నెస్లే బేబీ ఫుడ్‌లో చక్కెరను అధికంగా కలుపుతోందా? పరీక్షల్లో ఏం తేలింది? ప్రభుత్వం ఎందుకు పట్టుకోలేకపోయింది?

నెస్లే

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, అనఘా పాఠక్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

నెస్లే ఇండియా ట్విటర్ బయోలో, ‘‘జీవన నాణ్యతను మెరుగుపరిచి, ఆరోగ్యకర భవిష్యత్‌కు దోహదపడటం’’ అని రాసి ఉంటుంది.

గురువారం నుంచి ఈ వ్యాఖ్యపై ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. అల్పాదాయ దేశాల్లోని మార్కెట్లలో చాలావరకు సెరిలాక్, నిడో (పాల పొడి) ఉత్పత్తుల్లో యాడెడ్ షుగర్ ఉన్నట్లు, అది చాలా అధిక స్థాయిలో ఉన్నట్లు స్విస్ దర్యాప్తు ఏజెన్సీ పబ్లిక్ ఐ, ఇంటర్నేషనల్ బేబీ ఫుడ్ యాక్షన్ నెట్‌వర్క్ (ఐబీఎఫ్‌ఏఎన్) ఒక నివేదికను ప్రచురించింది. అప్పటినుంచి నెస్లే సంస్థ వార్తల్లో నిలిచింది.

నెస్లే భారత్‌లోని అన్ని రకాల బేబీ సిరియల్స్ ఉత్పత్తుల్లో ప్రతీ సర్వింగ్‌కు 2.7 గ్రాముల చొప్పున చక్కెరను కలుపుతుందని ఆ నివేదికలో పేర్కొన్నారు.

అయితే, నెస్లేకు ప్రధానమైన యూరప్ మార్కెట్లలోని పిల్లల (12-36 నెలల శిశువులు) కోసం చేసిన ఆహార ఉత్పత్తుల్లో ఎలాంటి యాడెడ్ షుగర్లు లేవు.

అయితే, ఏడాది కంటే ఎక్కువ వయస్సున్న పిల్లల కోసం చేసిన కొన్ని సిరియల్స్‌లో యాడెడ్ షుగర్లు ఉండగా, ఆరునెలల పిల్లల కోసం తయారుచేసిన సిరియల్స్‌లో ఎలాంటి యాడెడ్ షుగర్లు లేవు.

ఈ విషయం భారత్‌లో పెద్ద చర్చకు దారి తీసింది. భారత ఆహార నియంత్రణ సంస్థ అయిన ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) ఈ అంశాన్ని పరిశీలనలోకి తీసుకుంటామని చెప్పింది.

నెస్లే

ఫొటో సోర్స్, Getty Images

ఈ నివేదికను ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ పరిశీలిస్తోందని, తర్వాత దాన్ని ఒక సైంటిఫిక్ ప్యానెల్‌కు పంపిస్తుందని వార్తా సంస్థ ఏఎన్‌ఐ తెలిపింది.

నెస్లే తయారు చేసిన శిశువుల ఆహార ఉత్పత్తుల్లోని చక్కెర స్థాయిలపై వస్తోన్న ఆందోళనలను క్షుణ్ణంగా సమీక్షించాలని ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐని నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ (ఎన్‌సీపీసీఆర్) కోరింది.

ఈ పరిణామాల నేపథ్యంలో నెస్లే ఇండియా కంపెనీ ఒక ప్రకటనను విడుదల చేసింది. ‘‘గత అయిదేళ్లలో ఆహార వేరియంట్ ఆధారంగా మేం యాడెడ్ షుగర్ల స్థాయిని 30 శాతం వరకు తగ్గించాం. మేం తరచుగా మా ఉత్పత్తులను సమీక్షిస్తాం. పోషకాలు, నాణ్యత, ఆహార భద్రత, రుచి వంటి విషయాల్లో రాజీ పడకుండా యాడెడ్ షుగర్ స్థాయిలను మరింత తగ్గించేలా మా ఉత్పత్తులను కొత్తగా తయారుచేయడాన్ని కొనసాగిస్తాం. భారత్‌లో తయారయ్యే మా ఉత్పత్తులన్నీ కచ్చితంగా సీఓడీఈఎక్స్ ప్రమాణాలకు అనుగుణంగా ఉండేలా చూస్తాం. పోషకాలు, యాడెడ్ షుగర్ల విషయంలో స్థానిక ప్రమాణాలను పాటిస్తాం’’ అని ఆ ప్రకటనలో పేర్కొంది. నెస్లే ఇండియా ప్రకటనను పలు మీడియా సంస్థలు ప్రచురించాయి.

ప్రపంచవ్యాప్తంగా బేబీ ఫుడ్ మార్కెట్‌లో నెస్లే వాటా 20 శాతం ఉంటుందని, దాని విలువ 70 బిలియన్ డాలర్లు అని నివేదికలో పేర్కొన్నారు. భారత్‌లో నెస్లే కంపెనీకి చెందిన ‘సెరిలాక్’ అమ్మకాలు 2022లో 250 మిలియన్లు దాటాయని వెల్లడించింది.

నెస్లే

ఫొటో సోర్స్, Getty Images

పరిశోధకులు ఎవరు?

స్విట్జర్లాండ్‌కు చెందిన ఒక స్వచ్ఛంద సంస్థ ‘పబ్లిక్ ఐ’. ‘‘స్విట్జర్లాండ్, దానికి చెందిన కంపెనీలు ఆర్థికంగా వెనుకబడిన దేశాలపై చూపే ప్రభావం గురించి విమర్శనాత్మక విశ్లేషణను పబ్లిక్ ఐ అందిస్తుంది. పరిశోధన, న్యాయసలహా, ప్రచారాల ద్వారా ప్రపంచ వ్యాప్తంగా పర్యావరణం, మానవ హక్కుల గౌరవాన్ని పబ్లిక్ ఐ డిమాండ్ చేస్తుంది’’ అని తన వెబ్‌సైట్‌లో పబ్లిక్ ఐ పేర్కొంది.

చమురు అవినీతి, ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయ ఆర్థిక వ్యవస్థ, యుక్రెయిన్ యుద్ధానికి సంబంధించిన అంశాలపై కూడా గతంలో పబ్లిక్ ఐ నివేదికలు ప్రచురించింది.

ఇంటర్నేషనల్ బేబీ ఫుడ్ యాక్షన్ నెట్‌వర్క్ (ఐబీఎఫ్‌ఏఎన్) సహాయంతో నెస్లే ఆహార ఉత్పత్తులపై పబ్లిక్ ఐ సంస్థ పరిశోధనలు చేసింది. శిశువులు, బాలల అనారోగ్యం, మరణాల రేటును తగ్గించడానికి ప్రపంచవ్యాప్తంగా కృషి చేస్తోన్న ప్రజా ప్రయోజన గ్రూపుల కూటమి ఇంటర్నేషనల్ బేబీ ఫుడ్ యాక్షన్ నెట్‌వర్క్.

నెస్లే

ఫొటో సోర్స్, Getty Images

నివేదికలో వెల్లడైన అంశాలు ఏంటి?

ఆఫ్రికా, ఆసియా, లాటిన్ అమెరికాలోని ప్రధాన మార్కెట్లలో నెస్లే కంపెనీ విక్రయించే 115 ఉత్పత్తులను పబ్లిక్ ఐ, ఐబీఎఫ్‌ఏఎన్ సంస్థలు పరీక్షించి ఈ పరిశోధనాత్మక నివేదికను ప్రచురించాయి. ఈ ఉత్పత్తుల్లో 94 శాతం అంటే, 108 ఆహార పదార్థాల్లో యాడెడ్ షుగర్ ఉన్నట్లు వారి పరిశీలనలో తేలింది.

ఒక సర్వింగ్‌కు సగటున 4 గ్రాముల యాడెడ్ షుగర్ ఉన్నట్లు, ఫిలిప్పీన్స్‌లో ఆరు నెలల పిల్లల కోసం విక్రయిస్తోన్న ఆహార ఉత్పత్తుల్లో ఒక సర్వింగ్‌కు అత్యధికంగా 7.3 గ్రాములు యాడెడ్ షుగర్ ఉన్నట్లు నివేదికలో వారు పేర్కొన్నారు.

ఆహార ఉత్పత్తుల్లో అధిక యాడెడ్ షుగర్‌లు ఉన్న ఇతర దేశాలు

  • నైజీరియా: ప్రతీ సర్వింగ్‌కు 6.8 గ్రాములు
  • సెనెగల్: ప్రతీ సర్వింగ్‌కు 5.9 గ్రాములు
  • వియత్నాం: ప్రతీ సర్వింగ్‌కు 5.5 గ్రాములు
  • ఇథియోపియా: ప్రతీ సర్వింగ్‌కు 5.2 గ్రాములు
  • దక్షిణాఫ్రికా: ప్రతీ సర్వింగ్‌కు 4.2 గ్రాములు

భారత్‌లోని ఆహార ఉత్పత్తుల ప్యాకెట్ల మీద యాడెడ్ షుగర్ల శాతాన్ని పేర్కొన్నారని నివేదికలో తెలిపారు. కానీ, చాలా ఆఫ్రికన్, లాటిన్ అమెరికా దేశాల్లో ఈ సమాచారాన్ని ప్యాకెట్ల మీద రాయలేదని నివేదిక పేర్కొంది.

నెస్లే కంపెనీ తన వెబ్‌సైట్‌లో ‘చక్కెరకు దూరంగా ఉండండి’ అని పేర్కొనడం హాస్యాస్పదం.

‘‘మీ బిడ్డకు కొత్త రుచులను, ఆహారాలను అలవాటు చేసేందుకు 10 మార్గాలు’’ అనే పేరుతో నెస్లే వెబ్‌సైట్‌లో ప్రచురించిన ఒక కథనంలో, ‘‘పిల్లల కోసం తయారు చేసే ఆహారంలో చక్కెర వాడొద్దు. పిల్లలకు చక్కెరతో ఉండే పానీయాలు ఇవ్వొద్దు’’ అంటూ సిఫార్సు చేసింది.

నెస్లే

ఫొటో సోర్స్, Getty Images

‘‘డబుల్ స్టాండర్డ్స్’’

ప్రపంచవ్యాప్తంగా తమ అన్ని ఉత్పత్తుల్లో నెస్లే, చక్కెర జోడించడం లేదని నివేదిక ద్వారా తెలుస్తోంది. స్విట్జర్లాండ్, జర్మనీ, ఫ్రాన్స్, యూకే వంటి యూరోపియన్ దేశాల్లో అమ్మే సిరియల్స్‌లో చక్కెరను కలపలేదు. ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికాలోని ఆర్థికంగా వెనుకబడిన దేశాల్లో విక్రయించే ఉత్పత్తుల్లో అధిక స్థాయిలో చక్కెర ఉన్నాయి.

ఇది నెస్లే ద్వంద్వ ప్రమాణాలపై పెద్ద చర్చకు దారితీసింది. అల్పాదాయ దేశాలను నెస్లే ఎందుకు భిన్నంగా చూస్తోందంటూ చర్చలకు దారి తీసింది.

ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ మాజీ సభ్యుడు, ఫుడ్ పాలసీ నిపుణుడు బేజోన్ మిశ్రా ఈ అంశం గురించి స్పందించారు.

ఆహార భద్రత విషయంలో భారత ప్రభుత్వానికి కఠిన నిబంధనలు లేవని ఆయన భావిస్తున్నారు.

అధికాదాయ, అల్పాదాయ దేశాలను నెస్లే భిన్నంగా చూస్తుందనేది నిజం, కానీ, వారు అలా చేయడానికి మనమే అనుమతిస్తున్నామని ఆయన వివరించారు.

‘‘ప్రభుత్వ నియంత్రణ యంత్రాంగం చాలా యాదృచ్ఛికంగా ఉంటుంది. వారు పరీక్షల కోసం అస్తవ్యస్తంగా శాంపిల్స్ తీసుకుంటారు. వాటి ఫలితాలు కూడా పారదర్శకంగా ఉండవు. ఆహార ఉత్పత్తుల్లో చక్కెరలు ఎంత జోడించాలనే దానిపై మనకు నిబంధనలు ఉన్నప్పటికీ, వాటి సెట్ టోలరెన్స్ పరిమితి చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది కంపెనీలు అధిక యాడెడ్ షుగర్‌లు జోడించేందుకు అనుమతిస్తుంది’’ అని ఆయన వివరించారు.

థర్డ్ పార్టీ పరిశోధనపై భారత ఆహార సంస్థ ఎందుకు ఆధారపడుతుందనే ప్రశ్నకు కూడా ఆయన బదులిచ్చారు.

‘‘నిజానికి ఇలాంటి అధ్యయనాల్ని ప్రభుత్వ సంస్థలు చేయాలి. పౌరుల ఆరోగ్యం, భద్రతా ప్రమాణాలను నిర్దేశించడం ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ పని. ఈ నిబంధనలను అమలు చేయడంలోనే పెద్ద సమస్య వస్తుంది. ఈ ఉత్పత్తి మార్కెట్‌లో ఎందుకు అందుబాటులో ఉంది. మార్కెట్‌లో ఏదైనా ఉత్పత్తి అందుబాటులో ఉందంటే ప్రభుత్వం దాన్ని పరిశీలించి, ఆమోదించి ఉంటుందనే సగటు తల్లిదండ్రులు అనుకుంటారు’’ అని ఆయన అన్నారు.

పబ్లిక్ ఐ రిపోర్టులో పేర్కొన్న అంశాలపై ఎఫ్‌ఎస్‌ఎస్ఏఐ దర్యాప్తు చేస్తోంది.

స్పందన కోసం ఎఫ్‌ఎస్‌ఎస్ఏఐని బీబీసీ సంప్రదించింది. కానీ, వారినుంచి ఎలాంటి స్పందన రాలేదు.

నెస్లే

ఫొటో సోర్స్, Getty Images

పిల్లల ఆహారంపై ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ మార్గదర్శకాలు

ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) 2019లో ఆహార భద్రతా ప్రమాణాలను జారీ చేసింది.

పిల్లల ఆహారంలో ఏయే పదార్థాలు ఉండాలి? ఆహారాన్ని ఎలా ప్యాకింగ్ చేయాలి అనే అంశాల గురించి నిబంధనల్లో పేర్కొన్నారు.

దీనిలో ఒక నిబంధనలో ‘‘సుక్రోజ్, ఫ్రక్టోజ్‌లను కలపకూడదు. ఒకవేళ కార్బోహైడ్రేట్లలో భాగంగా వీటిని అందిస్తున్నట్లయితే, మొత్తం కార్బోహైడ్రేట్లలో వీటి వాటా 20 శాతానికి మించకూడదు’’ అని తెలిపారు.

‘‘లేబుల్‌పై పేర్కొన్న న్యూట్రియంట్లు లేదా న్యూట్రిషినల్ ఇంగ్రీడియంట్లలో కేవలం మైనస్ 10 శాతం వరకు తేడాలను మాత్రమే అనుమతిస్తారు. మొత్తంగా పోషక స్థాయిలు టేబుల్స్‌లో పేర్కొన్న గరిష్ఠ స్థాయికి మించకూడదు’’ అని కూడా నిబంధనల్లో పేర్కొన్నారు.

ఆ మార్గదర్శకాల్లో 50 పోషకాలు, ఫుడ్ అడిటివ్స్‌ల గరిష్ఠ పరిమితులను పేర్కొన్నారు. అయితే, ఇందులో షుగర్స్ గరిష్ఠంగా ఎంత ఉండాలో మాత్రం చెప్పలేదు.

దీనిపై బెజోన్ మిశ్ర మాట్లాడుతూ.. ‘‘ఈ విషయంలో నిబంధనలు ఉన్నాయి. అయితే, వాటిని పక్కాగా అమలు చేయాలి’’ అని అన్నారు.

షుగర్స్

ఫొటో సోర్స్, Getty Images

పిల్లల ఆరోగ్యంపై షుగర్ ఎలాంటి ప్రభావం చూపిస్తుంది?

ముంబయిలో డాక్టర్ రాజీవ్ కోవిల్ డయాబెటెస్ సెంటర్‌ను నడిపిస్తున్నారు. ‘‘పిల్లలకు సహజంగా ఇలాంటి రుచులు తినాలని ఏమీ ఉండదు. మీరు చిన్న వయసులోనే షుగర్‌ను వారికి తినిపించారంటే, వారిలో పెరిగేకొద్దీ షుగర్‌ను మరింత తీసుకోవాలనే కోరిక ఎక్కువుతుంది. మరోవైపు షుగర్‌కు అలవాటుపడిన పిల్లలు అన్నం, కూరగాయలు తినడానికి చాలా కష్టపడుతుంటారు. కొన్నిసార్లు అసలు అన్నం తిననని మారాం చేస్తుంటారు. చాలా మంది తల్లిదండ్రులు ఈ విషయంపై ఫిర్యాదులు చేస్తుంటారు. తమ పిల్లలు కేవలం మిల్క్ షేక్‌లు, చాక్లెట్లు, జ్యూస్‌లు మాత్రమే అడుగుతున్నారని చెబుతుంటారు’’ అని ఆయన చెప్పారు.

కొన్నిసార్లు షుగర్స్‌ను అధికంగా ఇవ్వడంతో పిల్లలు హైపర్ అగ్రేసివ్‌గా మారుతారని, వారిలో చికాకు కూడా పెరుగుతుందని ఆయన అన్నారు.

‘‘అందుకే రెండేళ్లలోపు పిల్లలకు అసలు యాడెడ్ షుగర్స్ ఇవ్వొద్దని మేం సూచిస్తాం’’ అని ఆయన తెలిపారు.

షుగర్స్‌కు పిల్లలు అలవాటు పడిపోయే ముప్పుంటుంది. దీని వల్ల వారి ఆరోగ్యం కూడా ప్రభావితం కావొచ్చని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

డాక్టర్ అభిషేక్ పింప్రాలేకర్ అపోలో హాస్పిటల్‌లో మధుమేహ నిపుణుడిగా పనిచేస్తున్నారు. ‘‘ప్రపంచానికి మధుమేహం, రక్తపోటుల రాజధానిగా భారత్ మారిపోతోంది. ప్రస్తుతం చాలా మంది టీనేజర్లు కూడా మధుమేహ బాధితులుగా మారుతున్నారు. దీనికి మూలాలు చిన్నప్పటి అలవాట్లలోనే ఉంటున్నాయి’’ అని ఆయన చెప్పారు.

‘‘షుగర్ అనేది ఆహారంలో అదనంగా కలిపేది మాత్రమే. అదిలేకపోయినా ఏం కాదు’’ అని ఆయన నొక్కిచెప్పారు.

షుగర్స్

ఫొటో సోర్స్, Getty Images

అతిగా షుగర్ తీసుకోవడంతో పిల్లల్లో ఊబకాయ సమస్య కూడా వస్తుందని డాక్టర్ కోవిల్ తెలిపారు.

‘‘ఊబకాయ చిన్నారుల్లో ప్రపంచంలోని తొలి ఐదు దేశాల్లో భారత్ కూడా ఉంది’’ అని ఆయన అన్నారు.

‘‘ప్రకృతిలో సహజసిద్ధంగా లభించే షుగర్స్ మనకు సరిపోతాయి. అన్నం, గోధుమలు, పళ్లలో సహజంగానే షుగర్స్ ఉంటాయి. వీటికి అదనంగా మీరు షుగర్స్ తీసుకోవాల్సిన పనిలేదు’’ అని ఆయన చెప్పారు.

ఆహారంపై లేబుల్స్‌ను జాగ్రత్తగా చదవాలని ఆయన తల్లిదండ్రులకు సూచిస్తున్నారు. ‘‘ఏదైనా బేబీ ఫుడ్‌లో యాడెడ్ షుగర్ ఉందంటే, దాన్ని పూర్తిగా పక్కన పెట్టేయడమే మంచిది’’ అని ఆయన అన్నారు.

‘‘ఇక్కడ ఫ్రక్టోస్, కార్న్, హైస్టార్చ్ లాంటి ఇతర షుగర్స్ కూడా ఉంటాయి. వీటిని అదనపు షుగర్లలో చూపించరు. నిజానికి ఇవి కూడా అదనపు షుగర్సే. కాబట్టి, ఫుడ్ లేబుల్స్‌పై వీటిని సరిగ్గా కలర్ కోడ్‌లతో చూపించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. పిల్లలకు ఏం ఇస్తున్నామో తల్లిదండ్రులకు కూడా అవగాహన ఉండాలి’’ అని ఆయన చెప్పారు.

అయితే, అసలు ప్రీమిక్స్‌లు, ప్యాకెడ్ ఫుడ్, రెడీ టు ఈట్ ఫుడ్‌లు పిల్లలకు ఇవ్వకపోవడమే మంచిదని డాక్టర్ పింప్రాలేకర్ చెప్పారు.

‘‘కొన్నిసార్లు షుగర్స్‌పై సమాచారాన్ని పైకి గుర్తించలేకుండా రాస్తుంటారు. ఉదాహరణకు కొన్నిరకాల బిస్కెట్లు మార్కెట్లో అందుబాటులో ఉంటున్నాయి. వీటిని డయాబెటెస్ ఫ్రెండ్లీగా చెబుతుంటారు. వీటిలో కూడా యాడెడ్ షుగర్స్ ఉంటాయి. అయితే, ఈ సమాచారం బిస్కెట్ ప్యాకెట్‌పై ఏదో ఒక మూలన రాస్తుంటారు. మీరు జాగ్రత్తగా వీటి కోసం వెతికినప్పుడు మాత్రమే ఇవి కనిపిస్తాయి’’ అని ఆయన తెలిపారు.

షుగర్స్

ఫొటో సోర్స్, Getty Images

డబ్ల్యూహెచ్‌వో మార్గదర్శకాలు

పిల్లలు, పెద్దవారికి రోజువారీగా శరీరానికి అందే ఎనర్జీలో ఫ్రీ షుగర్స్ 10 శాతం కంటే తక్కువే ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) సూచిస్తోంది. దీన్ని 5 శాతానికి తగ్గిస్తే, అంటే రోజుకు 6 స్పూన్లుకు పరిమితం చేస్తే ఇది ఆరోగ్యానికి మరింత మంచిదని చెబుతోంది.

ఒక టేబుల్ స్పూన్ కెచప్‌లో 4 గ్రాముల వరకూ ఫ్రీ షుగర్స్ ఉంటాయి. అదే షుగర్ సోడాల్లో ఇవి 40 గ్రాములు అంటే పది టీస్పూన్ల వరకూ ఉంటాయి.

షుగర్ డ్రింగ్స్‌ను ఎక్కువగా తీసుకునే పిల్లలు అతిబరువు లేదా ఊబకాయంతో బాధపడే అవకాశం ఎక్కువని డబ్ల్యూహెచ్‌వో పరిశోధనలు చెబుతున్నాయి.

మూడేళ్లలోపు చిన్నారులకు అయితే, అదనపు షుగర్స్ ఇవ్వొద్దని డబ్ల్యూహెచ్‌వో సూచిస్తోంది.

లాన్సెట్‌లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం, భారత్‌లో 11.4 శాతం మంది అంటే 10.1 కోట్ల మంది మధుమేహంతో బాధపడుతున్నారు.

భారత ఆరోగ్య మంత్రిత్వ శాఖ నిర్వహించిన సర్వేలోనూ దేశంలోని 13.6 కోట్ల మంది అంటే 15.3 శాతం మంది ప్రీ-డయాబెటెస్‌తో బాధపడుతూ ఉండొచ్చని తేలింది.

బాలల ఊబకాయం కూడా భారత్‌ను వేధిస్తున్న సమస్యల్లో ప్రధానమైనది.

జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (ఎన్ఎఫ్‌హెచ్ఎస్-5) ప్రకారం, భారత్‌లోని 23 శాతం మంది పురుషులు, 24 శాతం మంది మహిళల బాడీ మాస్ ఇండెక్స్ (బీఎంఐ) 25 లేదా అంతకంటే ఎక్కువే ఉంది. 2015-16తో పోలిస్తే ఇది 4 శాతం ఎక్కువ. మరోవైపు ఐదేళ్లలోపు చిన్నారుల్లో 3.4 శాతం మంది అతిబరువుతో జీవిస్తున్నారు. 2015-16లో ఇది కేవలం 2.1 శాతం మాత్రమే.

‘‘పిల్లల్లో ఊబకాయంతో మధుమేహం నుంచి కుంగుబాటు వరకూ చాలా సమస్యలు వస్తుంటాయి. టీనేజీ అమ్మాయిల్లో అయితే, పీసీవోడీ లేదా రుతుచక్రం ఆలస్యం కావడం లాంటి సమస్యలు కూడా కనిపిస్తాయి. ఊబకాయం మనల్ని చాలా రకాలుగా వేధిస్తోంది. ఈ సమస్యకు షుగర్స్ మరింత ఆజ్యం పోస్తున్నాయి’’ అని పింప్రాలేకర్ అన్నారు.

వీడియో క్యాప్షన్, చక్కిలిగింత పెడితే ఎందుకు నవ్వొస్తుంది?

ఇవి కూడా చదవండి:

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)