SRH vs DC: ఏంటా కొట్టుడు! భయంతో హెల్మెట్లు పెట్టుకున్న బాల్‌ బాయ్స్..

సన్‌రైజర్స్ హైదరాబాద్

ఫొటో సోర్స్, ANI

    • రచయిత, శారద మియాపురం
    • హోదా, బీబీసీ ప్రతినిధి

దిల్లీ క్యాపిటల్స్‌తో శనివారం నాటి మ్యాచ్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ చేసిన 266 పరుగులు గత సీజన్‌లో అయితే ఐపీఎల్ టాప్ స్కోర్‌గా నిలిచిపోయి ఉండేది.

కానీ, ఇప్పుడు సన్‌రైజర్స్ 266 పరుగులకు పరిమితం కావడం అభిమానుల్ని కాస్త నిరుత్సాహానికి గురిచేసింది.

ఎందుకంటే, ఈ సీజన్‌లో సన్‌రైజర్స్ బ్యాటింగ్‌లో విజృంభిస్తున్న తీరు అలా ఉంది మరి. పైగా శనివారం నాటి మ్యాచ్‌లో తొలి 6 ఓవర్లలోనే 125 పరుగులు చేసిన హైదరాబాద్ అభిమానుల అంచనాల్ని మరింత పెంచింది.

266 కూడా తక్కువ స్కోరేం కాదు. ఐపీఎల్ చరిత్రలో ఇది నాలుగో అత్యధిక స్కోరు. కానీ, ఈ సీజన్‌లోనే ఒక మ్యాచ్‌లో 287, మరో మ్యాచ్‌లో 277 పరుగులు చేసిన సన్‌రైజర్స్‌కు ఇది మూడో అత్యధిక స్కోరు.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, ఐపీఎల్‌ చరిత్రలోని టాప్-4 అత్యధిక స్కోర్లలో సన్‌రైజర్స్ ఈ సీజన్‌లో మూడింటిని నమోదు చేయడం.

అందుకే శనివారం రోజున కూడా హైదరాబాద్ తన రికార్డును తానే బ్రేక్ చేస్తూ అత్యధిక స్కోరు చేస్తుందని అభిమానులు ఆశించారు. అలా జరక్కపోయేసరికి కొంచెం నిరాశ చెందారు.

అయినప్పటికీ, లక్ష్యఛేదనలో దిల్లీ క్యాపిటల్స్ జట్టు ఈ స్కోరు దరిదాపుల్లోకి కూడా రాలేదు. 19.1 ఓవర్లలో 199 పరుగులకే ఆలౌటైంది. దీంతో సన్‌రైజర్స్‌ 67 పరుగుల తేడాతో గెలుపొందింది. వరుసగా నాలుగో విజయాన్ని నమోదు చేసిన హైదరాబాద్ 10 పాయింట్లతో రెండోస్థానానికి ఎగబాకింది.

సన్‌రైజర్స్ హైదరాాబాద్

ఫొటో సోర్స్, ANI

హెడ్, అభిషేక్, షాబాజ్ అద్భుత ఆటతీరు

దిల్లీలోని అరుణ్‌జైట్లీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో పలు రికార్డులు బద్దలయ్యాయి.

టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ పవర్‌ప్లేలో ఆకాశమే హద్దుగా చెలరేగింది.

ఓపెనింగ్ జోడీగా బరిలోకి దిగిన ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మలు ఓవర్‌కు 20 పరుగుల చొప్పున కొడుతూ దిల్లీ బౌలర్లపై చెలరేగారు. ఇరువురూ బౌండరీలే లక్ష్యంగా బౌలర్లపై విరుచుకుపడటంతో పలు రికార్డులు నమోదయ్యాయి.

సన్‌రైజర్స్ తొలి ఓవర్‌లో 19 పరుగులు చేసింది. పవర్‌ప్లేలో హైదరాబాద్ ఒక ఓవర్‌లో చేసిన అత్యల్ప స్కోరు ఇదే. అంటే తర్వాతి 5 ఓవర్లలో వారి జోరు ఎలా సాగిందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఓవర్‌కు 20 పరుగులకు తగ్గకుండా వారు బాదేశారు.

ట్రావిస్ హెడ్ కేవలం 16 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మరోవైపు ఐపీఎల్‌‌లో అతి తక్కువ బంతుల్లోనే 100 పరుగులు చేసిన జట్టుగా కూడా హైదరాబాద్ జట్టు నిలిచింది. ఐదు ఓవర్లలోనే ఆ జట్టు 103 పరుగులు సాధించింది.

గతంలో ఈ రికార్డు చెన్నై సూపర్ కింగ్స్ పేరిట ఉంది. ఆ జట్టు 6 ఓవర్లలో 100 పరుగులు సాధించింది.

పైగా ఐపీఎల్‌లో పవర్‌ప్లేలో అత్యధిక పరుగులు చేసిన జట్టుగా కూడా హైదరాబాద్ కొత్త రికార్డు నెలకొల్పింది. పవర్ ప్లేలో 20.83 రన్‌రేట్‌తో హైదరాబాద్ 125 పరుగులు సాధించింది. గతంలో ఈ రికార్డు (6 ఓవర్లకు 105 పరుగులు) కేకేఆర్ జట్టు పేరిట ఉంది.

హైదరాబాద్ ఈ రన్‌రేట్ ప్రకారం ఆడితే చివరికి స్కోరు 20 ఓవర్లలో 400 దాటి ఉండేది.

ఎస్ఆర్‌హెచ్ ఓపెనర్ల ధాటికి పవర్ ప్లేలో లలిత్ యాదవ్ 2 ఓవర్లలో 41 పరుగులు, ఎన్రిచ్ నోర్జే ఒకే ఓవర్‌లో 22 పరుగులు, ముఖేశ్ కుమార్ ఒక ఓవర్ వేసి 22 పరుగులు సమర్పించుకున్నారు.

తొలి పది ఓవర్లలో జట్టు స్కోరు అత్యంత వేగంగా 158 పరుగులకు చేరుకుంది.

సన్‌రైజర్స్ హైదరాబాద్

ఫొటో సోర్స్, ANI

ఓవరాల్‌గా 22 సిక్సర్లు, 18 ఫోర్లు

అభిషేక్ శర్మ 12 బంతుల్లో 6 సిక్సర్లు, 2 ఫోర్ల సాయంతో 46 పరుగులు సాధించి అవుట్ కాగా, మరో ఓపెనర్ ట్రావిస్ 32 బంతుల్లో 6 సిక్సర్లు, 11 ఫోర్ల సాయంతో 89 పరుగులు కొట్టి వెనుదిరిగాడు.

అయితే, 10 వ ఓవర్ నుంచి సన్ రైజర్స్ జట్టు స్కోరు మందగించింది. వరుసగా వికెట్లు పడటంతో తరువాత వచ్చిన ఆటగాళ్లు నెమ్మదిగా ఆడారు. సన్ రైజర్స్ జట్టులో షాబాజ్ అహ్మద్ 59 పరుగులు, నితీశ్ కుమార్ రెడ్డి 37, క్లాసెన్ 15, అబ్దుల్ సమద్ 13 పరుగులు చేశారు.

హైదరాబాద్ ఇన్నింగ్స్‌లో మొత్తం 22 సిక్సర్లు, 18 ఫోర్లు నమోదయ్యాయి. అంటే వీటిద్వారానే 204 పరుగులు లభించాయి.

మొత్తం మీద 20 ఓవర్లకు 7 వికెట్లు కోల్పోయిన సన్ రైజర్స్ జట్టు 266 పరుగులు చేసింది. దీంతో ఐపీఎల్‌లో నాలుగో అత్యధిక స్కోరును నమోదు చేసింది. ఇప్పటికే రెండు అత్యధిక స్కోర్లు నమోదు చేసిన సన్ రైజర్స్ జట్టు మూడోసారి 260కి పైగా పరుగులు సాధించింది.

దిల్లీ క్యాపిటల్స్ జట్టులో కుల్దీప్ యాదవ్‌కు 4 వికెట్లు, ముకేశ్ కుమార్, అక్షర్ పటేల్‌లకు చెరో వికెట్ దక్కాయి.

దిల్లీ క్యాపిటల్స్

ఫొటో సోర్స్, ANI

హెడ్ కంటే వేగంగా ఫ్రేజర్ అర్ధసెంచరీ

267 పరుగుల లక్ష్యఛేదనకు బరిలోకి దిగిన దిల్లీ క్యాపిటల్స్ మొదటి ఓవర్‌లో పృథ్వీ షా (16), రెండో ఓవర్‌లో డేవిడ్ వార్నర్ (1) వికెట్లను కోల్పోయింది.

అయినప్పటికీ జేక్ ఫ్రేజర్ మెకగర్క్ ధాటిగా ఆడటంతో పవర్‌ప్లేలో 88 పరుగులు చేసింది. ఈ సీజన్ ఐపీఎల్‌లో ఇది రెండో అత్యధిక పవర్‌ప్లే స్కోరు.

ఈ మ్యాచ్‌లో హెడ్ కంటే వేగంగా ఫ్రేజర్ అర్ధసెంచరీ చేశాడు.

ఫ్రేజర్ 15 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సర్లతో 50 పరుగుల్ని పూర్తి చేసి, ఈ సీజన్‌లోనే అత్యంత వేగవంతమైన అర్ధసెంచరీని నమోదు చేశాడు.

అయితే, ఏడో ఓవర్‌లోనే ఫ్రేజర్ అవుటవ్వడంతో దిల్లీ ఛేదనలో తడబడింది. ఆ తర్వాత నుంచి ఎక్కడా హైదరాబాద్‌కు పోటీనివ్వలేకపోయింది.

అభిషేక్ పొరెల్ (22 బంతుల్లో 42; 7 ఫోర్లు, 1 సిక్స్), కెప్టెన్ రిషభ్ పంత్ (35 బంతుల్లో 44; 5 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు.

కానీ, సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో దిల్లీ లక్ష్యఛేదనలో వెనుకబడింది.

టి. నటరాజన్ 19 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. మయాంక్ మార్కండే, నితీశ్ కుమార్ రెడ్డి చెరో 2 వికెట్లు తీశారు. భువనేశ్వర్ కుమార్, వాషింగ్టన్ సుందర్‌లకు చెరో వికెట్ లభించింది.

రిషభ్ పంత్

ఫొటో సోర్స్, ANI

హెల్మెట్ ధరించిన బాల్ బాయ్స్

కాలంతో పాటు క్రికెట్ ఆట తీరు ఎలా మారిపోతుందో, ఆటలో హెల్మెట్‌ల వాడకాన్ని బట్టి మీరు గ్రహించవచ్చు.

ఎలాగంటే, మొదట్లో ఫాస్ట్ బౌలర్ల బౌలింగ్‌లో బ్యాట్స్‌మెన్ హెల్మెట్లను ధరించేవారు. తర్వాత, బ్యాట్స్‌మన్‌కు అతిదగ్గరగా నిలబడి ఫీల్డింగ్ చేసే క్లోజ్ ఇన్ ఫీల్డర్ కూడా హెల్మెట్ ధరించడం మొదలుపెట్టారు.

అలాగే ఫాస్ట్ బౌలింగ్‌లో వికెట్లకు దగ్గరగా నిలబడాల్సి వచ్చినప్పుడు వికెట్ కీపర్లు కూడా హెల్మెట్ పెట్టుకోవడం ఆరంభించారు.

టి20 ఫార్మాట్‌లో, బ్యాట్స్‌మెన్ బౌండరీలే లక్ష్యంగా బలంగా బాదడం మొదలుపెట్టినప్పటి నుంచి అంపైర్లు కూడా దెబ్బలు తగలకుండా హెల్మెట్ పెట్టుకుంటున్నారు.

కానీ, ఇప్పుడు దిల్లీ, హైదరాబాద్ మ్యాచ్‌లో బౌండరీ లైన్ బయట బంతిని పట్టుకొనే బాల్ బాయ్స్ కూడా హెల్మెట్ పెట్టుకోవాల్సి వచ్చింది.

మైదానంలో బాల్ బాయ్స్ కూడా హెల్మెట్ పెట్టుకోవాల్సి రావడం బహుశా ఇదే తొలిసారేమో.

కామెంట్రీ బాక్స్‌లో బాల్ బాయ్స్ గురించి మురళీ కార్తీక్ ప్రస్తావించగానే, ఎవరికైనా భద్రతే ప్రాధాన్యం కాబట్టి హెల్మెట్ ధరించడం మంచి చర్య అని సునీల్ గావస్కర్ వ్యాఖ్యానించారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది

విశేషాలు

16: హెడ్ అర్ధసెంచరీ చేయడానికి ఆడిన బంతులు, సన్‌రైజర్స్ తరఫున అత్యంత వేగవంతమైన రికార్డును హెడ్ సమం చేశాడు. హెడ్ కంటే ముందు ముంబయితో మ్యాచ్‌లో అభిషేక్ ఈ రికార్డు నెలకొల్పాడు.

15: అర్ధసెంచరీకి ఫ్రేజర్ ఆడిన బంతులు. ఈ సీజన్‌లో ఇదే వేగవంతమైన అర్ధసెంచరీ. ఓవరాల్‌గా ఐపీఎల్లో మూడో వేగవంతమైన అర్ధసెంచరీ. యశస్వి 13 బంతుల్లో, కేఎల్ రాహుల్, కమిన్స్ 14 బంతుల్లో అర్ధసెంచరీలు చేశారు.

24: పవర్‌ప్లేలో సన్‌రైజర్స్ కొట్టిన బౌండరీలు. పురుషుల టి20ల్లో ఇదే ప్రపంచ రికార్డు.

11: తొలి ఆరు ఓవర్లలో సన్‌రైజర్స్ కొట్టిన సిక్సర్లు.

5: 100 పరుగులు దాటేందుకు సన్‌రైజర్స్‌కు అవసరమైన ఓవర్లు. పురుషుల టి20ల్లో అత్యంత వేగంగా 100 పరుగులు చేసిన జట్టుగా ఘనత సాధించిన సన్‌రైజర్స్.

125: పవర్‌ప్లేలో సన్‌రైజర్స్ స్కోరు. పురుషుల టి20ల్లో పవర్‌ప్లేలో నమోదైన అత్యధిక స్కోరు.

158/4: తొలి పది ఓవర్లలో సన్‌రైజర్స్ స్కోరు. ఐపీఎల్‌లో 10 ఓవర్లలో అత్యధిక స్కోరు చేసిన జట్టుగా తన రికార్డును సన్‌రైజర్స్ మెరుగుపరుచుకుంది. అంతకుమందు ముంబయిపై 10 ఓవర్లలో హైదరాబాద్ 148 పరుగులు చేసింది.

సన్‌రైజర్స్ హైదరాబాద్

ఫొటో సోర్స్, Getty Images

పవర్‌ప్లే ముంచేసింది: రిషబ్ పంత్

‘‘మంచు ప్రభావం ఉంటుందనే భావనతో మొదట బౌలింగ్ చేయాలని అనుకున్నాం. కానీ, దాని ప్రభావం పెద్దగా లేదు.

హైదరాబాద్‌ను 220-230 మధ్య కట్టడి చేసి ఉంటే మాకు గెలిచే అవకాశం ఉండేది. పవర్‌ప్లేలో భారీగా పరుగులు ఇవ్వడం ముంచేసింది.

రెండు జట్లలో ఇదే ప్రధాన తేడా. మా జట్టులో ఫ్రేజర్ అద్భుతంగా ఆడాడు’’ అని మ్యాచ్ అనంతరం రిషబ్ పంత్ వ్యాఖ్యానించాడు.

ఇవి కూడా చదవండి:

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)