ఏపీ పవర్ పాలిటిక్స్‌లో కనిపించని నాలుగో సింహం ఆ కులం

చంద్రబాబు, పవన్, జగన్

ఫొటో సోర్స్, facebook/TDP/JanaSena/YSRCP

    • రచయిత, అరుణ్ శాండిల్య
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలంటే ప్రధానంగా మూడు కులాల ప్రస్తావన వినిపిస్తుంది. ప్రధాన రాజకీయ పార్టీలకు కూడా కులాల ముద్ర ఉంది.

రాష్ట్రంలోని 29 ఎస్సీ, 7 ఎస్టీ నియోజకవర్గాలు.. ఉత్తరాంధ్ర నియోజకవర్గాలు, మిగతా రాష్ట్రంలోని కొన్ని నియోజకవర్గాలు మినహా ఓవరాల్‌గా చూసుకుంటే కమ్మ, రెడ్డి కాపు కులాల చుట్టూ రాజకీయం తిరుగుతుంటుంది.

స్థూలంగా ఆంధ్రప్రదేశ్‌ను కమ్మ, రెడ్డి, కాపు కుల రాజకీయ క్షేత్రంగానే చూస్తుంటారు.

కాపులలో కాపు, తూర్పు కాపు, తెలగ, బలిజ వంటి విభజన ఉంటూ కొన్ని జనరల్, కొన్ని బీసీ కులాలుగా ఉన్నప్పటికీ రాజకీయంగా మాత్రం ఒకటే వర్గంగా పరిగణిస్తున్నారు.

పార్టీలు తరచూ బీసీ మంత్రం జపించినా బీసీలు అనేది ఏ ఒక్క కులంగానో కాకుండా వేర్వేరు కులాలు కావడం వల్ల మళ్లీ ఆ మూడు ప్రధాన కులాల చుట్టూనే రాజకీయం తిరుగుతుంది.

అయితే, 2024 ఎన్నికలలో ఈ మూడు కులాలతో పాటు మరో కులం పేరు కూడా ప్రధానంగా వినిపిస్తోంది. అది యాదవ కులం.

Jagan, Chandrababu

ఫొటో సోర్స్, facebook/ysrcp/tdp

పైకి ప్రస్ఫుటంగా కనిపించేంత పెద్ద సంఖ్యలో ఈ కులానికి పార్టీలు సీట్లు కేటాయించనప్పటికీ సంఖ్యాపరంగా, ఆర్థికపరంగా ఈ కులానికి ఉన్న పొటెన్షియాలిటీని రాజకీయ పార్టీలు గుర్తించాయన్న విషయం ఈ ఎన్నికలతో స్పష్టమవుతోంది.

ఆ సమీకరణలతోనే అటు వైసీపీ కానీ, ఇటు టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి కానీ సీట్ల కేటాయింపులో యాదవ - కురుబలకు ప్రాధాన్యమిచ్చినట్లుగా అర్థమవుతోంది.

2009 ఎన్నికల వరకు బీసీలు తెలుగుదేశం వైపు మొగ్గుతో ఉండేవారు.. 2014 నుంచి క్రమంగా బీసీల మొగ్గు వైసీపీవైపు మళ్లిందని సీనియర్ పాత్రికేయులు, విశ్లేషకులు మెరుగుమాల నాంచారయ్య ‘బీబీసీ’తో అన్నారు.

2019 తరువాత అయిదేళ్లలో బీసీలకు పదవులు ఇస్తూ వైసీపీ వారిని ఆకట్టుకుందని.. ఈ ఎన్నికలలోనూ టికెట్ల కేటాయింపులో వైసీపీ బీసీలను లెక్కలోకి తీసుకుందని ఆయన అభిప్రాయపడ్డారు.

నరసరావుపేట, ఏలూరు లోక్‌సభ సీట్లలో వైసీపీ యాదవులకు టికెట్లు ఇవ్వడం వారికి ప్రాధాన్యమిచ్చిందనడానికి సూచన అని చెప్పారు.

‘‘అసెంబ్లీ సీట్ల విషయంలో గతం కంటే యాదవుల ప్రాధాన్యం సంఖ్యాపరంగా పెద్దగా పెరగనప్పటికీ నరసరావుపేట, ఏలూరు వంటి సెంట్రల్ ఆంధ్ర లోక్‌సభ నియోజకవర్గాలలో.. రాష్ట్రంలోని రాజకీయ ప్రాబల్యం ఉన్న కులాలకు పట్టున్న ఇలాంటి నియోజకవర్గాలలో యాదవులకు టికెట్లు ఇవ్వడమనేది పరిగణించదగ్గ విషయమే’ అన్నారు నాంచారయ్య.

పుట్టా మహేశ్ యాదవ్, పోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్

ఫొటో సోర్స్, bbc

ఫొటో క్యాప్షన్, పుట్టా మహేశ్ యాదవ్, పోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్

జిల్లాలు దాటించి యాదవ అభ్యర్థులను మోహరించారు

ఆంధ్రప్రదేశ్‌లో ఈసారి ఎన్నికల హడావుడి మొదలైన ప్రారంభంలోనే టికెట్ల కేటాయింపు విషయంలో అనేక సమీకరణలు మొదలయ్యాయి. నరసరావుపేట లోక్‌సభ నియోజకవర్గంలో 2019లో వైసీపీ నుంచి గెలిచిన లావు కృష్ణదేవరాయులు వైసీపీని వీడి టీడీపీ గూటికి చేరడంతో ఆయన స్థానంలో కొత్త అభ్యర్థి కోసం వైసీపీ కసరత్తు చేసింది.

నెల్లూరు సిటీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్ పేరు ఒక్కసారిగా తెరపైకి వచ్చింది. అది రాష్ట్రవ్యాప్త చర్చకు దారితీసింది.

కమ్మ, రెడ్డి కులాలకు చెందిన నేతలే ఎక్కువగా గెలుస్తూ వస్తున్న ఈ నియోజకవర్గంలో రెండు జిల్లాల అవతల నుంచి యాదవ నేతను తీసుకొచ్చి పోటీ చేయించాలన్న వైసీపీ అధ్యక్షుడు జగన్ ఆలోచన చాలామందిని ఆశ్చర్యపరిచింది.

అనిల్ యాదవ్ పేరునే జగన్ ఖరారు చేయడంతో ఈ ఎన్నికలలో కొత్త కుల సమీకరణలతో జగన్ ఎన్నికలకు వెళ్తున్నారన్న చర్చ రాష్ట్రవ్యాప్తంగా మొదలైంది.

ఇక తెలుగుదేశం పార్టీ కూడా ఏలూరు లోక్‌సభ నియోజకవర్గంలో ఇలాంటి అనూహ్య ఎంపికతో అందరినీ ఆశ్చర్యపరిచింది.

ఏలూరులో సుదీర్ఘకాలంగా టీడీపీ, కాంగ్రెస్ పార్టీల నుంచి కమ్మ అభ్యర్థులే గెలుస్తున్నారు. 2019లో తొలిసారి ఈ నియోజకవర్గంలో వైసీపీ గెలిచింది. వైసీపీ తరఫున పోటీ చేసిన వెలమ అభ్యర్థి కోటగిరి శ్రీధర్ ఇక్కడ గెలవడంతొ ఇక్కడి కుల సమీకరణలు మారాయి.

అయితే, ఈసారి 2019 సమీకరణలను కూడా మార్చుతూ వైసీపీ ఏలూరులో యాదవ అభ్యర్థిని ప్రకటించింది. జగన్ కేబినెట్లో మంత్రిగా ఉన్న కారుమూరి నాగేశ్వరరావు కుమారుడు సునీల్ యాదవ్‌ను ఏలూరు లోక్‌సభ అభ్యర్థిగా ప్రకటించింది.

దాంతో టీడీపీ కూడా ఇక్కడ బ్యాలన్స్ చేయడానికా అన్నట్లు యాదవ అభ్యర్థినే బరిలో దించింది.

అయితే, జగన్ తరహాలోనే చంద్రబాబు కూడా నాలుగైదు జిల్లాలు దాటించి ఉమ్మడి కడప జిల్లా నుంచి పుట్టా మహేశ్ యాదవ్‌ను ఏలూరు అభ్యర్థిగా తీసుకొచ్చారు.

దీంతో ఏలూరు లోక్‌సభ నియోజకవర్గంలో ఈసారి ప్రధాన పార్టీలు రెండూ యాదవ అభ్యర్థులనే బరిలో దించినట్లయింది.

‘‘ఏపీలోని మొత్తం 25 లోక్‌సభ సీట్లలో ప్రధాన పార్టీలు రెండింటి నుంచీ యాదవ అభ్యర్థులు పోటీ చేస్తున్న ఏకైక నియోజకవర్గం ఏలూరు’’ అని నాంచారయ్య చెప్పారు.

దీంతో ఏలూరులో టీడీపీ, వైసీపీ అభ్యర్థులలో ఎవరు గెలిచినా ఈ నియోజకవర్గం నుంచి యాదవ ఎంపీ పార్లమెంటులో అడుగుపెడతారన్నారు.

సర్నాల తిరుపతిరావు

ఫొటో సోర్స్, YSRCP

ఫొటో క్యాప్షన్, సర్నాల తిరుపతిరావు

అసెంబ్లీ సీట్లలోనూ..

కృష్ణా జిల్లా మైలవరం విషయంలోనూ జగన్ ఇలాంటి వ్యూహమే అనుసరించారు. సుదీర్ఘ కాలంగా కమ్మ అభ్యర్థులే గెలుస్తూ వస్తున్న ఈ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి జగన్ తన పార్టీ తరఫున యాదవ అభ్యర్థిని ప్రకటించారు.

వైసీపీ నుంచి ఇక్కడ సర్నాల తిరుపతిరావు అనే యాదవ నేతకు చాన్స్ ఇచ్చారు జగన్. మైలవరంలో కమ్మ సామాజికవర్గంతో పాటు యాదవ సామాజికవర్గ ఓట్లు కూడా చెప్పుకోదగ్గ సంఖ్యలో ఉండడమే జగన్ ఈ అడుగు వేయడానికి కారణం.

ఉమ్మడి కృష్ణా జిల్లాలో మాజీ మంత్రి కొలుసు పార్థసారథి వైసీపీని వీడడంతో మరో యాదవ నేతకు ఈ ప్రాంతంలో అవకాశం ఇవ్వాలన్న ప్రయత్నం కనిపించిందని, కమ్మ నేతలు గెలిచే మైలవరంలో సర్నాల తిరుపతి రావుకు టికెట్ ఇవ్వడం దానికి నిదర్శనమని నాంచారయ్య అభిప్రాయపడ్డారు.

ఇక ఉమ్మడి ప్రకాశం జిల్లాలో యాదవ ఓట్లు ఎక్కువగా ఉన్న కనిగిరి అసెంబ్లీ నియోజకవర్గం విషయంలోనూ జగన్ ఇలాంటి వ్యూహమే అనుసరించారు.

ఎక్కువగా రెడ్డి నేతలు, ఒకరిద్దరు కమ్మ నేతలు గెలిచిన ఈ నియోజకవర్గంలో జగన్ యాదవ నాయకుడు దుద్దాల నారాయణ యాదవ్‌కు అవకాశమిచ్చారు.

అయితే, జగన్ 2014, 2019 ఎన్నికలలోనూ ఈ నియోజకవర్గంలో జగన్ యాదవ అభ్యర్థులకే అవకాశమిచ్చారు.

2019లో వైసీపీ నుంచి బుర్రా మధుసూదన్ యాదవ్ ఇక్కడ గెలిచారు.

ప్రస్తుత ఎన్నికలలో మధుసూదన్ యాదవ్‌ను కనిగిరి నుంచి కందుకూరుకు మార్చారు జగన్.

పవన్ కల్యాణ్‌తో వంశీకృష్ణ యాదవ్

ఫొటో సోర్స్, janasena

ఫొటో క్యాప్షన్, పవన్ కల్యాణ్‌తో వంశీకృష్ణ యాదవ్

ఏ పార్టీ నుంచి ఎక్కడెక్కడ?

వైఎస్ఆర్ కాంగ్రెస్:

ప్రస్తుత ఎన్నికలలో పాలక వైసీపీ నలుగురు యాదవ, ఇద్దరు కురుబ అభ్యర్థులకు అసెంబ్లీ నియోజకవర్గాలలో అవకాశం ఇచ్చింది. లోక్ సభ నియోజకవర్గాలలో ఇద్దరు యాదవ, ఒక కురుబ అభ్యర్థిని ప్రకటించింది.

శాసన సభ నియోజకవర్గాలలో తణుకు నుంచి సిటింగ్ ఎమ్మెల్యే కారుమూరు నాగేశ్వరరావు, మైలవరంలో సర్నాల తిరుపతి రావు, కనిగిరిలో దద్దాల నారాయణ యాదవ్, కందుకూరులో బుర్రా మధుసూదన్ యాదవ్ పోటీ చేస్తుండగా హిందూపురంలో కురుబ సామాజిక వర్గానికి చెందిన తిప్పెగౌడ నారాయణ దీపికను బరిలో దించుతున్నారు.

ఆమె అక్కడ తెలుగుదేశం సిటింగ్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణను ఎదుర్కోనున్నారు.

ఇక పెనుకొండ నియోజకవర్గంలో మంత్రి ఉషశ్రీచరణ్‌ను పోటీ చేయిస్తోంది వైసీపీ. ఆమె కూడా కురుబ సామాజికవర్గానికి చెందినవారే.

లోక్‌సభ నియోజకవర్గాల విషయానికొస్తే ఏలూరు నుంచి కారుమూరు సునీల్ యాదవ్, నరసరావుపేటలో అనిల్ కుమార్ యాదవ్, అనంతపురంలో కురుబ నేత మాలగుండ్ల శంకరనారాయణ వైసీపీ నుంచి పోటీ చేస్తున్నారు.

తెలుగుదేశం:

తెలుగుదేశం పార్టీ నుంచి మైదుకూరు అసెంబ్లీ నియోజకవర్గంలో పుట్టా సుధాకర్ యాదవ్, తునిలో యనమల దివ్య, చీరాలలో మద్దులూరి మాలకొండయ్య యాదవ్, నూజివీడులో కొలుసు పార్థసారథి, గాజువాకలో పల్లా శ్రీనివాసరావు పోటీ చేస్తున్నారు.

ఏలూరు లోక్‌సభ స్థానం నుంచి పుట్టా మహేశ్ యాదవ్, హిందూపురం పార్లమెంటు స్థానం నుంచి కురుబ నేత బీకే పార్థసారథి, కర్నూలు లోక్‌సభ స్థానం నుంచి మరో కురుబ నేత బస్తిపాటి నాగరాజు టీడీపీ అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారు.

అయితే, యాదవ సామాజికవర్గం నుంచి టీడీపీలో టికెట్లు సంపాదించినవారిలో ముగ్గురు ఒకే కుటుంబానికి చెందినవారు. టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడి కుమార్తే దివ్య కాగా, సుధాకర్ యాదవ్ వియ్యంకుడు.. మహేశ్ యాదవ్ అల్లుడు.

జనసేన:

జనసేన నుంచి పోటీ చేస్తున్నవారిలో విశాఖ సౌత్ అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి వంశీకృష్ణ యాదవ్ వైసీపీ నుంచి ఎమ్మెల్సీగా ఉంటూ ఎమ్మెల్యే టికెట్ ఆశించారు. ఆ పార్టీలో టికెట్ రాకపోవడంతో జనసేనలో చేరి టికెట్ సంపాదించుకున్నారు.

రఘువీరా రెడ్డి

ఫొటో సోర్స్, RAGHUVEERA REDDY/FACEBOOK

ఫొటో క్యాప్షన్, రఘువీరా రెడ్డి

గత ఎన్నికలలో..

2019లో..

2019 ఎన్నికలలో యాదవ సామాజికవర్గం నుంచి నలుగురు, కురుబ నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలుగా గెలిచారు. మొత్తం ఆరుగురూ వైసీపీ నుంచే విజయం సాధించారు.

యాదవులలో కారుమూరు నాగేశ్వరరావు తణుకు నుంచి, కె.పార్థసారథి పెనమలూరు నుంచి, కనిగిరి నుంచి బుర్రామధుసూదన్ యాదవ్, నెల్లూరు సిటీ నుంచి అనిల్ కుమార్ యాదవ్ గెలిచారు.

వీరిలో కారుమూరు నాగేశ్వరరావు, అనిల్ కుమార్ మంత్రులయ్యారు.

కురుబ కులం నుంచి ఉషశ్రీచరణ్, మాలగుండ్ల శంకరనారాయణ గెలిచారు. వీరిద్దరికీ జగన్ కేబినెట్లో స్థానం దక్కింది.

మొత్తం ఆరుగురిలో పార్థసారథి ప్రస్తుత ఎన్నికలలో వైసీపీని వీడి టీడీపీ నుంచి పోటీ చేస్తున్నారు.

2014లో..

ముగ్గురు యాదవ ఎమ్మెల్యేలు, ఒక కురుబ ఎమ్మెల్యే ఎన్నికలలో విజయం సాధించారు. వీరిలో టీడీపీ నుంచి ఇద్దరు యాదవ, ఒక కురుబ నేత గెలవగా.. వైసీపీ నుంచి ఒక యాదవ నేత గెలిచారు.

టీడీపీ నుంచి గాజువాకలో పోటీ చేసిన పల్లా శ్రీనివాసరావు(యాదవ), తంబళ్లపల్లెలో శంకర్ యాదవ్(యాదవ), పెనుకొండ బీకే పార్థసారథి(కురుబ) గెలిచారు.

వైసీపీ నుంచి నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుంచి అనిల్ కుమార్ యాదవ్ అసెంబ్లీకి ఎన్నికయ్యారు.

2009లో..

2009 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ నుంచి ముగ్గురు యాదవ నేతలు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. తణుకులో కారుమూరు నాగేశ్వరరావు, పెనమలూరులో పార్థసారథి, కళ్యాణదుర్గంలో ఎన్.రఘువీరారెడ్డి(కురుబ) గెలిచారు.

ఆ ఎన్నికలలో టీడీపీ నుంచి కావలిలో యాదవ నేత బీద మస్తాన్ రావు, పెనుకొండలో కురుబ నేత బీకే పార్థసారథి గెలిచారు.

2004లో..

కాంగ్రెస్ పార్టీ నుంచి ఉయ్యూరులో కొలుసు పార్థసారథి, గురజాలలో జంగా కృష్ణమూర్తి, మడకశిరలో రఘువీరారెడ్డి సామాజికవర్గం నుంచి గెలిచారు.

ఆ ఎన్నికలలో టీడీపీ నుంచి తునిలో యాదవ నేత యనమల రామకృష్ణుడు విజయం సాధించారు.

గన్నవరంలో ఇండిపెండెంట్‌గా పోటీ చేసిన యాదవ నేత ముద్రబోయిన వెంకటేశ్వరరావు గెలిచారు.

‘మాకే టికెట్ ఇవ్వాలి’

ఆంధ్రప్రదేశ్ జనాభాలో యాదవుల సంఖ్య 7 శాతానికి పైగా ఉన్నట్లు అనధికారిక లెక్కలు చెప్తున్నాయి.

ప్రధాన పార్టీల టికెట్ల ప్రకటనకు ముందే ఏపీలోని కొన్ని నియోజకవర్గాలలో యాదవ నేతలు తమకు టికెట్లు ఇవ్వాలని డిమాండ్లు చేసిన ఘటనలున్నాయి.

ఆయా నియోజకవర్గాలలో యాదవ ఓటర్ల సంఖ్య, అక్కడ వారికి ప్రాధాన్యమున్నా ప్రాతినిధ్యం లేకపోవడాన్ని ప్రస్తావిస్తూ టికెట్లు డిమాండ్లు చేశారు.

పార్టీలలో పనిచేసే యాదవ నాయకులతో పాటు యాదవ కులసంఘాల నాయకులు కూడా రాజకీయ పార్టీలు తమ కులానికి చెందిన నేతలకు టికెట్లు ఇవ్వాలని పట్టుపట్టారు.

ఇది కొన్ని చోట్ల ఫలించినా మరికొన్ని చోట్ల ఫలించకపోవడం అసంతృప్తికి దారి తీసింది కూడా.

ముఖ్యంగా ఉత్తరాంధ్రలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యాదవులకు ఎక్కడా టికెట్లు ఇవ్వకపోవడాన్ని ఆ కులానికి చెందిన నాయకులు తప్పుపట్టారు.

అంతేకాదు.. విశాఖ నగరంలో వైసీపీ నుంచి ఎమ్మెల్సీగా ఉన్న వంశీకృష్ణ యాదవ్ ఆ పార్టీకి రాజీనామా చేసి జనసేనలో చేరి విశాఖపట్నం సౌత్ అసెంబ్లీ నియోజకవర్గ టికెట్ సంపాదించారు.

మరోవైపు గురజాల నియోజకవర్గంలోనూ యాదవ నేత, వైసీపీ ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి వైసీపీ టికెట్ ఆశించారు. అయితే, ఆయనకు టికెట్ రాకపోవడంతో పార్టీని వీడారు.

ఇక విజయనగరం జిల్లాలోనూ యాదవులు విజయనగరం అసెంబ్లీ సీటును డిమాండ్ చేస్తూ ప్రదర్శనలు చేశారు. విజయనగరం జిల్లాలో 2.5 లక్షల యాదవ ఓట్లు ఉంటే ఒక్క విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోనే 65 వేల ఓట్లు ఉన్నాయంటూ ప్రదర్శనలు చేశారు.

గుంతకల్లులోనూ టీడీపీ టికెట్ కోసం యాదవ సంఘాలు డిమాండ్ చేశాయి. గుంతకల్లు అసెంబ్లీ నియోజకవర్గంలో 65 వేల యాదవ ఓట్లు ఉన్నాయని, యాదవులకే టికెట్ ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు.

ఇవి కూడా చదవండి:

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)