చైనాలోని నగరాలు ఎందుకు కుంగిపోతున్నాయి?

చైనాలో కుంగిపోయిన భవనం ఫోటో | Earth Day story

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, గ్వాంగ్జి ప్రావిన్స్‌లో కుంగిపోయిన భవనం
    • రచయిత, మాట్ మెక్‌గ్రాత్
    • హోదా, బీబీసీ ఎన్విరాన్‌మెంట్ కరస్పాండెంట్

చైనాలోని పలు నగరాల్లో భూమి కుంగిపోతోంది. దీంతో పెద్ద పెద్ద భవనాలు కూలిపోతున్నాయి.

భూగర్భజలాల వెలికితీత, భవనాల భారీ బరువు కారణంగా చైనాలోని సగానికి పైగా పెద్ద నగరాలు కుంగిపోయే స్థితికి చేరుకున్నాయని పరిశోధకులు చెబుతున్నారు.

కొన్ని నగరాల్లో ఈ సమస్య మరింత తీవ్రంగా ఉంది. ప్రతి ఆరు నగరాల్లో ఒకటి ఏడాదికి 10 మిల్లిమీటర్ల చొప్పున కుంగిపోతోంది.

చైనాలో వేగంగా పెరుగుతున్న పట్టణీకరణ కారణంగా జనాభా నీటి అవసరాలు తీర్చేందుకు భూగర్భజలాలను అడ్డగోలుగా తోడేస్తున్నారని పరిశోధకులు చెబుతున్నారు.

భూగర్భ కోత కారణంగా సముద్ర మట్టాలు పెరిగి వరద ముప్పు పెరగడం, తీర ప్రాంతాల్లోని లక్షల మందిని భయపెడుతోంది.

సుదీర్ఘ చరిత్ర

భూ క్షీణత అధికంగా ఉన్న ప్రాంతాలు

చైనాలో ఇలా భూమి కుంగిపోతుందని చెప్పడానికి సుదీర్ఘ చరిత్రే ఉంది. 1920 నుంచి షాంఘై, టియాంజిన్ నగరాలు ఇందుకు తార్కాణంగా నిలుస్తున్నాయి. గడిచిన శతాబ్దంలో షాంఘై నగరం మూడు మీటర్ల మేర కుంగిపోయింది.

ఇటీవలి దశాబ్దాలలో వేగంగా విస్తరించిన నగరాలలో భూమి కుంగిపోవడం ఈ మధ్య మరింతగా పెరగింది.

ఈ సమస్య తీవ్రతను అర్థం చేసుకోవడానికి చైనాలోని పలు విశ్వవిద్యాలయాలకు చెందిన పరిశోధకుల బృందం 20 లక్షలకు మించి జనాభా కలిగిన 82కు పైగా నగరాలలో పరీక్షలు నిర్వహించింది.

దేశవ్యాప్తంగా వర్టికల్ లాండ్ మోషన్స్ ( దీర్ఘకాలంలో భూ ఉపరితల మార్పు సగటు)ను లెక్కించేందుకు వారు సెంటినెల్-1 ఉపగ్రహ సమాచారాన్ని వినియోగించారు.

ఈ బృందం 2015 నుంచి 2022 మధ్య కాలంలో మొత్తం నగరాలలో 45 శాతం ప్రాంతాలు ఏడాదికి మూడు మిల్లిమీటర్లకు పైగా కుంగిపోతున్నాయని తెలుసుకోగలిగింది.

దాదాపు 16 శాతం పట్టణ భూమి ఏడాదికి 10 మిల్లిమీటర్ల చొప్పున వేగంగా కుంగిపోతోంది. దీనిని శాస్త్రవేత్తలు వేగవంతమైన క్షీణతగా అభివర్ణిస్తున్నారు.

అంటే, దీన్నిబట్టి 6 కోట్ల 70 లక్షల మంది ప్రజలు భూమి వేగంగా కుంగిపోయే ప్రాంతాల్లో జీవిస్తున్నారని అర్థం చేసుకోవచ్చు.

భూమి, భవనాల బరువు సహా ఈ కుంగుబాటుకు అనేక అంశాలు కారణమవుతున్నప్పటికీ భూగర్భజలాల తోడివేతే ప్రధాన కారణమని చెబుతున్నారు.

దీన్ని బట్టి స్థానిక ప్రజల అవసరాల కోసం నగరాల కిందో, లేదో సమీపంలోనో నీటిని తోడివేస్తున్నారని అర్థం చేసుకోవచ్చు.

హూస్టన్, మెక్సికో సిటీ, దిల్లీ సహా ప్రపంచ వ్యాప్తంగా అనేక పెద్ద పట్టణ ప్రాంతాల్లో ఇలాంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి.

ఖనిజాల తవ్వకమూ కారణమే

థర్మల్ విద్యుత్ కేంద్రం ఫొటో | Earth Day story

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, చైనాలోని బొగ్గు ఉత్పత్తి కేంద్రాలు భూక్షీణతకు కారణమవుతున్నాయి

చైనాలో ఈ పరిశోధనా బృందం 1600 బావుల నుంచి నీటి తోడివేతను, భూ క్షీణత పెరిగిపోవడంతో ముడిపెట్టగలిగింది.

‘నీటి తోడివేతే భూక్షీణతకు ప్రధాన కారణమని నాకు అనిపిస్తోంది’’ అని ప్రొఫెసర్ రాబర్ట్ నికోలస్ చెప్పారు. ఆయన ఈస్ట్ ఆంగ్లియా యూనివర్సిటీలో పనిచేస్తున్నారు. కానీ ఆయనీ పరిశోధనలో పాలుపంచుకోలేదు.

‘‘భౌగోళికంగా చెప్పాలంటే లక్షల మంది నివసించే ప్రాంతాలు ఇటీవలి కాలంలో కుంగుబాటుకు గురయ్యాయి. మీరు నీటిని తోడివేసినప్పుడు లేదా నేలను పొడిగా మార్చినప్పుడో అవి కుంగుబాటుకు గురవుతాయి. పట్టణ రవాణా వ్యవస్థ, ఖనిజాలు, బొగ్గు తదితరాల కోసం గనుల తవ్వకం కూడా భూమి గుల్లబారిపోవడానికి మరికొన్ని కారణాలు’’ అని చెప్పారు.

వ్యూహాలూ ఉన్నాయి

చైనాలో కుంగిపోతున్న భూమి | Earth Day story

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, జెంగ్జౌ నగరంలో భూమి కుంగిపోవడం కారణంగా నడిరోడ్డుపై ఏర్పడిన గుంత

చైనాలో అతిపెద్ద బొగ్గు గని ప్రాంతాల్లో ఒకటైన పింగ్డిన్‌గ్షాన్ ఉత్తర ప్రాంతం ఏడాదికి 109 మిల్లిమీటర్ల చొప్పున కుంగిపోతోంది.

వాతావరణ మార్పుల వల్ల సముద్ర మట్టాలు పెరగడం, భూ క్షీణత వల్ల పట్టణ ప్రాంతాలలోని ప్రజలు వరద ముప్పును ఎదుర్కొంటారని ఈ అధ్యయన రచతయిలు తెలిపారు.

2020లో చైనా సముద్ర మట్టానికి సాపేక్షకంగా 6 శాతం దిగువన ఉండగా, వందేళ్లలో కర్బన ఉద్గారాల కారణంగా ఇది 26 శాతానికి పెరగొచ్చు.

సముద్ర మట్టాల పెరుగుదల కంటే భూ క్షీణత వేగంగా పెరుగుతోందని, ఈ రెండింటివల్ల లక్షలాదిమంది ప్రజలు వరదలకు గురయ్యే పరిస్థితి ఉందని పరిశోధకులు చెబుతున్నారు.

అయితే పరిశోధనలు భూక్షీణతను ఎదుర్కోవడానికి సమర్థవంతమైన వ్యూహాలు ఉన్నట్టు చూపుతున్నాయి.

భూ క్షీణత సమస్యలు ఒసాకా, జపాన్‌లోని టోక్యో సహా ఆసియా ఖండంలోని ప్రధాన నగరాలను గతంలో బాధించాయి.

‘‘ 20వ శతాబ్దాంలో ఓడరేవు సమీపంలో టోక్యో ఐదు మీటర్ల మేర కుంగిపోయింది’’ అని ప్రొఫెసర్ నికోలస్ చెప్పారు.

‘‘కానీ 1970 ప్రాంతాలలో వారు ఇతర ప్రాంతాల నుంచి పైపుల ద్వారా నీటి సరఫరా చేయడం ప్రారంభించారు. అలాగే బావుల నుంచి నీటి వాడకాన్ని నిషేధిస్తూ చట్టం చేశారు. ఇది భూమి కుంగిపోవడాన్ని నిలువరించింది’’ అని ఆయన చెప్పారు.

ఈ అధ్యయనం జర్నల్ సైన్స్ లో ప్రచురితమైంది.

ఇవి కూడా చదవండి:

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)