హెపటైటిస్: మొత్తం కేసులలో 11 శాతం భారత్‌లోనే.. అసలేమిటీ వ్యాధి, ఎందుకొస్తుంది, చికిత్స లేదా?

ఫొటో సోర్స్, GETTY IMAGES
వైరల్ హెపటైటిస్‌తో ప్రాణాలు కోల్పోతున్నవారి సంఖ్య భారత్‌లోనే ఎక్కువని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్ఓ) గ్లోబల్ హెపటైటిస్ రిపోర్ట్ 2024 తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వైరల్ హెపటైటిస్ రోగుల్లో 11 శాతం మంది భారత్‌లోనే ఉన్నారని పేర్కొంది.
2022లో కోవిడ్ -19 తరువాత అత్యధిక మరణాలు సంభవించింది వైరల్ హెపటైటిస్, టీబీ కారణంగానే.
హెపటైటిస్ ఎన్నిరకాలు?
హెపటైటిస్ అనేది ఓ కాలేయ వ్యాధి. 5 రకాల వైరస్‌ల ద్వారా ఈ వ్యాధి సంక్రమిస్తుంది. వీటిల్లో హెపటైటిస్ ఏ, ఈ అనేవి కలుషిత నీరు, ఆహారం ద్వారా సోకుతాయి.
జ్వరం, పొత్తికడుపునొప్పి, కామెర్లు, మూత్రం నల్లగా రావడం వంటి లక్షణాలు వీటిల్లో కనిపిస్తాయి.
ప్రపంచ ఆరోగ్య సంస్థ కలుషిత సిరంజిలు, సూదుల ద్వారా సంక్రమించే హెపటైటిస్ బీ, హెపటైటిస్ సీ గురించి మాత్రమే సర్వేను విడుదల చేసింది.
హెపటైటిస్ బీని వాక్సిన్ ద్వారా నిరోధించవచ్చు.
హెపటైటిస్ సీ మందుల ద్వారా మాత్రమే నయమవుతుంది.
హెపటైటిస్ బీతో బాధపడుతున్న రోగులలోనే హెపటైటిస్ డీ కూడా సంభవిస్తుంది.
అయితే వ్యాక్సిన్ తీసుకుంటే బీ, డీ రెండూ నయమవుతాయి.
హెపటైటిస్ డీ గణాంకాలను ఈ రిపోర్టులో పొందుపరచలేదు.

ఫొటో సోర్స్, GETTY IMAGES
రోజూ 3,500 మంది ప్రాణాలు కోల్పోతున్నారు
2022లో ప్రపంచ వ్యాప్తంగా 187 దేశాలలో ఒక కోటి 30 లక్షలమంది హెపటైటిస్ కారణంగా చనిపోయారు. వీరిలో 87 శాతం మంది హెపటైటిస్ బీ కారణంగా చనిపోగా, 17 శాతంమంది హెపటైటిస్ సీ వల్ల మృతి చెందారు.
ప్రపంచ వ్యాప్తంగా ప్రతిరోజూ హెపటైటిస్ బీ, సీ కారణంగా 3,500 మంది చనిపోతున్నారు. వీరిలో సగంమంది రోగులు 30 నుంచి 54 ఏళ్ళ లోపు వారు కాగా, 18 ఏళ్ళలోపు పిల్లలు 12 శాతం , మొత్తం మృతులలో 55 శాతం మంది పురుషులు ఉన్నారు.
2022 లో ప్రపంచ వ్యాప్తంగా హెపటైటిస్ బీ రోగుల సంఖ్య 25.4 కోట్ల మంది ఉండగా, వీరిలో 2.9 కోట్ల మంది ఇండియాలోనే ఉన్నారు. ఇండియా కంటే 7.9 కోట్ల హెపటైటిస్ బీ రోగులతో చైనా ముందుంది.
ప్రపంచ వ్యాప్తంగా 2022లో 5 కోట్ల హెపటైటిస్ సీ కేసులు నమోదయ్యాయి.
వీరిలో 88 లక్షల మంది పాకిస్తాన్‌లోనూ, 55 లక్షల మంది ఇండియాలోనూ ఉన్నారు.
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హెపటైటిస్ సీ కేసులలో 66 శాతం లేదా రెండిట మూడొంతుల మంది బంగ్లాదేశ్, చైనా, ఇథియోపియా, ఇండియా, ఇండోనేషియా, నైజీరియా, పాకిస్తాన్, ఫిలిప్పిన్స్, రష్యా, వియత్నాం దేశాలలోనే ఉన్నారు.
వైరల్ హెపటైటిస్ వ్యాధి నిర్థరణ రేటు కూడా ఇండియాలో చాలా తక్కువగా ఉంది.
మొత్తం హెపటైటిస్ రోగులలో 2.4 శాతం హెపటైటిస్ బీతోనూ, 28 శాతం మంది హెపటైటిస్ సీతోనూ బాధపడుతున్నట్టుగా నిర్థరించారు.
హెపటైటిస్ బీ, సీ కేసుల స్క్రీనింగ్, వ్యాధి నిర్థరణకు భారత్ ఉచిత ప్రభుత్వ పథకాన్ని ఏర్పాటుచేసినా, వ్యాధి నిర్థరణ రేటు ఇప్పటికీ తక్కువగానే ఉంది.

ఫొటో సోర్స్, GETTY IMAGES
హెపటైటిస్ అంటే కామెర్లా?
వైరల్ హెపటైటిస్‌ను 2030 నాటికల్లా నిర్మూలించాలని భారత ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
హెపటైటిస్ బీ, సీ రోగులకు ఉచితంగా మందులను అందించేందుకు మోదీ ప్రభుత్వం 2018లో ఓ పథకాన్ని ప్రారంభించింది.
భారత ఆరోగ్య రంగంలో వైరల్ హెపటైటిస్ తీవ్రమైన సమస్యగా ఉంది.
వైరల్ హెపటైటిస్ కలుషిత సూదులు, లేదంటే రక్తం ద్వారా ఒకరి నుంచి మరొకరికి సంక్రమిస్తుంది.
దాదాపు పది దేశాలలోని హెపటైటిస్ సీ రోగులలో 80 శాతం మందికి ఆ వ్యాధి డ్రగ్స్‌ను వినియోగించే సూదుల ద్వారానే సంక్రమించింది. అలాంటి దేశాలలో ఇండియా కూడా ఒకటి.
‘‘దేశంలో ప్రజలకు హెపటైటిస్‌పైనా చైతన్యం, అవగాహన లేకకపోవడం వల్లే బీ,సీ,డీ,ఏ హెపటైటిస్ మనుగడ సాగిస్తోందని డాక్టర్ అవినాష్ బాంధ్వే చెప్పారు. అలాగే ‘‘హెపటైటిస్ అంటే కామెర్లు అని, కామెర్లు అంటే హెపటైటిస్ అనే నమ్మకం ఉంది. కామెర్లకు చిన్నపాటి మందులు, మూలికలు వాడితే నయమవుతుందని నమ్ముతుంటారు. కామెర్లను సంప్రదాయపద్ధతిలో అర్థం చేసుకుని మందులు వాడటం తప్పు. కొంతమంది రోగులైతే కనీసం రక్తపరీక్షలు చేయించుకోకుండానే చిన్న పాటి ఔషధాలను చికిత్సగా తీసుకుంటారు. తల్లుల నుంచి పిల్లలకు హెపటైటిస్ సంక్రమించడమనేది భారత్‌లో పెరుగుతోంది. ప్రసవం అయిన వెంటనే ఈ పరీక్షలు నిర్వహించాలి’’ అని ఆయన చెప్పారు.
‘హెపటైటిస్ ఏ, ఈ అనేవి కలుషిత నీరు, ఆహారం వల్ల సంక్రమిస్తాయి’’ అని డాక్టర్ బాంధ్వే తెలిపారు.
హెపటైటిస్ ను గుర్తించడం ఎలా?
హెపటైటిస్‌ను ఏ,బీ, సీ, డీ, ఈ గా వర్గీకరించారు.
హెపటైటిస్ అనేది ఓ లివర్ జబ్బు. హెపటైటిస్ వైరస్ కారణంగా ఈ వ్యాధి వస్తుంది.
కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకారం మద్యపానం, కొన్నిరకాల డ్రగ్స్, ఇతర వ్యాధులు హెపటైటిస్ సోకడానికి కారణమవచ్చు.
ప్రపంచ వ్యాప్తంగా లక్షలాదిమంది రోగులు హెపటైటిస్ బీ, సీతో బాధపడుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది.
హెపటైటిస్ ఇన్ఫెక్షన్ కారణంగా ‘లివర్ సిరోసిస్’, లివర్ కాన్సర్ వచ్చే అవకాశం ఉంది. కొన్ని సందర్భాలలో మరణం కూడా సంభవించవచ్చు.

ఫొటో సోర్స్, GETTY IMAGES
హెపటైటిస్ ఏ
ఈ వ్యాధి హెపటైటిస్ ఏ వైరస్ ద్వారా వస్తుంది. కలుషిత ఆహారం, నీరు ద్వారా ఈ వ్యాధి సోకుతుంది.
మురుగునీటి వ్యవస్థ సక్రమంగా లేని చోట హెపటైటిస్ రోగులు ఎక్కువగా కనిపిస్తారు.
హెపటైటిస్ ఏ అనేది మొండి వ్యాధి కాదని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.
మూడునెలల్లో ఈ వ్యాధి లక్షణాలు క్రమంగా కనుమరగవుతాయి.
‘‘ హెపటైటిస్ ఏ సోకిన చిన్నపిల్లలు త్వరగా కోలుకుంటారని’’ ఫోర్టిస్ ఆస్పత్రిలో గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్‌గా పనిచేస్తున్న డాక్టర్ రాకేష్ పటేల్ చెప్పారు.
హెపటైటిస్ ఏ కు ప్రత్యేక చికిత్స అంటూ లేదు.
కానీ హెపటైటిస్ ఏ వ్యాక్సిన్ వేసుకోవడం ద్వారా ఈ వ్యాధి నుంచి రక్షణ పొందవచ్చు.
ఈ వ్యాధి భారత ఉపఖండంతోపాటు ఆఫ్రికా, దక్షిణ మధ్య అమెరికా, తూర్పు యూరప్ దేశాలలో ఎక్కువ ప్రభావం చూపుతోంది.
ఈ దేశాలకు వెళ్లాలనుకునేవారు కచ్చితంగా వ్యాక్సిన్ తీసుకోవాల్సి ఉంటుంది.
ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం హెపటైటిస్ ఏ రోగుల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది
ఈ వ్యాధి లక్షణాలు ఇన్పెక్షన్ సోకిన 14 నుంచి 28 రోజుల తరువాత బయటపడతాయి
జ్వరం, ఆకలి తగ్గిపోవడం, డయేరియా, కామెర్లు వంటివి కొన్ని లక్షణాలు.
కేంద్రప్రభుత్వం హెపటైటిస్ నియంత్రణ కార్యక్రమం ప్రకారం హెపటైటిస్ ఏ రోగులలో కాలేయం తీవ్రంగా దెబ్బతినడమనేది 5 నుంచి 15 శాతం మందిలో కనిపిస్తుంది.
హెపటైటిస్ బీ
‘కలుషిత రక్తం, ఇతరులు వాడిన సూదులు, శరీర ద్రవాలు హెపటైటిస్ బీ ఇన్ఫెక్షన్‌ను కలగచేస్తాయి. తల్లి నుంచి పిల్లలకు సంక్రమించే అవకాశం కూడా ఉంది’’అని డాక్టర్ రాకేష్ పటేల్ చెప్పారు.
డ్రగ్స్ వాడేవారిలో హెపటైటిస్ వ్యాధి సాధారణం.
ఇండియా, చైనా, సెంట్రల్, సౌత్ ఆసియాలో హెపటైటిస్ బీ రోగులు ఎక్కువగా కనిపిస్తారు.
ఈ వ్యాధి బారిన పడినవారు రెండు నెలల్లోపు పూర్తిగా కోలుకుంటారు.
కానీ కొంతమంది దీనివల్ల తీవ్ర అనారోగ్యానికి గురవుతారు. దీనిని ‘క్రానిక్ హెపటైటిస్’గా పిలుస్తారు. ఇది లివర్ సిరోసిస్‌కు, లివర్ కాన్సర్‌కు కారణమవుతుంది.
హెపటైటిస్ బీ హెచ్ఐవీ కంటే 50 నుంచి వందరెట్లు ఎక్కువ అంటువ్యాధి.
కామెర్లు, బలహీనత, వాంతులు, పొత్తికడుపునొప్పి ఈ వ్యాధిలో కనిపించే సాధారణ లక్షణాలు
6 ఏళ్ళ లోపు పిల్లలకు ఈ వ్యాధి సోకితే అది మొండిరోగంగా మారే ప్రమాదం ఉంది.
హెపటైటీస్ బీకి ఇప్పుడు టీకా లభిస్తోంది.
అప్పుడే పుట్టిన పిల్లలకు 24గంటల్లోగా ఈ వ్యాక్సిన్ ఇవ్వాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచిస్తోంది.
తరువాత 6, 10, 14 వారాలకు కూడా ఈ వ్యాక్సిన్ ఇప్పించాల్సి ఉంటుంది.
దీనికి ప్రత్యేకంగా చికిత్స లేదు. చాలామంది రోగులలో ఈ ఇన్ఫెక్షన్ అవశేషంగా ఉంటుంది.
దీంతో దీర్ఘకాలంపాటు రోగులు మందులు వాడాల్సి ఉంటుంది.

ఫొటో సోర్స్, GETTY IMAGES
హెపటైటిస్ సీ
ప్రధానంగా రక్తం ద్వారా సంక్రమించే వ్యాధి హెపటైటిస్ సీ. కొన్ని సందర్భాలలో లాలాజాలం, వీర్యం, యోని ద్రవాల ద్వారా ఈ వ్యాధి సంక్రమిస్తుంది.
‘‘కలుషిత రక్తం ద్వారా లేదా, ప్రసవ సమయంలో తల్లి నుంచి బిడ్డకు కూడా హెపటైటిస్ సీ సోకే అవకాశం ఉంది’’ అని డాక్టర్ పటేల్ వివరించారు.
వైరస్ శరీరంలోకి ప్రవేశించిన 2 నుంచి 6 వారాల తరువాత ఈ వ్యాధి లక్షణాలు బయటపడతాయి.
80 శాతమంది రోగులలో ఎటువంటి లక్షణాలు కనిపించవు.
జ్వరం, బలహీనత, కామెర్లు, ఆకలి తగ్గిపోవడం, వాంతులు, పొత్తికడుపు నొప్పి, నల్లటి రంగులో మలం రావడం దీని లక్షణాలు
హెపటైటిస్ సీకి ప్రస్తుతం ఎటువంటి వ్యాక్సిన్ లేదు.
హెపటైటిస్ సీ మొండిగా మారితే డ్రగ్ థెరపీ చికిత్స అందిస్తారు
హెపటైటీస్ సీ తల్లిపాలు, ఆహారం, నీరు, ఇతరులను తాకడం ద్వారా వ్యాపించదని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది.
హెపటైటిస్ డీ, ఈ
హెపటైటిస్ బీతో బాధపడే రోగులలో హెపటైటీస్ డీ తిష్ట వేస్తుంది. హెపటైటిస్ డీ వైరస్ సోకాలంటే హెపటైటిస్ బీ అవసరం ఉంటుంది. ప్రపంచ వ్యాప్తంగా 5శాతం మంది హెపటైటిస్ బీ రోగులలో హెపటైటిస్ డీ కనిపిస్తుంది. ఈ ఇన్ఫెక్షన్ ఇంజెక్షన్ల ద్వారా, పచ్చబొట్లు, కలుషిత రక్తం వల్ల వ్యాపిస్తుంది.
హెపటైటిస్ బీ వ్యాక్సిన్ హెపటైటిస్ డీ ముప్పును తగ్గిస్తుంది. శరీరంలోకి వైరస్ ప్రవేశించిన 3 నుంచి 7 వారాల్లోపు లక్షణాలు బయటపడతాయి. ఇందులో కూడా జ్వరం, బలహీనత, కామెర్లు, ఆకలి తగ్గిపోవడం, వాంతులు, పొత్తి కడుపు నెప్పి, నల్లటి మలం తదితర లక్షణాలు కనిపిస్తాయి.
హెపటైటిస్ ఈ అనేది చాలా స్వల్ప ప్రభావాన్ని చూపుతుంది. తక్కువ కాలం మాత్రమే ఉంటుంది. ఎక్కువగా కలుషిత నీటి ద్వారా వ్యాపిస్తుంది. ప్రపంచంలోని అన్ని దేశాలలో ఈ వ్యాధి కనిపిస్తుంది. ముఖ్యంగా తూర్పు, దక్షిణ ఆసియాలో మరీ సాధారణం.
తక్కువ ఆదాయ కలిగిన దేశాలలో నీటి సరఫరా, పరిశుభ్రత, ఆరోగ్య సంరక్షణ అనేవి కీలకాంశాలు. ఈ దేశాలలో హెపటైటిస్ ఈ ప్రబలంగా ఉంది. వైరస్ సోకిన 2 నుంచి 10 వారాల తరువాత లక్షణాలు కనిపిస్తాయి. 15 నుంచి 40 ఏళ్ళ వారిలో ఇదో సాధారణ వ్యాధి.
ఇతర హెపటైటిస్ వ్యాధుల లక్షణాలే ఇందులోనూ కనిపిస్తాయి.
దీనికి చికిత్స ఉంది. నయమవుతుంది.
కాకపోతే లక్షణాలను గుర్తించలేకపోతే లివర్ సిరోసిస్, లివర్ క్యాన్సర్ సోకే అవకాశ ఉంది.

ఫొటో సోర్స్, GETTY IMAGES
చికిత్స ఏమిటి?
హెపటైటిస్ ఏ, బీ వ్యాక్సిన్లు తీసుకోవాలి
లైంగిక చర్యలలో కండోమ్ వాడాలి
మత్తుమందులు వాడకూడదు.
మత్తు మందుల్లో ఒకరు వాడిన ఇంజెక్షన్ మరోకరు వాడటం వల్ల ఈ వ్యాధి సోకుతుంది.
మద్యం తాగకూడదు. కలుషిత నీటికి దూరంగా ఉండాలి.
శరీర శుభ్రతతో పాటు పరిసరాలు శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి.
హెపటైటిస్ వ్యాక్సిన్, ఎవరు ఎప్పుడు తీసుకోవాలి
ఒక ఏడాది పిల్లల నుంచి 18ఏళ్ళ వరకు హెపటైటిస్ ఏ వ్యాక్సిన్ రెండు లేదా మూడు డోసులు ఇస్తారు. పెద్దవాళ్ళు వ్యాక్సిన్ మొదటి డోస్ తీసుకున్న ఆరు లేదా పన్నెండు నెలల తరువాత బూస్టర్ డోస్ తీసుకోవాల్సి ఉంటుంది.
ఈ వ్యాక్సిన్ 15 నుంచి 20 ఏళ్లపాటు రక్షణ కవచంలా పనిచేస్తుంది.
వ్యాక్సిన్ తీసుకున్న తరువాత 15 ఏళ్ళపాటు రక్షణ ఉంటుందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. నేషనల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ హెపటైటిస్ బీ వ్యాక్సిన్ వేస్తారు.
‘‘ మద్య రహిత ఫ్యాటీ లివర్ వ్యాధి పెరుగుతోంది. పాతిక శాతం మంది రోగులు ఈ ఫ్యాటీ లివర్‌తో బాధపడుతున్నారు. జీవన శైలి మారడం, స్థూలకాయమే ఇందుకు కారణం’’ అని తెలిపారు డాక్టర్ పటేల్.
ఇవి కూడా చదవండి:
- ఇరాన్ ఎందుకు ఇజ్రాయెల్‌పై దాడులు చేసింది? ఆరు ప్రశ్నలు, సమాధానాలు..
- వెయ్యేళ్ల నాటి ఈ అస్థిపంజరం కోసం నాజీలు, సోవియట్లు ఎందుకు పోరాడారు?
- గాజా యుద్ధం: ఇజ్రాయెల్‌కు ఆయుధాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి?
- ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు: వైసీపీకి చిక్కవు, టీడీపీకి దొరకవు
- 'ఇంట్లో చొరబడి చంపేస్తాం' అన్న మోదీ వ్యాఖ్యలపై అమెరికా ఏమందంటే..
బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














