1200 ఎకరాల భూమి.. 200 ఫ్లాట్లు.. భారీ కుంభకోణం ఆరోపణలు.. ఎవరీ నీరజ్ అరోరా?

నీరజ్ అరోరా

ఫొటో సోర్స్, PUNJAB POLICE

ఫొటో క్యాప్షన్, నీరజ్ అరోరా కోసం గత తొమ్మిదేళ్లుగా పోలీసులు వెతుకుతున్నారు.
    • రచయిత, గగన్‌దీప్ సింగ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

పంజాబ్‌లో కోట్లాది రూపాయల స్కాం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడు నీరజ్ అరోరాను ఇటీవల పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ అరెస్ట్ తర్వాత విస్తుగొలిపే విషయాలు వెలుగులోకి వచ్చాయి.

నేచర్ హైట్స్ ఇన్‌ఫ్రా పేరుతో భారీ మోసం చేసినట్లు చెబుతున్న కేసులో ప్రధాన నిందితుడిగా నీరజ్ అరోరా ఉన్నారు. ఇతని కోసం పోలీసులు తొమ్మిదేళ్లుగా వెతుకుతున్నారు.

పోలీసుల నుంచి తప్పించుకునేందుకు నీరజ్ అరోరా ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోవాలని ప్లాన్ చేశారని పోలీసులు తెలిపారు.

ఉత్తరాఖండ్‌‌లోని పౌరీ జిల్లా శ్రీనగర్‌లో నీరజ్‌ను ఫరీద్‌కోట్, ఫాజిల్కా పోలీసులు అరెస్ట్ చేశారు.

పంజాబ్ పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం, నీరజ్ అరోరాకు పంజాబ్, మధ్య ప్రదేశ్ రాష్ట్రాలలో 1200 ఎకరాలకు పైగా భూములు, 200 రెసిడెన్షియల్ ఫ్లాట్లు ఉన్నట్లు తెలిసింది. వీటి విలువ రూ. వెయ్యి కోట్లకు పైనే ఉంటుందని అంచనా.

ఆర్థిక మోసం

ఫొటో సోర్స్, GETTY IMAGES

రూ.7 లక్షల నుంచి రూ.1,000 కోట్లు

పంజాబ్ పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం, నీరజ్ అరోరా తండ్రి ఇంటెలిజెన్స్ విభాగంలో ఇన్‌స్పెక్టర్‌గా పనిచేసేవారు. తల్లి ఉపాధ్యాయురాలు.

నీరజ్ అరోరా ఎంబీఏ పూర్తి చేసిన తర్వాత, తన స్నేహితులతో కలిసి సబ్బులు, టీ, ఇతర నిత్యావసర వస్తువులను అమ్మే చిన్న వ్యాపారాన్ని ప్రారంభించారు.

‘‘ప్రైవేట్ నెట్‌వర్కింగ్ కంపెనీలో నీరజ్ అరోరా తన కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడే నెట్‌వర్కింగ్ వ్యాపారంలో కొన్ని కిటుకులు తెలుసుకున్నారు’’ అని పోలీసులు విచారణలో తెలిసింది.

నీరజ్ అరోరా ముగ్గురు సహోద్యోగులతో కలిసి 2002లో రూ.7 లక్షల పెట్టుబడితో నేచర్‌వే నెట్‌వర్కింగ్ అనే కంపెనీని ప్రారంభించారు. దశాబ్ద కాలంలోనే ఆ సంస్థ టర్నోవర్‌ రూ.100 కోట్లకు పెరిగింది.

2003లో తమ వ్యాపారాలను రాజస్థాన్‌కు విస్తరించారు. 2011 నాటికి 12 రాష్ట్రాల్లో 400 స్టోర్లు తెరుచుకున్నాయి.

‘‘పంజాబ్, రాజస్థాన్‌లలో తన కంపెనీ కస్టమర్లను, ఏజెంట్ల నెట్‌వర్క్‌ను విస్తరించేందుకు నీరజ్ 1.6 లక్షల కిలోమీటర్లకు పైగా ప్రయాణం చేశారు. అతిపెద్ద నెట్‌వర్క్‌ను అభివృద్ధి చేయడంలో ఆయన విజయం సాధించారు’’ అని ఫరీద్‌కోట్ పోలీసు అధికారులు తెలిపారు.

‘‘నేచర్‌వే కంపెనీ 500 గ్రోసరీ, ఇతర ఉత్పత్తులను విక్రయించింది. 2012 వరకు కంపెనీ మంచి పనితీరును కనబర్చింది. ఆశ్చర్యకరంగా 2013లో నీరజ్ అరోరాకు ఐడియల్ ట్యాక్స్‌పేయర్ అవార్డు వచ్చింది’’ అని ఒక పోలీసు అధికారి చెప్పారు.

నీరజ్ అరోరాను అరెస్ట్ చేసిన పోలీసులు

ఫొటో సోర్స్, PUNJAB POLICE

ఫొటో క్యాప్షన్, నీరజ్ అరోరాను అరెస్ట్ చేసిన పోలీసులు

నిత్యావసర వస్తువులు అమ్ముతూనే భవంతుల మీద భవంతులు నిర్మించారు

నేచర్‌వే సంస్థ విజయం సాధించిన తర్వాత, అమిత్ కుక్కడ్, ప్రమోద్ నాగ్‌పాల్, ఇతర పార్టనర్లతో కలిసి రియల్ ఎస్టేట్ వ్యాపారంలోకి అడుగు పెట్టారు.

2012లో నేచర్‌ హైయిట్స్ ఇన్‌ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని ప్రారంభించారు.

‘‘నేచర్‌వే విజయం తర్వాత, ప్రజల్లో, పెట్టుబడిదారులలో నీరజ్‌కు మంచి పేరు దక్కింది. తక్కువ కాలంలో ఎక్కువ డబ్బులు వస్తాయనే హామీ ఇవ్వడంతో ఆయన కంపెనీలో చాలా మంది పెట్టుబడులు పెట్టడం ప్రారంభించారు’’ అని ఫరీద్‌కోట్ పోలీసులు తెలిపారు.

‘‘2013 నుంచి 2015 మధ్య కాలంలో పంజాబ్‌లో పలు జిల్లాల్లో నీరజ్ పలు ఆస్తులను కొనుగోలు చేశారు. అయితే, లాభాలను పెట్టుబడిదారులకు పంచకపోతుండటంతో, ప్రజలు పోలీసులను ఆశ్రయించడం ప్రారంభించారు. ఆయనకు వ్యతిరేకంగా ఫిర్యాదు దాఖలు చేశారు. నీరజ్‌పై చాలా ఫిర్యాదులు వచ్చాయి’’ అని చెప్పారు.

ముందస్తు ప్రణాళిక ప్రకారం తన వ్యక్తిగత ప్రయోజనం కోసం పెట్టుబడిదారుల డబ్బులను తప్పుదోవ పట్టించేందుకు, వారిని మోసం చేసేందుకు నీరజ్ అరోరా ప్రయత్నించారని ఫరీద్‌కోట్ పోలీసుల విచారణలో తేలింది.

ప్రధాన ప్రాంతాలలో చౌక ధరలకు ప్లాట్లను ఆయన కంపెనీ ఆఫర్ చేసింది. కానీ, చాలా కాలనీల్లో కనీసం భూములు కూడా లేవని ఆ తర్వాత తెలిసింది.

‘‘హోషియార్‌పూర్‌లో మాకు దక్కాల్సిన నాలుగు ఎకరాల భూమి కాంట్రాక్టును మరో నలుగురికి ఇచ్చినట్లు తర్వాత తెలిసింది’’ అని ఇన్వెస్టర్ జజ్ సింగ్ తెలిపారు.

‘‘ఈ కంపెనీ పెట్టుబడిదారులకు కనీసం ప్లాట్లను ఇవ్వలేదు. డబ్బులను తిరిగి ఇవ్వలేదు. కంపెనీ ఇచ్చిన చెక్‌లు కూడా బౌన్స్ అయ్యాయి. పంజాబ్‌లో కస్టమర్ల నుంచి కోట్ల రూపాయలను కంపెనీ సేకరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. 2015లో కంపెనీకి చెందిన బ్రాంచులన్ని మూతపడ్డాయి’’ అని చెప్పారు.

‘‘అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకు పంజాబ్‌లోని పఠాన్‌కోట్ జిల్లా నుంచి పాస్‌పోర్టుతో సహా పలు నకిలీ గుర్తింపు కార్డులను నీరజ్ అరోరా తయారు చేసుకున్నారు’’ అని ఫరీద్‌కోట్ జిల్లా డీఎస్‌పీ ఇక్బాల్ సింగ్ తెలిపారు.

పోలీసుల నుంచి తప్పించుకునేందుకు ముంబై, డెహ్రాడూన్, చండీగఢ్‌లలో నీరజ్ నివసించారు. నకిలీ పాస్‌పోర్టుతో థాయ్‌లాండ్, కాంబోడియా వంటి దేశాలకు ఆయన ప్రయాణించారు’’ అని ఇక్బాల్ సింగ్ చెప్పారు.

‘‘నీరజ్ అరోరా నుంచి ప్లాస్టిక్ సర్జన్‌కు చెందిన పలు మెడికల్ రికార్డులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్లాస్టిక్ సర్జరీ ద్వారా తన రూపును మార్చుకోవాలని నీరజ్ ప్లాన్ చేసినట్లు విచారణలో తెలిసింది. డబ్బులు లేకపోవడంతో సర్జరీ చేయించుకోలేకపోయారు’’ అని ఇక్బాల్ సింగ్ తెలిపారు.

21 జిల్లాల్లో నీరజ్‌కు వ్యతిరేకంగా 108 కేసులు

ఫొటో సోర్స్, PUNJAB POLICE

ఫొటో క్యాప్షన్, నీరజ్‌కు వ్యతిరేకంగా 21 జిల్లాల్లో 108 కేసులు

నీరజ్ అరోరాను ఎలా అరెస్ట్ చేశారు?

‘‘ఈ ఏడాది ఏప్రిల్ తొలి వారంలో నీరజ్ అరోరా వదిన మేనక తులీని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ఉత్తరాఖండ్‌లో ఒక ప్రైవేట్ గృహంలో నివసిస్తున్న నీరజ్ అరోరాను చేరుకోగలిగాం’’ అని ఫరీద్‌కోట్ పోలీసులకు చెందిన ఒక సీనియర్ పోలీసు అధికారి తెలిపారు.

అరెస్ట్ భయంతో, నీరజ్ కనీసం ఫోన్ కూడా వాడటం లేదని, బంధువులు, పరిచయస్తులతో ఉన్న సంబంధాలన్నింటిన్నీ తెంచేసుకున్నట్లు ఆయన చెప్పారు.

‘‘ఈ కేసును విచారించేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశాం. గత నెలగా వారు ఈ కేసుపై పనిచేశారు. ఫాజిల్కా ఎస్ఎస్‌పీ ప్రజ్ఞా జైన్ ఇచ్చిన సమాచారంతో మేం మోస్ట్ వాంటెండ్ నీరజ్ అరోరాను అరెస్ట్ చేశాం’’ అని ఫరీద్‌కోట్ ఎస్‌ఎస్‌పీ హర్జీత్ సింగ్ బీబీసీకి తెలిపారు.

21 జిల్లాల్లో నీరజ్‌పై 108 కేసులు

ప్రజల్ని మోసం చేసి డబ్బులు, ప్లాట్లు తీసుకున్నందుకు పంజాబ్‌లోని 21 జిల్లాల్లో నీరజ్‌పై 108 కేసులు నమోదయ్యాయని ఫరీద్‌కోట్ డీఎస్‌పీ ఇక్బాల్ సింగ్ సంధు తెలిపారు.

‘‘నీరజ్‌కు వ్యతిరేకంగా నమోదైన 108 ఎఫ్‌ఐఆర్‌లలో 47 ఫాజిల్కాలోనే నమోదయ్యాయి. 8 ఎఫ్ఐఆర్లు ఫిరోజ్‌పూర్‌లో, పటియాలా, ఫతేగఢ్ సాహిబ్‌లలో ఆరు చొప్పున, రూప్నగర్‌, మొహాలీ, ఎస్ఏఎస్ నగర్‌లో ఐదు చొప్పున, ఫరీద్‌కోట్, శ్రీ ముక్త్సార్ సాహిబ్, జలంధర్ కమిషనరేట్‌లో నాలుగు కేసులు చొప్పున దాఖలయ్యాయి’’ అని చెప్పారు.

2016 ఫిబ్రవరిలో ఫాజిల్కా పోలీసులు నీరజ్ అరోరాను అరెస్ట్ చేశారు. కానీ, బెయిల్ వచ్చాక ఆయన తప్పించుకుని పారిపోయారు.

నీరజ్, ఆయన అసోసియేట్స్‌కు చెందిన ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) స్వాధీనం చేసుకుంది.

నీరజ్, ఆయన కంపెనీ, బ్యాంకులోని నగదు డిపాజిట్లకు చెందిన రూ.22 కోట్ల వరకు విలువైన ఆస్తులను కూడా ఈడీ సీజ్ చేసింది.

2017 నుంచి ఈ కేసును విచారించడం ప్రారంభించింది ఈడీ. పెట్టుబడిదారుల నుంచి 491కి పైగా ఫిర్యాదులు ఈడీ వద్ద దాఖలు అయ్యాయి.

‘‘మా కష్టార్జితాలను పెట్టుబడిగా పెట్టాం’’

నీరజ్ అరోరాకు చెందిన నేచర్ హైయిట్స్ ఇన్‌ఫ్రా లిమిటెడ్‌లో రూ.91 లక్షలను పెట్టుబడిగా పెట్టినట్లు ఫరీద్‌కోట్ జిల్లాకు చెందిన జజ్ సింగ్ తెలిపారు. కానీ, ఆ డబ్బులన్ని పోయినట్లు చెప్పారు.

‘‘2012లో నీరజ్ అరోరాను నేను కలిశాను. మా దగ్గర కొంత డబ్బులున్నాయి. వాటిని మేం ఆయన కంపెనీలో పెట్టుబడిగా పెట్టాం’’ అని బీబీసీతో జరిపిన ఫోన్ సంభాషణలో జజ్ సింగ్ బరాడ్ చెప్పారు.

‘‘మా జీవితకాలం సంపాదించిన డబ్బంతా దానిలో పెట్టుబడిగా పెట్టాం. రూ.91 లక్షల ప్రిన్సిపల్ డబ్బు కోల్పోయాం. ఈ మోసం వల్ల భారీ మొత్తంలో ఆర్థిక నష్టాన్ని చవిచూశాం. ఈ విషయం బంధువులకు చెప్పేందుకు కూడా సిగ్గుగా అనిపించింది’’ అని జజ్ సింగ్ బరాడ్ చెప్పారు.

‘‘మేం ఈ కంపెనీలో డబ్బులు పెట్టాం. ఎందుకంటే, ప్రభుత్వం నుంచి అన్ని లైసెన్సులు, అనుమతులు వారికి ఉన్నాయి. ఇన్వెస్టర్ల ప్రయోజనాలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది’’ అని బరాడ్ అన్నారు.

ఇవి కూడా చదవండి:

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)