బాల్ ఠాక్రేను ఆరేళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా, ఓటు వేయనివ్వకుండా చేసిన ఘటన ఇది

బాల్ ఠాక్రే, ఎన్నికల సంఘం, అసెంబ్లీ ఎన్నికలు

ఫొటో సోర్స్, VIKAS KHOT/HINDUSTAN TIMES VIA GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, బాల్ ఠాక్రే
    • రచయిత, అనిల్ జైన్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

సార్వత్రిక ఎన్నికల్లో పార్టీల ప్రచారం ఊపందుకుంది.

ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చిన తర్వాత ప్రచారంలో మతపరమైన చిహ్నాలు ఉపయోగించడం, కులాన్ని, మతాన్ని ప్రస్తావించడం, వాటి ఆధారంగా ఓట్లు అడగడం లాంటివి చేయకూడదు.

అలాగే, ఒక మతం లేదా కులాన్ని రెచ్చగొట్టేలా లేదా కించపరిచేలా మాట్లాడటం లేదా నినాదాలు చేయడంపైనా నిషేధం ఉంది.

తాజా ఎన్నికలకు సంబంధించి ఈ నిబంధనలను ఎన్నికల సంఘం ఇప్పటి వరకు అమలు చేసినట్లు కనిపించడం లేదు.

బీజేపీ రామ మందిరాన్ని ఉపయోగించుకుంటున్న తీరు, రాజస్థాన్‌లోని బన్సవరలో ప్రధానమంత్రి మోదీ ముస్లింల గురించి మాట్లాడిన మాటలు తాజా ఉదాహరణలు.

ప్రధాని వ్యాఖ్యల విషయంలో ఏ చర్యలు తీసుకున్నారని ప్రతిపక్షాలు ఎన్నికల సంఘాన్ని ప్రశ్నిస్తున్నాయి.

బాల్ ఠాక్రే, శివసేన

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, వివాదానికి దారి తీసిన బాల్ ఠాక్రే ప్రసంగం

విల్లే పార్లే ఉప ఎన్నికలో బాల్ ఠాక్రే ప్రసంగం

రెండున్నర దశాబ్ధాల క్రితం శివసేన వ్యవస్థాపకుడు బాల్ ఠాక్రే విద్వేష పూరిత ప్రసంగం చేసినందుకు, ఆరేళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా, ఓటు వేయకుండా ఎన్నికల సంఘం ఆయనపై నిషేధం విధించింది.

1987లో ముంబయిలోని విల్లే పార్లే అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరిగింది.

ఈ ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రభాకర్ కాశీనాధ్ కుంతే, స్వతంత్ర అభ్యర్థిగా డాక్టర్ రమేష్ యశ్వంత్ ప్రభు పోటీ పడ్డారు.

వీరిలో స్వతంత్ర అభ్యర్థి డాక్టర్ యశ్వంత ప్రభుకు శివసేన మద్దతు ఇచ్చింది.

ఈ ఉప ఎన్నిక జరిగే సమయానికి శివసేనకు రాజకీయ పార్టీగా గుర్తింపు లభించలేదు. ఆ ఎన్నికల్లో శివసేన అధ్యక్షుడు బాల్ ఠాక్రే డాక్టర్ రమేష్ ప్రభుకు మద్దతుగా నిలిచారు.

1987 డిసెంబల్ 13న పోలింగ్ జరిగింది. డిసెంబర్ 14న ఫలితాలు ప్రకటించారు. విల్లే పార్లే నుంచి స్వతంత్ర అభ్యర్థి డాక్టర్ రమేష్ ప్రభు కాంగ్రెస్ అభ్యర్థి ప్రభాకర్ కుంతే మీద గెలిచారు. ఉప ఎన్నికకు ముందు ఈ సీటు కాంగ్రెస్ చేతిలో ఉంది.

ఉప ఎన్నికలో ఓడిపోయిన కాంగ్రెస్ నేత ప్రభాకర్ కుంతే ఫలితాన్ని హైకోర్టులో సవాలు చేశారు.

ఎన్నికల్లో రమేష్ ప్రభు విద్వేష పూరిత ప్రసంగాలు చేశారని, వాటి కారణంగానే ఆయన గెలిచారని కోర్టులో వాదించారు.

ఇందుకు సంబంధించిన ఆధారాలను ఇచ్చి, డాక్టర్ రమేష్ ప్రభు ఎన్నికను రద్దు చేయాలని కోర్టుని కోరారు.

కొన్ని నెలల పాటు ఈ కేసులో వాదనలు కొనసాగాయి. 1989 ఏప్రిల్ 7న బాంబే హైకోర్టు ఈ కేసులో తీర్పు చెప్పింది.

ఎన్నికల్లో డాక్టర్ రమేష్ ప్రభు, బాల్ ఠాక్రే అక్రమ మార్గాలను అనుసరించారని తేలినందున, ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951 ప్రకారం విల్లే పార్లే ఉప ఎన్నిక ఫలితాన్ని రద్దు చేస్తున్నట్లు తీర్పులో పేర్కొంది.

బాంబే హైకోర్టు తీర్పుపై డాక్టర్ రమేష్ ప్రభు సుప్రీంకోర్టుని ఆశ్రయించారు.

అయితే 1995 డిసెంబర్ 11న ఆయన అప్పీలును సుప్రీంకోర్టు తిరస్కరించింది. బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పుని సమర్ధించింది.

సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జేఎస్ వర్మ తన తీర్పులో ఇలా రాశారు.

“విల్లే పార్లే అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో1987 నవంబర్ 29, డిసెంబర్ 9, డిసెంబర్ 10న డాక్టర్ రమేష్ ప్రభు, బాల్ ఠాక్రే చేసిన ప్రసంగాల ఆధారంగా ఈ కేసులో విచారణ జరిగింది.

ఆ రోజున చేసిన ప్రసంగాల్లో బాల్ ఠాక్రే “హిందువులను రక్షించేందుకే మనం ఎన్నికల్లో పోటీ చేస్తున్నాం. మనం ముస్లింల ఓట్ల గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఈ దేశం హిందువులది. దేశంలో హిందువులు మాత్రమే ఉంటారు” అని అన్నట్లు కోర్టు గుర్తించింది.

ఈ ప్రసంగాల ఆధారంగా వీళ్లిద్దరూ ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించినట్లు కోర్టు తేల్చింది.

బాల్ ఠాక్రే, కాంగ్రెస్, బీజేపీ, వాజ్‌పేయి ప్రభుత్వం, నరేంద్రమోదీ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, బాల్ ఠాక్రే ఓటుహక్కుపై ఆరేళ్ల పాటు నిషేధం

బాల్ ఠాక్రే ఓటు హక్కుపై ఆరేళ్ల పాటు నిషేధం

సురేష్ ప్రభు ఎన్నికను రద్దు చేస్తూ బాంబే హైకోర్టు వెల్లడించిన తీర్పుని సుప్రీంకోర్టు సమర్థించింది. ఈ విధంగా సురేష్ ప్రభుకు శిక్ష పడింది. మరి బాల్ ఠాక్రే సంగతేంటి? ఆయనకు ఎలాంటి అధికార పదవి లేదు. ఏ సభలోనూ ప్రజాప్రతినిధి కాదు. మరి ఆయనకు ఏ శిక్ష వేయాలి?

ఎన్నికల నియమావళి ఉల్లంఘించిన వారికి గరిష్టంగా ఆరేళ్ల పాటు ఓటు హక్కు లేకుండా నిషేధం విధించవచ్చని ఎన్నికల సంఘం మాజీ ప్రధాన కమిషనర్ టీఎస్ కృష్ణమూర్తి చెబుతున్నారు.

ఇలాంటి కేసులలో రాష్ట్రపతి అంతిమ నిర్ణయం తీసుకోవచ్చు. నిర్ణయం తీసుకునే ముందు ఆయన ఎన్నికల సంఘం అభిప్రాయాన్ని కోరవచ్చు.

ఈ కేసులో బాల్ ఠాక్రేపై చర్య తీసుకోవాలని సుప్రీంకోర్టు రాష్ట్రపతిని కోరింది.

ఆ సమయంలో రాష్ట్రపతిగా కేఆర్ నారాయణన్ ఉన్నారు.

ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా డాక్టర్ మనోహర్ సింగ్ గిల్, ఎన్నికల కమిషనర్లుగా జేఎం లింగ్డో, టీఎస్ కృష్ణమూర్తి ఉన్నారు.

సుప్రీంకోర్టు సూచనల మేరకు బాల్ ఠాక్రే కేసు విచారణ చేపట్టిన రాష్ట్రపతి నారాయణన్ నిబంధనల ప్రకారం ఈ కేసులో ఏం చర్యలు తీసుకోవచ్చో చెప్పాలని ఎన్నికల సంఘాన్ని కోరారు.

1998 సెప్టెంబర్ 22న ఎన్నికల సంఘం తన సూచనలను రాష్ట్రపతి కార్యాలయానికి పంపింది.

బాల్ ఠాక్రే ఎన్నికల నియమావళి ఉల్లంఘించినట్లు కోర్టు తేల్చడంతో ఆయన ఓటు హక్కును ఆరేళ్ల పాటు రద్దు చేయవచ్చని (1995 డిసెంబర్ 11 నుంచి 2001 డిసెంబర్ 10వరకు) ప్రధాన ఎన్నికల కమిషనర్ డాక్టర్ మనోహర్ సింగ్ గిల్ సూచించారు.

ఎన్నికల సంఘం సూచనలతో బాల్ ఠాక్రే ఓటు వేయకుండా ఆరేళ్ల పాటు నిషేధిస్తూ 1999 జులై 28న అప్పటి రాష్ట్రపతి కేఆర్ నారాయణన్ నిర్ణయం తీసుకున్నారు.

ఈ మొత్తం వ్యవహారం దేశంలో రాజ్యాంగ వ్యవస్థలకున్న విస్తృత అధికారాలు, బాధ్యతలను సూచించడమే కాకుండా కీలక సమయంలో అవి ఎలా స్పందించాయో చెబుతోంది.

ఇందులో ఆసక్తికర అంశం ఏంటంటే, 2019 లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా మహారాష్ట్రలో ప్రచారం నిర్వహించిన నరేంద్రమోదీ కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు.

కాంగ్రెస్ పార్టీ బాల్ ఠాక్రే ఓటు హక్కుని రద్దు చేయించిదని, అలా చేయడం ఠాక్రే పౌర హక్కులు, మానవ హక్కులకు భంగం అని ఆరోపించారు.

రాక్రే ఓటు హక్కుని రద్దు చేయడం అనేది కోర్టులు, రాష్ట్రపతి, ఎన్నికల సంఘం లాంటి రాజ్యాంగబద్ధ సంస్థలు తీసుకున్న నిర్ణయం.

2019 ఏప్రిల్ 9న నరేంద్ర మోదీ లాతూర్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రసంగించారు.

“నేను కాంగ్రెస్ వాళ్లకు ఒకటే చెబుతున్నాను. మీ మొహాలు అద్దంలో చూసుకోండి. మానవ హక్కుల గురించి మాట్లాడటం మీకు సరిపోదు. కాంగ్రెస్ వాళ్లు దేశంలోని ప్రతి పిల్లవాడికి కూడా సమాధానం చెప్పాలి. మీ కాంగ్రెస్ వాళ్లే బాల్ ఠాక్రే పౌరహక్కుల్ని లాగేసుకున్నారు. ఆయన ఓటు హక్కుని కూడా లాగేసుకున్నారు” అని అన్నారు.

లాతూర్ సభలో ప్రధానమంత్రి ప్రసంగించేటప్పుడు వేదికపై ఆయన బాల్ ఠాక్రే కుమారుడు శివసేన ప్రధాన కార్యదర్శి ఉద్దవ్ ఠాక్రే కూడా ఉన్నారు.

బాల్ ఠాక్రే ఓటు హక్కుపై ఆరేళ్ల పాటు నిషేధం విధిస్తూ రాష్ట్రపతి నిర్ణయం తీసుకున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉంది. అప్పుడు ప్రధానమంత్రిగా వాజ్‌పేయి ఉన్నారు.

తన ఓటుహక్కు రద్దు చేయడంపై బాల్ ఠాక్రే నాటి ప్రభుత్వంపై విమర్శలు చేశారు. కానీ ఏ రోజూ కూడా తన ఓటు హక్కు రద్దు కావడానికి కాంగ్రెస్ పార్టీ కారణం అని చెప్పలేదు.

రాష్ట్రపతి నిర్ణయం కారణంగా బాల్ ఠాక్రే 1999 లోక్‌సభ ఎన్నికల్లో, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేయలేదు. ఆరేళ్ల శిక్ష ముగిసిన తర్వాత 2004 ఎన్నికల్లో ఆయన ఓటు వేశారు.

ఇవి కూడా చదవండి:

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)