ఆంధ్రప్రదేశ్: పల్నాడులో ఎన్నికలంటే భయపడాల్సిందేనా?

- రచయిత, శంకర్ వడిశెట్టి
- హోదా, బీబీసీ ప్రతినిధి
కొన్ని దశాబ్దాల కిందట ఆంధ్రప్రదేశ్‌లోని పల్నాడు ప్రాంతంలో నిత్యం గ్రూపు గొడవలు, రాజకీయ హత్యలు, కొట్లాటలు జరిగేవి.
మధ్యలో కొన్నేళ్ల పాటు ప్రశాంత వాతావరణం కనిపించింది. కానీ గత కొంతకాలంగా వాటి తీవ్రత పెరుగుతోంది.
ఈ ఎన్నికల్లో పల్నాడులో మరోసారి ఉద్రిక్త వాతావరణం కనిపిస్తోంది.
పల్నాడులో ఈ ఘటనలు సంచలనం
ప్రస్తుత పల్నాడు జిల్లా నరసరావుపేట కేంద్రంగా రాజకీయాల్లోకి వచ్చి హోంమంత్రి వరకు ఎదిగిన కోడెల శివప్రసాద్ ఇంట్లో బాంబు పేలుళ్ల ఘటన దేశమంతా సంచలనంగా మారింది.
1999 ఎన్నికల ముంగిట ఆయన ఇంట్లో బాంబు పేలి నలుగురు అనుచరులు చనిపోయారు. ఈ కేసు విచారణ ఎటూ తేల్చకుండా ఆగిపోయింది.
ఆ తర్వాత 1991 ఎంపీ ఎన్నికల సమయంలో వైఎస్సార్ కాన్వాయ్ మీద కుంకలగుంట సమీపంలో బాంబు దాడి యత్నం జరిగింది.
మాచర్ల కేంద్రంగా ఫ్యాక్షన్ గొడవలు జరిగాయి. ఏడు ఫ్యాక్షన్ హత్యలుగా పిలిచే కేసు అందులో ఒకటి.
2001 మార్చి 10న దుర్గి సమీపంలో జరిగిన దాడిలో ఏడుగురు ప్రత్యర్థులను నరికి చంపిన ఘటన కలకలం రేపింది.
నరసరావుపేటలో కోర్టుకి వెళ్లి తిరిగి వస్తుండగా, మార్గమధ్యలో దుర్గి మండలం ఆత్మకూరు వద్ద దారి కాచి జూలకంటి సాంబిరెడ్డి సహా అతని అనుచరులను హత్య చేశారు.
అంతకుముందు సాంబిరెడ్డి వర్గీయులు హనిమిరెడ్డిని హత్య చేయడంతో, దానికి ప్రతీకారంగా జరిగిన ఈ హత్యలు సంచలనం సృష్టించాయి.
ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న జూలకంటి బ్రహ్మారెడ్డి ప్రస్తుతం మాచర్లలో టీడీపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ఆ ఘటన తర్వాత చాలాకాలం పాటు రాజకీయాలకు దూరంగా ఉన్న ఆయన నాలుగేళ్ల క్రితం మరోసారి తెరమీదకు వచ్చారు.

ఫొటో సోర్స్, Getty Images
పల్నాడు ఫ్యాక్షన్ చరిత్ర
2001 తరువాత కొంతకాలం పల్నాడులో వర్గపోరు, రాజకీయ హత్యలు తగ్గాయి. కానీ ఇప్పుడు మళ్లీ పెరుగుతున్నాయి.
"పల్నాడు ఫ్యాక్షన్‌కి చాలా చరిత్రే ఉంది. 2001 తర్వాత కొంత సద్దుమణిగింది. ఓ వర్గం ప్రత్యక్ష రాజకీయాలకు దూరం కావడం అందుకు ప్రధాన కారణం. మాచర్లలో పిన్నెల్లి కుటుంబం పూర్తిగా ఆధిపత్యం సాధించేందుకు అవకాశం దక్కింది.
కానీ ప్రస్తుతం ప్రతిఘటన మొదలయ్యింది. ఇది ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందోననే భయం చాలామందిలో ఉంది. పరిస్థితిని పూర్తిగా అదుపులో ఉంచేలా ఇరువర్గాలు సంయమనం పాటించాలి. లేదంటే మళ్లీ పూర్వపు పరిస్థితి రావొచ్చు" అని సీనియర్ జర్నలిస్ట్ ఆర్ రామారావు అన్నారు.
పల్నాడులో ప్రస్తుతం మాచర్ల కేంద్రంగానే హింసాత్మక ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయని ఆయన అన్నారు.
పల్నాడు జిల్లా పరిధిలో నరసరావుపేట, చిలకలూరిపేట, పెదకూరపాడు, సత్తెనపల్లి నియోజకవర్గాల్లో ఫ్యాక్షన్ ప్రభావం కాస్త తక్కువే.
కొన్ని ఘటనలు మినహా నిత్యం బిక్కుబిక్కుమంటూ గడపాల్సిన పరిస్థితి కనిపించదు.
వినుకొండ, గురజాల, మాచర్ల మాత్రం అందుకు పూర్తి భిన్నం. దానికి అనేక కారణాలు ఉన్నాయి. ఇరు పార్టీల తరుపున బలమైన నేతలు ప్రాతినిధ్యం వహిస్తుండడం కూడా ఒక కారణం.
పై చేయి కోసం చేసే ప్రయత్నాల్లో ఇరు వైపుల నుంచి ప్రయత్నాలు ముమ్మరంగా ఉంటాయి. పట్టు సడలకూడదని ఒకరు, పట్టు సాధించాలని మరొకరు ప్రయత్నిస్తూ పల్లెల్లో వైషమ్యాలు రాజేస్తున్నారనే వాదన ఉంది.

మాచర్ల నియోజకవర్గంలో ఫ్యాక్షన్ గొడవలు
2019 సాధారణ ఎన్నికల్లో సత్తెనపల్లి నుంచి బరిలో ఉన్న కోడెల శివప్రసాద్‌పై ఇనిమెట్ల పోలింగ్ బూత్ వద్ద దాడి జరిగింది. ఆయన మీద భౌతికంగా దాడి చేసి, చొక్కా చింపేసిన తీరు సంచలనంగా మారింది. అప్పటికీ ఆయన ఏపీ అసెంబ్లీ స్పీకర్‌గా ఉన్నారు.
జంగమహేశ్వర పాడు, పిన్నెల్లి, గుళ్లపాడు, మిరియాల, కండ్లకుంటతో పాటుగా మాచర్ల మునిసిపల్ కేంద్రంలో కూడా ఫ్యాక్షన్ ప్రభావం ఉంటుంది. ప్రత్యర్థుల మీద ప్రతీ సందర్భంలోనూ దాడులు చేస్తున్న ఘటనలు కనిపిస్తాయి.
మునిసిపల్ ఎన్నికల సమయంలో ప్రచారానికి వెళ్లిన విజయవాడకు చెందిన టీడీపీ నాయకులు బొండా ఉమా, బుద్ధా వెంకన్న వంటి వారి వాహనాల మీద దాడులు జరిగాయి. బహిరంగంగానే వారిని అడ్డుకుని, దాడులకు పాల్పడడం అప్పట్లో కలకలం రేపింది.
ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత కూడా గడిచిన నెల రోజుల్లో ఒకరు హత్యకు గురయ్యారు. కాకానివారిపాలెంలో టీడీపీ కార్యకర్త సమర్పణరావు ఇంటిపై దాడి చేసి ఇల్లంతా ధ్వంసం చేశారు.
నరమాలపాడులో టీడీపీ అభ్యర్థి జూలకంటి బ్రహ్మానందరెడ్డి ప్రచారానికి ట్రాక్టర్ అడ్డుపెట్టి ఆటంకం కల్పించారు.
రెంటచింతలలో ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయులు ప్రచార రథంపై దాడి జరిగింది.
కొత్తపుల్లారెడ్డి గూడెంలో జనసేన పార్టీకి చెందిన కేతావత్ వెంకటశ్వర్లు నాయక్ టీడీపీ ప్రచారంలో ఉన్నారనే కారణంతో దాడి చేయడంతో తల పగిలింది.
మాచర్లలో టీడీపీ కార్యకర్త కారు తగులబెట్టిన ఘటనలో పోలీసుల వైఫల్యం మీద ఈసీ కూడా సీరియస్ అయ్యింది.
మాచర్ల నియోజకవర్గంలోని వెల్దుర్తి, దుర్గి, కారంపూడి మండలాల్లోని పదుల గ్రామాల్లో 2019లో కూడా ఎన్నికల హింస ఎక్కువగా నమోదయ్యింది.
ఎన్నికల ఫలితాల తర్వాత పరిస్థితి మరింత తీవ్రమయ్యింది. మాచర్ల నియోజకవర్గంలో వందల కుటుంబాలు తమ గ్రామాలు ఖాళీ చేయాల్సి వచ్చింది. ప్రతిపక్షాలకు సహకరించిన, సానుభూతిపరులుగా ఉన్న వారు ఊరొదిలి వెళ్లిపోయారు.
వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలాంటి పరిస్థితి వచ్చిందని అప్పట్లో టీడీపీ ఆందోళన చేసింది. బాధితుల కోసమంటూ గుంటూరులో శిబిరం కూడా ఏర్పాటు చేసింది.
జాతీయ మానవ హక్కుల సంఘానికి చేసిన ఫిర్యాదుతో ఎన్‌హెచ్‌ఆర్‌ఏ అధికారులు కూడా స్పందించారు.
గడిచిన ఐదేళ్లలో ఒక్క మాచర్ల నియోజకవర్గంలోనే వివిధ ఘటనల్లో 24మంది హత్యకు గురయినట్టు పోలీసు రికార్డులు చెబుతున్నాయి.
చనిపోయిన వారిలో 18 మంది తమ కార్యకర్తలేనని టీడీపీ చెబుతుండగా, తమ కార్యకర్తలు కూడా హత్యా రాజకీయాలకు బలయ్యారని వైఎస్సార్సీపీ అంటోంది.
రాజకీయ కారణాలతో ఇలాంటి దాడులు, ప్రతిదాడులతో పల్నాడు ప్రాంతం రక్తమోడుతోంది.
ప్రస్తుతం ఎన్నికల వేళ ఈ రాజకీయ హింస ఎంతమేరకు కట్టడి చేయగలరన్నది అనుమానాలు రేకెత్తిస్తోంది.
తన విధుల నిర్వహణలో విఫలమయ్యారంటూ పల్నాడు జిల్లా ఎస్పీ రవిశంకర్ రెడ్డిని ఈసీ బదిలీ చేసింది. దాంతో ఈ వ్యవహారం పోలీసులకు కూడా సవాల్‌గా మారింది.

ఫొటో సోర్స్, FACEBOOK/PALANATIPULI.DRKODELASIVAPRASADARO
పల్నాడులో ఫ్యాక్షన్ గొడవలకు కారణమేంటి?
పల్నాడు జిల్లాలో ఫ్యాక్షన్ ప్రభావం కొనసాగుతుండడానికి రాజకీయ నేతలే కారణమని వినుకొండకు చెందిన సామాజిక కార్యకర్త ఆర్ రాజేష్ అన్నారు.
"ఎన్నికలు వస్తున్నాయంటే భయమే. ప్రతీసారీ ఇంతే. మొన్నటి స్థానిక ఎన్నికల్లో మరింత ఘోరంగా కనిపించింది. ప్రతిపక్ష ఓటర్లు అని అనుమానం వస్తే వారు బూత్‌ల వరకు రాకుండా అడ్డుకున్న సందర్భాలు ఉన్నాయి. భయపడి కొందరు ఓటు వేయడానికి కూడా రాలేదు. ఈసారి పరిస్థితి మరింత తీవ్రంగా కనిపిస్తోంది. పోటీ ఎక్కువగా ఉంది. దాంతో ఇంకెంత ఎన్నికల హింస జరుగుతుందోననే సందేహాలు అందరిలో ఉన్నాయి" అంటూ ఆయన అభిప్రాయపడ్డారు.
పై స్థాయి అధికారులు ఎన్ని ప్రకటనలు చేసినా, క్షేత్రస్థాయి సిబ్బంది మాత్రం ఏకపక్షంగా వ్యవహరించిన ఘటనలు అనేకం ఉన్నాయని ఆయన తెలిపారు. అదనపు బలగాలను రంగంలో దింపిన నేపథ్యంలో పూర్తిగా స్థానికేతరులతో ఎన్నికలు నిర్వహిస్తుండటం వల్ల కొంత ఉపయోగం ఉంటుందని అన్నారు.
"అధికారం, ఆధిపత్యం కోసం ఎన్నికల రోజు జరిగే హింస ప్రభావమే ఏళ్ల తరబడి గ్రామాల్లో కొనసాగుతోంది. ఎన్నికల్లో దాన్ని అదుపు చేస్తే పల్లెలు మళ్లీ సాధారణ స్థితికి వస్తాయి. కానీ నాయకులు మాత్రం అనుచరులను రెచ్చగొట్టి, తమ పబ్బం గడుపుకునే పనిలో ఉన్నారు'' అని రాజేశ్ చెప్పారు.

పావు శాతం పోలింగ్ కేంద్రాలు సమస్యాత్మకమే
పల్నాడు జిల్లాలో సమస్యాత్మక, అతి సమస్యాత్మక గ్రామాలను కూడా గుర్తించారు.
జిల్లావ్యాప్తంగా 1926 పోలింగ్ కేంద్రాలు ఉండగా, వాటిలో గత చరిత్ర ఆధారంగా 445 పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మక, అతి సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుగా గుర్తించారు.
అంటే దాదాపు పావు వంతు పోలింగ్ కేంద్రాలలో పరిస్థితి అదుపులో ఉంచడం మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది.
మాచర్లలో అయితే 299 పోలింగ్ కేంద్రాలకు గానూ 136 పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మక, అతి సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించాల్సి వచ్చింది.
గురజాలలో 304కి 145 పోలింగ్ కేంద్రాలు ఆ జాబితాలో ఉన్నాయి. ఆ ప్రాంతంలో ఫ్యాక్షన్ తగాదాలు సహా వివిధ కారణాలతో ఎన్నికల హింసకు ఎక్కువ ఆస్కారముందని భావిస్తున్నారు. ఇప్పటికే అదనపు బలగాలను కూడా రంగంలో దింపారు.

పోలీసులు ఏం చెబుతున్నారు?
2019 సాధారణ ఎన్నికలు, 2021-22 స్థానిక ఎన్నికల నాటి అనుభవాలతో పగడ్బందీగా రంగంలో దిగుతున్నట్టు పోలీస్ యంత్రాంగం చెబుతోంది.
ఈసారి ఎన్నికల హింసను నియంత్రించడం మీద ఎక్కువగా దృష్టి కేంద్రీకరించామని నరసరావుపేట ఎస్పీ గరికపాటి బిందు మాధవ్ చెబుతున్నారు.
"గత అనుభవాలున్నాయి. పరిస్థితిలో కొంత మార్పు వస్తోంది. యువత ఫ్యాక్షన్ గొడవలపై అంతగా శ్రద్ధ చూపడం లేదు. అందరూ స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పిస్తాం. ఇప్పటికే అనుమానితులుగా ఉన్న రౌడీషీటర్ల మీద ప్రత్యేక నిఘా పెట్టాం. కొన్ని చోట్ల బైండోవర్లు కూడా చేస్తాం.
స్వల్పంగా కొన్ని ఘటనలు జరుగుతున్నా, ప్రస్తుతం అంతా నియంత్రణలో ఉంది. అతి సమస్యాత్మక గ్రామాలకు అదనపు బలగాలు వచ్చాయి. స్థానిక అధికారులతో సమన్వయం చేసుకుని ఈసారి సామరస్యంగా ఎన్నికల ప్రక్రియ జరిగేలా చూస్తాం" అని చెప్పారు ఎస్పీ బిందు మాధవ్.
రాజకీయ కక్షలు, కార్పణ్యాలతో హింసను ప్రేరిపించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, ఓటర్లకు ఆటంకం కల్పిస్తే సహించబోమని ఆయన బీబీసీతో అన్నారు.
కొంతకాలంగా ఫ్యాక్షన్ గొడవలు చేస్తున్న వారిపై ప్రత్యేక దృష్టి పెట్టడం ద్వారా ఎన్నికల హింస, ఫ్యాక్షన్ తగాదాల నియంత్రణకు పోలీస్ యంత్రాంగం ప్రయత్నిస్తోంది.
అదే సమయంలో తమ పట్టు నిలుపుకోవడం కోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నట్టు రాజకీయ పార్టీలు కనిపిస్తున్నాయి.
ఈ పరిస్థితుల మధ్య ఎన్నికలు ముగిసే వరకు పల్నాడు ప్రాంతంలో ఎప్పుడు ఏం జరుగుతుందో అనే టెన్షన్ పెరుగుతోంది.
ఇవి కూడా చదవండి:
- 4.7 కోట్ల ఏళ్లనాటి వాసుకి పాము అవశేషాలు వెలుగులోకి.. అసలేంటి ఈ పాము కథ?
- అడాల్ఫ్ హిట్లర్ కోసం ఆ మహిళలు కన్న వేలమంది ‘ఆర్య పుత్రులు’ ఏమయ్యారు?
- హెపటైటిస్: మొత్తం కేసులలో 11 శాతం భారత్‌లోనే.. అసలేమిటీ వ్యాధి, ఎందుకొస్తుంది, చికిత్స లేదా?
- SRH vs DC: ఏంటా కొట్టుడు! భయంతో హెల్మెట్లు పెట్టుకున్న బాల్ బాయ్స్..
- సీతాదేవి: రెండో పెళ్లి కోసం ఇస్లాం మతంలోకి మారిన ఈ పిఠాపురం యువరాణి కథ ఏంటి?
బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














