ముస్లింల గురించి ప్రధాని మోదీ కామెంట్స్.. తీవ్రంగా స్పందించిన కాంగ్రెస్

బాణాన్ని సంధిస్తున్న ప్రధాని మోదీ ఫోటో

ఫొటో సోర్స్, ANI

ప్రధాని నరేంద్ర మోదీ రాజస్థాన్‌లో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.

''తల్లుల వద్ద, అక్కచెల్లెళ్ళ వద్ద ఉన్న బంగారాన్ని కాంగ్రెస్ పార్టీ తీసుకుని చొరబాటుదారులకు పంపిణీ చేయాలని అనుకుంటోంది'' అని మోదీ ఆరోపించారు.

మోదీ తన ప్రసంగంలో ముస్లింల గురించి ప్రస్తావించారు.

దేశంలో ప్రధాని విద్వేష బీజాలు నాటుతున్నారని కాంగ్రెస్ విమర్శించింది.

‘‘తమ ఎన్నికల మేనిఫెస్టోలో హిందూ-ముస్లిం’ అని ఎక్కడ రాసి ఉందో చూపించాలని’’ కాంగ్రెస్ అధికార ప్రతినిధి పవన్ ఖేరా మోదీ ప్రసంగం ముగిసిన కొద్దిసేపటికే సవాల్ విసిరారు.

ర్యాలీ తరువాత ప్రధాని మాట్లాడుతూ ‘‘ప్రతి ఇంటికి గ్యాస్, నీరు ఇచ్చామని, ఇప్పుడు ప్రతి ఇంటిని సౌర విద్యుత్ నిలయంగా తీర్చిదిద్దుతామని’’ చెప్పారు.

ఉచిత రేషన్ పథకం రాబోయే ఐదేళ్లు కొనసాగుతుందని, దీని ద్వారా దళితులు, వెనుకబడిన వర్గాలకు ప్రయోజనం దక్కుతుందని అన్నారు.

దేశంలో బలమైన ప్రభుత్వం ఉండాల్సిన అవసరం ఉందని, సరిహద్దులను రక్షించడంతోపాటు, శత్రువులను తుదముట్టిస్తామని చెప్పారు.

‘‘ఇంతటి పెద్ద దేశాన్ని ఎటువంటి అనుభవం లేని వ్యక్తి చేతుల్లో పెడదామా?’’ అని మోదీ ప్రశ్నించారు.

ఎన్నికల ర్యాలీలో ప్రసంగిస్తున్న ప్రధాని మోదీ

ఫొటో సోర్స్, ANI

కాంగ్రెస్ మేనిఫెస్టోపై మోదీ విమర్శలు

మోదీ తన ప్రసంగంలో కాంగ్రెస్ మేనిఫెస్టోను లక్ష్యంగా చేసుకున్నారు.

దేశంలోని మహిళల బంగారం ఎంతుందో లెక్కించి, ఆ సంపదను కాంగ్రెస్ పార్టీ అందరికీ పంపిణీ చేయాలని చూస్తోందని మోదీ అన్నారు.

‘‘మన గిరిజన కుటుంబాలలో ఉన్న వెండిని లెక్కిస్తారు, మన సోదరిమణులకు ఉన్న బంగారాన్ని, అక్కడి ఆస్తులను అందరికీ సమానంగా పంపిణీ చేస్తారు. ఇది మీకు అంగీకారమేనా? మీ ఆస్తులను తీసుకునే హక్కు ప్రభుత్వానికి ఎక్కడుంది? మీ కష్టార్జితాన్ని స్వాధీనం చేసుకునే హక్కు ప్రభుత్వానికి ఉందా’’? అని మోదీ ప్రశ్నించారు.

‘‘కాంగ్రెస్ పార్టీ గతంలో అధికారంలో ఉన్నప్పుడు దేశంలోని సంపదపై ముస్లింలకు తొలి హక్కు ఉంటుందని చెప్పారు. దీనర్థం ఈ ఆస్తులన్నీ స్వాధీనం చేసుకుని, వీటిని ఎక్కువ మంది పిల్లలు ఉన్నవారికి, చొరబాటుదారులకు పంచడమేనా, మీ కష్టార్జితాన్ని చొరబాటుదారులకు ఇవ్వడాన్ని మీరు అంగీకరిస్తారా?’’ అని ప్రజలను ఉద్దేశిస్తూ అడిగారు.

‘‘కాంగ్రెస్ పార్టీ తల్లులు, అక్కచెల్లెళ్ళ బంగారానికి సంబంధించిన సమాచారాన్ని తెప్పించుకుని, దానిని మన్మోహన్ సింగ్ చెప్పిన మొదటి హక్కు గల ముస్లింలకు పంపిణీ చేస్తుంది.

‘‘అక్కలారా, అన్నలారా, ఈ అర్బన్ నక్సలైట్ల ఆలోచనా విధానం మీ మెడలో మంగళసూత్రాలను కూడా వదలవు’’ అని మోదీ అన్నారు.

రాహుల్ గాంధీ ఫోటో

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ

మోదీకి కాంగ్రెస్ సవాల్

ప్రధాని మోదీ ప్రసంగాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా విమర్శించింది.

ప్రధాని విద్వేష బీజాలను నాటుతున్నారని చెప్పింది.

‘‘మొదటి విడత ఓటింగ్‌తో నిరాశకు గురైన నరేంద్ర మోదీ అబద్ధాలు చెబుతూ ప్రజలను సమస్యల నుంచి పక్కదోవ పట్టిస్తున్నారు’’ అంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఎక్స్ వేదికగా స్పందించారు.

‘‘కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోకు దేశవ్యాప్తంగా ఆదరణ పెరుగుతోంది. దేశం ఇప్పుడు సమస్యల ఆధారంగా ఓటు వేస్తుంది. ఉద్యోగాల కోసం, కుటుంబ భవిష్యత్తు కోసం దేశం ఓటు వేస్తుంది’’ అని రాశారు.

‘‘దేశ ప్రధాని మరోసారి అబద్ధాలు చెప్పారు. ఎలక్షన్లలో గెలవాలంటే మీరు అబద్ధాలు చెబుతూనే ఉండాలి. మీరు ఇచ్చిన గ్యారంటీలన్నీ అబద్ధాలు, మీ ప్రకటనలు అబద్ధం, మీ వాగ్ధానాలు అబద్ధం, మీరో అబద్ధాల కోరు’’ అంటూ కాంగ్రెస్ నాయకుడు పవన్ ఖేడా సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేశారు.

‘‘మీరు హిందు,ముస్లిం పేరుతో దేశాన్ని విభజించాలని చూస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో హిందు, ముస్లిం అనే పదాలు ఎక్కడున్నాయో చూపించాలని ప్రధాని మోదీకి సవాల్ విసురుతున్నాను. అలా చూపలేకపోతే మీరు అబద్ధాలు ఆడుతున్నారని అర్థం’’ అని చెప్పారు.

‘‘కాంగ్రెస్ మేనిఫెస్టోలో అన్నివర్గాలకు న్యాయం చేయడం గురించిన చర్చ ఉంది. యువత, మహిళలు, గిరిజనులు, కార్మికులు ఇలా అన్ని వర్గాలకు న్యాయం చేయడం గురించి ఉంది. ప్రధాని మోదీకి దీనిపై అభ్యంతరం ఉంది. దీనిపై అసలు అభ్యంతరం ఎందుకుండాలి? న్యాయమంటే ఏమిటో మా మేనిఫెస్టో ప్రధానికి చూపించింది. గత పదేళ్ళుగా హిందు, ముస్లిం ఆటతో గడిపేశారు’’ అని పవన్ ఖేడా విమర్శించారు.

‘‘బాబా సాహెబ్ అంబేడ్కర్, జవహర్ లాల్ నెహ్రు అందరికీ ఓటు హక్కు కల్పించారు. సమాజంలోని అన్ని వర్గాలకు గౌరవం కల్పించారు. కానీ పేదల నుంచి ఆ హక్కులను, గౌరవాన్ని లాక్కోవాలని ప్రధాని మోదీ కోరుకుంటున్నారు’’ అని ఝార్ఖండ్‌లోని రాంచీలో ఇండియా కూటమి ర్యాలీలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు.

‘‘ప్రజల కోసం నేను చేస్తున్నది ట్రైలర్ మాత్రమే అని మోదీ చెపుతున్నారని, ట్రైలర్‌లోనే ఇన్ని సమస్యలుంటే అదెలాంటి సినిమా అవుతుంది’’ అని ఆయన వ్యంగ్యంగా ప్రశ్నించారు.

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్

ఫొటో సోర్స్, GETTY IMAGES

మన్మోహన్ ఏం చెప్పారు?

2006లో జాతీయ అభివృద్ధి మండలి (ఎన్‌డీసీ) సమావేశంలో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ మాట్లాడారు.

వ్యవసాయం, నీటిపారుదల-నీటి వనరులు, ఆరోగ్యం, విద్య, గ్రామీణ మౌలిక సదుపాయాలలో గణనీయమైన పెట్టుబడులు, సాధారణ మౌలిక సదుపాయాలలో ప్రభుత్వ పెట్టుబడుల అవసరం వంటి మా సమష్టి ప్రాధాన్యతలు స్పష్టంగా ఉన్నాయని నమ్ముతున్నాను.

‘‘షెడ్యూల్డ్ కులాలు, తెగల పునరద్ధరణకు కృషి చేయాల్సిన అవసరం ఉంది. కొత్త పథకాల ద్వారా మైనారిటీలు, ముఖ్యంగా ముస్లింల అభ్యున్నతికి అభివృద్ధి ఫలాలు అందేలా చూడాలి. వారందరికీ వనరులపై మొదటి హక్కు ఉండాలి. కేంద్రానికి చాలా బాధ్యతలు ఉన్నాయని, అందుబాటులో ఉన్న వనరులు ప్రతి ఒక్కరి అవసరాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంది.’’ అని మన్మోహన్ అన్నారు.

మన్మోహన్ సింగ్ అప్పుడు ఇంగ్లీషులో మాట్లాడారు. అందులో ఆయన ‘రైట్స్’ అనే పదం వాడలేదు. కానీ ఇంగ్లీషులో ఆయన క్లెయిమ్ అనే పదం ఉపయోగించారు. ఈ ప్రసంగం పీఎంఓ ఆర్కైవ్స్‌లో అందుబాటులో ఉంది.

ఇవి కూడా చదవండి:

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)