సూరత్: కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ రద్దు, బీజేపీ అభ్యర్థి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించిన కలెక్టర్, అసలేం జరిగిందంటే..

ఫొటో సోర్స్, RUPESH SONWANE
గుజరాత్‌లోని సూరత్ లోక్‌సభ నియోజకవర్గంలో రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా మారుతున్నాయి.
మొదట కాంగ్రెస్ అభ్యర్థి నీలేశ్ కుంభానీ నామినేషన్‌ను ఎన్నికల అధికారులు రద్దు చేశారు. అనంతరం స్వతంత్ర అభ్యర్థులంతా పోటీ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు.
దీంతో బీజేపీ అభ్యర్థి ముకేష్ దలాల్ ఏకగ్రీవంగా గెలిచినట్లు రిటర్నింగ్ ఆఫీసర్ సౌరవ్ పర్గి సోమవారం ప్రకటించారు. ముఖేష్‌కు సర్టిఫికేట్ కూడా అందించారు.
దీంతో బీజేపీ ఇక్కడ విజయోత్సవ సంబరాలను కూడా మొదలుపెట్టింది.
మరోవైపు ఏకగ్రీవంగా ఎన్నికైన బీజేపీ అభ్యర్థి ముఖేష్‌కు సోషల్ మీడియాలోనూ అభినందనలు చెబుతున్నారు.

ఫొటో సోర్స్, RUPESH SONWANE
నీలేశ్ కుంభానీ నామినేషన్ రద్దు అనంతరం తొమ్మిది మంది ఇతర అభ్యర్థులు పోటీ నుంచి వైదొలుగుతూ తమ నామినేషన్లను వెనక్కి తీసుకున్నట్లు సూరత్‌కు చెందిన బీబీసీ ప్రతినిధి రూపేశ్ సోనావనే ధ్రువీకరించారు.
దీంతో బీజేపీ అభ్యర్థి ముఖేష్ దలాల్ గెలిచినట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు. అనంతరం బీజేపీ సీనియర్ నాయకుడు సీఆర్ పాటిల్‌ను కలిసేందుకు ముఖేశ్ వెళ్లారు.
మరోవైపు సీఆర్ పాటిల్‌తోపాటు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలకు ముఖేష్ దలాల్ ధన్యవాదాలు తెలిపారు.
ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారంటూ విపక్ష నాయకులు చేస్తున్న విమర్శలపై ముఖేష్ స్పందించారు.
‘‘ఆ విమర్శలు కాలం చెల్లినవి. తమకు అనుకూలంగా ఫలితాలు వస్తే, అన్నీ సవ్యంగానే జరిగినట్లు. లేకపోతే, ప్రజాస్వామ్యం హత్యకు గురైనట్లు.. ఇలాంటి విమర్శల్లో అర్థంపర్థం లేదు’’ అని ఆయన అన్నారు.

ఫొటో సోర్స్, BBC/ SHEETAL PATEL
నీలేశ్ కుంభానీ నామినేషన్ ఎందుకు రద్దైంది?
సూరత్‌లో ఓటింగ్ వరకూ వెళ్లకముందే ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలేశ్ కుంభానీ నామినేషన్ పత్రాలపై మొదట్నుంచీ బీజేపీ అభ్యంతరం వ్యక్తంచేసింది.
నీలేశ్ నామినేషన్ పత్రాల్లోని ప్రపోజర్ల సంతకాలు చెల్లవని బీజేపీ ఆరోపించింది. దీనిపై ముఖేష్ ఎలక్షన్ ఏజెంట్ దినేశ్ జోధానీ ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు.
రెండు వర్గాల వాదనలపై రిటర్నింగ్ అధికారి ఆదివారం విచారణ చేపట్టారు. అనంతరం తన తీర్పును వెల్లడించారు.
నీలేశ్ కుంభానీకి మద్దతుదారులుగా సంతకాలు పెట్టినట్లు కనిపిస్తున్న నలుగురిలో ముగ్గురు తాము ఆ ఫామ్‌పై సంతకాలు పెట్టలేదని ఎన్నికల అధికారి ముందు అఫిడవిట్లు సమర్పించారు.
అనంతరం ఈ విషయంపై వివరణ ఇవ్వాలని నీలేశ్ కుంభానీకి కలెక్టరు సూచించారు. ఏప్రిల్ 21 ఆదివారం ఉదయం 11లోగా స్పందించాలని సూచించారు.
నీలేశ్ కుంభానీ మద్దతుదారులుగా సంతకాలు పెట్టినవారిలో రమేశ్‌భాయ్ బల్వంత్‌భాయ్ పోల్రా, జగదీశ్ నంజిభాయ్ సావలియా, ధ్రువిన్ ధీరుభాయ్ ధమేలియా ఉన్నారు. వీరిలో జగదీశ్.. నీలేశ్‌కు బావ వరుస అవుతారు. ధ్రువిన్ మేనల్లుడు, రమేశ్ పోల్రా ఆయన బిజినెస్ పార్ట్‌నర్.
ఆ ముగ్గురు నీలేశ్‌కు ఆప్తులే. అసలు ఎందుకు వారు ఇలా చేశారోనని చాలా మంది ప్రశ్నలు సంధిస్తున్నారు. అయితే, ఆ ముగ్గురూ మీడియాతో మాట్లాడటం లేదు.

ఫొటో సోర్స్, BHARGAV PARIKH/BBC
ఆ తర్వాత ఏం జరిగింది?
తమ అభ్యర్థుల మద్దతుదారులను కొందరు కిడ్నాప్ చేశారని కాంగ్రెస్, ఆప్ నాయకులు ఆరోపిస్తున్నారు.
ఈ విషయంపై ఆప్ నాయకుడు గోపాల్ ఇటాలియా మాట్లాడుతూ.. ‘‘నీలేశ్ మద్దతుదారులను కిడ్నాప్ చేసి ఒక రహస్య ప్రాంతానికి తీసుకెళ్లారు. వారి ఫోన్లను కూడా తీసేసుకున్నారు. భయపెట్టి వారి నుంచి అఫిడవిట్లను తీసుకున్నారు. వీటినే కలెక్టర్ ఆఫీసులో సమర్పించారు’’ అని ఆరోపించారు.
మరోవైపు తన మద్దతుదారులను కిడ్నాప్ చేశారని ఉమ్రా పోలీస్ స్టేషన్‌లో నీలేశ్ ఫిర్యాదు కూడా చేశారు.
అయితే, ఈ విషయంపై బీజేపీ నాయకుడు, సూరత్ మాజీ మేయర్ జగదీశ్ పటేల్ మాట్లాడుతూ.. ‘‘ఎన్నికలు వచ్చినా లేదా ఏదైనా కార్యక్రమాలు జరిగినా కాంగ్రెస్ పని బీజేపీకి వ్యతిరేకంగా విమర్శలు చేయడమే. ఆ అఫిడవిట్లను అందరిముందే సమర్పించారు. నిజానికి ఆ మద్దతుదారులంతా కాంగ్రెస్ వారే. ఆ ఫామ్‌లు కూడా వారు సమర్పించినవే. దీనిలో బీజేపీ చేసేది ఏముంటుంది?’’ అని ఆయన ప్రశ్నించారు.
ఇవి కూడా చదవండి:
- ఇరాన్ ఎందుకు ఇజ్రాయెల్‌పై దాడులు చేసింది? ఆరు ప్రశ్నలు, సమాధానాలు..
- వెయ్యేళ్ల నాటి ఈ అస్థిపంజరం కోసం నాజీలు, సోవియట్లు ఎందుకు పోరాడారు?
- గాజా యుద్ధం: ఇజ్రాయెల్‌కు ఆయుధాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి?
- ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు: వైసీపీకి చిక్కవు, టీడీపీకి దొరకవు
- 'ఇంట్లో చొరబడి చంపేస్తాం' అన్న మోదీ వ్యాఖ్యలపై అమెరికా ఏమందంటే..
బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














