IPL 2024: ఈ బ్యాటర్ల జోష్ ఇలాగే సాగితే టీ20 క్రికెట్‌కు ప్రమాదమా?

ఐపీఎల్

ఫొటో సోర్స్, AFP

    • రచయిత, అయాజ్ మెమన్
    • హోదా, క్రికెట్ రచయిత

ప్రపంచంలోనే అత్యంత ధనిక క్రికెట్ టోర్నమెంట్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్). తాజాగా మార్చిలో మొదలైన ఈ టోర్నీలో అనూహ్యంగా రికార్డులు బద్దలవుతున్నాయి.

మైదానాల్లో బ్యాటర్లు 'తుపాను' సృష్టిస్తున్నారు. భారీ షాట్‌లతో విరుచుకుపడుతున్నారు. ప్రతి మ్యాచ్‌ను సిక్సర్ల పండగలా మారుస్తున్నారు.

అయితే, ఇది ట్వంటీ 20 క్రికెట్‌ను ఎటువైపు తీసుకెళుతుందో తెలియక బౌలర్లు, క్రికెట్ నిపుణులు, అభిమానులు ఆందోళన పడుతున్నారు.

ఈ సీజన్ బ్యాటింగ్ విన్యాసాలను హైలైట్ చేసే కొన్ని నంబర్స్ పరిశీలిద్దాం.

ఈనెల 23న చెన్నై సూపర్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య జరిగిన మ్యాచ్‌తో ఈ సీజన్‌లో ఇప్పటివరకు మొత్తం 1,191 ఫోర్లు, 686 సిక్సర్లు నమోదయ్యాయి.

గత ఏడాది సీజన్‌లో 2,174 ఫోర్లు, 1,124 సిక్సర్లు నమోదయ్యాయి. ఈ సీజన్‌లో ఇంకా సగానికి పైగా మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి.

ప్రస్తుత సీజన్ బ్యాటింగ్ సరళిని పరిశీలిస్తే గత సంవత్సరం గణాంకాలను సులభంగా అధిగమించే అవకాశాలున్నాయి.

ఐపీఎల్

ఫొటో సోర్స్, AFP

300 కూడా కొట్టేస్తారేమో..

బ్యాటర్లు దూకుడుగా ఆడుతుండటంతో ఫోర్లు, సిక్సర్ల సంఖ్యతో పాటే జట్ల స్కోరూ పెరుగుతోంది.

అప్పట్లో 150-160 స్కోరును పోటీగా భావించేవారు, కానీ ఇవాళ ఐపీఎల్‌లో ఆ స్కోరుకే పరిమితమైన జట్లలో పదిలో ఎనిమిది ఓటమిని చవిచూస్తున్నాయి.

2007లో జరిగిన తొలి టీ20 ప్రపంచ కప్‌లో ఇంగ్లండ్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్‌ బౌలింగ్‌లో భారత బ్యాటర్ యువరాజ్ సింగ్ ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు కొట్టాడు.

ఆ మ్యాచ్‌లో ఇండియా 218 పరుగులు చేసింది. ఆ సమయంలో అది గొప్ప స్కోరు. అయితే, 16 ఏళ్ల తర్వాత చూసుకుంటే జట్టు 200 పరుగులు సాధించడం చాలా కామన్‌గా మారింది.

ఈ ఐపీఎల్ సీజన్‌లో ఇప్పటివరకు 40 మ్యాచ్‌లు జరగగా జట్లు 21 సార్లు 200 పరుగుల మార్క్‌ను అధిగమించాయి.

మొత్తం రెండు జట్ల స్కోర్లు తొమ్మిది సార్లు 400 పరుగులు దాటాయి, ఇక రెండు మ్యాచ్‌లైతే ఆశ్చర్యకరంగా 500 పరుగులను మించిపోయాయి! ఈ సీజన్‌లో సగటు రన్ రేట్ ఓవర్‌కు 10కి చేరుకుంది.

ఐపీఎల్

ఫొటో సోర్స్, Getty Images

సీజన్ ప్రారంభం నుంచి దూకుడు మీదున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు దిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మొదటి పవర్‌ప్లే (6 ఓవర్లు) లో 125 పరుగులు సాధించింది.

జట్టు రన్ రేట్ ఓవర్‌కు 20.83 పరుగులు.

సన్‌రైజర్స్ ఈ సీజన్‌లో మూడుసార్లు 250 కంటే ఎక్కువ పరుగులు సాధించింది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరుపై ఏకంగా 287 పరుగులు కొట్టింది.

బహుశా ఈ సీజన్‌లోనే 300 పరుగుల మైలురాయిని కూడా దాటే అవకాశముంది.

టీ20 క్రికెట్‌లో స్ట్రోక్ ప్లే అవసరం, టెస్టులు, వన్డేలతో పోలిస్తే ఇక్కడ డాట్ బాల్స్ తక్కువగా నమోదవుతాయి. బ్యాటర్‌లు బంతిని స్వేచ్ఛగా బాదేస్తుంటారు.

ఈ వ్యూహం ప్రమాదకరమైనప్పటికీ బౌండరీలు, సిక్సర్లతో వస్తున్న స్కోరింగ్ ఈ సీజన్‌లో అనూహ్యంగా ఉంది.

ఐపీఎల్

ఫొటో సోర్స్, AFP

ఫొటో క్యాప్షన్, ముంబైతో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ బ్యాటర్ అశుతోష్ శర్మ 28 బంతుల్లో 61 పరుగులు సాధించాడు.

విధ్వంసకర బ్యాటింగ్‌ను ప్రభావితం చేసేదేమిటి?

ఫ్లాట్ పిచ్‌లు. సాధారణంగా వన్డేలు, టీ20లు సహా వైట్-బాల్ క్రికెట్ కోసం పిచ్‌లు బ్యాట్స్‌మెన్‌కు అనుకూలంగా ఉండేలా తయారు చేస్తుంటారు. ఎందుకంటే టీ20 క్రికెట్ ఫాస్ట్-పేస్డ్ యాక్షన్, పెద్ద హిట్‌ గేమ్. అభిమానులు, ప్రసారకులు, స్పాన్సర్‌లలో పాపులర్ గేమ్.

అయితే, ఐపీఎల్‌లో బ్యాటర్ల దూకుడు ఆటతీరుతో బౌలర్లు ఫ్లాట్ ట్రాక్‌ పిచ్‌లను మించిన సవాళ్లను ఎదుర్కొంటున్నారు.

బ్యాటర్‌లు బలంగా కొడుతున్నారు, మరీ ముఖ్యంగా సాహసోపేతంగా ఆడుతున్నారు. యువ ఆటగాళ్లు టీ20లతోనే పేరు తెచ్చుకుంటున్నారు.

ఎక్కువ రిస్క్‌లు తీసుకుంటున్నారు, మ్యాచ్‌లు గెలవడానికి, పోటీని తట్టుకోవడానికి లేదా ఎక్కువ గుర్తింపు, రివార్డు కోసం దూకుడైన ఆటతీరుతో ముందుకొస్తున్నారు.

క్రికెట్ నియమాల్లో మార్పులు కూడా ఆటలో బౌలర్ల పాత్రను తగ్గించాయి. ఉదాహరణకు గత ఏడాది ఐపీఎల్ సీజన్‌లో ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ ప్రవేశపెట్టారు.

కోచ్‌లు, కెప్టెన్‌లు సరైన సమయంలో ఒక ఆటగాడిని తీసుకురావడానికి ఇది అవకాశం కల్పిస్తోంది. ఇది ఒక ఆసక్తికరమైన ఎత్తుగడ.

కానీ ఇప్పటివరకు జరిగిన మ్యాచ్‌లను పరిశీలిస్తే బ్యాటింగ్ లోతు ఉన్న ఆటగాళ్లకే ఈ రూల్ ఎక్కువగా ఉపయోగపడింది.

ఐపీఎల్

ఫొటో సోర్స్, Getty Images

ఇది మంచిది కాదు: సునీల్ గావస్కర్

చాలామంది 'క్రికెట్ ఒక బ్యాటర్ గేమ్' అంటుంటారు. అయితే బ్యాట్‌కు, బంతికి మధ్య అసమతుల్యత టీ20కి మంచిదేనా అనే చర్చ ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో గట్టిగా నడుస్తోంది

దీనిపై భారత మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ కూడా తన అసంతృప్తిని లేవనెత్తారు. "ఆట ఏకపక్షంగా ఉంటే, పోటీ ఉండదు, ఆసక్తిని తగ్గిస్తుంది" అని గవాస్కర్ చెప్పాడు.

బౌండరీల దూరం 75 గజాల నుంచి 65 గజాలకు తగ్గుతుందనే ఆందోళన వెలిబుచ్చారు గవాస్కర్.

"బ్యాట్స్‌మన్ పొరపాటు చేసేలా బౌలర్ బంతి సంధిస్తాడు, అయితే, బౌండరీ దూరం దగ్గరయితే ఎలా? అది బౌలర్‌కే పనిష్మెంట్‌లా మారుతుంది. క్యాచ్‌గా ఫలితం తేలాల్సిన బంతి, సిక్స్‌గా మారిపోతోంది" అని అంటున్నాడు.

అయితే, దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ డేల్ స్టెయిన్ ఈ పరిస్థితిని బౌలర్ల నైపుణ్యాలు, స్వభావాన్ని సవాలు చేసేదిగా చూస్తున్నాడు.

"ఇందులో కూడా బౌలర్లు 4 ఓవర్లలో హీరోలుగా మారడానికి కావాల్సిన అవకాశం, ప్రోత్సాహం ఉంది" అని స్టెయిన్ అంటున్నాడు.

ఇదే సమయంలో టీ20 ఆట ప్లేయర్స్ స్కిల్స్, ఆలోచించే విధానం నాటకీయంగా మారుస్తోంది. ఇది ఆటగాళ్లను హుషారుగా, క్రియాశీలంగా, సృజనాత్మకంగా ఉండేలా ప్రేరేపిస్తోంది.

అయితే, ఈ టీ20 ఆట గోల్ఫ్, బేస్ బాల్ క్రికెట్‌గా మారకుండా ఉండాలంటే బ్యాట్, బాల్ మధ్య సమతుల్యత ఉండి తీరాలి.

ఇవి కూడా చదవండి:

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)