డార్ఫర్ క్యాంప్: ఇక్కడ ప్రతి రెండు గంటలకు ఒకరు ఆకలితో చనిపోతున్నారు...

సూడాన్ సంక్షోభం

ఫొటో సోర్స్, Mohamed Zakaria/BBC

ఫొటో క్యాప్షన్, గత నాలుగు నెలల్లో కిస్మా అబ్దిరహ్మాన్ అలీ అబుబకర్ ముగ్గురు పిల్లలు చనిపోయారు.
    • రచయిత, బార్బరా ప్లెట్-అషర్
    • హోదా, బీబీసీ ఆఫ్రికా ప్రతినిధి

సూడాన్‌లో ఒక సంవత్సరం క్రితం సైన్యం, సాయుధ పారామిలిటరీల మధ్య అంతర్యుద్ధం మొదలైంది. దీంతో పౌరులు ఇళ్లను వదిలి పారిపోయారు. అలా వెళ్లి శిబిరంలో తలదాచుకుంటున్న లక్షలాది మహిళల్లో కిస్మా అబ్దిరహ్మాన్ అలీ అబుబకర్ ఒకరు. ఇపుడు ఆమె కళ్లల్లో విచారం, స్వరంలో నిశ్శబ్ధం కనిపిస్తోంది.

ఆహారం కోసం కిస్మా క్యూలో నిల్చున్నారు. అయితే, ఆమె పట్టుకున్న చిన్న సంచి కుటుంబ మొత్తం ఆకలి బాధను తీర్చడానికి సరిపోదు.

పోషకాహార సంక్షోభం హెచ్చరికలతో పశ్చిమ ప్రాంతంలోని ఉత్తర డార్ఫర్‌ ప్రజలకు జామ్‌జామ్ క్యాంప్‌లో ఆశ్రయం కల్పించారు. అబుబకర్ కూడా అక్కడే ఉన్నారు.

సూడాన్ పరిస్థితిపై ఐక్యరాజ్యసమితి స్పందిస్తూ "ఇది ప్రపంచంలోని అత్యంత భయంకరమైన ఆకలి సంక్షోభం" అంటూ ప్రకటించింది.

గత 4 నెలల్లో తన ముగ్గురు పిల్లలు పోషకాహార లోపం, వ్యాధుల కారణంగా మరణించారని కిస్మా చెప్పారు.

చనిపోయిన వారిలో పెద్దవాడికి మూడేళ్లు, మరొకరికి రెండేళ్లు, చివరి పాపకు ఆరు నెలల వయస్సు.

డార్ఫర్

ఫొటో సోర్స్, Marek Polaszewski / BBC

ప్రతీ రెండు గంటలకు ఒక చిన్నారి..

జామ్‌జామ్ క్యాంప్‌ దేశంలోనే అత్యంత పురాతనమైన, అతిపెద్ద శిబిరం, ఏడాదైనా సూడాన్ యుద్ధం ముగియకపోవడంతో అక్కడి ప్రజల్లో నిరాశ నిస్పృహ కనిపిస్తోంది.

శిబిరంలో ప్రతి రెండు గంటలకు కనీసం ఒక చిన్నారి మరణిస్తున్నట్లు జనవరిలో మెడిసిన్స్ శాన్స్ ఫ్రాంటీయర్స్ (ఎంఎస్ఎఫ్) కనుగొన్నారు.

డార్ఫర్‌లో పనిచేస్తున్న అంతర్జాతీయ మానవతా ఏజెన్సీలలో ఎంఎస్ఎఫ్ ఒకటి. ఇది జామ్‌జామ్‌లో ప్రమాదంలో ఉన్న మహిళలు, పిల్లల స్క్రీనింగ్‌ను పూర్తి చేసింది. ఆ ఫలితాలను ప్రత్యేకంగా బీబీసీతో పంచుకుంది.

ఐదేళ్లలోపున్న ప్రతి 10 మంది పిల్లలలో ముగ్గురు తీవ్ర పోషకాహార లోపంతో బాధపడుతున్నారని ఏజెన్సీ గుర్తించింది.

అలాగే గర్భిణీలు, పాలిచ్చే తల్లులలో మూడోవంతు మంది విపత్తు (ప్రమాదం)లో ఉన్నారని తెలుసుకుంది.

డార్ఫర్

ఫొటో సోర్స్, Getty Images

ఇది కేవలం గోరంతే..

‘‘ఇది న్యూట్రిషన్ ఎమర్జెన్సీ పరిస్థితికి రెట్టింపుగా ఉందని, కనిపిస్తున్న ఈ సూడాన్ ఆకలి సంక్షోభం బహుశా గోరంతే, ఇంకా కొండంత చూడాల్సి ఉంది'' అని సూడాన్ ఎంఎస్ఎఫ్ ఆపరేషన్స్ మేనేజర్ అబ్దల్లా హుస్సేన్ చెప్పారు. ఆయన కెన్యా రాజధాని నైరోబీలోని ఎంఎస్ఎఫ్ ప్రాంతీయ ప్రధాన కార్యాలయంలో ఉన్నారు.

"మేము డార్ఫర్‌లో ఉంటున్న పిల్లలందరినీ కలవలేదు, కనీసం నార్త్ డార్ఫర్‌ మొత్తం కూడా తిరగలేదు, అక్కడి ఒకే ఒక శిబిరం గురించి మాట్లాడుతున్నాం" అని బీబీసీతో అబ్దల్లా చెప్పారు.

డార్ఫర్‌‌లో తిరగడం విదేశీ జర్నలిస్టులకు, సహాయ సంస్థలకు చాలా కష్టం, కానీ మేము స్థానిక కెమెరామెన్‌తో కలిసి వెళ్లాం, అక్కడ కిస్మా తన కథను చెప్పారు.

తన పిల్లలను ఆసుపత్రికి తీసుకెళ్లడానికి లేదా కనీసం మందులు కొనే స్థోమత కూడా లేదని ఆమె తెలిపారు.

సూడాన్

ఫొటో సోర్స్, Mohamed Zakaria/BBC

ముగ్గురు బిడ్డలు చనిపోయారు: కిస్మా

"నా మొదటి బిడ్డ ఫార్మసీ నుంచి ఇంటికి వెళ్లే దారిలో మరణించాడు, పోషకాహార లోపంతో రెండో బిడ్డ ఆరు రోజులకు మరణించాడు. పాపకు జ్వరం వచ్చిన మూడు రోజుల తర్వాత చనిపోయింది'' అని కిస్మా చెప్పారు.

కిస్మా కుటుంబం డార్ఫూర్‌లో చాలామంది మాదిరే చిన్నకారు రైతులు. పంటలు పండించడానికి చాలా కష్టపడేవారు. యుద్ధం కారణంగా చెలరేగిన హింస, అభద్రత వారి వ్యవసాయాన్ని తీవ్రంగా దెబ్బతీశాయి.

"ప్రజలు ఇక్కడ అనారోగ్యంతో, ఆకలితో ఉన్నారు" కిస్మా బీబీసీతో తెలిపారు.

"ఆశ్రయం కోసం వచ్చిన ప్రజల్లో ఎక్కువమంది నిరుద్యోగులు. ఎవరి దగ్గరైతే డబ్బులున్నాయో వాళ్లంతా ప్రభుత్వ ఉద్యోగులు. ఇక్కడ తొంభై శాతం మంది అనారోగ్యంతో ఉన్నారు" అని కిస్మా తెలిపారు.

ఆర్‌ఎస్‌ఎఫ్ బలగాలు

ఫొటో సోర్స్, AFP

ఫొటో క్యాప్షన్, ఆర్‌ఎస్‌ఎఫ్ బలగాలు

సాయం ఎందుకు ఆగింది?

జామ్‌జామ్ శిబిరం ఇప్పటికే బలహీనంగా ఉంది. 20 ఏళ్ల క్రితం జాతి హింసలో చిక్కుకున్న వారు దీనిని ఏర్పాటు చేసుకున్నారు. ఆ శిబిరం పూర్తిగా మానవతా సహాయంపైనే ఆధారపడి నడుస్తోంది.

కానీ, యుద్ధంతో ఇక్కడికి ఆహార సరఫరా ఆగిపోయింది. పారామిలిటరీ ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ (ఆర్ఎస్ఎఫ్) అక్కడి పెద్ద ప్రాంతాలను స్వాధీనం చేసుకోవడంతో చాలా సహాయ సంస్థలు అక్కడి నుంచి ఖాళీ చేశాయి.

ఆర్ఎస్ఎఫ్, దాని అనుబంధ మిలీషియా ఫైటర్లు ఆసుపత్రులు, దుకాణాలను దోచుకున్నారనే ఆరోపణలూ ఎదుర్కొన్నారు. దీనిని ఆర్ఎస్ఎఫ్ ఖండించింది.

దాడులు జరుగుతుండటంతో కొత్త సామగ్రిని పంపడం దాదాపు అసాధ్యంగా కనిపిస్తోంది.

మరోవైపు వీసాలు, అంతర్గతంగా ప్రయాణానికి అనుమతులను జారీ చేయడంలో సూడాన్ మిలటరీ అధికారులు ఆలస్యం చేస్తున్నారని సహాయ కార్యక్రమాలలో పాల్గొంటున్న వలంటీర్లు ఆరోపిస్తున్నారు.

ఆర్‌ఎస్‌ఎఫ్‌కి ఆయుధాలు చేరకూడదన్న ఉద్దేశంతో చాడ్ ప్రాంతం నుంచి వచ్చే భూ మార్గాలను సైన్యం మూసివేసింది. దీంతో ఆహార సరఫరాకు ఇబ్బందులు తలెత్తాయి.

వరల్డ్ ఫుడ్ ప్రోగ్రాం ఇటీవల రెండు కాన్వాయ్‌లను తీసుకురాగలిగింది, కానీ అవి సరిపోలేదు.

డార్ఫర్

ఫొటో సోర్స్, Dany Abi Khalil / BBC

వైద్య కేంద్రాల కొరత

సరిపడా ఆహారం లేకపోవడంతో వైద్య సేవలలో కూడా ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఇపుడు దేశవ్యాప్తంగా 20-30 శాతం ఆరోగ్య కేంద్రాలు మాత్రమే పనిచేస్తున్నాయి.

వాటిలో జామ్‌జామ్ క్యాంప్‌కు సమీపంలో ఉన్న ఫాషర్ నగరంలోని బాబికర్ నహర్ పీడియాట్రిక్ హాస్పిటల్ ఒకటి.

ఇది పిల్లలకు ఆహారం, వైద్యం అందించే కేంద్రం, సీరియస్ కేసులకు ఇక్కడి ఇంటెన్సివ్ కేర్‌లో చికిత్స చేస్తారు. మా కెమెరామెన్ సందర్శించిన రోజున అక్కడి రెండు వార్డులూ నిండిపోయాయి.

ముక్కులో ట్యూబ్‌లతో ఉన్న పిల్లలు తమ తల్లుల భుజాలపై తలవాల్చుతూ కనిపించారు. అమీన్ అహ్మద్ అలీ అనే మహిళ చిన్న కొడుకుకు వైద్యులు సిరంజి ద్వారా ఆహారం అందించారు.

ఆమెకు ఆరు నెలల వయసున్న కవలలు ఉన్నారు. వారికి వారాల పాటు విరేచనాలయ్యాయి. నెమ్మదిగా కోలుకుంటున్నారు. మిగతా పిల్లలకు ప్యాకెట్లలో ఆహారం అందించారు.

''యుద్ధానికి ముందు కూడా ఈ ఆసుపత్రి పోషకాహార లోపంతో బాధపడేవారికి చికిత్స అందించేది, కానీ ఇప్పుడు ఆ సంఖ్య రెట్టింపు అయింది" అని డాక్టర్ ఎజ్జెడిన్ ఇబ్రహీం అన్నారు.

"నెలనెలకు పేషెంట్ల సంఖ్య పెరుగుతోంది, నార్తర్న్ డార్ఫర్‌లో పూర్తి పోషకాహార కార్యక్రమం నిర్వహించేవాళ్లం, యుద్ధం కారణంగా అది ఆగిపోయింది" అని ఆయన తెలిపారు.

డార్ఫర్‌లోని ఈ కేంద్రం పిల్లల ఆరోగ్య సంరక్షణకు ఎంతోగానో ఉపయోగపడుతోంది. ఈ సదుపాయాలు లేక ఇతర ప్రాంతాలు అల్లాడిపోతున్నాయి.

డార్ఫర్

ఫొటో సోర్స్, Dany Abi Khalil / BBC

ఆకలి, చావుకు మధ్య బతుకుతూ

అక్కడి శిబిరాలలోని "బ్లాక్ హోల్" అని పిలిచే ప్రాంతంలో పరిస్థితిపై రీజనల్ ఎమర్జెన్సీ వర్కర్ ఒకరు బీబీసీకి ఫోటోలను పంపారు.

అందులో దక్షిణ డార్ఫర్‌లోని కల్మా ఐడీపీ క్యాంప్‌లో ఇహ్సాన్ ఆడమ్ అబ్దుల్లా అనే పేరుగల మూడేళ్ల చిన్నారి ఫోటో కూడా ఉంది. గత నెలలో ఆమె మృతి చెందినట్లు సమాచారం.

మరొక ఫోటో సెంట్రల్ డార్ఫర్‌లోని జెనుబియా క్యాంప్‌లోని చిన్న పిల్లవాడిది.

ఆ బాలుడి తల్లి పేరు ఫాతిమా మొహమ్మద్ ఒత్మాన్. తన 10 మంది పిల్లలను పోషించడానికి సహాయం కోరుతూ ఆమె ఒక వీడియోను రికార్డ్ చేశారు.

"పిల్లలు ఆకలి, చావుల మధ్య బతుకుతున్నారు, ఏ చిన్న సాయమైనా చాలు" అని ఆ వీడియోలో ఫాతిమా వేడుకున్నారు.

జామ్‌జామ్‌లో ఎంఎస్ఎఫ్ 50 పడకల టెంట్ ఆసుపత్రిని ప్రారంభించబోతోంది. మానవతా సాయాన్ని పంచుకోవడానికి ఇతర అంతర్జాతీయ సహాయ ఏజెన్సీలు తిరిగి రావాలని ఆ సంస్థ విజ్ఞప్తి చేస్తోంది.

"బాధితులను చేరుకోవడానికి మాకు మరింత మానవతా సహాయం అవసరం" అని అబ్దుల్లా హుస్సేన్ అంటున్నారు.

అలాగే "అనుమతులు, వీసాలు సరళీకృతం చేయాలి, సరిహద్దులను తెరవాలి, మానవతా సిబ్బంది, పౌరుల మౌలిక సదుపాయాలకు ఇబ్బందులు కలిగించొద్దు. ఇవి లేకుండా ఈ భారీ సంక్షోభాన్ని ఎదుర్కోవడం సాధ్యం కాదు, ఇంకా చాలామంది పిల్లలు చనిపోవచ్చు'' అని ఆయన హెచ్చరించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)