బ్రాయిలర్ చికెన్ సంతాన సమస్యలకు దారితీస్తుందా? కొన్ని అపోహలు, వాస్తవాలు

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, సుభాష్ చంద్రబోస్
- హోదా, బీబీసీ ప్రతినిధి
చాలా మంది చికెన్ తింటూ ఉంటారు. అయితే, తాము తినే చికెన్‌లో హానికరమైన పదార్థాలు, రసాయనాలు ఏమైనా ఉన్నాయా? లేవా? అన్నది ఎలా తెలుసుకోవాలి?
కేంద్ర మత్స్య, పశుసంవర్థక శాఖ 2019లో విడుదల చేసిన డేటాలో, దేశంలో బ్రాయిలర్ చికెన్‌ను అత్యధికంగా తమిళనాడు ఉత్పత్తి చేస్తోంది.
పౌల్ట్రీ ఫార్మర్స్ రెగ్యులేటరీ కమిషన్ (పీఎఫ్ఆర్‌సీ) వెబ్‌సైట్‌లో పొందుపరిచిన వివరాల ప్రకారం, దేశ ఎకానమీలో పౌల్ట్రీ రంగం విలువ రూ.2,04,900 కోట్లుగా ఉంది.
2023లో భారత్‌లో 4,407.24 మెట్రిక్ టన్నుల బ్రాయిలర్ మాంసం ఉత్పత్తి అయి, ఎగుమతి అయినట్లు జర్మన్ డేటా ప్రాసెసింగ్ కంపెనీ ‘స్టాటిస్టా’ తెలిపింది.
అయితే, ఎన్నో ఏళ్లుగా బ్రాయిలర్ చికెన్ విషయంలో పలు రూమర్లు చక్కర్లు కొడుతూ ఉన్నాయి. బ్రాయిలర్ కోళ్లకు ఇచ్చే ఇంజెక్షన్లు, ఔషధాల వల్ల పలు ఆరోగ్య సమస్యలకు కారణమవుతున్నాయని రూమర్లున్నాయి.
అసలు బ్రాయిలర్ చికెన్ అంటే ఏమిటి? వాటిని ఎలా పెంచుతారు? ఈ బ్రాయిలర్ కోళ్ల మాంసం తింటే మన శరీరానికి ఏదైనా ప్రమాదం ఉందా? అన్న దానిపై నిపుణులేం చెబుతున్నారో చూద్దాం..

ఫొటో సోర్స్, Getty Images
బ్రాయిలర్ చికెన్ అంటే ఏమిటి?
బ్రాయిలర్ చికెన్ సహజంగా ఉత్పత్తి అయ్యే చికెన్ కాదు. ఈ కోళ్లను ఫారాళ్లో పెంచుతారు. అతితక్కువ కాలంలో కోళ్లు పెరుగుతాయి. అమెరికా వంటి పలు దేశాల్లో తొలుత 1930ల్లో దీన్ని అభివృద్ధి చేశారు.
ఎంపిక చేసే ఆరోగ్యకరమైన కోళ్ల జాతులకు క్రాస్ ఫెర్టిలైజింగ్ చేయడం ద్వారా ఈ కోళ్లను పెంచుతారు.
1960 చివరిలో ప్రపంచవ్యాప్తంగా ఈ బ్రాయిలర్ కోళ్లు విస్తరించాయి. కోళ్ల మాంసానికి కొరత ఏర్పరడటంతో ఈ కోళ్ల ఉత్పత్తి పెరిగింది.
ఈ కోళ్ల రాక చాలా ముఖ్యమైనదిగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ప్రొటీన్ కొరత ఉన్న చాలా దేశాలకు ఈ కోళ్ల మాంసం ఉపయోగపడింది.
ఇవి పెరిగే కాల వ్యవధి, తక్కువ ధర, అత్యధిక ప్రొటీన్ కంటెంట్ ఈ మాంసానికి గిరాకీ పెరిగేందుకు ప్రధాన కారణాలుగా నిలిచాయి.
బ్రాయిలర్ కోళ్ల పెంపకం భారత్‌లో 1970ల్లో ప్రారంభమైందని, 1980-85లలో వీటి మాంసం వినియోగం బాగా పెరిగిందని పౌల్ట్రీ ఫామ్ నిర్వహణలో సుదీర్ఘ అనుభవం ఉన్న ముత్తురామలింగం చెప్పారు.
అప్పటి నుంచి 30 ఏళ్లలో బ్రాయిలర్ కోళ్లు నాటు కోళ్లను మించిపోయాయని, ప్రస్తుతం ప్రతి ప్రాంతంలో ఇవి సాధారణంగా మారిపోయాయని అన్నారు.
పౌల్ట్రీ ఫార్మర్స్ రెగ్యులేటరీ కమిషన్ ప్రకారం, ఎక్కువ కాలం పాటు గుడ్ల కోసం పెంచే వాటిని ‘లేయర్లు’ అని పిలుస్తారు. స్వల్ప కాలంలో మాంసం కోసం మార్కెట్ చేసే వాటిని ‘బ్రాయిలర్స్’ అని పిలుస్తారు.
‘‘కార్నిష్ క్రాస్‌ల ప్రత్యేక జాతినే బ్రాయిలర్ చికెన్. ఈ రకమైన కోడి జాతికి చాలా వేగంగా పెరిగే సామర్థ్యం ఉంటుంది. 1970 నుంచి మాంసం కోసం ఇలాంటి రకానికి చెందిన కోళ్లను పెంచడం మొదలు పెట్టారు’’ అని పిడియాట్రిషియన్, న్యూట్రిషన్ కన్సల్టెంట్ డాక్టర్ అరుణ్ కుమార్ అన్నారు.
‘‘ఈ పరిశ్రమలో ఆధునిక మార్పులు చోటు చేసుకోవడంతో, అంతకుముందు 60 రోజుల్లో పెరిగే బ్రాయిలర్ కోళ్లు, ప్రస్తుతం 32 రోజుల్లోనే పెరుగుతున్నాయి. ఈ కోళ్లకు అందించే ఆహారంలో మార్పులే ఇందుకు కారణం’’ అని చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
బ్రాయిలర్ కోళ్లకు, దేశవాళి కోళ్లకు మధ్య తేడా ఏంటి?
సాధారణంగా దేశవాళి కోళ్లు (నాటు కోళ్లు) పెరిగేందుకు ఆరు నెలలు, అంతకంటే ఎక్కువ సమయం పడుతుంది. కానీ, బ్రాయిలర్ కోళ్లు అయితే 35 రోజుల నుంచి 45 రోజుల వ్యవధిలోనే 2 కిలోలకు పైగా బరువు పెరుగుతాయి.
అయితే, నాటు కోళ్లకు ఉన్నంత రోగ నిరోధక శక్తి బ్రాయిలర్ కోళ్లకు ఉండదు. అందుకే, బ్రాయిలర్ కోళ్లకు పలుమార్లు టీకాలు వేయాల్సి ఉంటుంది.

ఫొటో సోర్స్, Getty Images
బ్రాయిలర్ కోళ్లను పెంచేందుకు ఉన్న నిబంధనలేంటి?
బ్రాయిలర్ కోళ్లను పెంచేందుకు ప్రత్యేక మార్గదర్శకాలు ఉన్నట్లు పోషకాహార నిపుణులు మీనాక్షి బజాజ్ చెప్పారు.
బ్రాయిలర్ కోళ్లను ఎలా పెంచాలనే విషయంపై పౌల్ట్రీ ఫార్మర్స్ రెగ్యులేటరీ కమిషన్ మార్గదర్శకాలు జారీ చేసింది.
ఈ మార్గదర్శకాల ప్రకారం, బ్రాయిలర్ చికెన్‌ను 6 నుంచి 8 వారాలు పెంచాలి.
వీటికి ఇచ్చే ఆహారం, నీళ్లు, పెంచే వాతావరణం, టీకాలు, వైద్యం ఎలాంటివి ఇవ్వాలన్న ప్రతిదానిపై మార్గదర్శకాలను నిర్ణయించారు.
ఆరోగ్యకరమైన రీతిలో బ్రాయిలర్ కోళ్లను పెంచాలని పౌల్ట్రీ ఫార్మర్స్ రెగ్యులేటరీ కమిషన్ సిఫారసు చేస్తోంది.

ఫొటో సోర్స్, Getty Images
బ్రాయిలర్ కోళ్లకు హార్మోన్ ఇంజెక్షన్లను ఇస్తున్నారా?
తొందరగా పెరిగేందుకు బ్రాయిలర్ కోళ్లకు హార్మోన్ ఇంజెక్షన్లను ఇస్తున్నారని పలు రిపోర్టులు పేర్కొన్నాయి.
వీటిని తిన్న వారికి హార్మోన్ సంబంధిత సమస్యలు వస్తున్నాయని, చిన్న పిల్లలకు త్వరగా యుక్తవయసు వచ్చేస్తుందని ఈ రిపోర్టులు చెబుతున్నాయి. మరి, ఇదెంత వరకు నిజం? నిజంగా ఈ కోళ్లను హార్మోన్ల ఇంజెక్షన్లతో పెంచుతున్నారా? అని అడిగితే.. అలాంటిది జరగదు అని ముత్తురామలింగం చెప్పారు.
‘‘ఈ కోళ్లు పెరిగేటప్పుడు, పలు రకాల వైరస్‌లు వాటిపై దాడి చేస్తూ ఉంటాయి. వైరస్‌లు సోకకుండా మనుషులకు టీకాలు ఇచ్చినట్లే, ఈ కోళ్లకు కూడా టీకాలు ఇస్తుంటారు. అంతే తప్ప, ఇంకెలాంటి డ్రగ్స్‌ను ఇవ్వరు’’ అని ఆయన చెప్పారు.
ఒకవేళ ప్రతి కోడికి హార్మోన్లను వేస్తే ఖర్చు భారీగా పెరిగి, కిలో చికెన్ ధర రూ.700 నుంచి రూ.900 మధ్యలో ఉండాలని పౌల్ట్రీ ఫార్మర్స్ రెగ్యులేటరీ కమిటీ డిప్యూటీ సెక్రటరీ శరత్ చెప్పారు.
అలాంటి అవకాశమే ఉండదన్నారు. ఒకవేళ ఈ కోళ్లకు ఏదైనా అయితే, యాంటిబయాటిక్స్ ఇస్తామని తెలిపారు.
‘‘బ్రాయిలర్ కోళ్లు 42 నుంచి 45 రోజుల్లో పెరుగుతాయి. వాటికి హార్మోన్లను ఇవ్వరు. ఇవి ఇతర పెద్ద జంతువుల మాదిరి కాదు’’ అని ఆయన చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
‘గ్రోత్ హార్మోన్ లాంటిదేమీ లేదు’
‘‘గ్రోత్ హార్మోన్లతో ఈ కోళ్లను పెంచుతున్నట్లు చాలా మంది అనుకుంటూ ఉంటారు. కానీ, అలాంటి హార్మోనే లేదు. ఎదుగుదల లేని పిల్లలకు, వారి ఎత్తును పెంచేందుకు పిడియాట్రిక్స్‌లో గ్రోత్ హార్మోన్లను వాడుతుంటాం. వీటిని కోళ్లకు వాడాలనుకుంటే, 40 రోజుల పాటు రోజుకు నాలుగు ఇవ్వాలి. అంటే ఒక్క కోడికి రూ.20 నుంచి రూ.25 వేల ఖర్చు అవుతుంది. ఇదే హార్మోన్‌ను కోళ్లకు ఇస్తున్నారన్నది అవాస్తవం. ఇది కేవలం రూమర్ మాత్రమే’’ అని డాక్టర్ అరుణ్ కుమార్ చెప్పారు.
‘‘వైరల్ ఇన్‌ఫెక్షన్ల నుంచి ఈ కోళ్లను రక్షించేందుకు ఒక్కో కోడికి 5 టీకాలు ఇస్తుంటారు. చాలా మంది వీటిని హార్మోన్ ఇంజెక్షన్లుగా భావిస్తారు’’ అని తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images
చిన్న పిల్లలకు త్వరగా యుక్త వయసు వచ్చేస్తుందా?
సాధారణం కంటే త్వరగానే పిల్లలు యుక్త వయసులోకి వెళ్తున్నారని అమెరికా నేషనల్ సెంటర్ ఫర్ మెడిసిన్ అధ్యయనంలో తెలిసిందని ఎస్‌ఆర్ఎం గ్లోబల్ హాస్పిటల్ సీనియర్ కన్సల్టెంట్ డైటీషియన్ యశోదా పొన్నుచామి అన్నారు.
చికెన్‌ను బాగా ఉడికించుకుని తినడం వల్ల సమస్యలు తక్కువగా ఉంటాయి. కానీ, బిర్యానీ రూపంలో లేదా మరో రూపంలో తిన్నప్పుడు బరువు పెరిగేందుకు, ఇతర సమస్యలకు కారణమవుతున్నాయని చెప్పారు.
‘‘మా దగ్గరకు వచ్చే మహిళలను చెక్ చేశాం. చికెన్ అన్నంతో పాటు కోడి మాంసాన్ని బాగా తింటున్నట్లు చాలా మంది చెప్పారు. దీని వల్ల ఊబకాయం, త్వరగా మెనోపాజ్ రావడం, పీసీఓడీ లాంటి సమస్యలు తలెత్తుతున్నాయి’’ అని మదురై మీనాక్షి మిషన్ హాస్పిటల్‌కు చెందిన సీనియర్ డైటీషియన్ జయంతి అన్నారు.
అయితే, ఇది పూర్తిగా అపోహానని డాక్టర్ అరుణ్ కుమార్ అన్నారు.
‘‘గత వందేళ్లలో, శాకాహారం, మాంసాహారం తిన్న పిల్లలందరిలో యుక్త వయసు పెరిగింది. అంతకుముందు 17 ఏళ్లకు యుక్తవయసులోకి వచ్చే పిల్లలు, ప్రస్తుతం 11, 12 ఏళ్లలోనే యుక్తవయసును పొందుతున్నారు. దీనికి కారణం వారి శరీరానికి కావాల్సిన సరైన ప్రొటీన్ దొరుకుతుంది. పిల్లలు 8 ఏళ్ల కంటే ముందే యుక్త వయసులోకి వస్తే, దాన్ని ముందస్తు రజస్వల అంటారు. 12 ఏళ్లకు యుక్తవయసులోకి వస్తే పిల్లలు ఆరోగ్యకరంగా ఉన్నట్లే’’ అని అరుణ్ కుమార్ తెలిపారు.

ఫొటో సోర్స్, CHANDRASEKHAR
సంతాన సమస్యలు వస్తాయా?
పౌల్ట్రీ ఫార్మర్స్ రెగ్యులేటరీ కమిషన్ నిర్దేశించిన నిబంధనలను పాటించకుండా పౌల్ట్రీ ఫామ్‌లలో కోళ్లను ఉత్పత్తి చేసే వాటితో కచ్చితంగా ప్రమాదం ఉంటుందని న్యూట్రిషనిస్ట్ మీనాక్షి చెప్పారు.
అదనంగా కెమికల్స్‌ను, యాంటిబయాటిక్స్ ఇచ్చిన ఈ రకమైన కోళ్లను తిన్నప్పుడు, ప్రజలకు ప్రమాదం ఉంటుందని చెన్నై స్టాన్లీ గవర్నమెంట్ మెడికల్ కాలేజీ ప్రొఫెసర్, మెడికల్ డిపార్ట్‌మెంట్ హెడ్ ఎస్ చంద్రశేఖర్ కూడా ఇదే రకమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
‘‘అదనపు మాంసం కోసం ఈ కోళ్లకు కెమికల్స్‌ను ఎక్కించి, కోళ్ల పరిశ్రమల్లో వేల కొద్దీ కోళ్లను పెంచుతుంటారు. ఎలాంటి వైరస్‌లు వీటిపై దాడి చేయకుండా నిరోధించేందుకు వాటి ఆహారంలో అత్యధిక గాఢత ఉన్న యాంటిబయోటిక్స్‌ను ఇస్తుంటారు.’’ అని చెప్పారు.
ఈ కెమికల్స్‌ను ఎండోక్రైన్ డిస్రప్టర్స్ అంటారు.
ఇలాంటి కెమికల్స్ ఉన్న వాటిని తిన్నప్పుడు మహిళలకైనా, పురుషులకైనా వంధ్యత్వం, టెస్టిక్యులర్ ట్యూమర్లు, ముందస్తు మెనోపాజ్ వంటి ఆరోగ్య సమస్యలు తలెత్తుతుంటాయని తెలిపారు.
ఈ వ్యాధులకు బ్రాయిలర్ చికెన్లలో ఉన్న కెమికల్స్ మాత్రమే కారణమని చెప్పలేం, కానీ ఇది కూడా ఒక కారణం కావొచ్చని చంద్రశేఖర్ చెప్పారు.

ఫొటో సోర్స్, DOCTOR ARUNKUMAR
‘ప్రజలపై ప్రభావం ఉండకపోవచ్చు’
బ్రాయిలర్ కోళ్ల పెంపకంలో ప్రబలంగా యాంటిబయోటిక్స్ వాడకం ఉన్నప్పటికీ, వాటి వల్ల నేరుగా ప్రజలపై ప్రభావం ఉండదని డాక్టర్ అరుణ్ కుమార్ అన్నారు.
‘‘ప్రజలకు తరచూ యాంటిబయోటిక్స్ ఇచ్చినట్లే, కోళ్లకు ఇస్తుంటారు. అయితే, ఈ కోళ్లను తిన్నవారిపై నేరుగా ఈ ప్రభావం పడదు’’ అని చెప్పారు.
బ్రాయిలర్ కోళ్లను తినడం వల్ల మనుషులకు ఎలాంటి ప్రమాదం ఉండదని డాక్టర్ అరుణ్ కుమార్ చెప్పారు.
‘‘బ్రాయిలర్ కోళ్లు చాలా సున్నితమైనవి. అవసరమైన దానికంటే తక్కువ మోతాదులోనే ఇస్తుంటారు. పశువైద్యుని సూచన మేరకు ఈ యాంటిబయోటిక్స్ ఇస్తారు. అది కూడా ‘విత్‌డ్రాయల్ లిమిట్’లోనే ఉంటుంది. ఒకవేళ ఆ వ్యాధి నయం కాకపోతే, అది విచ్ఛిన్నమై, మనుషులపై దాడి చేసే అవకాశమే లేదు. శాస్త్రీయంగా ఇది సాధ్యం కాదు’’ అని అన్నారు.

ఫొటో సోర్స్, Meenakshi Bajaj
బిర్యానీ తినేవాళ్లు ఏం చేయాలి?
భారత్‌లో గత ఏడాది ఫుడ్ డెలివరీ కంపెనీల ద్వారా ఆర్డర్ చేసిన నెంబర్ 1 ఆహారంగా బిర్యానీ ఉందని ఇటీవల సర్వేల్లో తెలిసింది. ప్రతి 2.25 సెకన్లకు భారతీయులు బిర్యానీని ఆర్డర్ పెడుతున్నారు.
భారతీయుల్లో చికెన్ బిర్యానీ చాలా పాపులర్ అయింది. చికెన్ అత్యధికంగా తినడం కూడా ప్రమాదమే. కానీ, మితంగా తీసుకోవడం వల్ల ఈ ప్రమాదాల నుంచి తప్పించుకోవచ్చని న్యూట్రిషనిస్ట్ మీనాక్షి చెప్పారు.
‘‘వారంలో మూడుసార్లు 100 గ్రాముల చికెన్‌ను మీరు తినవచ్చు. గ్రిల్డ్ లేదా ఫ్రై చేసింది కాకుండా గ్రేవీ రూపంలోనిది అయినా లేదా అది ఉడకపెట్టినదైనా తీసుకోవచ్చు. ఒకవేళ బిర్యానీ అయితే, నెలలో రెండుసార్లు మితంగా తినాలి. కానీ, దాన్ని కూడా ఇంట్లోనే చేసుకుని, తింటే మంచిది’’ అని చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- ఈ.కోలి: ప్రాణాలు తీసే ఈ బ్యాక్టీరియా ఆహారం ద్వారా ఎలా వ్యాపిస్తుంది? ఇన్ఫెక్షన్ ముప్పు ఎవరికి ఎక్కువ?
- అరపైమా గిగాస్, పైచ్: ఈ చేపకు ఆకలి ఎక్కువ.. పీక్కు తినే పిరానా చేపను కూడా ఇది మింగేస్తుంది
- నీళ్లలో మీ మలం తేలుతుందా? అది చెప్పే ఆరోగ్య రహస్యాలు ఇవీ!
- వేడి వేడి చికెన్ సూప్ తాగితే జలుబు తగ్గుతుందా? నిపుణులు ఏం చెబుతున్నారు
- ‘గ్లూటెన్’ అంటే ఏమిటి? ఇది లేని ఆహారం మంచిదేనా?
బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














