హిట్లర్ కోరిక మేరకు ఆ తల్లులు కన్న వేలమంది 'ఆర్య పుత్రులు' ఏమయ్యారు?

ఆర్య పుత్రులు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, లెబెన్స్‌బోర్న్ ప్లాన్‌లో భాగంగా పుట్టిన పిల్లలు

అడాల్ఫ్ హిట్లర్ 1889, ఏప్రిల్ 20న జన్మించారు. 1945, ఏప్రిల్ 30న మరణించారు. 1934లో ఆయన జర్మనీ దేశాధిపతి అయ్యారు. ఆయన్ను ‘ఫ్యూరర్’ ఆఫ్ జర్మనీగా పిలిచేవారు. అంటే గొప్ప నాయకుడని అర్థం.

రెండో ప్రపంచ యుద్ధం చివర్లో హిట్లర్ నాజీ బలగాలను జర్మనీ రాజధాని బెర్లిన్‌లో స్టాలిన్ రెడ్ ఆర్మీ ఓడించింది. సైనిక బలగాలకు చిక్కకముందే, హిట్లర్, అతడి భార్య ఆత్మహత్య చేసుకున్నారని చరిత్ర పుస్తకాల్లో మీరు చదువుకునే ఉంటారు.

మొదటి ప్రపంచ యుద్ధంతో జర్మనీ కకావికలమైంది. దేశాన్ని పునర్నిర్మించేందుకు, జనాభాను పెంచేందుకు ఓ కార్యచరణ ప్రణాళికను నాజీ ఆర్మీ సిద్ధం చేసింది.

దీనిలో భాగంగా దేశం కోసం పిల్లలను కనేందుకు కొంత మంది మహిళలు స్వతహాగానే ముందుకు వచ్చారు. అయితే, దీనికి పూర్తి విరుద్ధమైన కొన్ని కథలు కూడా ఉన్నాయి.

లెబెన్స్‌బోర్న్ ప్రోగ్రామ్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, లెబెన్స్‌బోర్న్ ప్రోగ్రామ్‌లో చేసిన పనులను కోర్టులో అంగీకరిస్తున్న ఇంక్ వీర్‌మెట్జ్

1936లో నాజీ మద్దతుదారు హిల్డెగార్డ్ డ్రూయిట్జ్.. ‘స్వచ్ఛమైన జాతి (ఎథినికల్లీ ప్యూర్)’ విమెన్ ప్రోగ్రామ్‌లో చేరారు. ఈ మహిళలంతా ‘షూట్జ్ స్టేపల్ (ఎస్ఎస్)’గా పిలిచే అధికారులతో సెక్స్ ద్వారా ఆర్య పుత్రులను కని, తమ ప్రభుత్వానికి సేవ చేయాలని నాజీ ఆర్మీ సూచించేది.

ఈ ఎస్ఎస్ అధికారులు నల్లని యూనిఫామ్‌లు ధరించి, హిట్లర్ చుట్టుపక్కల ఉండేవారు. వీరికి హిమ్లెర్ దళాధిపతి. అతడు హిట్లర్‌కు నీడలా ఉంటూ, ఆయన సిద్ధాంతాలను ఆచరణలో పెడుతుండేవారు.

ఆర్య పుత్రుల ప్రోగ్రామ్‌ను లెబెన్స్‌బోర్న్ జాగ్రత్తగా ముందుండి నడిపించేవారు. ఆనాడు పడిపోతున్న జర్మనీ జననాల రేటును మళ్లీ పెంచేందుకు లెబెన్స్‌బోర్న్ ప్లాన్‌ను అమలు చేశారు.

ఈ ప్రాజెక్టులో భాగంగా 12 ఏళ్ల హిట్లర్ కాలం (1933-45)లో జర్మనీ, నార్వేలలో దాదాపు 20,000 మంది పిల్లలు జన్మించారు. ఈ ప్లాన్ ప్రకారం, ఎస్ఎస్ దళంలో ఉండే ప్రతి అధికారికీ కనీసం నలుగురు పిల్లలు ఉండాలి. ఆ పిల్లలు కూడా నాజీ జర్మనీ సూచించిన ఆర్య సంతతి మహిళల నుంచి పొందాలి. అయితే, ఈ ప్రాజెక్టు ఆశించిన స్థాయిలో ఫలితాలను ఇవ్వలేదు.

లెబెన్స్‌బోర్న్

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, లెబెన్స్‌బోర్న్ మెటర్నిటీ హోమ్ ఇదీ

హిట్లర్ నుంచి స్ఫూర్తి పొందిన మహిళలు

ఈ కాలంలోనే స్వచ్ఛందంగా పిల్లలను కనేందుకు ముందుకు వచ్చిన ఒక మహిళ జీవితంపై బ్రిటిష్ రచయిత గిల్స్ మిల్టన్ ఒక పుస్తకం రాశారు. ఆ మహిళ పేరు హిల్డెగార్డ్ డ్రూయిట్జ్.

హిట్లర్ నాజీ పార్టీలోని మహిళల విభాగం యూత్ మూవ్‌మెంట్‌ (బీడీఎం)లో డ్రూయిట్జ్ సభ్యురాలు. జర్మనీలో ఈ దళాన్ని బుండ్ డ్యూషెర్ మేడెల్ (బీడీఎం)గా పిలిచేవారు.

డ్రూయిట్జ్‌తోపాటు చాలా మంది అమ్మాయిలు, మహిళలు.. హిట్లర్ కోసం గర్భం దాల్చేందుకు ఎందుకు ముందుకు వచ్చారో తన పుస్తకంలో గిల్స్ మిల్టన్ రాసుకొచ్చారు.

హిట్లర్ నాయకత్వానికి గట్టి మద్దతు ప్రకటించేవారిలో డ్రూయిట్జ్ కూడా ఒకరు. బీడీఎంలో 1933లోనే ఆమె చేరారు. ప్రతివారం జరిగే సమావేశాలకు కూడా ఆమె హాజరయ్యేవారు.

‘‘అడాల్ఫ్ హిట్లర్, నాజీ జర్మనీపై నాకు చాలా నమ్మకం ఉంది. నేను వీరితో చేయి కలిపిన తర్వాతే, జర్మనీకి మాలాంటి యువత ఎంత మేలు చేయగలదో నాకు అర్థమైంది’’ అని డ్రూయిట్జ్ ఆ పుస్తకంలో చెప్పారు. కొంత కాలానికి స్థానిక నాయకురాలిగా ఆమె ఎదిగారు.

‘‘జర్మనీ బ్లాండ్ హెయిర్ (గోధుమ రంగు జుట్టు), నీలి కళ్లను కలిగి ఉండటంతో నేను నార్డిక్ మహిళకు చక్కటి ఉదాహరణ లాంటిదాన్నని నాయకులు తరచూ చెప్పేవారు. పొడవైన కాళ్లు, దృఢమైన చేతులతోపాటు సహజంగా బిడ్డకు జన్మనిచ్చేందుకు విశాలమైన కటి వలయం నాకు ఉండేది’’ అని ఆమె చెప్పారు.

లెబెన్స్‌బోర్న్

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, లెబెన్స్‌బోర్న్ ప్రోగ్రామ్‌లో జన్మించిన జెర్ట్ ఫీచెర్ 2007లో తన న్యాయవాదితో మాట్లాడినప్పుడు..

1936లో డ్రూయిట్జ్‌కు 18 ఏళ్లు. అప్పటికే ఆమె తన పాఠశాల విద్యను పూర్తిచేశారు. ఆ తర్వాత ఏం చేయాలో ఆమెకు తెలియలేదు. అప్పుడే ఒక బీడీఎం నాయకుడు ఇచ్చిన సలహాతో ఆమె జీవితమే మారిపోయింది.

‘‘నీకు జీవితంలో ఏం చేయాలో తెలియకపోతే, ఫ్యూరర్ (హిట్లర్) కోసం ఒక బిడ్డను ఎందుకు కనివ్వకూడదు? ఈ సమయంలో జర్మనీకి అత్యంత అవసరమైనది అదే’’ అని ఆ నాయకుడు చెప్పారు.

అప్పటివరకు ప్రభుత్వ ప్రోత్సాహంతో లెబెన్స్‌బోర్న్ లాంటి ప్రాజెక్టు ఒకటి నడుస్తోందని డ్రూయిట్జ్‌కు తెలియదు కూడా. ముఖ్యంగా గోధుమ రంగు బ్లాండ్ జుట్టు, నీలి కళ్లు కలిగిన ఆర్య పుత్రులు ప్రసవించేలా చూడటమే ఈ ప్రాజెక్టు లక్ష్యం. స్వచ్ఛమైన ఆర్య జాతిగా భావించే ఎస్‌ఎస్ అధికారులతో శృంగారం ద్వారా ఆ మహిళలకు స్వచ్ఛమైన ఆర్య పుత్రులు పుడతారని బీడీఎం భావించేది.

అసలు ఈ లెబెన్స్‌బోర్న్ ప్లాన్ ఎలా పనిచేస్తుందో డ్రూయిట్జ్‌కు ఆ నాయకుడు వివరించారు. దీని కోసం వచ్చే సదరు మహిళలకు ముందు కొన్ని పరీక్షలు నిర్వహిస్తారు. దీని ద్వారా ఆమె పూర్వీకుల వివరాలు తెలుసుకుంటారు. ఆమె వంశం యూదు రక్తంతో కలుషితం అయ్యిందో లేదో చూస్తారు. ఒకసారి పరీక్షలన్నీ పూర్తయ్యాక, భాగస్వామిని ఎంచుకునే అవకాశం సదరు వలంటీరుకు కల్పిస్తారు.

ఒక టీనేజరుగా హిట్లర్ కోసం ఒక బిడ్డను కనిచ్చేందుకు డ్రూయిట్జ్ చాలా ఉత్సాహం కనబరిచారు. వెంటనే ఆమె ఆ ఫామ్‌పై సంతకం చేశారు. ఈ విషయం తెలిస్తే, తన తల్లిదండ్రులు ఒప్పుకోరని, వారికి బోర్డింగ్ స్కూలుకు వెళ్తున్నానని ఆమె అబద్ధం చెప్పారు.

హిట్లర్

ఫొటో సోర్స్, Getty Images

విలాసవంతంగా..

ఆమె మొదట బీడీఎం నాయకులను కలిశారు. నాజీ అధికారులే ఆమెను బవేరియాలోని డేకెర్నెస్‌కు తీసుకెళ్లారు. అక్కడి విలాసవంతమైన భవనంలో ఆమె లాంటి మరో 40 మంది మహిళలు కనిపించారు. అక్కడ ఎవరూ తమ అసలు పేర్లను బయటికి చెప్పలేదు. అందరికీ ఏదో ఒక మారు పేర్లు ఉన్నాయి. తమ పూర్వీకులు ఆర్య సంతతికి చెందినవారని నిరూపించుకోగలిగిన మహిళలను మాత్రమే ఇక్కడికి అనుమతిస్తారు.

ఆ కోట పెద్దపెద్ద గదులతో విలాసవంతంగా ఉండేది. గేమ్స్ కోసం ప్రత్యేక గదులు ఉండేవి. లైబ్రరీ, మ్యూజిక్ రూమ్‌లతోపాటు సినిమా థియేటర్ కూడా అక్కడ ఉండేది.

జీవితంలో తాను ఇంతకు ముందెన్నడూ రుచి చూడని ఆహారాన్ని అక్కడ తిన్నానని డ్రూయిట్జ్ చెప్పారు. లెక్కలేనంత మంది సేవకులు అక్కడ అందుబాటులో ఉండేవారు. దీని వల్ల తను మరీ బద్ధకస్తురాలిగా మారిపోయానని డ్రూయిట్జ్ వివరించారు.

హిట్లర్

ఫొటో సోర్స్, Getty Images

ఎస్ఎస్ విభాగానికి చెందిన ఒక డాక్టర్ నియంత్రణలో ఈ కోట ఉండేది.

‘‘మేం లోపలకు అడుగుపెట్టిన వెంటనే, డాక్టర్ ప్రతి అంగుళం అంగుళం తనిఖీ చేస్తారు. మాకు ఏ వంశపారంపర్య వ్యాధులు, మత్తుమందుల అలవాటు లాంటివి లేవని చెప్పే ఒక పత్రంపై సంతకం చేయాలని సూచిస్తారు’’ అని డ్రూయిట్జ్ చెప్పారు.

ప్రసవం తర్వాత పిల్లలపై తమకు ఎలాంటి హక్కూ ఉండదనే పత్రంపై కూడా అక్కడ సంతకం పెట్టించుకుంటారు. ఈ పిల్లలంతా దేశ సొత్తుగానే పరిగణిస్తారని డాక్టర్ వారికి ముందే చెబుతారు.

ఈ పిల్లలందరినీ ప్రత్యేక శిక్షణ ఇచ్చి నాజీ సైన్యం, నాజీ సిద్ధాంతాల్లో భాగం చేస్తారు.

హిట్లర్

వారం రోజుల సమయం

డ్రూయిట్జ్‌తోపాటు మరికొందరు మహిళలు కూడా అన్ని షరతులకు అంగీకారం తెలిపారు. ఒకసారి అన్ని పత్రాలపైనా సంతకాలు పెట్టిన తర్వాత, అక్కడ ఉండేవారితో తమకు నచ్చిన భాగస్వామిని ఎంచుకునే స్వేచ్ఛ వీరికి లభిస్తుంది.

అక్కడుండే మగవారంతా పొడుగ్గా, నీలి కళ్లతో ఉంటారు. కలిసి సినిమాలు చూడటం, మాట్లాడటం లాంటి చర్యలతో వారిని కలిసే అవకాశం కల్పిస్తారు.

‘‘పార్ట్‌నర్‌ను ఎంచుకునేందుకు ప్రతి మహిళకూ ఒక వారం సమయం ఇస్తారు’’ అని డ్రూయిట్జ్ చెప్పారు. పార్ట్‌నర్‌ను ఎంచుకునేటప్పుడు, వారి కళ్లు, జుట్టు రంగు తమకు దగ్గరగా ఉండేవారిని ఎంచుకోవాలని సూచిస్తారు.

మరోవైపు అక్కడి అధికారుల పేర్లు, హోదా వివరాలను కూడా బయటపెట్టరు. ఇదంతా లెబెన్స్‌బోర్న్ ప్లాన్‌లో భాగమే.

హిట్లర్

‘‘అన్నీ ప్రక్రియలు పూర్తయ్యాక, నెలసరి అయిన పదో రోజు తర్వాత పార్ట్‌నర్‌తో కలిసేందుకు అవకాశం కల్పిస్తారు. దీనికి ముందు, ఆ తర్వాత వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. ఆ రోజు రాత్రి మొత్తం మేం ఎంచుకున్న వ్యక్తితో గడపొచ్చు’’ అని డ్రూయిట్జ్ చెప్పారు.

‘‘దాన్ని కేవలం సెక్స్‌గా చూడకూడదు. ఎందుకంటే నేనది మా గాడ్‌ఫాదర్ (హిట్లర్) కోసం చేస్తున్నాను. వినడానికి కాస్త వింతగా అనిపించొచ్చు. కానీ, దీనికి నేనేమీ సిగ్గుపడటం లేదు. మేం ఏం చేయాలో, ఏం చేస్తున్నామో మా ఇద్దరికీ తెలుసు. అదే సమయంలో నా పార్ట్‌నర్‌ను చూసి నేను ఆకర్షితురాలిని అయ్యాను కూడా’’ అని డ్రూయిట్జ్ తెలిపారు.

వీడియో క్యాప్షన్, జర్మనీ, అమెరికా అందించే ట్యాంకులు యుక్రెయిన్ యుద్ధగతిని మార్చేస్తాయా

పిల్లల నుంచి దూరంగా..

వారంలో మొదటి మూడు రోజులు డ్రూయిడ్జ్ ఎస్ఎస్‌లో గడిపారు. ఆ తర్వాత ఎంచుకున్న వ్యక్తితో ఆమె శృంగారంలో పాల్గొన్నారు. ఆ తర్వాత మూడు రోజులు ఆయన మరో మహిళతో గడపాల్సి ఉంది.

తర్వాత కొన్ని వారాలకు తను గర్భం దాల్చానని డ్రూయిట్జ్‌కు తెలిసింది. పరీక్షలు కూడా ఆ విషయాన్ని ధ్రువీకరించాయి. వెంటనే కోట నుంచి మెటర్నిటీ హోమ్‌కు ఆమెను మార్చారు.

‘‘ఆ కోట నుంచి అంత త్వరగా బయటకు వస్తానని అనుకోలేదు. ప్రసవం కూడా దగ్గర పడింది. చాలా వేదన అనుభవించాల్సి వచ్చింది’’ అని డ్రూయిట్జ్ చెప్పారు.

వీడియో క్యాప్షన్, మ్యూనిక్ ఒలింపిక్స్‌ నరమేధంలో మృతులైన ఇజ్రాయెల్ ఆటగాళ్ల కుటుంబాలు ఇప్పుడేమంటున్నాయి?

డ్రూయిట్జ్ ఒక బాబుకు జన్మనిచ్చారు. రెండు వారాల వరకూ బాబు తన దగ్గరే పెరిగాడు. ఆ తర్వాత ఆ శిశువును తల్లి నుంచి వేరు చేశారు. ప్రత్యేకమైన ఎస్ఎస్ హాస్టల్‌కు తనను తీసుకెళ్లారు. అతడిని నాజీ ఆర్మీ సైనికుడిగా పెంచాలని భావించారు.

తను గర్భం ధరించేందుకు కారణమైన ఆ ఎస్ఎస్ అధికారిని మళ్లీ డ్రూయిట్జ్ చూడలేదు. తన బిడ్డ కూడా తండ్రిని చూసుండకపోవచ్చని ఆమె అనుకున్నారు.

పూర్తిగా కోలుకున్నాక ఆమె ఇంటికి తిరిగివచ్చారు. అయితే, ఆ తర్వాత మళ్లీ హిట్లర్ కోసం మరొక బిడ్డను కనివ్వాలని ఆమెలో స్ఫూర్తి కలిగింది. అయితే, మధ్యలో ఒక యువ అధికారితో ఆమె ప్రేమలో పడి, పెళ్లి చేసుకున్నారు.

తన భర్తకు ఆ ప్రోగ్రామ్ గురించి ఆమె తెలియజేశారు. అయితే, తన భర్త నుంచి అనుకున్నంత సానుకూల స్పందన ఆమెకు రాలేదు. అదే సమయంలో ఆయన ఆమెను నిందించలేదు కూడా.

మొత్తానికి దేశం కోసమే నేను బిడ్డను కనిచ్చానని ఆయనను ఆమె సమాధాన పరిచారు.

తన బిడ్డకు ఏమైందో చివరివరకూ డ్రూయిట్జ్‌కు తెలియదు. లెబెన్స్‌బోర్న్ పిల్లల్లానే తను కూడా పెద్దై, యుద్ధంలో పాల్గొని ఉండొచ్చు.

హిట్లర్ జనరల్స్‌లో ఒకరైన హిమ్లర్ అయితే, లెబెన్స్‌బోర్న్ ప్లాన్ కింద 20 కోట్ల మంది పిల్లలకు జన్మనివ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. అయితే, కేవలం జర్మనీలో మహిళలతో ఇంత మంది పిల్లలకు జన్మనివ్వడం అసాధ్యం. కాబట్టి ఇతర ప్రాంతాల్లోని ఆర్యుల లక్షణాలున్న మహిళలను కిడ్నాప్ చేయడం మొదలుపెట్టారు.

ముఖ్యంగా మొదటి ప్రపంచ యుద్ధం వల్ల జర్మనీ నుంచి వెళ్లిపోయి యూరప్‌లోని ఇతర ప్రాంతాల్లో స్థిరపడ్డ మహిళలను వీరు లక్ష్యంగా చేసుకునేవారు.

వీడియో క్యాప్షన్, రష్యా-జర్మనీ మధ్య ఈ నార్డ్ స్ట్రీమ్ 2 పైప్‌లైన్ ఎందుకు?

హిట్లర్ 12 ఏళ్ల కాలంలో మొత్తంగా 20,000 మంది పిల్లలకు ఇలా పుట్టేలా తన పథకాన్ని అమలు చేశారు. ముఖ్యంగా జర్మనీ, నార్వేలలో ఈ ప్రసవాలు జరిగేవి. ఇలా పుట్టిన పిల్లల్లో చాలామంది యుద్ధాల్లో పట్టుబడ్డారు. యుద్ధం అనంతరం వీరి జనన ధ్రువీకరణ పత్రాలను ధ్వంసం చేశారు. చిన్న పిల్లలను దత్తతకు ఇచ్చేశారు. వీరిలో కొందరు తమకు అన్యాయం జరిగిందని కోర్టులకు కూడా వెళ్లారు.

వీరిలో చాలామంది వృద్ధులయ్యాక వయోభారంతో మరణించారు. వీరి పుట్టుక వివరాలు మాత్రం ఎప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)