కర్నాటక: ఎన్నికల సభలో ప్రధాని మోదీ ప్రస్తావించిన నేహా హత్య కేసు ఏమిటి?

ఫొటో సోర్స్, IMRAN QURESHI
- రచయిత, ఇమ్రాన్ ఖురేషి
- హోదా, బీబీసీ కోసం
కర్నాటక హుబ్లీ జిల్లాలో నేహా హిరేమత్ అనే అమ్మాయిని తన మాజీ క్లాస్‌మేట్, స్నేహితుడైన ఫయాజ్ కుండునాయక్ అనే యువకుడు హత్య చేసిన ఘటనను తాజా ఎన్నికల సభలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రస్తావించారు.
ఈ ఘటనతో రాష్ట్రంలో ‘లవ్ జిహాద్’కు వ్యతిరేకంగా బీజేపీ చేపడుతున్న నిరసనలకు మరింత ఆజ్యం పోసినట్లయింది.
నేహాపై తన కాలేజీ క్యాంపస్‌లోనే పదునైన ఆయుధంతో ఫయాజ్ దాడి చేశాడు. దీంతో ఉత్తర కర్నాటకలో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి.
మొదట్లో నేహా, ఫయాజ్ సన్నిహితంగా ఉండేవారు. అయితే, విభేదాలు రావడంతో ఫయాజ్‌ను నేహా దూరం పెట్టింది.
వీరిద్దరూ బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ (బీసీఏ)ను ఒకే కాలేజీలో చదివారు. చివరి పరీక్షల్లో పాసైన తర్వాత పైచదువుల కోసం వేరే కాలేజీలో నేహా చేరారు.

ఫొటో సోర్స్, IMRAN QURESHI
తన కొడుకు చేసిన పనిని ఫయాజ్ తల్లి బహిరంగంగానే ఖండించారు. అయితే, వీరిద్దరూ ప్రేమించుకున్నారని ఆమె చెప్పారు.
స్థానిక రిపోర్టర్లతో ఫయాజ్ తల్లి ముంతాజ్ మాట్లాడుతూ.. ‘‘నేను కర్నాటక ప్రజలకు క్షమాపణలు చెబుతున్నాను. నేహా కుటుంబానికి కూడా క్షమాపణలు. నేహాకు, ఆమె కుటుంబానికి మా అబ్బాయి చాలా అన్యాయం చేశాడు. దీనికి మేం సిగ్గుతో తలవంచుకుంటున్నాం. చట్టాలకు అనుగుణంగా అతడికి కఠిన శిక్ష వేయాలి’’ అని ఆమె చెప్పారు.
టీచర్‌గా పనిచేస్తున్న ఆమె రెండు చేతులు జోడించి, ఏడుస్తూ రిపోర్టర్లతో మాట్లాడారు.
‘‘నేహా, మా అబ్బాయి కేవలం స్నేహితులు మాత్రమే కాదు. వారు ప్రేమించుకున్నారు. ఏడాది క్రితమే ఈ విషయం మాకు తెలిసింది. వారిద్దరూ పెళ్లి చేసుకోవాలని కూడా అనుకున్నారు’’ అని ఆమె చెప్పారు.

ఫొటో సోర్స్, IMRAN QURESHI
మరోవైపు రాష్ట్ర హోం మంత్రి డా. జి. పరమేశ్వర దీనిపై మాట్లాడుతూ.. ‘‘ఈ కేసులో లవ్ జిహాద్ కోణం లేదు’’ అని చెప్పారు. వారిద్దరూ ఒకరినొకరు ప్రేమించుకున్నారని అన్నారు.
నేహా హత్య తర్వాత, ఉత్తర కర్నాటకలోని చాలా నగరాలు, పట్టణాల్లో బీజేపీ నిరసనలు చేపట్టింది. ఇది కచ్చితంగా లవ్ జిహాద్ కేసేనని పార్టీ నాయకులు ప్రచారం చేశారు.
అయితే, వ్యక్తిగత కారణాలతోనే ఆ హత్య జరిగిందని కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అన్నారు.
సీఎం ప్రకటనపై నేహా తండ్రి నిరంజనయ్య హిరేమత్ అసంతృప్తి వ్యక్తంచేశారు. తమ కుటుంబ పరువుకు భంగం కలిగించేలా ముఖ్యమంత్రి మాట్లాడారని వ్యాఖ్యలు చేశారు.
హుబ్లీలో కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్‌గా నిరంజనయ్య పనిచేస్తున్నారు. ఆయన ఈ విధంగా స్పందించడంతో రాజకీయ వర్గాల్లో ఈ అంశంపై చాలా చర్చ జరిగింది.
నిరంజనయ్య వ్యాఖ్యలతో బీజేపీ చెబుతున్న లవ్ జిహాద్ కోణానికి మరింత ఆజ్యం పోసినట్లు అయింది.

ఫొటో సోర్స్, IMRAN QURESHI
హుబ్లీలో విలేఖరులతో నిరంజనయ్య మాట్లాడుతూ.. ‘‘ఒకవేళ వారి మధ్య సాన్నిహిత్యం గురించి ఫయాజ్ తల్లికి ముందే తెలిస్తే, ఆమె ఎందుకు మాకు చెప్పలేదు? వారి మధ్య స్నేహాన్ని ప్రాథమిక దశలోనే ఆపివేసేందుకు మేం ప్రయత్నించేవాళ్లం కదా’’ అని ఆయన అన్నారు.
శుక్రవారం సాయంత్రం బెంగళూరులో ఒక బహిరంగ సభను ఉద్దేశించి ప్రసంగించేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వచ్చారు.
ప్యాలెస్ గ్రౌండ్స్‌లో ఆ సభలో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రోత్సహిస్తున్న విధానాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు.
‘‘కాంగ్రెస్ ప్రోత్సహిస్తున్న విధానాలు చాలా ప్రమాదకరమైనవి. మన అమ్మాయిలపై దాడులు చేస్తున్నారు. బహిరంగ ప్రదేశాల్లో బాంబులు పెడుతున్నారు. భజనలు, కీర్తనలు పాడేవారిని లక్ష్యంగా చేసుకుంటున్నారు. ఇవేమీ సాధారణ ఘటనలు కాదు. అందుకే కర్నాటక ప్రజలు అప్రమత్తంగా ఉండాలి’’ అని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు.

ఫొటో సోర్స్, ANI
నేహా హత్య అనంతరం ఫయాజ్ సొంత ఊరైన బెలగామీ జిల్లాలోని మునావాలీలోనూ నిరసనలు జరిగాయి.
ఫయాజ్‌కు కఠినమైన శిక్ష విధించాలని స్థానిక ముస్లిం సంస్థలు డిమాండ్ చేశాయి.
ఈ కేసుపై పనిచేస్తున్న ఓ సీనియర్ పోలీసు అధికారి మాట్లాడుతూ.. ‘‘దర్యాప్తులో ఫయాజ్ మాట్లాడాడు. వారిద్దరూ ప్రేమించుకున్నారని, అయితే, గొడవల కారణంగా కొన్ని రోజుల నుంచీ నేహా మాట్లాడటం మానేసిందని చెప్పాడు. ఈ కేసులో మరిన్ని వివరాల కోసం దర్యాప్తు చేపడుతున్నాం. ఘటన జరిగిన వెంటనే ఫయాజ్‌ను అరెస్టు చేశాం’’ అని చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- పరోటాలు రోజూ తింటే ఏమవుతుంది? మైదాపిండిపై ఉన్న అపోహలు, వాస్తవాలు
- వెయ్యేళ్ల నాటి ఈ అస్థిపంజరం కోసం నాజీలు, సోవియట్లు ఎందుకు పోరాడారు?
- ఇరాన్ ఎందుకు ఇజ్రాయెల్‌పై దాడులు చేసింది? ఆరు ప్రశ్నలు, సమాధానాలు..
- ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు: వైసీపీకి చిక్కవు, టీడీపీకి దొరకవు
- భవిష్యత్తు భూగర్భానిదే.. అక్కడే ఇళ్లు, షాపింగ్ మాల్స్, వ్యవసాయం.. ఇదంతా సాధ్యమేనా?
బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















