ఎన్టీపీసీ-సింహాద్రి ప్లాంట్‌: దూరంగా ఉన్నవారికి వెలుగుల్ని, పక్కనే ఉన్న ఊరికి జబ్బుల్ని మిగిల్చిందా?

ధర్మల్ విద్యుదుత్పత్తి కేంద్రం
    • రచయిత, లక్కోజు శ్రీనివాస్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

అనకాపల్లి జిల్లాలోని పరవాడ ఫార్మాసిటీలో పరిశ్రమలను దాటుకుని ముందుకు వెళ్తుంటే దారి పొడవునా పచ్చని పొలాలు పలకరిస్తాయి.

ఆ పొలాలతో పాటు నేషనల్ థర్మల్ పవర్ కార్పోరేషన్- ఎన్టీపీసీ-సింహాద్రికి చెందిన పొడవాటి టవర్లు దట్టమైన ఆవిర్లను వదులుతూ కనిపిస్తాయి. ఈ టవర్లకు ఆనుకుని ఉంటుంది మూల స్వయంభువరం గ్రామం.

ఈ గ్రామంలోకి వెళ్తూంటే “మమ్మల్ని ఎన్టీపీసీ నుంచి రక్షించేంత వరకు మేం ఈ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలను బహిష్కరిస్తున్నాం” అంటూ ఫ్లెక్సీలు కనిపిస్తాయి.

ఊర్లోకి వెళ్లిన తర్వాత కూడా ఇవే బోర్డులు తారసపడతాయి.

1300 మంది ఉండే ఈ గ్రామానికి ఏమైంది? ఎన్టీపీసీ కారణంగా ఈ గ్రామంలో ఏం జరిగింది? 600 ఓట్లు ఉన్న ఈ గ్రామం ఎన్నికలను బహిష్కరిస్తామని ఎందుకు చెబుతోంది?.

ఎన్టీపీసీ, పవర్ ప్లాంట్, పొల్యూషన్
ఫొటో క్యాప్షన్, తమ సమస్యను పరిష్కరించాలంటున్న గ్రామస్తులు

విద్యుదుత్పత్తి కేంద్రాల కాలుష్యం

బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు ఉన్న ప్రాంతాల్లో ఇలాంటి సమస్యలు ఉన్నాయి.

ఆంధ్రప్రదేశ్ జెన్‌కోకు కృష్ణా, నెల్లూరు, కడప జిల్లాల్లో 6,610 మెగా వాట్ల సామర్థ్యం గల 17 యూనిట్లు ఉన్నాయి.

వీటికి అదనంగా కొన్ని ప్రైవేటు కంపెనీలు కూడా విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నాయి.

తెలంగాణలో టీఎస్ జెన్‌కో 4,042 మెగా వాట్ల సామర్థ్యం గల 10 యూనిట్లను నడుపుతోంది. ఎన్టీపీసీకి రామగుండంలోనూ పవర్ ప్లాంట్ ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో కొత్తగూడెం, రామగుండం, కడపలోని ఎర్రగుంట్ల మండలం, కొండపల్లి, ఇబ్రహీంపట్నం, పరవాడలో గాలి కాలుష్యం, నీటి కాలుష్యంతో పాటు స్థానికులకు చర్మం మీద దద్దులు, శ్వాస కోశ ఇబ్బందులు, కిడ్నీ సంబంధిత వ్యాధుల గురించి ఆరోపణలు వస్తున్నాయి.

నెల్లూరు జిల్లాల్లో థర్మల్ పవర్ ప్లాంట్ వల్ల అనారోగ్యం బారిన పడిన ముతుకూరు ప్రజలకు నష్టపరిహారం చెల్లించాలంటూ 2022లో నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ ఆదేశించింది.

కాలుష్యం, నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్
ఫొటో క్యాప్షన్, రెండు కాళ్లు చచ్చుబడి పోవడంతో నడవలేని పరిస్థితిలో ఉన్న నాగమణి

‘ సొంతంగా మంచి నీళ్లు కూడా తాగలేను’

నాగమణి మూలస్వయంభువరం గ్రామానికి కోడలిగా వచ్చారు. హాయిగా జీవితం సాగిపోతున్న తరుణంలో ఆరోగ్య సమస్యలు మొదలైయ్యాయి. క్రమంగా కాళ్లు చచ్చుబడిపోయాయి.

ఇంట్లో కూడా కనీసం ఎటు కదలలేని పరిస్థితిలో ఉన్నారు.

ఆమె ఇంటికి బీబీసీ వెళ్లినప్పుడు గుమ్మం వద్ద కనిపించారు.

మీకు మంచినీళ్లు కూడా ఇవ్వలేను. ఎందుకంటే నాకే నా భర్త అన్ని పనులు చేసిపెడతారు. ఆయన లేకుండా కనీసం నేను మంచినీళ్లు కూడా తాగలేను. ప్రస్తుతం నా భర్త పని కోసం వేరే ఊరు వెళ్లారు అని చెప్పారు.

“ఎన్టీపీసీ నుంచి వస్తున్న కాలుష్యం వల్లే నాకిలాంటి పరిస్థితి వచ్చింది. అందులో ఏముంటాయో తెలియదు. కానీ నాకు ఈ జబ్బు తెచ్చిపెట్టింది. ఈ ఊర్లో చాలామందికి ఇదే పరిస్థితి. నేను కనీసం ఏ పనికి కదలలేను. రెండు కాళ్లు చచ్చుబడిపోయాయి.” అని కన్నీళ్లు పెట్టుకున్నారామె.

నాగమణి ఇంటికి నాలుగిళ్ల అవతల ఉన్న రాజుది కూడా ఇదే పరిస్థితి. రెండు కాళ్లు వంకర్లు తిరిగిపోయి, నడవలేని పరిస్థితిలో ఉన్నారు.

2014 వరకు ఎన్టీపీసీలో రాజు పని చేసేవారు. ఆ తర్వాత క్రమంగా ఆరోగ్యం చెడిపోవడంతో ఇంటికే పరిమితమయ్యారు.

“నా కాళ్లు క్రమంగా శక్తిని కోల్పోతున్నాయి. ఆసుపత్రికి వెళ్తే మేం తాగే నీటిలోనే సమస్య ఉందని డాక్టర్లు చెప్పారు.” అని రాజు బీబీసీతో అన్నారు.

మూల స్వయంభువరం గ్రామంలో కాళ్లు వంకర్లు తిరిగిన వాళ్లు చాలామంది కనిపించారు. అలాగే శరీరంపై తెల్లని మచ్చలతో బాధపడే వారు ఉన్నారు.

వారందరూ కూడా గతంలో తాము ఆరోగ్యంగా ఉండేవాళ్లమని, ఎన్టీపీసీ వచ్చిన తర్వాతే తమ పరిస్థితి ఇలా అయిందని బీబీసీతో చెప్పారు.

పవర్ ప్లాంట్, కాలుష్యం, ఐరన్
ఫొటో క్యాప్షన్, కూలింగ్ టవర్ల నుంచి వస్తున్న నీటి తుంపర్లతో ఇనుప వస్తువులకు తుప్పు

‘ఊళ్లో ఇనుప వస్తులన్నింటికి తుప్పే’

మూల స్వయంభువరం గ్రామంలో గుడి, బడి ఉన్నాయి. ఈ రెండు ప్రాంగణాలకు అమర్చిన ఇనుప గేట్లు తుప్పు పట్టి ఉన్నాయి.

గ్రామంలోని దాదాపు ఇళ్లలోని కిటీకీలు, ఇతర ఇనుప వస్తువులన్నింటికి తప్పు కనిపించింది. ఇళ్ల రేకులకు రంధ్రాలు పడ్డాయి.

ఎన్టీపీసీ కూలింగ్ టవర్ల నుంచి వస్తున్న ఉప్పు నీటితో కూడిన తుంపర్ల వల్లే ఇనుప వస్తువులకు తుప్పు పడోతందని గ్రామస్తులు చెబుతున్నారు.

గ్రామంలో చాలా ఇళ్లలో స్లాబ్ లోపల ఇనుప ఊచలకు తప్పుపట్టి... పైకప్పు పెచ్చులు ఊడిపోయి కనిపించాయి.

ఈ సమస్యతో పదే పదే ఇంటి రిపేర్లకు వేలల్లో ఖర్చు చేయాల్సి వస్తుందని గ్రామస్తులు చెప్పారు.

గ్రామంలోని చాలా చెట్లు మాడిపోయి, పంట పొలాలు వాడిపోయి కనిపించాయి. ఊళ్లోని ప్రతి ఇంట్లోనూ గోడలపై దుమ్ము, ధూళి పేరుకుపోయింది. ఇంటిని శుభ్రపరుస్తుంటే నల్లని ద్రవం కారుతున్న దృశ్యాలు ప్రతి ఇంటి వద్ద కనిపించాయి.

గతంలో తమ ఊరు నుంచి గాజువాక, విశాఖకు ప్రతి రోజూ టన్నుల కొద్దీ కూరగాయాలు వెళ్తుండేవని, ఇప్పుడు తాము కూరకు సరిపడా కూరగాయాలను పండించుకోలేని స్థితికి వచ్చామని చెప్పారు.

అలాగే ఊరిలో నీటిని తాగలేక వేరే ప్రాంతాల నుంచి మంచి నీరు కొనుగోలు చేసి తెచ్చుకోవడం గ్రామంలో కనిపించింది.

సార్వత్రిక ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలు
ఫొటో క్యాప్షన్, సమస్య పరిష్కరిస్తేనే ఓటు వేస్తామంటున్న గ్రామస్తులు

'పోలీస్‌ స్టేషన్ కైనా వెళ్తాం, పోలింగ్ బూత్‌కి వెళ్లం’

‘‘గ్రామాన్ని ఇక్కడ నుంచి తరలించాలని 20 ఏళ్లుగా ఎన్టీపీసీ-సింహాద్రి అధికారులను, రాజకీయ నాయకులను అడుగుతున్నాం. స్థానిక రాజకీయ నాయకుల సాయంతో ఎన్టీపీసీ అధికారులను కలిసేందుకు ప్రయత్నించాం. కానీ మా సమస్యను వాడుకుని నాయకులు తమకు కావలసిన వారికి కాంట్రాక్టు ఉద్యోగాలు ఇప్పించుకున్నారు. మమ్మల్ని పట్టించుకోలేదు’’ అని గ్రామానికి చెందిన కొత్తపల్లి బాబురావు బీబీసీతో చెప్పారు.

“ఒకపక్క బూడిద, మరో వైపు కూలింగ్ టవర్ల నుంచి వచ్చే ఉప్పునీరు. గ్రామంలో మనుషులు ఉండలేని పరిస్థితి వచ్చింది. అనారోగ్యంతో పాటు భూములు నిరుపయోగంగా మారిపోతున్నాయి. ఆస్తి నష్టం కూడా జరుగుతోంది. ఇరవై ఏళ్లుగా నలుగురు ఎమ్మెల్యేలకు మా గోడు చెప్పుకున్నాం. అయినా మా పరిస్థితి మార లేదు” అని బాబురావు అన్నారు.

“అందుకే ఈసారి గట్టి నిర్ణయం తీసుకున్నాం. ఎట్టి పరిస్థితుల్లో మా గ్రామాన్ని తరలిస్తేనే మేం ఓట్లు వేస్తాం. కలెక్టర్ స్థాయి అధికారి లిఖితపూర్వకంగా హామీ ఇస్తేనే పోలింగ్ బూతులకు వెళ్తాం. అవసరమైతే పోలీస్ స్టేషన్ కైనా వెళ్తాం కానీ, పోలింగ్ స్టేషన్ కు వెళ్లం” అని కొత్తపల్లి బాబురావు చెప్పారు.

ఈ సమస్య పరిష్కరించాలంటే రాజకీయ ఒత్తిడి ఉండాలి. రాజకీయ నాయకులు పట్టించుకోవడం లేదు. అందుకే సమస్య ఆ గ్రామంలోనే ఉండిపోతుందని సీనియర్ జర్నలిస్ట్ వీవీ రమణమూర్తి అన్నారు.

“ఆ గ్రామస్తులతో నేను మాట్లాడాను. వాళ్లకి ప్రజాస్వామ్యంపై, ఎన్నికల వ్యవస్థపై నమ్మకం ఉంది. కానీ అక్కడి సమస్య గ్రామం దాటి బయటకు రావడం లేదు. అందుకు ఏదో ఒకటి చేయాలి. అందుకని ఎన్నికలు బహిష్కరిస్తున్నామని గ్రామస్తులు చెప్పారు. ఎవరైనా బాధ్యతగల అధికారులు వచ్చి సరైన హామీ ఇస్తే ఎన్నికల్లో పాల్గొంటామని చెప్పారు.” అని రమణమూర్తి అన్నారు.

ఎన్నికలు, ఓట్లు, పోలింగ్, పోలీసులు
ఫొటో క్యాప్షన్, తాడో పేడో తేల్చుకోవాలని నిర్ణయించుకున్న గ్రామస్తులు

నేతలు మారారు, మా బతుకులు మారలేదు: గ్రామస్తులు

పరవాడలో ఎన్టీపీసీ తొలి యూనిట్ 2002లో సింహాద్రి-ఎన్టీపీసీ పేరుతో ప్రారంభమైంది.

ఆ తర్వాత 2004, 2011, 2012లలో మరో మూడు యూనిట్లు నెలకొల్పారు.

ఒక్కో యూనిట్ 500 మెగావాట్ల చొప్పున్న ప్రస్తుతం పరవాడలోని ఎన్టీపీసీ-సింహాద్రి 2వేల మెగావాట్ల విద్యుత్ ను ఉత్పత్తి చేస్తుంది.

‘‘ఈ ఫ్యాక్టరీ ద్వారా మా ఊరు మారిపోతుందని, మాకు మంచి జరుగుతుందని భావించాం. కానీ మా జీవితాలను నాశనం చేసింది. ఎన్టీపీసీ పెట్టిన తర్వాత నలుగురు ఎమ్మెల్యేలు వచ్చారు. 2004లో గుడివాడ గుర్నాధరావు, 2009లో పంచకర్ల రమేష్ బాబు, 2014లో బండారు సత్యనారాయణ మూర్తి, 2019లో అదిప్ రాజ్ వచ్చారు. కానీ మా సమస్య మాత్రం పరిష్కరం కాలేదు. సీఎంలు మారారు, పీఎం మారారు. కానీ మేం ఇక్కడే కష్టాల్లోనే ఉన్నాం’’ అని 60 ఏళ్ల నూకాలమ్మ ఆవేదన వ్యక్తం చేశారు.

ఎన్టీపీసీ-సింహాద్రి దేశంలోనే తీర ప్రాంతంలో నెలకొల్పిన మొట్టమొదటి బొగ్గు ఆధారిత థర్మల్ పవర్ ప్లాంట్.

దీని నీటి అవసరాలకు 80 శాతం వరకు సముద్రపు నీటినే వాడతారు.

ఈ నీటినే ఎన్టీపీసీలోని వివిధ యూనిట్లలో వేడిని తగ్గించేందుకు కూలింగ్ టవర్లలో వాడతారు.

కూలింగ్ టవర్లలో ఉపయోగించే ఉప్పు నీరు బయటకు టవర్ల పై భాగం నుంచి వస్తుంది. అది ఎన్టీపీసీకి దాదాపుగా అనుకుని ఉన్న మూల స్వయంభువరం గ్రామంపై పడుతుంది. దాంతో అక్కడ భవనాలు, ఇనుప సామానులు తప్పు పడుతున్నాయని ఆంధ్రా యూనివర్సిటీ ఎన్విరాన్మెంటల్ విభాగం రిటైర్డ్ ప్రొఫెసర్ ఈయూబీ రెడ్డి బీబీబీసీతో చెప్పారు.

కాలుష్యం, అనారోగ్యం, కూరగాయలు
ఫొటో క్యాప్షన్, గ్రామస్తులకు వివిధ రకాల జబ్బులు

తప్పనిసరి కీడు: ప్రొఫెసర్ ఈయూబీ రెడ్డి

ఎన్టీపీసీ వంటి పరిశ్రమలు దేశ అభివృద్ధికి తప్పనిసరిగా కావాలని, కానీ వీటి వలన వచ్చే నష్టాలు ఉన్నాయి. అందుకే వీటిని నెససరీ ఈవిల్స్ అంటారని ఈయూబీ రెడ్డి అభిప్రాయపడ్డారు. భారతదేశం విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంలో 65% కంటే ఎక్కువ థర్మల్ పవర్ ప్లాంట్ల నుండి వస్తుందని, దేశంలోని థర్మల్ విద్యుత్ ఉత్పత్తిలో 85% బొగ్గు ఆధారితమైనవేనని ఆయన తెలిపారు.

“థర్మల్ విద్యుత్ ఉత్పత్తి చేసే క్రమంలో బొగ్గు వినియోగం జరుగుతుంది. బొగ్గు వినియోగంలో మెర్క్యురీ, ఆర్సినిక్, కాడ్మియం, లెడ్ వంటి లోహాలు కూడా బయటకు వస్తాయి. ఇవి మనుష్యుల ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి. అణు ధార్మికత ఉండే యురేనియం అవక్షేపాలు, సల్ఫర్, నైట్రోజన్ కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా కాల్చేటప్పుడు ఆక్సైడులుగా, డై ఆక్సైడులుగా మారతాయి. దీంతో ఇవి గాల్లో కలిసి పరిసరాలలోని మనుషుల ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి. శ్వాసకోస వ్యాధులు, చర్మ వ్యాధులు, ఊపిరితిత్తుల క్యాన్సర్ వంటివి కూడా వచ్చే ప్రమాదం ఉంది. అందుకే ఈ సమస్యకు ఒక పరిష్యారం చూపించాలి.” అని ఈయూబీ రెడ్డి బీబీసీతో అన్నారు.

పర్యావరణం

సల్ఫర్ డైయాక్సైడ్ తగ్గించాం: సంజయ్ కుమార్ సిన్హా

పరవాడ ఎన్టీపీసీ-సింహాద్రి నుంచి విడుదలవుతున్న సల్పర్ డైయాక్సైడ్ ను తగ్గించేందుకు పరిశ్రమలో డి-సల్ఫూరిసైషన్ పరికాలను అమరుస్తున్నట్లు ప్లాంట్ హెడ్ సంజయ్ కుమార్ సిన్హా కొద్ది రోజుల కిందట జరిగిన మీడియా సమావేశంలో చెప్పారు.

ఇప్పటికే నైట్రస్ ఆక్సైడ్ బర్నర్లను యూనిట్ 2లో ఏర్పాటు చేశామని, సింహాద్రి-ఎన్టీపీసీ నుంచి వచ్చే ఫ్లై యాష్ ని 100 శాతం ఇటుకలు తయారీ, ఇతర అవసరాలను గత ఏడేళ్లుగా వినియోగిస్తున్నామని తెలిపారు.

ఈ సమావేశంలోనే పాల్గొన్న ఎన్టీపీసీ-సింహాద్రి అడిషనల్ జనరల్ మేనేజర్ వి.జయన్ మాట్లాడుతూ...తమ సంస్థ 2021 -22లో మెరైన్ ఎకాలజీ స్టడీ నిర్వహించిందని, తమ ప్లాంట్ కార్యకలాపాల వలన సముద్ర జీవులకు ఎటువంటి హని జరగడం ఆ అధ్యయనంలో తేలిందని చెప్పారు.

“సమీప గ్రామాలలో ప్లాంట్ నుంచి విడుదల అవుతున్న వాయువుల వలన ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమవుతున్నాయనే అంశంపై మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ అండ్ ఫారెస్ట్ గుర్తించిన సంస్థతో హెల్త్ అసెస్‌మెంట్ స్టడీ నిర్వహించాం. ఈ స్టడీలో భాగంగా ఎన్టీపీసీ-సింహాద్రి కారణంగా సమీప గ్రామాలలో ప్రజలు, పశువులలో వచ్చే ఆరోగ్య సమస్యలతో పాటు గాలి, నీరు, మట్టి నాణ్యతపై కూడా స్టడీ చేశాం. అయితే ఎన్టీపీసీ నుంచి విడుదల అవుతున్న కాలుష్యం వలన ఎటువంటి ఇబ్బంది లేదని తేలింది.” అని జయన్ తెలిపారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)