన్ని వైపులా ఆర్మీపై ఒత్తిడి పెరిగింది.

అప్పటి ఆర్మీ చీఫ్ జనరల్ బజ్వా ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రేంజర్స్‌పై దర్యాప్తుకు ఆదేశించారు. విచారణ పూర్తయ్యే వరకు ఆ అధికారులను విధుల నుంచి తప్పించాలని ఆదేశించారు.

ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయని మాజీ పోలీసు అధికారి, ఐజీ ఎహసాన్ ఘనీ అన్నారు.

“వీటిలో కొందరు ముందుకు వచ్చారు. నేను ఐజీగా ఉన్నప్పుడు ఏఎస్‌ఐకి, సైన్యానికి మధ్య ఇలాంటి సంఘటన ఒకటి జరిగింది. నేను పోలీసుల వైపు నిలబడ్డాను. సైన్యం వినలేదు, చట్టం ప్రకారం ఎఫ్ఐఆర్ నమోదు చేశాను'' అని అన్నారు.

పాకిస్తాన్

ఫొటో సోర్స్, PUNJAB POLICE

పోలీసులపై ప్రభావం చూపుతుందా?

“ఇలాంటి సంఘటనల వల్ల పోలీసుల నైతికత తగ్గిపోతుందనేది నిజం. నేను వివిధ స్థాయిల పోలీసు అధికారులకు అకాడమీలో ఉపన్యాసాలు ఇస్తాను. వారి వైపు నుంచి కూడా ఇటువంటి ప్రశ్నలు వస్తాయి, పోలీసులపై ఎంత ప్రభావం పడిందో దీన్నిబట్టి అర్థమవుతోంది'' అని ఎహసాన్ ఘనీ అన్నారు.

''ఇలాంటి సంఘటనలు పోలీసుల నమ్మకంపై ప్రభావం చూపిస్తుంది. ప్రజలు కూడా పోలీసులను సీరియస్‌గా తీసుకోరు. ఇది చట్టం అమలులో సమస్యలను సృష్టిస్తుంది" అని అన్నారు.

“ఏదైనా ప్రభుత్వ సంస్థ లేదా శక్తి తన అధికార పరిధికి మించి ప్రయత్నిస్తే ఇబ్బంది తలెత్తుతుంది. బహవల్‌నగర్‌లో ఇదే జరిగింది. ఈ సంఘటనలో పోలీసుల తప్పు ఎంత ఉందంటున్నారో, సైన్యం చేసినది కూడా చట్టపరంగా తప్పే'' అని ఘనీ అన్నారు.

దీనిపై దర్యాప్తునకు జేఐటీ ఏర్పాటైందని, అయితే ఒక ఘటనను మార్చిపోవాలి అనుకున్నప్పుడు జేఐటీ ఏర్పాటవుతుందని అందరికీ తెలుసునని మాజీ ఐజీ ఆరోపించారు.

ఇవి కూడా చదవండి:

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)