ఇజ్రాయెల్ - ఇరాన్‌: ఈ రెండు దేశాల మధ్య ఏం జరుగుతోంది?

ఇరాన్ ఇజ్రాయెల్ దాడులు

ఫొటో సోర్స్, Getty Images

'ఇరాన్ దాడులకు సరైన సమయంలో బదులిస్తాం'... డ్రోన్లు, మిస్సైల్స్‌తో ఇరాన్ దాడి చేసిన తర్వాత ఇజ్రాయెల్ స్పందన ఇది.

ఇజ్రాయెల్ క్షిపణి ఇరాన్‌పై దాడి చేసినట్లు బీబీసీ అమెరికా భాగస్వామి సీబీఎస్ న్యూస్‌తో అమెరికన్ అధికారులు చెప్పారు.

శుక్రవారం తెల్లవారుజామున ఇరాన్‌లోని ఇస్ఫహాన్‌కు వాయువ్యంగా పేలుడు శబ్దం వినిపించిందని ఆ దేశ వార్తా సంస్థ ఫార్స్ తెలిపింది. నగరంలోని అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలో ఈ శబ్దం వినిపించిందని ఫార్స్ పేర్కొంది.

అయితే, ఇస్ఫాహాన్ నగరంలో ఎటువంటి నష్టం వాటిల్లలేదని ఆర్మీ జనరల్‌ను ఉటంకిస్తూ ఇరాన్ మీడియా తెలిపింది. ‘‘ఇస్ఫహాన్ నగరంలో భారీ శబ్దాలు వినిపించాయి. ఈ శబ్దాలు గగన తల రక్షణ వ్యవస్థ అనుమానిత వస్తువులపై చేసిన కాల్పుల కారణంగా ఏర్పడినవే’’ అని వివరించాయి.

ఇజ్రాయెల్ క్వాడ్‌కాప్టర్స్ (డ్రోన్లు)ను ఎగరవేసేందుకు విఫలయత్నం చేసిందని, వాటిని తాము కూల్చివేశామని ఇరాన్ జాతీయ సైబర్ స్పేస్ సెంటర్ అధికార ప్రతినిధి హోస్సెన్ డల్లిరియాస్ తెలిపారు.

ఇస్ఫహాన్ ప్రావిన్స్ భారీ వైమానిక స్థావరం, మిస్సైల్స్ ఉత్పత్తి కేంద్రంతో పాటు అణు కేంద్రాలకు నిలయంగా ఉంది.

ఇరాన్ గగనతల రక్షణ వ్యవస్థ(ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్)ను యాక్టివేట్ చేసినట్లు ఆ దేశ అధికారిక వార్తా సంస్థ ఐఆర్‌ఎన్‌ఏ తెలిపింది. ఇరాన్ తన ఎయిర్ డిఫెన్స్ బ్యాటరీలను సిద్ధం చేసినట్లు పేర్కొంది.

అసోసియేటెడ్ ప్రెస్ ప్రకారం, ఇరాన్‌లోని అనేక నగరాల్లో విమానాల రాకపోకలను నిలిపివేసినట్లు ఇరాన్ ప్రభుత్వ మీడియా రిపోర్ట్ చేసింది.

ఇరాన్ రాజధాని టెహ్రాన్‌కు దక్షిణాన 350 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇస్ఫహాన్‌లో పేలుళ్లు జరిగినట్లు వార్తా సంస్థలు రిపోర్ట్ చేస్తున్నాయి.

ఇరాన్ వైమానిక స్థావరం, అణు కేంద్రాలు మాత్రమే కాకుండా, ఇరాన్ యురేనియం శుద్ధి కార్యకలాపాలు కొనసాగుతున్న నటాన్జ్ నగరం కూడా ఈ ప్రావిన్స్‌లోనే ఉంది.

క్షిపణి దాడితో సంబంధమున్నట్లు లేదా బాధ్యత వహిస్తూ ఇప్పటికి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

గతవారం ఇరాన్ చేసిన దాడులకు ప్రతీకారంగా ఇప్పుడు ఇజ్రాయెల్ క్షిపణి ప్రయోగించినట్లు భావిస్తున్నారు.

ఇజ్రాయెల్

ఫొటో సోర్స్, REUTERS

ఫొటో క్యాప్షన్, దక్షిణ ఇజ్రాయెల్ అరద్ సమీపంలో పడిన ఇరాన్ రాకెట్ బూస్టర్

ఇంతకుముందు ఏం జరిగింది?

ఏప్రిల్ 13 - 14వ తేదీ మధ్య రాత్రి ఇజ్రాయెల్‌‌పై ఇరాన్ డ్రోన్లు, క్షిపణులతో దాడికి దిగింది.

ఇరాన్ 300 పేలుడు డ్రోన్లు, క్రూయిజ్, బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించిందని ఇజ్రాయెల్ మిలటరీ ప్రతినిధి రేర్ అడ్మిరల్ డేనియల్ హగారీ ధ్రువీకరించారు.

అర్థరాత్రి 1 గంట 45 నిమిషాలకు జెరుసలెంపైకి దూసుకొచ్చిన క్షిపణులను ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అడ్డుకోవడంతో నగరమంతా సైరన్లతో మార్మోగింది.

అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, జోర్డాన్, ఇతర మిత్రదేశాల సహకారంతో ఇరాన్ ప్రయోగించిన డ్రోన్లు, క్షిపణులలో 99 శాతం వరకూ ధ్వంసం చేసినట్లు ఇజ్రాయెల్ తెలిపింది.

ఈ దాడుల్లో ఇజ్రాయెల్ దక్షిణ భాగంలోని సైనిక స్థావరం స్వలంగా దెబ్బతిన్నట్టు ఇజ్రాయెల్ మిలిటరీ చెప్పింది.

మరోవైపు, సిరియా రాజధాని డమాస్కస్‌లోని తమ కాన్సులేట్ మీద జరిగిన దాడికి బదులు తీర్చుకున్నామని, ఇజ్రాయెల్‌పై జరిపిన దాడితో తాము అనుకున్న లక్ష్యాలను సాధించినట్లు ఇరాన్ సైన్యం ప్రకటించింది.

ఇరాన్

ఫొటో సోర్స్, REUTERS

ఫొటో క్యాప్షన్, ఇరాన్ కాన్సులేట్ పై దాడిలో సీనియర్ అధికారులు మృతి చెందారు

డమాస్కస్‌లో ఇరాన్ సైనిక ఉన్నతాధికారుల మరణం

ఏప్రిల్ 1న సిరియా రాజధాని డమాస్కస్‌లోని ఇరాన్ రాయబార కార్యాలయంపై జరిగిన వైమానిక దాడుల్లో ఇద్దరు ఇరాన్ సైనిక ఉన్నతాధికారులతో సహా 13 మంది మరణించారు. ఇది ఇజ్రాయెల్ దాడిగా ఇరాన్ ఆరోపించింది.

అయితే, ఈ దాడులు తాము చేయలేదని ఇజ్రాయెల్ చెప్పలేదు.

ఈ దాడిలో ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్‌కు చెందిన ఏడుగురు సిబ్బంది, ఆరుగురు సిరియన్లు మరణించారు. ఈ దాడిపై తమ స్పందన చాలా తీవ్రంగా ఉంటుందని ఇరాన్ అప్పుడు హెచ్చరించింది.

కానీ, ఈ విషయాన్ని అంతర్జాతీయ సమాజం తేలికగా తీసుకుంది.

ఇరాన్‌ రెవల్యూషనరీ గార్డ్స్ కోర్ (ఐఆర్‌జీసీ)కి చెందిన విదేశీ శాఖ అయిన ఖుద్స్ ఫోర్స్ సీనియర్ కమాండర్ బ్రిగేడియర్ జనరల్ మొహమ్మద్ రెజా జహేదీ ఈ దాడిలో మరణించారు. లెబనాన్‌లోని షియా గ్రూపు హిజ్బొల్లాలో ఆయన కీలక వ్యక్తి.

హిజ్బొల్లాకు అత్యంత కచ్చితంగా లక్ష్యాలను ఛేదించగలిగిన క్షిపణులు సహా పలు ఆయుధాలను సిరియా మీదుగా ఖుద్స్ ఫోర్స్ చేరవేస్తోంది.

ఈ ఆయుధాలు అందకుండా చూడటంతోపాటు సిరియాలో ఇరాన్ సైన్యం ప్రభావం పెరగకుండా నిరోధించేందుకు ఇజ్రాయెల్ ప్రయత్నిస్తోంది.

అమెరికా
ఫొటో క్యాప్షన్, ఇరాన్ దాడి తర్వాత ఇజ్రాయెల్‌కు మద్దతు ప్రకటించిన జో బైడెన్

అమెరికా ఏమన్నది?

ఇజ్రాయెల్‌పై దాడి తర్వాత ఆ దేశ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహుతో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మాట్లాడారు. ఇజ్రాయెల్ భద్రతకు సహకరిస్తామని స్పష్టం చేశారు.

కానీ, ఇజ్రాయెల్ ప్రతీకార దాడులకు మద్దతు ఇవ్వబోమన్నారు.

ప్రాంతీయ ఉద్రిక్తతలు పెరగకుండా చూసేందుకు ఇజ్రాయెల్ ప్రతీకారంలో తాము భాగస్వాములం కాబోమని అమెరికా చెప్పింది.

అయితే, గాజాపై ఇజ్రాయెల్ దాడి తర్వాత ఆ దేశానికి దూరంగా జరుగుతున్న పశ్చిమ దేశాలు ఇరాన్ దాడితో తిరిగి ఇజ్రాయెల్‌కు దగ్గరయ్యాయని ఇజ్రాయెల్ పరిశోధకుడు ఎరిక్ రుండస్కీ అభిప్రాయపడ్డారు.

ముఖ్యంగా అమెరికా- ఇజ్రాయెల్ సంబంధాల్లో ఏర్పడిన ఉద్రిక్తతలు తొలగిపోయాయి.

ఇరాన్

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, మిస్సైల్, డ్రోన్లపై ఇరాన్ పెద్ద ఎత్తున ఖర్చు చేస్తోంది

ఇరాన్‌ వర్సెస్ ఇజ్రాయెల్

మిడిల్ ఈస్ట్‌లో అమెరికా, ఇజ్రాయెల్ ప్రయోజనాలకు సవాల్ విసురుతూ ఇరాన్ తన మిత్రులు, మిలీషియా దళాలతో ఓ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసింది. వీటన్నింటికీ వివిధ స్థాయిల్లో ఇరాన్ మద్దతు ఇస్తుంటుంది.

ఇరాన్ మద్దతు ఉన్న అత్యంత శక్తిమంతమైన సాయుధ గ్రూపుల్లో లెబనాన్‌లోని హిజ్బొల్లా గ్రూపు ఒకటి. ఇజ్రాయెల్ - హమాస్ యుద్ధం మొదలైనప్పటి నుంచి, సరిహద్దుల వద్ద ఇజ్రాయెల్, హిజ్బొల్లా గ్రూపుల మధ్య కూడా కాల్పులు జరుగుతూనే ఉన్నాయి.

ఇరాక్, సిరియా, జోర్డాన్‌లోని అమెరికా స్థావరాలపై దాడులు చేసిన ఇరాక్‌లోని షియా మిలీషియా గ్రూపులకు ఇరాన్ వెన్నుదన్నుగా ఉంది. జోర్డాన్‌లోని మిలిటరీ ఔట్ పోస్టుపై దాడిలో ముగ్గురు అమెరికన్ సైనికులు చనిపోయారు. దీనికి ప్రతీకారంగా అమెరికా కూడా దాడులకు దిగింది.

యెమెన్‌లోని హూతీలకు ఇరాన్ మద్దతు ఇస్తోంది. యెమెన్‌లోని అనేక ప్రాంతాలు హూతీ తిరుగుబాటుదారుల నియంత్రణలో ఉన్నాయి.

గాజాలోని హమాస్‌కు తమ మద్దతు తెలిపేందుకు హూతీలు ఇజ్రాయెల్‌పై మిస్సైల్స్, డ్రోన్లు ప్రయోగించారు. అలాగే తమ తీరప్రాంతంలోని వాణిజ్య నౌకలపై దాడులు చేశారు. ఒక నౌకను ముంచేశారు. దీనికి ప్రతిగా అమెరికా, బ్రిటన్‌లు హూతీ స్థావరాలపై దాడులు చేశాయి.

నిరుడు అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై దాడికి దిగిన హమాస్ సహా పాలస్తీనాలోని అనేక సాయుధ గ్రూపులకు ఇరాన్ ఆయుధాలతో పాటు శిక్షణ కూడా ఇస్తోంది.

ఇది గాజా యుద్ధం సహా, ఇరాన్, దాని మద్దతు కలిగిన గ్రూపులుకు, ఇజ్రాయెల్ సహా దాని మిత్ర రాజ్యాల మధ్య ఘర్షణలకు కారణమవుతోంది.

ఇవి కూడా చదవండి:

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)