రెండు బస్సుల సైజున్న ఆ జీవి ఎముకలు బీచ్‌లో దొరికాయి, ఏమిటా జంతువు?

అతిపెద్ద సముద్ర ప్రాణి

ఫొటో సోర్స్, SERGEY KRASOVSKIY

    • రచయిత, జార్జినా రన్నార్డ్
    • హోదా, సైన్స్ జర్నలిస్ట్, బీబీసీ న్యూస్

రెండు బస్సుల కంటే పెద్ద సైజుతో, సముద్రాల్లో తిరిగిన భారీ జీవి ఏంటన్న విషయాన్ని శాస్త్రవేత్తలు ఎట్టకేలకు గుర్తించారు.

ఈ సముద్ర జీవి సుమారు 20 కోట్ల ఏళ్ల కిందట డైనోసార్లతో కలిసి జీవించేదని తేల్చారు. దీని అతి పెద్ద దవడ ఎముకల అవశేషాలను యూకేలోని సోమర్సెట్ బీచ్‌లో తొలిసారి 2016లో గుర్తించారు.

2020లో ఇదే మాదిరి మరో అవశేషాన్ని బీచ్‌కు వచ్చిన ఒక తండ్రి, కూతురు గుర్తించారు.

ఈ అవశేషాలు 20 మీటర్ల వరకు పొడవుండే రెండు అతిపెద్ద ఇక్తియోసారస్ అనే జీవికి చెందినవని శాస్త్రవేత్తలు చెప్పారు.

డోసెట్ గుట్టలలో కనుగొన్న భారీ జీవి ప్లయోసార్ పుర్రె కంటే దీని దవడ ఎముకలు అతిపెద్దవి.

భూగ్రహంపై తిరిగిన అత్యంత భయంకరమైన వేటాడే జంతువులలో ప్లయోసార్ కూడా ఒకటి.

15 కోట్ల సంవత్సరాల కిందటి ఈ సముద్ర జీవి పుర్రెను అది దొరికిన ప్రదేశానికి దగ్గర్లోనే ఉన్న డోసెట్‌లోని ఒక మ్యూజియంలో పెట్టారు.

దవడ అవశేషాలు

ఫొటో సోర్స్, TONY JOLLIFFE/BBC

‘‘ఈ జీవి దవడల పరిణామం చూస్తే, ఒకటి మీటరు పొడవు, మరొకటి రెండు మీటర్ల పొడవు ఉంది. దీని పొడవు 25 మీటర్లు ఉంటుందని అంచనావేస్తున్నాం. ఆకారంలో బ్లూ వేల్ కంటే పెద్దది కావొచ్చు’’ అని బ్రిస్టల్ యూనివర్సిటీలోని పాలియోంటాలజిస్ట్(చనిపోయిన పురాతన జంతువులు, చెట్లపై అధ్యయనం చేసే వ్యక్తి) డీన్ లొమ్యాక్స్ తెలిపారు.

అయితే, ఈ సముద్ర జీవి పుర్రె, ఎముకలు పూర్తిగా దొరికితేనే ఇది ఎంత పరిణామంలో ఉండేదో కచ్చితంగా చెప్పగలమని, దీనికి మరిన్ని ఆధారాలు కావాలని చెప్పారు.

ఇప్పటి వరకు కేవలం కొన్ని శకలాలను మాత్రమే కనుగొన్నట్లు తెలిపారు.

భారీ సంఖ్యలో జీవులు అంతరించిపోయినప్పుడు ఈ భారీ ఇక్తియోసార్ కూడా కనుమరుగైందని, ఆ తర్వాత జీవించిన ఇక్తియోసార్ మళ్లీ ఆ పరిణామానికి చేరుకోలేదని పేర్కొన్నారు.

పాల్ డి లా సల్లే, ఆయన భార్య కరోల్

ఫొటో సోర్స్, TONY JOLLIFFE/BBC

ఫొటో క్యాప్షన్, పాల్ డి లా సల్లే, ఆయన భార్య కరోల్

శిలాజాల అన్వేషకులు

శిలాజాల అన్వేషకులు పాల్ డి లా సల్లే సోమర్సెట్ బీచ్‌లో తవ్వకాలు జరిపినప్పుడు 2016లో తొలిసారి ఈ ప్రాణి శకలాలను గుర్తించారు.

ప్రముఖ శిలాజాల అన్వేషకుడు స్టీవ్ ఎచెస్ నుంచి స్ఫూర్తి పొందిన తర్వాత 25 ఏళ్లుగా ఆయన పలు శిలాజాలను సేకరించారు.

తన భార్య కరోల్‌తో కలిసి బీచ్‌లను అన్వేషిస్తుండగా, తన జీవితకాలంలో ఇంతవరకు చూడని వస్తువును కనుగొన్నారు. ఈ భారీ సముద్ర ప్రాణికి చెందిన దవడను ఆయన తొలిసారి కనుగొన్నారు.

‘‘ఈ సముద్ర ప్రాణి ఎంత పెద్దది అయి ఉంటుందో అర్థం చేసుకునేందుకు మరింత ఆధారాలు అవసరం’’ అని చెప్పారు.

డీల్ లొమాక్స్, రుబీ రేనాల్డ్స్, జస్టిన్ రేనాల్డ్స్, పాల్ డి లా సల్లే

ఫొటో సోర్స్, DEAN LOMAX

ఫొటో క్యాప్షన్, డీల్ లొమాక్స్, రుబీ రేనాల్డ్స్, జస్టిన్ రేనాల్డ్స్, పాల్ డి లా సల్లే

ఇలాంటి మరిన్ని కనుగొంటామని ఆశాభావంతో ఉన్నట్లు లొమాక్స్ చెప్పారు.

2020లో తండ్రి, కూతుల్లు జస్టిన్, రుబీ రేనాల్డ్స్‌ కలిసి తాను వెతుకుతున్న దాన్ని కనుగొన్నారని పేర్కొన్నారు.

‘‘నాకు చాలా ఆనందం వేసింది. సంతోషంగా అనిపించింది. ఈ అతిపెద్ద ఇక్తియోసార్‌లో ఒకదాన్ని రెండవ దంతం వాళ్లకు దొరికింది’’ అని లొమాక్స్ చెప్పారు.

దీంతో పాల్ డి ల సల్లే వెంటనే బీచ్‌కు వెళ్లి, మరిన్ని కనుగొనేందుకు వారికి సాయం చేశారు.

‘‘బురద మట్టిని తవ్వాను. గంట తర్వాత, నా పారకు గట్టి పదార్థం తగింది. అది ఎముక. దీన్ని మేం జాగ్రత్తగా భద్రపరిచాం’’ అని గుర్తుకు చేసుకున్నారు.

రెండో దంతానికి చెందిన శకలాల కోసం ఈయన టీమ్, కుటుంబ సభ్యులు వెతకడం కొనసాగించారు. చివరి శకలం 2022లో గుర్తించారు.

సొర చేపలు

ఫొటో సోర్స్, GABRIEL UGUETO

ఇక్తియోటైటాన్ సీవెర్నెన్సిస్

దీని సైజును అంచనా వేసేందుకు ఈ పరిశోధన మరిన్ని ఆధారాలను ఇచ్చింది. ఈ భారీ జంతువులు ఇక్తియోసార్‌‌కు చెందిన కొత్త జాతులు. వీటి పేరు ఇక్తియోటైటాన్ సీవెర్నెన్సిస్ లేదా సెవెర్న్ జెయింట్ ఫిష్ లిజార్డ్.

రుబీ రేనాల్డ్స్‌తో కలిసి లొమాక్స్ తాజాగా ఒక సైంటిఫిక్ పేపర్‌ను రాశారు. ఒక రోజు తాను గుర్తించే జీవి నమూనాకు రుబీ అనే పేరు పెడుతుండొచ్చని అన్నారు.

పాల్ డి ల సల్లే గుర్తించిన జీవి నమూనాను మూడేళ్ల పాటు తన గ్యారేజ్‌లో పెట్టుకుని, దానిపై పరిశోధన చేపట్టారు. ఈ భారీ ఇక్తియోసార్ త్వరలోనే యూకేలోని బ్రిస్టల్ మ్యూజియం, ఆర్ట్ గ్యాలరీలో ప్రదర్శించనున్నారు.

వీడియో క్యాప్షన్, అతి పెద్ద ప్రాణిజాతి శిలాజాలను గుర్తించిన బ్రిటన్ శాస్త్రవేత్తలు...

ఇవి కూడా చదవండి:

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)