ఐపీఎల్: లఖ్‌నవూపై 8 వికెట్ల తేడాతో కోల్‌కతా నైట్ రైడర్స్ గెలుపు
కోల్‌కతా నైట్ రైడర్స్ ఆరంభంలో తడబడినా తర్వాత కోలుకుంది. రెండు వికెట్లు కోల్పోయి, 15.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది.
లైవ్ కవరేజీ
ఇరాన్ ఎలా క్షిపణులను వదిలింది, ఇజ్రాయెల్ ఎలా అడ్డుకుంది?
లైవ్ పేజీ అప్‌డేట్స్ సమాప్తం
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్స్‌ను ఇంతటితో ముగిస్తున్నాం.
స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల లైవ్ అప్‌డేట్స్‌తో రేపు ఉదయం మళ్లీ కలుద్దాం.
ధన్యవాదాలు.
ఐపీఎల్: లఖ్‌నవూపై 8 వికెట్ల తేడాతో కోల్‌కతా నైట్ రైడర్స్ గెలుపు

ఫొటో సోర్స్, GETTY IMAGES
కోల్‌కతా నైట్ రైడర్స్ ఎనిమిది వికెట్ల తేడాతో లఖ్‌నవూ సూపర్ జెయింట్స్‌పై విజయం సాధించింది.
162 పరుగుల లక్ష్యాన్ని 15.4 ఓవర్లలోనే పూర్తి చేసింది.
తొలుత బ్యాటింగ్ చేసిన లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ ఏడు వికెట్లు కోల్పోయి నిర్ణీత 20 ఓవర్లలో 161 పరుగుల స్కోరును నమోదు చేసింది.
ఈ టీమ్‌లో నికోలస్ పూరన్ అత్యధికంగా 45 పరుగులు చేశాడు. కేఎల్ రాహుల్ 39 పరుగులు చేశాడు.
ఆ తర్వాత ఇన్నింగ్స్ ఆడిన కోల్‌కతా నైట్ రైడర్స్ ఆరంభంలో తడబడినా తర్వాత కోలుకుంది. రెండు వికెట్లు కోల్పోయి, 15.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది.
కోల్‌కతా నైట్ రైడర్స్ టీమ్‌లో ఫిలిప్ సాల్ట్ అత్యధిక స్కోరును నమోదు చేశాడు.
47 బంతులకు 89 పరుగులు చేసి, నాటౌట్‌గా నిలిచాడు.
వాతావరణం వేడిక్కితే చాక్లెట్ ధరలు పెరుగుతాయా, రెండింటికీ లింకేంటి?
ఇరాన్-ఇజ్రాయెల్ ఘర్షణ: ఈ రెండు దేశాల మధ్య వైరానికి మూలం ఎక్కడుంది?
డార్ఫర్ క్యాంప్: ఇక్కడ ప్రతి రెండు గంటలకు ఒకరు ఆకలితో చనిపోతున్నారు...
ఈ ప్రపంచం మరో యుద్ధాన్ని తట్టుకోలేదు: ఐక్యరాజ్యసమితి

ఫొటో సోర్స్, EPA
ఇజ్రాయెల్‌పై ఇరాన్ దాడిని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ ఖండించారు. ఈ విషయంలో అందరూ సంయమనం పాటించాలని ఆయన కోరారు.
‘‘మిడిల్ ఈస్ట్‌లో యుద్ధ వాతావరణానికి దారి తీసే ఏ చర్య విషయంలోనైనా అందరూ సాధ్యమైనంతమేరకు సంయమనంతో వ్యవహరించాలి. నేను ఒకే విషయాన్ని పదే పదే నొక్కి చెబుతున్నా. అదేంటంటే, ఈ రీజియన్ లేదా ఈ ప్రపంచం మరో యుద్ధాన్ని తట్టుకోలేదు’’ అని ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.
బీజేపీ మేనిఫెస్టో: ఉమ్మడి పౌర స్మృతి నుంచి ‘ఒకే దేశం ఒకే ఎన్నిక’ వరకు ఏయే అంశాలు ఉన్నాయంటే?
ఇజ్రాయెల్ ప్రతీకార దాడులు చేస్తే మరింత తీవ్రంగా స్పందిస్తామంటూ ఇరాన్ హెచ్చరిక

ఫొటో సోర్స్, Getty Images
ఇజ్రాయెల్‌ను ఇరాన్ ఆదివారం మరోసారి హెచ్చరించింది.
ఇజ్రాయెల్ ఇప్పుడు ప్రతీకారదాడులు చేయకూడదని, ఒకవేళ అలా చేస్తే తమ నుంచి మరింత పెద్ద ప్రతిస్పందన ఉంటుందంటూ ఇజ్రాయెల్‌కు హెచ్చరికలు జారీ చేసింది.
ఒకవేళ ఇజ్రాయెల్ ప్రతీకారం తీర్చుకునేందుకు ప్రయత్నిస్తే, రాత్రి చేసిన బాంబుదాడుల కంటే మరింత తీవ్ర స్థాయిలో ఇరాన్ ప్రతిస్పందిస్తుందంటూ ప్రభుత్వ టీవీతో మాట్లాడుతూ ఇరాన్ సాయుధ బలగాల చీఫ్ ఆఫ్ స్టాఫ్, మేజర్ జనరల్ మొహమ్మద్ బఘేరి వ్యాఖ్యానించినట్లు వార్తా సంస్థ రాయిటర్స్ పేర్కొంది.
అమెరికాకు కూడా ఇరాన్ హెచ్చరికలు జారీ చేసింది.
ఇజ్రాయెల్ ప్రతీకార దాడులకు అమెరికా మద్దతుగా నిలిస్తే, అమెరికా స్థావరాలను కూడా తాము లక్ష్యంగా చేసుకోవాల్సి వస్తుందని హెచ్చరించింది.
ఇరాన్‌పై నేరుగా ఎలాంటి ఆపరేషన్లలో అమెరికా పాల్గొనబోదని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుతో ఫోన్‌లో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ చెప్పినట్లు అధికారులను ఉటంకిస్తూ వార్తాసంస్థ సీఎన్ఎన్ పేర్కొంది.
దాదాపు 99 శాతం క్షిపణుల్ని పేల్చేశాం: ఐడీఎఫ్

ఫొటో సోర్స్, REUTERS
ఇరాన్ 300లకు పైగా డ్రోన్లు, క్షిపణులను ఇజ్రాయెల్‌లోకి ప్రయోగించినట్లు ఇజ్రాయెల్ మిలిటరీ తెలిపింది.
అందులో దాదాపు 99 శాతం ఆయుధాలను తాము నేలకూల్చేసినట్లు వెల్లడించింది.
రాత్రిపూట చేసిన దాడుల్లో కొన్నింటిని యెమెన్, ఇరాక్‌ల నుంచి ప్రయోగించినట్లు ఒక టీవీ బ్రీఫింగ్‌లో ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ అధికార ప్రతినిధి డేనియల్ హగారి చెప్పారు.
ఇరాన్ ప్రయోగించిన క్షిపణులు, డ్రోన్లలో చాలావాటిని కూల్చేశామన్న ఇజ్రాయెల్
బీజేపీ మేనిఫెస్టోలో ఏముంది?

ఫొటో సోర్స్, BJP
2024 లోక్‌సభ ఎన్నికల మేనిఫెస్టోను భారతీయ జనతా పార్టీ (బీజేపీ) విడుదల చేసింది. ఈ మేనిఫెస్టోకు ‘మోదీ గ్యారంటీ సంకల్ప పత్రం’ అనే పేరు పెట్టారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ల సమక్షంలో ఆదివారం ఈ మేనిఫెస్టోను విడుదల చేశారు.
బీజేపీ సీనియర్ నాయకుడు, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ.. ‘‘మేం చెప్పింది చేసి చూపిస్తాం’’ అని అన్నారు.
‘‘జమ్మూకశ్మీర్‌లో ఆర్టికల్ 370ను రద్దు చేసి చూపిస్తామని గతంలో హామీఇచ్చాం. దాన్ని చేసి చూపించాం. మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్లపై కూడా హామీ ఇచ్చాం. దాన్ని కూడా పూర్తిచేశాం’’ అని ఆయన చెప్పారు.
బీజేపీ కొత్త మేనిఫెస్టోలో 24 సెక్షన్లు ఉన్నాయి. సుపరిపాలన, దేశ భద్రత, పారిశుద్ధ్యం, స్పోర్ట్స్ అభివృద్ధి, పర్యావరణం తదితర సెక్షన్లు దీనిలో ఉన్నాయి.
మోదీ గ్యారంటీ పత్రం24 క్యారెట్ల బంగారమంత మంచిదని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ వ్యాఖ్యానించారు.

ఫొటో సోర్స్, BJP
మేనిఫెస్టోలోని ముఖ్యాంశాలు
- వచ్చే ఐదేళ్లపాటు ఉచిత రేషన్, నీరు, గ్యాస్ కనెక్షన్, జీరో విద్యుత్ బిల్లు కోసం ప్రత్యేక నిబంధనలు
- ఆయుష్మాన్ భారత్ కింద రూ.5 లక్షల వరకూ ఉచిత చికిత్సలు.. వీటిని భవిష్యత్‌లోనూ కొనసాగింపు
- మధ్య తరగతి కుటుంబాలకు శాశ్వత గృహాలు
- పశ్నపత్రాల లీక్‌పై కొత్త చట్టం
- నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అమలు
- 2036లో ఒలింపిక్స్ నిర్వహణ
- మౌలిక సదుపాయాల కల్పన, వస్తు తయారీ, అంకుర పరిశ్రమల ఏర్పాటు, స్పోర్ట్స్, పెట్టుబడులు, ఇతర సేవలు, పర్యటకం కింద లక్షల ఉద్యోగాల కల్పన
- ఇప్పటికే కోటి మంది అక్కాచెల్లెళ్లు లక్షాధికారులు అయ్యారు. మరో మూడు కోట్ల మందిని కూడా లక్షాధికారులను చేయాలని లక్ష్యం
- నారీ వందన చట్టం అమలు
- విత్తనాల కొనుగోలు నుంచి మార్కెట్ వరకూ రైతుల ఆదాయం పెంపు. నానో యూరియా, ప్రకృతి వ్యవసాయంతో నేలకు రక్షణ
- మత్స్యకారుల జీవితాలకు సంబంధించిన పడవలకు ఇన్సూరెన్స్, చేపల ప్రాసెసింగ్, సత్వర సమాచార బదిలీ లాంటి అన్ని సేవల బలోపేతం
- సముద్రపు నాచు, ముత్యాల సాగు దిశగా మత్స్యకారులకు ప్రోత్సాహం
- గిగ్ వర్కర్లు, ట్యాక్సీ డ్రైవర్లు, ఆటో డ్రైవర్లు, ఇంటి పనిచేసేవారు, కూలీలు, ట్రక్కు డ్రైవర్లు అందరినీ ఈ-శ్రమ్ పోర్టల్ ద్వారా అనుసంధానించి సంక్షేమ పథకాలు అమలు
- భారత సంస్కృతిని తిరువళ్లూర్ కల్చరల్ సెంటర్ ద్వారా ప్రపంచ దేశాలకు పరిచయం, వ్యాప్తి
- ఉన్నత విద్యా సంస్థల్లో భారత భాషల అధ్యయనాలకు ప్రోత్సాహం
- 2025ను గిరిజన గర్వ ఏడాది (ట్రైబల్ ప్రైడ్ ఇయర్)గా ప్రకటన
- ఏకలవ్య పాఠశాలలు, పీఎం జన్‌మన్ లాంటి పథకాలను ప్రోత్సహించడంతోపాటు ఏకో టూరిజం, అటవీ ఉత్పత్తులకు ప్రాధాన్యం
- ఓబీసీ, ఎస్సీ, ఎస్టీలకు అన్ని విధానాల గౌరవం కల్పించేలా చర్యలు
బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్ ఇంటి వద్ద కాల్పులు

ఫొటో సోర్స్, ANI
బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఇంటి బయట ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులు జరిపినట్లు వార్తా సంస్థ ఏఎన్‌ఐ తెలిపింది.
బాంద్రాలోని సల్మాన్ ఖాన్ నివాసం వద్ద ఉదయం 5 గంటలకు ఈ ఘటన జరిగినట్లు వెల్లడించింది.
మూడు రౌండ్ల పాటు ఫైరింగ్ జరిగినట్లు పోలీసులకు సమాచారం అందిందని, ఘటనా స్థలానికి చేరుకున్న క్రైం బ్రాంచ్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించినట్లు ముంబయి పోలీసులను ఉటంకిస్తూ ఏఎన్‌ఐ పేర్కొంది.
పోస్ట్ X స్కిప్ చేయండిX ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
తిరుపతి: ఆంధ్రప్రదేశ్ ఆధ్యాత్మిక రాజధానిలో రాజకీయాలు ఎలా ఉన్నాయి?
బ్రేకింగ్ న్యూస్, ఇజ్రాయెల్‌కు ‘ఇనుప కవచం’లా మద్దతుగా నిలుస్తామన్న జో బైడెన్

ఫొటో సోర్స్, Reuters
ఇరాన్ ప్రయోగించిన దాదాపు అన్ని డ్రోన్లు, క్షిపణులను నేలకూల్చడంలో ఇజ్రాయెల్‌కు అమెరికా సహాయపడిందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు.
అమెరికా మిలిటరీ విమానాలకు, బాలిస్టిక్ మిసైల్ డిఫెన్స్ డిస్ట్రాయర్లకు గత వారం రోజులుగా తాను మార్గనిర్దేశకత్వం చేసినట్లుగా ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
‘‘ఇజ్రాయెల్ వైపు దూసుకొచ్చిన దాదాపు అన్ని డ్రోన్లు, క్షిపణులను పేల్చేయడంలో మేం సహకరించాం. ఈ పనిని అత్యంత నైపుణ్యంతో చేసిన మా సభ్యులకు కృతజ్ఞతలు. ఇరాన్ చేసిన ఈ దాడులను నేను తీవ్రంగా ఖండిస్తున్నా’’ అని జో బైడెన్ అన్నారు.
కొన్ని నిమిషాల ముందు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో ఫోన్‌లో మాట్లాడిన జో బైడెన్, ఇజ్రాయెల్‌కు అమెరికా ఇనుప కవచంలా మద్దతుగా నిలుస్తుందని హామీ ఇచ్చినట్లు తెలిపారు.
‘‘ఊహకందని దాడులను కూడా సమర్థవంతంగా తిప్పిగొట్టడమే కాకుండా ప్రత్యర్థిని ఓడించగలమని ఇజ్రాయెల్ నిరూపించింది. ఇలా చేయడం ద్వారా ఇజ్రాయెల్ భద్రతకు ఎవరూ ముప్పు కలిగించలేదని స్పష్టమైన సందేశాన్ని శత్రువులకు పంపించిందని నెతన్యాహుతో నేను చెప్పాను’’ అని జో బైడెన్ అన్నారు.
ఇరాన్ దాడిని ఖండించిన జర్మనీ, ఇజ్రాయెల్ వైపే ఉంటామని వ్యాఖ్య
ఇజ్రాయెల్‌పై ఇరాన్ దాడిని జర్మనీ తీవ్రంగా ఖండించింది.
మధ్యప్రాచ్యం అంతటా యుద్ధం ముప్పును ఇరాన్ పెంచుతోందని జర్మనీ చాన్స్‌లర్ ఓలాఫ్ షోల్జ్ అధికార ప్రతినిధి అన్నారు.
‘‘ఈ బాధ్యతారహిత, అసమంజసమైన దాడితో ఇరాన్ ప్రాంతీయ యుద్ధ ప్రమాదాన్ని పెంచుతోంది. జర్మనీ, ఇజ్రాయెల్ వైపే నిలబడుతుంది’’ అని వ్యాఖ్యానించారు.
వీడియో: సైరన్ల మోత, పేలిపోతున్న డ్రోన్లతో జెరూసలెం ఆకాశంలో మెరుపులు
వీడియో క్యాప్షన్, ఇజ్రాయెల్-ఇరాన్: జెరూసలెంలో సైరన్ల మోత, ఆకాశంలో డ్రోన్లు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఫోన్

ఫొటో సోర్స్, Israeli PM's office
ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహుకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఫోన్ చేసినట్లు నెతన్యాహు అధికార ప్రతినిధి ఒకరు వెల్లడించారు.
వారిద్దరూ ఫోన్‌లో సంభాషిస్తున్నట్లుగా చెబుతూ ఒక ఫోటోను విడుదల చేశారు.
ఇజ్రాయెల్‌పై వందల డ్రోన్లు, క్షిపణులతో దాడి చేసిన ఇరాన్, వాటిని ఆకాశంలోనే పేల్చేసిన ఐడీఎఫ్

ఇజ్రాయెల్ మీద ఇరాన్ 200కు పైగా డ్రోన్లు, క్రూయిజ్ క్షిపణులు, బాలిస్టిక్ క్షిపణులతో భారీ దాడికి పాల్పడిందని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడీఎఫ్) అధికార ప్రతినిధి, రియర్ అడ్మిరల్ డేనియల్ హగారీ ఒక టీవీ ప్రకటనలో వెల్లడించారు.
ఇరాన్ ప్రయోగించిన క్షిపణులు, డ్రోన్లలో చాలావాటిని ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థతో పాటు మిత్రపక్షాలు సమర్థంగా అడ్డుకున్నాయని ఆయన తెలిపారు.
డజన్ల కొద్దీ డ్రోన్లను ఇజ్రాయెల్ భూభాగం వెలుపలే కూల్చేసినట్లు చెప్పారు.
ఇజ్రాయెల్ మీదకు డజన్ల కొద్ది డ్రోన్లు, క్షిపణులను ప్రయోగించినట్లు ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్‌జీసీ) ఒక ప్రకటన విడుదల చేసింది.

ఫొటో సోర్స్, EPA
జెరూసలేంలో సైరన్ల మోతతో పాటు ఇరాన్ ప్రయోగించిన ఆయుధాలను ఐడీఎఫ్ అడ్డుకోవడంతో ఆకాశంలో మెరుపులు కనిపించాయి.
మరిన్ని దాడులు చేయబోమని ఇరాన్ సూచనప్రాయంగా చెప్పింది. కానీ, ఇజ్రాయెల్ ప్రతీకార దాడులు చేయకూడదని, అమెరికా ఈ విషయంలో జోక్యం చేసుకోకూడదని హెచ్చరించింది.
ఇజ్రాయెల్ వైపు దూసుకొస్తున్న కొన్ని డ్రోన్లను అమెరికా కూల్చేసింది.
ఏ పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తూ ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు అన్నారు.

