బీజేపీ మేనిఫెస్టో: ఉమ్మడి పౌర స్మృతి నుంచి ‘ఒకే దేశం ఒకే ఎన్నిక’ వరకు ఏయే అంశాలు ఉన్నాయంటే?

ఫొటో సోర్స్, ANI
భారతీయ జనతా పార్టీ (బీజేపీ) 2024 లోక్‌సభ ఎన్నికల మేనిఫెస్టోను ఆదివారం విడుదల చేసింది. ఈ మేనిఫెస్టోకు ‘మోదీ గ్యారంటీ సంకల్ప పత్రం’ అనే పేరు పెట్టారు.
దిల్లీలోని పార్టీ కార్యాలయంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ల సమక్షంలో ఆదివారం ఈ మేనిఫెస్టోను విడుదల చేశారు.
బీజేపీ సీనియర్ నాయకుడు, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ.. ‘‘మేం చెప్పింది చేసి చూపిస్తాం’’ అని అన్నారు.
‘‘జమ్మూకశ్మీర్‌లో ఆర్టికల్ 370ను రద్దు చేసి చూపిస్తామని గతంలో హామీఇచ్చాం. దాన్ని చేసి చూపించాం. మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్లపై కూడా హామీ ఇచ్చాం. దాన్ని కూడా పూర్తిచేశాం’’ అని ఆయన చెప్పారు.
బీజేపీ కొత్త మేనిఫెస్టోలో 24 సెక్షన్లు ఉన్నాయి. సుపరిపాలన, దేశ భద్రత, పారిశుద్ధ్యం, స్పోర్ట్స్ అభివృద్ధి, పర్యావరణం తదితర సెక్షన్లు దీనిలో ఉన్నాయి.
మోదీ గ్యారంటీ పత్రం 24 క్యారెట్ల బంగారమంత మంచిదని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ వ్యాఖ్యానించారు.
దేశంలో లోక్‌సభ ఎన్నికలు ఏడు దశల్లో జరుగనున్నాయి. ఏప్రిల్ 19న తొలి దశ పోలింగ్ జరుగుతుంది.
‘ఒకే దేశం- ఒకే ఎన్నిక’తో పాటు ఉమ్మడి ఓటర్ల జాబితా (కామన్ ఎలక్టోరల్ రోల్)ను తీసుకొస్తామంటూ మేనిఫెస్టోలో పేర్కొంది.
దేశం మొత్తం బీజేపీ మేనిఫెస్టో కోసం ఎదురుచూస్తోందని, దానికి కారణం బీజేపీ ఇచ్చిన ప్రతీ హామీని నెరవేర్చడమే అని మేనిఫెస్టో విడుదల సందర్భంగా ప్రధాని మోదీ అన్నారు.
యూనిఫామ్ సివిల్ కోడ్ (యూసీసీ)కు బీజేపీ చాలా ప్రాధాన్యం ఇస్తుందని ఆయన వ్యాఖ్యానించారు.

ఫొటో సోర్స్, BJP
మేనిఫెస్టోలోని ముఖ్యాంశాలు
- వచ్చే ఐదేళ్లపాటు ఉచిత రేషన్, నీరు, గ్యాస్ కనెక్షన్, జీరో విద్యుత్ బిల్లు అందించడం
- ఆయుష్మాన్ భారత్ కింద రూ.5 లక్షల వరకూ ఉచిత చికిత్సలు.. వీటిని భవిష్యత్‌లోనూ కొనసాగింపు
- జన ఔషధి కేంద్రాల్లో 80 శాతం రాయితీకి ఔషధాలు
- మధ్య తరగతి కుటుంబాలకు 3 కోట్ల పక్కా ఇళ్ల నిర్మాణం
- ముద్ర పథకం కింద రూ. 20 లక్షల వరకు రుణాలు
- జాతీయ విద్యా విధానం అమలు
- ప్రశ్నపత్రాల లీక్‌పై కొత్త చట్టం
- 2036లో ఒలింపిక్స్ నిర్వహణ
- దివ్యాంగులకు పీఎం ఆవాస్ యోజనలో ప్రాధాన్యం
- యువత కోసం మౌలిక సదుపాయాల కల్పన, వస్తు తయారీ, అంకుర పరిశ్రమల ఏర్పాటు, స్పోర్ట్స్, పెట్టుబడులు, ఇతర సేవలు, పర్యటకం కింద లక్షల ఉద్యోగాల కల్పన
- ఇప్పటికే కోటి మంది అక్కాచెల్లెళ్లు లక్షాధికారులు అయ్యారు. మరో మూడు కోట్ల మందిని కూడా లక్షాధికారులను చేయాలని లక్ష్యం
- నారీ వందన చట్టం అమలు
- విత్తనాల కొనుగోలు నుంచి మార్కెట్ వరకు రైతుల ఆదాయం పెంచడానికి కృషి. నానో యూరియా, ప్రకృతి వ్యవసాయంతో నేలకు రక్షణ. శ్రీఅన్న సాగుకు ప్రోత్సాహం
- మత్స్యకారుల జీవితాలకు సంబంధించిన పడవలకు ఇన్సూరెన్స్, చేపల ప్రాసెసింగ్, సత్వర సమాచార బదిలీ లాంటి అన్ని సేవల బలోపేతం
- సముద్రపు నాచు, ముత్యాల సాగు దిశగా మత్స్యకారులకు ప్రోత్సాహం
- గిగ్ వర్కర్లు, ట్యాక్సీ డ్రైవర్లు, ఆటో డ్రైవర్లు, ఇంటి పనిచేసేవారు, కూలీలు, ట్రక్కు డ్రైవర్లు అందరినీ ఈ-శ్రమ్ పోర్టల్ ద్వారా అనుసంధానించి సంక్షేమ పథకాలు అమలు
- భారత సంస్కృతిని తిరువళ్లూర్ కల్చరల్ సెంటర్ ద్వారా ప్రపంచ దేశాలకు పరిచయం, వ్యాప్తి
- ఉన్నత విద్యా సంస్థల్లో భారత భాషల అధ్యయనాలకు ప్రోత్సాహం
- 2025ను గిరిజన గర్వ ఏడాది (ట్రైబల్ ప్రైడ్ ఇయర్)గా ప్రకటన
- ఏకలవ్య పాఠశాలలు, పీఎం జన్‌మన్ లాంటి పథకాలను ప్రోత్సహించడంతోపాటు ఏకో టూరిజం, అటవీ ఉత్పత్తులకు ప్రాధాన్యం
- ఓబీసీ, ఎస్సీ, ఎస్టీలకు అన్ని విధానాల గౌరవం కల్పించేలా చర్యలు
- ట్రాన్స్‌జెండర్లకు కూడా ఆయుష్మాన్ భారత్ వర్తింపు

ఫొటో సోర్స్, ANI
కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఏముంది?
ఏప్రిల్ 5న కాంగ్రెస్ పార్టీ తమ మేనిఫెస్టోను విడుదల చేసింది. దీనికి ‘న్యాయపత్రం’ అనే పేరు పెట్టింది.
ఈ మేనిఫెస్టోలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల కోసం 50 శాతం రిజర్వేషన్ల పరిమితిని పెంచుతామని పేర్కొంది. ఇందుకోసం రాజ్యాంగ సవరణ తీసుకొస్తామని హామీ ఇచ్చింది.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే కనీస మద్దతు ధర కల్పిస్తామని పేర్కొన్నారు.
కాంగ్రెస్ మేనిఫెస్టో ముఖ్యాంశాలు
- కేంద్ర ప్రభుత్వంలోని 30 లక్షల ఉద్యోగాల భర్తీ
- దేశంలోని అందరికీ రూ. 25 లక్షల ఆరోగ్య బీమా
- దేశవ్యాప్తంగా సామాజిక, ఆర్థిక, కులాల సర్వే నిర్వహణ
- 25 ఏళ్ల లోపు గ్రాడ్యుయేట్లకు ఒక ఏడాది పాటు అప్రెంటిస్‌షిప్
- పేపర్ లీకేజీ కేసుల పరిష్కారానికి ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటు, బాధితులకు నష్టపరిహారం
- స్టార్టప్‌ల కోసం నిధుల కేటాయింపు
- డిజిటల్ లెర్నింగ్ కోసం 9 నుంచి 12వ తరగతి విద్యార్థులకు ఫోన్ల పంపిణీ
- 21 ఏళ్ల లోపు యువ క్రీడాకారుల కోసం నెలకు రూ. 10 వేల నగదు ప్రోత్సాహం
- మహాలక్ష్మీ పథకాన్ని ప్రారంభించి ప్రతీ పేద కుటుంబానికి షరతుల్లేకుండా ప్రతీ ఏడాది లక్ష రూపాయల నగదు సహాయం.
- 2025 నుంచి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళల కోసం సగం రిజర్వేషన్లు
- అగ్నిపథ్ పథకం రద్దు
- జమ్మూకశ్మీర్‌కు రాష్ట్ర హోదా
- ప్రభుత్వ ఉద్యోగాల పరీక్షా ఫీజుల రద్దు
- మైనార్టీలకు వస్త్రధారణ, ఆహారం, భాష, ప్రేమ, పెళ్లి, భారత్‌లో నచ్చిన ప్రాంతంలో పర్యటించే హక్కు, పర్సనల్ లాను ఎంచుకొనే హక్కు కల్పన. వారి వ్యక్తిగత ఎంపికల్లో కాంగ్రెస్ జోక్యం చేసుకోదంటూ హామీ
- తప్పుడు వార్తల నియంత్రణకు 1978 నాటి ప్రెస్ కౌన్సిల్ ఇండియా చట్టం సవరణ
- ఆశా, అంగన్‌వాడీ, మధ్యాహ్న భోజనం పథకాల సిబ్బంది వేతనాలకు కేంద్ర ప్రభుత్వ సహకారం రెట్టింపు చేయడం.
- జాతీయ ఉపాధి హామీ కింద రోజువారీ వేతనం రూ. 400కు పెంపు
- పార్లమెంట్ సమావేశాల్లో విపక్షాల అజెండాపై వారంలో ఒకరోజు చర్చ
- ఎలక్టోరల్ బాండ్ స్కామ్, ప్రభుత్వ ఆస్తులను విచక్షణా రహితంగా విక్రయించడం, పీఎం కేర్స్ స్కామ్, ఇంటెలిజెన్స్ వైఫల్యాలపై ఉన్నత స్థాయి విచారణ
- మీడియా స్వేచ్ఛను కాపాడటం
- సెన్సార్‌షిప్ చట్టాల ఉపసంహరణ
- హైకోర్టు, సుప్రీం కోర్టు ఖాళీలను మూడేళ్లలోగా భర్తీ చేయడం
ఇవి కూడా చదవండి:
- ఇజ్రాయెల్-ఇరాన్ ఉద్రిక్తత: యుద్ధభయం ఉన్నా ఇజ్రాయెల్ వెళ్లడానికి ఈ యూపీ యువకులు ఎందుకు సిద్ధమవుతున్నారు?
- బంగారం: ఈ విలువైన లోహం భూమి మీదకు ఎలా వచ్చింది, శాస్త్రవేత్తలు ఏం చెబుతున్నారు?
- పాకిస్తాన్ క్రికెట్లో కొత్త డ్రామా, అమీర్ రీఎంట్రీకి కారణాలేంటి?
- కచ్చతీవుకు బదులుగా భారత్ తీసుకున్న 'వాడ్జ్ బ్యాంక్' ప్రాంతం అంత విలువైనదా?
- భారత్ ఉల్లిగడ్డలతో దౌత్యం నెరుపుతోందా?
బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














