తెల్ల భాస్వరంతో ఇజ్రాయెల్ ఎందుకు దాడులు చేస్తోంది?

ఫొటో సోర్స్, AP
- రచయిత, బీబీసీ పర్షియన్, అరబిక్
- హోదా, బీరూట్, కైరో, లండన్
ఇజ్రాయెల్ గత ఆరు నెలలుగా సరిహద్దుల మీదుగా దక్షిణ లెబనాన్‌లో తెల్ల భాస్వరం దాడులను చేస్తోంది.
ఈ విషపూరిత వాయువు కళ్లకు, ఊపిరితిత్తులకు ప్రమాదకరం. దీనివల్ల శరీరంపై కాలిన గాయాలు అవుతాయి.
ఈ వాయువు వాడకాన్ని అంతర్జాతీయ చట్టాలు తీవ్రంగా నియంత్రిస్తాయి.
ఈ వివాదాస్పద వాయువును ఇటీవల గాజా, లెబనాన్‌లోని సాయుధ మిలిటెంట్లపై ఉపయోగించడం చట్టబద్ధమేనని ఇజ్రాయెల్ మిలిటరీ చెబుతోంది.
కానీ, దీన్ని కచ్చితంగా యుద్ధ నేరంగా చూడాలని మానవ హక్కుల గ్రూపులు డిమాండ్ చేస్తున్నాయి.
లెబనాన్, గాజా ప్రాంతాల్లో ఇజ్రాయెల్ తెల్ల భాస్వరం ఆయుధాల వాడకంపై దర్యాప్తు చేస్తామని అమెరికా చెబుతోంది.
పౌరులు ఉండే ప్రదేశాలకు దగ్గరగా దీన్ని వాడటం ద్వారా ఇజ్రాయెల్, చట్టాన్ని ఉల్లంఘిస్తోందా? లేదా యుద్ధంలో తమ హక్కులకు లోబడే ఈ చర్యకు పాల్పడుతోందా?
‘‘ఇది ఒక తెల్లటి పొగమంచులా ప్రయాణిస్తుంది. కానీ, నేలను తాకగానే పొడి రూపంలో మారుతుంది’’ అని దక్షిణ లెబనాన్‌కు చెందిన 48 ఏళ్ల అలీ అహ్మద్ అబు సమ్రా అనే రైతు చెప్పారు.
2023 అక్టోబర్ 19న తెల్లటి పొగతో కూడిన ఒక దట్టమైన మేఘం తనను చుట్టుముట్టిందని ఆయన తెలిపారు.
‘‘దాన్నుంచి వెల్లుల్లి వాసన వస్తుందని అంటారు. కానీ, దాని వాసన చాలా దరిద్రంగా ఉంటుంది. అసలు భరించలేం. మురుగునీటి కంపు కంటే ఘోరంగా ఉంటుంది’’ అని తెల్ల భాస్వరం దాడి గురించి అలీ వివరించారు.

తెల్ల భాస్వరం రసాయన చర్య ద్వారా 815 డిగ్రీ సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతను ఉత్పత్తి చేయగలదు. దీనికి అధిక మండే స్వభావం ఉంటుంది. అత్యంత విషపూరితమైనది.
‘‘మా కళ్ల నుంచి నీళ్లు ధారగా రావడం మొదలైంది. తడి గుడ్డతో మా నోరు, ముక్కును మూసుకొని ఉండకపోతే ఈరోజు మేం బతికి ఉండేవాళ్లం కాదు’’ అని ధైరా గ్రామానికి చెందిన అలీ అహ్మద్ చెప్పారు.
గాజాలో యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇజ్రాయెల్-గాజా సరిహద్దుల్లో హింస పెరిగింది. రెండు వైపులా ప్రాణనష్టం జరిగింది. వేలాది మంది ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు.
ఇరాన్‌కు సన్నిహితంగా ఉండే, హమాస్‌కు కూడా మిత్రపక్షమైన హిజ్బొల్లా ప్రపంచంలోని అత్యంత భారీ సాయుధ సైనిక దళాల్లో ఒకటి. ప్రస్తుతం ఇజ్రాయెల్ సైనిక దళాల నుంచి వైమానిక దాడులతోపాటు భూతల దాడులను వారు రోజూ ఎదుర్కొంటున్నారు. వీరిపై తెల్ల భాస్వరంతోనూ దాడులు చేపడుతున్నారు.
షెల్ నుంచి విడుదలయ్యే తెల్ల భాస్వరం, గాలిలోని ఆక్సీజన్‌తో చర్య జరిపి దట్టమైన పొగ మేఘాన్ని ఏర్పరుస్తుంది. ఇది శత్రువుల దృష్టిని మరల్చుతుంది. కొన్ని పరిస్థితుల్లో ఇది అత్యంత సమర్థవంతమైన, చట్టపరమైన మిలిటరీ వ్యూహం.
అయితే, అంతర్జాతీయ చట్టాల ప్రకారం, సాయుధ ఘర్షణల సమయంలో పౌరులను రక్షించడం అన్ని వర్గాల బాధ్యత.
అసలు యుద్ధంలో తెల్ల భాస్వరాన్ని ఎప్పుడు ఉపయోగించారు?

ఫొటో సోర్స్, REUTERS
గత పదేళ్లలో ప్రపంచంలోని ప్రధాన మిలిటరీలు తెల్ల భాస్వరాన్ని ఉపయోగించాయి. రెండో ప్రపంచ యుద్ధం సమయంలో సోవియట్ యూనియన్ విస్తృతంగా దీన్ని ఉపయోగించినట్లు సీఐఏ తెలిపింది.
తెల్ల భాస్వరాన్ని 2004లో ఇరాక్‌లో, ఆ తర్వాత సిరియాలో, 2017లో ఐసిస్‌కు వ్యతిరేకంగా మళ్లీ ఇరాక్‌లో వాడినట్లు అమెరికా అంగీకరించింది.
గాజాలో 2008-09 దాడి సమయంలోనూ ఈ రసాయనాన్ని వాడినట్లు ఇజ్రాయెల్ పేర్కొంది.
అయితే, ఈ రసాయనం వాడకంలో ఇజ్రాయెల్ మిలిటరీ నిర్లక్ష్యంగా వ్యవహరించిందని ఐక్యరాజ్యసమితి చెప్పిన తర్వాత, దీని వాడకాన్ని త్వరలోనే మానేస్తామని 2013లో ఐడీఎఫ్ చెప్పింది.
హిజ్బొల్లా ఫైటర్లు ఇద్దరు నుంచి నలుగురు వరకు ఉండే చిన్న యూనిట్లుగా మారి పని చేస్తుంటారని వారికి పేరు. అడవిని రక్షణగా వాడుకుంటూ వారు తరచుగా క్షిపణులు, రాకెట్లను సరిహద్దుల మీదుగా ఇజ్రాయెల్ ఆర్మీ స్థావరాలపైకి ప్రయోగిస్తారు. వారిని భాస్వరం పొగలో కూరుకుపోయేలా చేయడం ద్వారా వారి దాడులను తిప్పికొట్టేందుకు ఇజ్రాయెల్ ఆర్మీకి ఒక అవకాశం లభిస్తుంటుంది.
అదే సమయంలో హిజ్బొల్లా ఫైటర్లతో ఉంటే, తమపైనా భాస్వరం దాడులు జరుగుతాయని స్థానిక ప్రజలు కూడా భయపడుతుంటారు.
‘‘హిజ్బొల్లా ఫైటర్లు ఉంటే, అక్కడి నుంచి వెంటనే వెళ్లిపోవాలని ప్రజలు చెబుతుంటారు. ఎందుకంటే చనిపోవాలని ఎవరూ కోరుకోరు’’ అని అలీ చెప్పారు.

ఫొటో సోర్స్, AP
ధైరా గ్రామంలో మొదట స్పందించే వైద్య సిబ్బందిలో ఖాలీద్ ఖ్రైతమ్ ఒకరు.
‘‘మేం ఆ రోజు స్పృహ కోల్పోయిన ప్రజలను ముందు తరలించాం’’ అని ఆయన చెప్పారు.
‘‘మిగతా వారిని తరలించేందుకు ప్రయత్నించే సమయంలోనే మా రెస్క్యూ టీమ్‌పై దాడి జరిగింది’’ అని ఆయన తెలిపారు.
‘‘మాపైకి వారు షెల్స్ ప్రయోగించారు. మేం చేసే పనిని అడ్డుకోవాలని వారు అనుకున్నారు. లేదా మాపై దాడి ద్వారా అందరిలోనూ భయం పుట్టించాలని చూశారు’’ అని ఆయన అన్నారు.
టయర్ ప్రాంతంలోని ఒక ఇటాలియన్ హాస్పిటల్‌కు తొమ్మిది మందిని ఎలా తీసుకెళ్లారో ఖాలీద్ గుర్తుచేసుకున్నారు. ఆ రోజు రక్షించిన వారిలో తన తండ్రి ఇబ్రహీం కూడా ఉన్నారు.
65 ఏళ్ల ఇబ్రహీం తీవ్రమైన శ్వాస సమస్యలతో మూడు రోజులపాటు ఆసుపత్రిలో ఉండాల్సి వచ్చింది. ఆయనను దగ్గరుండి చూసిన డాక్టర్ మొహమ్మద్ ముస్తాఫా.. భాస్వరం దాడులకు బాధితులైన చాలా మందికి చికిత్స అందించారు.
‘‘మా దగ్గరకు తీవ్రమైన శ్వాస సమస్యలతో బాధితులు వస్తుంటారు. వారికి విపరీతంగా చెమటలు పడుతుంటాయి, వాంతులు అవుతాయి. వారి గుండె కూడా లయ తప్పుతుంది’’ అని ముస్తాఫా చెప్పారు.
‘‘వారికి రక్త పరీక్షలు నిర్వహించడంతో భాస్వరం దాడులకు గురైనట్లు నిర్ధారణ అవుతుంది’’ అని ఆయన వివరించారు.
మూడు నెలల తర్వాత మళ్లీ ఇబ్రహీంను కలుసుకునేందుకు వెళ్లాం. అప్పటికీ ఆయన కళ్లు ఇంకా ఎర్రగానే ఉన్నాయి. ఆయన చేతులు, కాళ్లపై చర్మం పైపొరలు ఊడిపోతున్నాయి. ఇదంతా భాస్వరం వల్లే జరుగుతోందని వైద్యులు తనకు చెప్పినట్లు ఆయన వివరించారు.
‘‘1970ల నుంచి మేం యుద్ధ వాతావరణంలోనే జీవిస్తున్నాం’’ అని ఆయన చెప్పారు.
‘‘కానీ, ఇలా ముందెప్పడూ జరగలేదు. ప్రస్తుతం మా ఇళ్లకు పక్కనే పేలుళ్లు జరుగుతున్నాయి’’ అని ఆయన వివరించారు.
ఒక షెల్ తన కారుకు ఆరు మీటర్ల దూరంలోనే పేలిందని ఆయన చెప్పారు. తమ తలపై ఐడీఎఫ్ డ్రోన్లు తిరుగుతూ కనిపిస్తుంటాయని ఆయన తెలిపారు.
‘‘వారు మమ్మల్ని చూడగలరు. అయినప్పటికీ నిర్లక్ష్యంగా కాల్పులు జరుపుతుంటారు’’ అని ఇబ్రహీం చెప్పారు.
ధైరాలో జరిగిన దాడిని యుద్ధ నేరంగా పరిశోధించాలని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ చెబుతోంది. ఎందుకంటే ఇక్కడ జరిగిన దాడిలో తొమ్మిది మంది పౌరులు గాయపడ్డారు. పౌరుల ఆస్తులపై షెల్స్‌తో దాడి చేశారు.
ప్రజలు ఎక్కువగా జీవించే ప్రాంతాల్లోనూ నిర్లక్ష్యంగా భాస్వరంతో దాడులు చేస్తున్నారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్న విషయాలను ఐడీఎఫ్ దృష్టికి బీబీసీ తీసుకెళ్లింది.
‘‘అయితే, కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మినహా ప్రజలు జీవించే ప్రాంతాల్లో ఎప్పుడూ తెల్ల భాస్వరంతో దాడులు చేయకూడదని మాకు మార్గదర్శకాలు ఉన్నాయి. మీరు చెబుతున్న కొన్ని అంశాలు సైనిక రహస్యాల కిందకు వస్తాయి. మేం వాటి గురించి మాట్లాడకూడదు’’ అని ఐడీఎఫ్ ప్రతినిధి ఒకరు చెప్పారు.

ఫొటో సోర్స్, AP
ఆధారాలు ఇవీ..
అలీ గ్రామంపై దాడి అనంతరం.. దానిపై ఆన్‌లైన్‌లో కొన్ని కథనాలు వచ్చాయి. మొదట తాము వైట్ పాస్ఫరస్ ఉపయోగించామనే వాదనను ఇజ్రాయెల్ ఆర్మీ ఖండించింది.
అయితే, ఆ తర్వాత యూటర్న్ తీసుకుంది. అంతర్జాతీయ చట్టాలకు లోబడే అక్కడ దాడి చేసినట్లు అంగీకరించింది.
క్షేత్రస్థాయిలో లభించిన ఆధారాలను పరిశీలించిన అనంతరం, ధైరాతోపాటు మరో మూడు గ్రామాల్లోనూ గత ఆరు నెలల్లో తెల్ల భాస్వరాన్ని ఉపయోగించినట్లు బీబీసీ ధ్రువీకరించగలిగింది.
కాఫర్ కీలాలో రెండు షెల్ భాగాలకు బీబీసీ రసాయన పరీక్షలు నిర్వహించింది. ఇవి రెండూ ప్రజల ఇళ్ల మధ్యే పడ్డాయి. వీటి విశ్లేషణను ప్రముఖ రసాయన శాస్త్రవేత్త నిర్వహించారు. అయితే, భద్రతా కారణాల దృష్ట్యా ఆయన పేరు వెల్లడించడం లేదు.
పీపీఈ కిట్‌తోపాటు గ్యాస్ మాస్క్ వేసుకొని ఆ మెటల్ లోపల అతుక్కుని ఉన్న రసాయనాలను ప్రొఫెసర్ విశ్లేషించారు.
‘‘ఇది 15 మి.మీ. హోవిట్జర్ షెల్ భాగం. దీనిపై ఎం825ఏ1 అనే మార్కింగ్‌ను పరిశీలిస్తే, ఇదొక వైట్ పాస్ఫరస్ పేలుడు పదార్థమని తెలుస్తోంది. దీన్ని అమెరికాలో తయారుచేశారు’’ అని ఆయన చెప్పారు.
షెల్‌లోని మిగిలిన పదార్థాన్ని లైటర్‌తో ఆయన వేడి చేశారు. వెంటనే అది మండిపోయింది.
‘‘ఇది మండుతున్నప్పుడు మీ బట్టలు, లేదా ఒంటిపై ఉంటే ఏమవుతుందో ఒకసారి ఊహించుకోండి’’ అని ఆ ప్రొఫెసర్ అన్నారు.
30 రోజులు అయినప్పటికీ, ఆ షెల్‌లోని భాస్వరం అవశేషాలు నిప్పు తగిలితే వెంటనే మండుతున్నాయి.
సరిహద్దు ప్రాంతాల్లోని ప్రజలను వెళ్లగొట్టేందుకు కావాలనే జనావాసాలపైకి ఇజ్రాయెల్ సైన్యం భాస్వరాన్ని ప్రయోగిస్తోందని ఖాలీద్ అంటున్నారు.
‘‘ఒకప్పుడు ఇక్కడ గ్రామీణ జీవితం చాలా బావుండేది. కానీ, ఇప్పుడు అటవీ ప్రాంతంలో భాస్వరంతో వారు దాడులు చేస్తున్నారు. చుట్టుపక్కల ఆలివ్ చెట్లు, అవొకాడో తోటలపైనా దాడులు చేస్తున్నారు’’ అని ఆయన చెప్పారు.
ఖాలీద్ చేస్తున్న ఆరోపణలపై ఐడీఎఫ్ స్పందించింది.
‘‘ప్రజలను వెళ్లగొట్టేందుకు వారి ఇళ్లపై భాస్వరాన్ని ఉపయోగిస్తున్నామన్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు’’ అని తెలిపింది.

చట్టాలను ఇజ్రాయెల్ ఉల్లంఘిస్తోందా?
తెల్ల భాస్వరాన్ని రసాయన ఆయుధంగా చెప్పలేం. అదే సమయంలో దీన్ని పేలుళ్ల కోసం ఉపయోగించే పదార్థమని కూడా పేర్కొనలేం.
యూఎన్ కన్వెన్షన్ ఆన్ కన్వెన్షనల్ వెపన్స్ (సీసీడబ్ల్యూ) ప్రకారం.. ప్రజలను మంటల్లో చిక్కుకునేలా చేయడంతోపాటు మంటలకు కారణమయ్యే పేలుడు పదార్థాలపై పరిమితులు ఉన్నాయి.
ఇజ్రాయెల్ సహా కొన్ని దేశాలు వైట్ పాస్ఫరస్‌ను కేవలం పొగ కోసం మాత్రమే వాడితే, సీసీడబ్ల్యూ దీనికి వర్తించదు.
ఈ వాదనతో హ్యూమన్ రైట్స్ వాచ్ (హెచ్‌ఆర్‌డబ్ల్యూ) విభేదిస్తోంది. సీసీడబ్ల్యూలో చాలా లొసుగులు ఉన్నాయని సంస్థ హెచ్చరిస్తోంది.
‘‘సీసీడబ్ల్యూలో చాలా లోపాలు ఉన్నాయి. ముఖ్యంగా ఆయుధాల నిర్వచనమే అసలు సమస్య’’ అని హెచ్ఆర్‌డబ్ల్యూ రీసెర్చర్ రామ్జీ కయాస్ అన్నారు.
‘‘కానీ, ఇంటర్నేషనల్ హ్యూమనైటేరియన్ లా (ఐహెచ్ఎల్) ప్రకారం, ఘటనల్లో పౌరులు గాయపడకుండా అందరూ జాగ్రత్త వహించాలి. ముఖ్యంగా భాస్వరంతో తయారుచేసిన పేలుడు పదార్థాలు ఉపయోగించినప్పుడు’’ అని ఆయన అన్నారు.
ఇజ్రాయెల్ ఐహెచ్ఎల్‌ను ఉల్లంఘించిందో లేదో చెప్పడం కష్టమని స్వతంత్ర న్యాయవాది, మిలిటరీ నిపుణుడు ప్రొఫెసర్ బిల్ బూథీ అన్నారు.
‘‘కేవలం పొగ కోసమే భాస్వరాన్ని ఉపయోగిస్తున్నామని ఇజ్రాయెల్ చెబుతోంది. అయితే అసలు మిలిటెంట్లే లేనప్పుడు పొగ ఎందుకని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. అందుకే అసలు ఎందుకు దీన్ని ఉపయోగిస్తున్నారో మొదట తెలుసుకోవాలి. అప్పుడే చట్టాలు ఉల్లంఘించారో లేదో తెలుస్తుంది’’ అని ఆయన చెప్పారు.
ఈ విషయంపై ఐడీఎఫ్‌ను సమాధానం కోరినప్పుడు, ‘‘ఇది క్లాసిఫైడ్ ఇన్ఫర్మేషన్. దీనిపై మేం మాట్లాడకూడదు’’ అని ఐడీఎఫ్ తెలిపింది.
ఇవి కూడా చదవండి:
- ఇరాన్ ఎందుకు ఇజ్రాయెల్‌పై దాడులు చేసింది? ఆరు ప్రశ్నలు, సమాధానాలు..
- వెయ్యేళ్ల నాటి ఈ అస్థిపంజరం కోసం నాజీలు, సోవియట్లు ఎందుకు పోరాడారు?
- గాజా యుద్ధం: ఇజ్రాయెల్‌కు ఆయుధాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి?
- ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు: వైసీపీకి చిక్కవు, టీడీపీకి దొరకవు
- 'ఇంట్లో చొరబడి చంపేస్తాం' అన్న మోదీ వ్యాఖ్యలపై అమెరికా ఏమందంటే..
బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















