ఇరాన్, ఇజ్రాయెల్‌.. ఎవరి దగ్గర ఆయుధాలు ఎక్కువ?

ఇజ్రాయెల్, ఇరాన్

ఫొటో సోర్స్, Reuters

    • రచయిత, ఆరిఫ్ షమీమ్
    • హోదా, బీబీసీ న్యూస్ ఉర్దూ, బీబీసీ న్యూస్ పర్షియన్

ఏప్రిల్ 13 (శనివారం) అర్ధరాత్రి ఇజ్రాయెల్‌పై క్షిపణులు, డ్రోన్లతో ఇరాన్ దాడి చేసింది. శుక్రవారం (ఏప్రిల్ 19) ఇరాన్‌పై ఇజ్రాయెల్ క్షిపణితో దాడి చేసిందని అమెరికా తెలిపింది.

ఈ రెండు దేశాల పరస్పర దాడులతో మధ్యప్రాచ్యంలో మరోసారి భయాందోళనలు పెరిగాయి.

ఇరాన్ చేసిన దాడితో ఇజ్రాయెల్‌లో చెప్పుకోదగ్గ స్థాయిలో నష్టం జరగలేదు. కానీ, సుదూర ప్రాంతం నుంచి 300కి పైగా పేలుడు పదార్థాలతో దాడి చేయగల సామర్థ్యాన్ని ఇరాన్ ప్రదర్శించింది.

తాజాగా ఇరాన్‌లోని ఇస్ఫహాన్‌ ప్రాంతంపై ఇజ్రాయెల్ క్షిపణితో దాడి చేసిందని అమెరికా చెప్పింది. అయితే, చిన్న డ్రోన్లు మాత్రమే తమ భూభాగం వైపు వచ్చాయని, వాటిని కూల్చేశామని ఇరాన్ పేర్కొంది.

ఈ రెండు దేశాల మధ్య కొంతకాలంగా ఉద్రిక్తతలు పెరుగుతూ వస్తున్నాయి.

ఇరాన్ తన అనుబంధ గ్రూపుల ద్వారా ఇజ్రాయెల్‌పై దాడులు చేయిస్తోందని ఆరోపణలు ఉన్నాయి. అలాగే, ఇరాన్‌ సంబంధిత ప్రాంతాలపై ఇజ్రాయెల్ దాడులు చేస్తోందనే అభియోగాలు ఉన్నాయి. పరస్పర ఆరోపణలతో ఈ దేశాల మధ్య చాలా కాలంగా ప్రచ్ఛన్న యుద్ధంలా ఉన్న పరిస్థితి తాజా పరిణామాలతో తీవ్రరూపం దాల్చింది.

ఈ ఘర్షణ వాతావరణం మరింత తీవ్రమవుతుందేమోననే ఆందోళనలు ఉన్నాయి.

క్షిపణుల చిత్రాల దగ్గర మహిళ

ఫొటో సోర్స్, EPA

ఎవరిది పైచేయి?

కింద పేర్కొన్న అంశాల ఆధారంగా ఈ ప్రశ్నను బీబీసీ అంచనా వేసింది. అయితే, బహిర్గతం కాని, రహస్యంగా ఉంచిన ఏదైనా ప్రత్యేక సామర్థ్యం ఏ దేశమైనా కలిగి ఉండే అవకాశం ఉంది.

ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ స్ట్రాటజిక్ స్టడీస్ (ఐఐఎస్ఎస్) వివిధ అధికారిక, ఇతర పద్ధతుల ద్వారా రెండు దేశాల మిలిటరీల ఆయుధ సంపత్తిని బేరీజు వేసి అత్యుత్తమ అంచనాలను రూపొందించింది.

స్టాక్‌హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసర్చ్ ఇన్‌స్టిట్యూట్ వంటి ఇతర సంస్థలు కూడా అంచనాలు రూపొందిస్తాయి. అయితే, తరచుగా గణాంకాలు అందజేయని దేశాల అంచనాలు మారొచ్చు.

అయితే, ప్రపంచవ్యాప్తంగా దేశాల సైనిక బలాన్ని అంచనా వేసేందుకు ఐఐఎస్ఎస్‌ను బెంచ్‌మార్క్‌గా పరిగణిస్తున్నట్లు పీస్ రీసర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఓస్లో(పీఆర్‌ఐఓ)కి చెందిన నికోలస్ మార్ష్ తెలిపారు.

ఇజ్రాయెల్, ఇరాన్ జనాభా, రక్షణ బడ్జెట్లు

ఐఐఎస్ఎస్ ప్రకారం, ఇజ్రాయెల్ తన రక్షణ కోసం ఇరాన్ కంటే ఎక్కువ ఖర్చు చేస్తోంది.

2022, 2023లో ఇరాన్ రక్షణకు కేటాయించిన బడ్జెట్ ఏడాదికి దాదాపు 7.4 బిలియన్ డాలర్లు కాగా, ఇజ్రాయెల్ రెండింతల కంటే ఎక్కువ, దాదాపు 19 బిలియన్ డాలర్లు ఖర్చు చేస్తున్నట్లు ఐఐఎస్ఎస్ పేర్కొంది. ఇజ్రాయెల్ రక్షణ వ్యయం దాని స్థూల జాతీయోత్పత్తితో పోల్చినా ఇరాన్ కంటే రెట్టింపు ఉంది.

సాంకేతిక ప్రయోజనం ఎవరికి ఎక్కువ?

యుద్ధం కోసం ఇజ్రాయెల్ వద్ద 340 సైనిక విమానాలు సిద్ధంగా ఉన్నాయని ఐఐఎస్ఎస్ గణాంకాలు చెబుతున్నాయి. కచ్చితమైన వైమానిక దాడుల్లో ఈ విమానాలు ఉపయోగపడతాయి.

ఇజ్రాయెల్ వద్దనున్న సైనిక విమానాల్లో సదూరం నుంచి దాడులు చేసే ఎఫ్-15 విమానాలు, ఎప్-35 అత్యాధునిక రహస్య విమానాలు ఉన్నాయి. ఇవి రాడార్ నుంచి కూడా తప్పించుకోగలవు. వేగంగా దాడి చేయగలవు.

ఇరాన్ వద్ద సుమారు 320 యుద్ధ సామర్థ్యపు విమానాలు ఉండొచ్చని ఐఐఎస్ఎస్ అంచనావేస్తుంది.

1960 నాటికి చెందిన జెట్స్‌, ఎఫ్-4లు, ఎఫ్-5లు, ఎఫ్-14లు కూడా ఇరాన్ వద్ద ఉన్నాయి.

అయితే, ఈ పాత విమానాల్లో ఎన్ని ప్రస్తుతం ఎగురుతున్నాయన్న విషయంలో స్పష్టత లేదని పీఆర్ఐఓ నికోలస్ మార్ష్ తెలిపారు.

ఎందుకంటే, పాడైన వీటి విడి భాగాలకు మరమ్మత్తులు చేయించడం కష్టం.

ఎఫ్-14 టామ్‌కాట్‌ను 20 ఏళ్ల క్రితమే అమెరికా వైమానిక దళం నిలిపివేసింది. కానీ, ఇరాన్‌లో మాత్రం ఇంకా సర్వీసుల్లో ఉంది.

ఐరమ్ డోమ్, యారో వ్యవస్థలు

ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థకు వెన్నుదన్ను అంటే ఐరమ్ డోమ్, యారో వ్యవస్థలే.

దేశ రక్షణ మంత్రిత్వ శాఖలో ఇజ్రాయెల్ క్షిపణి రక్షణ సంస్థను క్షిపణి ఇంజనీర్ యుజి రుబిన్ స్థాపించారు.

శనివారం ఇజ్రాయెల్‌ పైకి ఇరాన్ ప్రయోగించిన క్షిపణులను, డ్రోన్లను సుమారు అన్నింటిన్నీ ఐరమ్ డోమ్, అంతర్జాతీయ మిత్ర దేశాలు కూల్చేయడం చూసిన తర్వాత తనెంత సురక్షితంగా భావించానో ప్రస్తుతం జెరూసలేం ఇన్‌స్టిట్యూట్ ఫర్ స్ట్రాటజీ అండ్ సెక్యూరిటీ సీనియర్ రీసెర్చర్‌గా ఉన్న యుజి రుబిన్ తెలిపారు.

‘‘నేనెంతో సంతృప్తికరంగా, సంతోషంగా భావించాను. లక్ష్యాలకు వ్యతిరేకంగా ఇది పనిచేసింది. ఇది షార్ట్ రేంజ్ మిసైల్ డిఫెన్స్. మరే ఇతర వ్యవస్థకు కూడా ఇది సమానం కాదు’’ అని చెప్పారు.

ఇరాన్ ప్రయోగించిన 300కి పైగా క్షిపణులను, డ్రోన్లను ధ్వంసం చేసేందుకు ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ రక్షణ వ్యవస్థ సాయం చేసింది.

ఇజ్రాయెల్ నుంచి ఇరాన్ ఎంత దూరంలో ఉంది?

ఇరాన్ నుంచి 2,100 కి.మీలకు పైగా దూరంలో ఇజ్రాయెల్ ఉంది.

ఇజ్రాయెల్‌ కంటే ఇరాన్ చాలా పెద్ద దేశం. జనాభా పరంగా ఇజ్రాయెల్ కంటే పదింతలు ఎక్కువగా ఉంటుంది.

ఇజ్రాయెల్‌తో పోలిస్తే ఇరాన్‌లో ఆరింతలు ఎక్కువ మంది సైనికులున్నారు. ఇరాన్‌లో 6 లక్షల మంది సైనికులుంటే, ఇజ్రాయెల్ వద్ద 1,70,000 మంది ఉన్నట్లు ఐఐఎస్ఎస్ చెప్పింది.

ఇజ్రాయెల్ దేశంపై దాడి చేసేలా ఇరాన్ క్షిపణులు దూసుకొచ్చాయి. ఇరాన్ క్షిపణి కార్యక్రమాన్ని మధ్య ప్రాచ్యంలో అత్యంత భిన్నమైనదిగా, అతిపెద్దదిగా భావిస్తారు.

ఇరాన్ వద్ద 3 వేలకు పైగా బాలిస్టిక్ క్షిపణులు ఉన్నాయని 2022లో అమెరికా సెంట్రల్ కమాండ్‌కు చెందిన జనరల్ కెన్నెథ్ మెకెంజీ చెప్పారు.

ఇజ్రాయెల్ కూడా పలు దేశాలకు క్షిపణులను ఎగుమతి చేస్తుందని సీఎస్ఐఎస్ మిస్సైల్ డిఫెన్స్ ప్రాజెక్ట్ తెలిపింది.

ఇరాన్ క్షిపణులు, డ్రోన్లు

1980 నుంచి 1988 మధ్యకాలంలో సరిహద్దు దేశమైన ఇరాక్‌తో యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇరాన్ తన క్షిపణి వ్యవస్థలు, డ్రోన్లను అభివృద్ధి చేసుకునేందుకు విస్తృతంగా పనిచేస్తుంది.

షార్ట్, లాంగ్ రేంజ్ క్షిపణులను, డ్రోన్లను ఇది అభివృద్ధి చేసింది. వాటిలో చాలా వరకు ఇటీవల ఇజ్రాయెల్‌పైకి ప్రయోగించింది.

హూతీ రెబల్స్ సౌదీ అరేబియా లక్ష్యంగా చేసుకున్న క్షిపణులను ఇరాన్‌ తయారు చేసినవేనని అనలిస్ట్‌ల పరిశీలనలో తెలిసింది.

లాంగ్ రేంజ్ ఎటాక్స్ ద్వారా ప్రతీకారం

ఇజ్రాయెల్ దేశం ఇరాన్‌తో గ్రౌండ్‌లోకి దిగి పోరాటం చేయదని డిఫెన్స్ ఐ ఎడిటర్ టిమ్ రిప్లీ చెప్పారు.

‘‘ఇజ్రాయెల్‌కు అతిపెద్ద ప్రయోజనం దాని వైమానిక శక్తి, ఆయుధాలే. ఇరాన్‌లో కీలక లక్ష్యాలపై వైమానిక దాడులు చేసే సామర్థ్యం దీనికి ఉంది’’ అని తెలిపారు.

ఇజ్రాయెల్ నింగి నుంచి జరిపే దాడులతోనే కీలక అధికారులను చంపేయగలదని, ఆయిల్ ఇన్‌స్టాలేషన్స్ ధ్వంసం చేయగలని చెప్పారు.

గతంలో ఇరాన్ మిలటరీకి చెందిన ఉన్నతా అధికారులు, పౌర నాయకులు వైమానిక దాడుల్లోనే చనిపోయారు.

ప్రముఖ ఇరాన్ అధికారులను లక్ష్యంగా జరిపిన చాలా దాడులకు ఇజ్రాయెల్ బాధ్యత వహించడం లేదు. అంతేకాక, తానే ఈ దాడులు చేశానన్న విషయాన్ని కూడా ఖండించడం లేదు.

నావిక దళాలు

ఇరాన్ నావిక దళాల వద్ద 220 నౌకలు, ఇజ్రాయెల్ వద్ద సుమారు 60 నౌకలు ఉన్నట్లు ఐఐఎస్ఎస్ చెబుతోంది.

సైబర్ దాడులు

సైబర్ దాడుల్లో ఇరాన్ కంటే ఎక్కువగా నష్టపోయింది ఇజ్రాయెలే.

ఇజ్రాయెల్‌తో పోలిస్తే ఇరాన్ రక్షణ వ్యవస్థ సాంకేతికపరంగా తక్కువ అభివృద్ధి చెందింది. దీంతో ఇజ్రాయెల్ సైన్యంపై ఎలక్ట్రానిక్ దాడి ఎక్కువగా జరగనుంది.

‘‘అంతకుముందు కంటే సైబర్ దాడుల తీవ్రత పెరిగింది. కనీసం మూడింతలు ఎక్కువగా ఈ దాడులు జరిగాయి. ఇజ్రాయెల్ ప్రతి రంగంపై ఈ సైబడర్ దాడులు జరిగాయి. ఈ యుద్ధంలో ఇరాన్, హిజ్బొల్లా(లెబనాన్ మిలటెంట్, పొలిటికల్ ఆర్గనైజేషన్) మధ్య సహకారం పెరిగింది’’ అని ఇజ్రాయెల్ ప్రభుత్వ నేషనల్ సైబర్ డైరెక్టరేట్ తెలిపింది.

అక్టోబర్ 7 నుంచి 2023 ఏడాది ముగిసే నాటికి 3,380 సైబర్ దాడులు జరిగినట్లు ఇది రిపోర్టు చేసింది.

ఇరాన్‌లో పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్న సమయంలో ఒక నెలలోనే సుమారు 3,380 సైబర్ దాడులు జరిగాయని ఇరాన్ సివిల్ డిఫెన్స్ ఆర్గనైజేషన్ అధినేత, బ్రిగేడియర్ జనరల్ ఘోలమ్రెజా జలాలి చెప్పారు.

దేశవ్యాప్తంగా సైబర్ దాడులతో పెట్రోల్ స్టేషన్లలో అంతరాయం నెలకొందని ఇరాన్ ఆయిల్ మంత్రి డిసెంబర్‌లో తెలిపారు.

అణుముప్పు

ఇజ్రాయెల్‌కు సొంతంగా అణు ఆయుధాలున్నట్లు అంచనాలున్నాయి. కానీ, దీనిపై ప్రభుత్వ అధికారిక విధానం ఏంటన్న విషయంలో స్పష్టత లేదు.

ఇరాన్ వద్ద అణు ఆయుధాలను లేవని అనుకుంటున్నారు. తన పౌర అణు కార్యక్రమాన్ని అణు ఆయుధాలు కలిగిన దేశంగా మార్చుకోవడం కోసం ప్రయత్నిస్తుందన్న ఆరోపణలను ఇరాన్ ఖండిస్తుంది.

ఇజ్రాయెల్, ఇరాన్ ‘ప్రాక్సీ వార్’ ఏంటి?

ఇప్పటి వరకు ఇరాన్, ఇజ్రాయెల్ ఎదురెదురుగా తలపడనప్పటికీ, అనధికారికంగా ఈ రెండు దేశాల మధ్య ఘర్షణలు జరుగుతూనే ఉన్నాయి.

ఇరాన్‌కు చెందిన ప్రముఖ వ్యక్తులు ఇతర దేశాల్లో పలు దాడుల్లో మృతి చెందారు. దీనికి ఇజ్రాయెలే కారణమని ఆరోపణలున్నాయి. అలాగే, ఇరాన్ కూడా పరోక్షంగా ఇజ్రాయెల్‌ను లక్ష్యంగా చేసుకుని దాడులు జరుపుతుంది.

మిలిటెంట్, పొలిటికల్ గ్రూప్ హిజ్బొల్లా లెబనాన్ నుంచి ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా ఇరాన్ కోసం పరోక్ష యుద్ధాలను చేపడుతోంది. హిజ్బొల్లాకు మద్దతు ఇస్తున్నామనే విషయాన్ని ఇరాన్ కూడా ఖండించడం లేదు.

అలాగే, గాజాలో కూడా హమాస్‌కు ఇరాన్ మద్దతు ఇస్తుంది. దశాబ్దాలుగా ఇజ్రాయెల్ భూభాగంపై గాజా స్ట్రిప్ నుంచి రాకెట్లను ప్రయోగిస్తుంది.

ఈ క్రమంలోనే అక్టోబర్ 7న హమాస్ ఇజ్రాయెల్‌పై దాడులు జరిపింది. దీనికి ప్రతిగా ప్రస్తుతం ఇజ్రాయెల్ గాజా స్ట్రిప్‌లో దాడులు చేస్తుంది.

హమాస్‌కు ఇరాన్ ఆయుధాలను, మందుగుండు సామాగ్రిని, శిక్షణను అందిస్తుందని ఇజ్రాయెల్, పశ్చిమ దేశాలు భావిస్తున్నాయి.

యెమెన్‌లో హూతీలను ఇరాన్ ప్రాక్సీలుగా చూడొచ్చు. ఇరాన్‌కు చెందిన ఇతర గ్రూప్‌లు కూడా ఇరాక్, సిరియాలో ఉన్నాయి.

సిరియా ప్రభుత్వానికి ఇరాన్ సహకారం ఉంది. ఇజ్రాయెల్‌పై దాడులు చేసేందుకు సిరియా భూభాగాన్ని వాడుకుంటున్నట్లు ఇది చెప్పింది.

ఇవి కూడా చదవండి:

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)