ఎవరెస్ట్, ఎండీహెచ్‌ తయారు చేసిన ఆ మసాలాలు వాడొద్దని సింగపూర్, హాంకాంగ్‌ ఎందుకు ఆదేశించాయి?

సుగంధ ద్రవ్యాలు

ఫొటో సోర్స్, Getty Images

భారత కంపెనీలైన ఎండీహెచ్, ఎవరెస్ట్‌లకు చెందిన కొన్ని ప్యాక్ చేసిన మసాలా దినుసులను వాడొద్దని హాంకాంగ్ ఫుడ్ సేఫ్టీ డిపార్ట్‌మెంట్ ఆ దేశ ప్రజలకు సూచించింది.

ఆ ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలను నిలిపి వేయాలని ఆదేశించింది.

సింగపూర్‌లోనూ ఎవరెస్ట్‌కు చెందిన ఫిష్‌ కర్రీ మసాలాను మార్కెట్‌ నుంచి ఉపసంహరించుకోవాలని ఆదేశాలు జారీ అయ్యాయి.

ఎండీహెచ్ మద్రాస్ కర్రీ పౌడర్, సాంబార్ మసాలా మిక్స్డ్ పౌడర్, కర్రీ ఫౌడర్ మిక్స్డ్ మసాలా, ఎవరెస్ట్ ఫిష్ కర్రీ మసాలాలలో పెస్టిసైడ్, ఇథిలీన్ ఆక్సైడ్ ఉన్నట్లు గుర్తించామని హాంకాంగ్ ఆహార భద్రతా విభాగమైన 'సెంటర్ ఫర్ ఫుడ్ సేఫ్టీ' (సీఎఫ్ఎస్) చెప్పింది.

క్యాన్సర్ కారకాల జాబితాలో ఇథిలీన్ ఆక్సైడ్‌ ఉందని అధికారులు చెప్పారు.

సుగంధ ద్రవ్యాలు

ఫొటో సోర్స్, Getty Images

ఎవరెస్ట్ ఫిష్ కర్రీ మసాలాపై సింగపూర్‌లో నిషేధం

ఫెస్టిసైడ్ అవశేషాలున్న ఉత్పత్తులు ఆరోగ్యానికి హానికరం కాకపోతేనే విక్రయించాలని ఫుడ్ ప్రోడక్ట్స్ రూల్స్‌ను ఉటంకిస్తూ హాంకాంగ్ ఆహార భద్రతా విభాగం పేర్కొంది.

హాంకాంగ్ ఫుడ్ సేఫ్టీ సెంటర్ మూడు షాపుల నుంచి సుగంధ ద్రవ్యాల నమూనాలను సేకరించింది.

ఫుడ్ సేఫ్టీ సెంటర్ ప్రతినిధి చెప్పిన వివరాల ప్రకారం, హాంకాంగ్‌లో ఆహారంలో ఇథిలీన్ ఆక్సైడ్ వంటి క్రిమిసంహారక మందుల అవశేషాలు ఉంటే గరిష్టంగా 50వేల డాలర్ల జరిమానా విధిస్తారు.

నేరం రుజువైతే జరిమానాతో పాటు ఆరు నెలల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది.

అటు, ఎవరెస్ట్‌ ఫిష్ కర్రీ మసాలాలో ఇథిలీన్ ఆక్సైడ్ కనుగొనడంతో, మార్కెట్ నుంచి సరుకు ఉపసంహరించుకోవాలని దిగుమతిదారులను సింగపూర్ ఆదేశించింది.

ఎవరెస్ట్ ఫిష్ కర్రీ మసాలా వాడొద్దని ప్రజలకు సింగపూర్ ఫుడ్ ఏజెన్సీ సూచించింది.

ఈ సందర్భంగా హాంకాంగ్ ఫుడ్ సేఫ్టీ డిపార్ట్‌మెంట్ జారీ చేసిన సూచనలను సింగపూర్ ఫుడ్ ఏజెన్సీ ఉదహరించింది.

సుగంధ ద్రవ్యాలు

ఫొటో సోర్స్, Getty Images

ఎవరెస్ట్ కంపెనీ ఏం చెప్పింది?

ప్రోడక్టులలో ఇథిలీన్ ఆక్సైడ్ కొద్దిగా ఉంటే వెంటనే ప్రమాదం లేదని సింగపూర్ ఫుడ్ ఏజెన్సీ తెలిపింది. అయితే, దీర్ఘకాలం వాడితే మాత్రం ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుందని హెచ్చరించింది.

సింగపూర్‌ ఫుడ్ ఏజెన్సీ ఆదేశాల తర్వాత ఎవరెస్ట్‌ సంస్థ వివరణ ఇచ్చింది.

"మా ఉత్పత్తులన్నీ కఠినమైన పరీక్షల తర్వాత మాత్రమే తయారవుతాయి, ఎగుమతి అవుతాయి. మాది యాభై ఏళ్ల నాటి, ప్రసిద్ధ బ్రాండ్" అని వియోన్ వార్తాసంస్థతో ఎవరెస్ట్‌ సంస్థ చెప్పింది.

''మేం పరిశుభ్రత, ఆహార భద్రతా ప్రమాణాలను ఖచ్చితంగా పాటిస్తాం. మా ఉత్పత్తులకు ఇండియన్ స్పైస్ బోర్డ్, ఎఫ్ఎస్ఎస్ఏఐ సహా అన్ని ఏజెన్సీల నుంచి ఆమోదం ఉంది'' అని తెలిపింది.

“ప్రతి ప్రోడక్టు ఎగుమతి చేయడానికి ముందు, వాటిని స్పైస్ బోర్డ్ ఆఫ్ ఇండియా పరీక్షిస్తుంది. ప్రస్తుతం అధికారిక సమాచారం కోసం ఎదురుచూస్తున్నాం. మా నాణ్యత నియంత్రణ బృందం ఈ విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తోంది'' అని ఎవరెస్ట్ కంపెనీ చెప్పింది.

హాంకాంగ్ ఫుడ్ ఏజెన్సీ ఆదేశాలపై ఎండీహెచ్ కంపెనీ ఇంకా స్పందించాల్సి ఉంది.

ఇథిలిన్ ఆక్సైడ్

ఫొటో సోర్స్, Getty Images

ఇథిలీన్ ఆక్సైడ్ అంటే ఏమిటి?

ఇథిలీన్ ఆక్సైడ్ ఒక రంగులేని, మండే వాయువు. దీనిని సాధారణంగా వ్యవసాయం, హెల్త్ కేర్, ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీలలో పురుగుమందులు, స్టెరిలెంట్‌ల తయారీలలో ఉపయోగిస్తారు.

సూక్ష్మజీవుల కాలుష్యాన్ని తొలగించడానికి, కీటకాలను నియంత్రించడానికి సుగంధ ద్రవ్యాలు, ఇతర పొడి ఆహారాలలో ఇథిలీన్ ఆక్సైడ్ వాడతారు. బ్యాక్టీరియా, శిలీంధ్రాలు, కీటకాల నుంచి ఆహారాన్ని రక్షించడానికి ఉపయోగిస్తుంటారు.

కానీ, అనేక ఆరోగ్య సంస్థలు దీనిని క్యాన్సర్ కారక వర్గంలో పొందుపరిచాయి. ఇథిలీన్ ఆక్సైడ్ ప్రమాదాన్ని పరిగణనలోకి తీసుకుని, అనేక దేశాల ఫుడ్ రెగ్యులేటరీలు ఆహార పదార్థాలలో దాని వినియోగంపై కఠిన నియమాలను రూపొందించాయి. పలు దేశాల్లో ఇథిలీన్ ఆక్సైడ్ పరిమాణం ఎంత ఉండాలనే దానిపై చట్టాలు కూడా ఉన్నాయి.

అమెరికాలోనూ..

భారతీయ సుగంధ ద్రవ్యాలు విదేశీ నిబంధనలలో చిక్కుకున్న సందర్భాలు గతంలోనూ ఉన్నాయి.

2023లో ఎవరెస్ట్ సాంబార్ మసాలా, గరం మసాలాను మార్కెట్ నుంచి ఉపసంహరించుకోవాలని అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్స్ అథారిటీ ఆదేశించింది.

ఈ సుగంధ ద్రవ్యాలలో సాల్మొనెల్లా ఉన్నట్లు అప్పట్లో గుర్తించారు. ఈ బ్యాక్టీరియా వల్ల అతిసారం, కడుపు నొప్పి, జ్వరం, తల తిరగడం, వాంతులు అవుతాయి.

ఇటీవల ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికాలలో 'నెస్లే' ఉత్పత్తులలో అదనపు చక్కెర ఉన్నట్లు కనుగొన్నారు. శిశువులకు అంత చక్కెర ఇవ్వడం మంచిది కాదని నివేదికలో తెలిపారు.

దీనిలో ప్రపంచంలోనే అతిపెద్ద బేబీ తృణధాన్యాల బ్రాండ్ అయిన సెరెలాక్ కూడా ఉంది. ఈ రిపోర్టు స్విస్ సంస్థ అయిన పబ్లిక్ ఐ నుంచి వచ్చింది.

ఇంటర్నేషనల్ బేబీ ఫుడ్ యాక్షన్ నెట్‌వర్క్ సహకారంతో ఈ రిపోర్టు రూపొందించారు. బెల్జియన్ ల్యాబ్‌లో ఈ ఉత్పత్తులను పరీక్షించిన తర్వాత ఈ చర్యలు తీసుకున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)