నెజాక్ యూడా: ఇజ్రాయెల్ ఆర్మీలో అమ్మాయిలకు దూరంగా మసలే ఈ సైనికుల పటాలంపై అమెరికా ఆంక్షలు విధిస్తుందా?

ఇజ్రాయెల్, ఇరాన్, అమెరిాకా

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, సనాతన ధార్మిక యువతను సైన్యంలోకి తీసుకు వచ్చేందుకు ఏర్పాటైన యూనిట్
    • రచయిత, అల్హరెత్ అల్హబాష్నే
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ఇజ్రాయెల్ సైన్యంలోని నెజాక్ యూడా యూనిట్‌ సభ్యులు కఠినమైన, మతపరమైన నియమాల చట్రంలో జీవిస్తూ, విధులు నిర్వహిస్తుంటారు. ఈ బెటాలియన్‌పై ఆంక్షలు విధించాలని అమెరికా ఆలోచిస్తోందంటూ వార్తలు వచ్చాయి.

అయితే, నిర్ధరణ కాని ఆ వార్తలపై ఇజ్రాయెల్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

వెస్ట్‌బ్యాంక్‌లో జరుగుతున్న మానవహక్కుల ఉల్లంఘనలకు గాను అమెరికా ఈ నిర్ణయం తీసుకోబోతోందని ద యాక్సియోస్ న్యూస్ వెబ్‌సైట్ తెలిపింది.

ఒకవేళ ఇది వాస్తవం అయితే, ఇజ్రాయెల్ ఆర్మీ యూనిట్ మీద అమెరికా ఆంక్షలు విధించడం ఇదే తొలిసారి అవుతుంది.

నెజాక్ యూడా బెటాలియన్‌పై అమెరికా ఆంక్షలు విధించనుందన్న వార్తలపై తమ వద్ద ఎలాంటి సమాచారం లేదని ఇజ్రాయెల్ సైన్యం ఆదివారం చెప్పింది. ఈ యూనిట్ అంతర్జాతీయ చట్టాల ప్రకారమే పని చేస్తోందని ప్రకటించింది.

“అమెరికా అలాంటి నిర్ణయం తీసుకుంటే, దాన్ని సమీక్షిస్తాం” అని ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. ఏదైనా అసాధారణ సంఘటన జరిగితే దాని మీద చట్టం ప్రకారం సాధారణ పద్దతిలో విచారణ జరుపుతామని చెప్పింది.

నెజాక్ యుడా, ఇజ్రాయెల్ సైన్యం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, 2007లో తన సైనిక శిక్షణ పూర్తైన తర్వాత జెరూసలేంలోని ఓల్డ్ సిటీలో పశ్చిమ గోడ వద్ద ప్రార్థన చేస్తున్న నెజాక్ యుడా బెటాలియన్ సైనికుడు.

అమెరికన్ ప్రభుత్వం నెజాక్ యూడా మీద ఆంక్షలు విదిస్తే, ఈ యూనిట్‌కు అమెరికన్ సైన్యం నుంచి ఎలాంటి సాయం కానీ, శిక్షణ కానీ అందదని అమెరికన్ వర్గాలు చెబుతున్నాయి.

ఇజ్రాయెల్‌లో మిగతా పౌరుల మాదిరిగా హరెది యూదులను మిలటరీలో చేరాల్సిన అవసరం లేకుండా మినహాయింపులు ఇవ్వడంపై కొన్ని నెలలుగా దేశవ్యాప్తంగా ఆగ్రహం పెరుగుతోంది.

ఇజ్రాయెల్‌లో ప్రజలు సైన్యంలో పని చెయ్యడం తప్పనిసరి, పురుషులు మూడేళ్లు, మహిళలు రెండేళ్లు సైన్యంలో పని చేయాల్సిందే.

పాలస్తీనీయుల మీద నెజాక్ యూడా బెటాలియన్ చేసిన దాడుల విషయంలో నిర్వహించిన విచారణలో ఏం జరిగిందో చెప్పాలని వాషింగ్టన్ అనేక సందర్భాల్లో ఇజ్రాయెల్‌ను కోరినట్లు అధికారులు తమతో చెప్పారని ద ఇజ్రాయెలీ పబ్లిక్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పోరేషన్ తెలిపింది.

నెతన్యాహు, వైట్ హౌస్, వాషింగ్టన్

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, అమెరికా ఆంక్షలు విధించడాన్ని “మూర్ఖత్వానికి పరాకాష్ట మాత్రమే కాదు నైతికంగా దిగజారి పోవడం” అని అభివర్ణించిన నెతన్యాహు

‘మూర్ఖత్వానికి పరాకాష్ట’

ఇజ్రాయెల్ ఆర్మీ యూనిట్ మీద అమెరికా ఆంక్షలు విధించడం “ప్రమాదకరమైన సంకేతం’’ అని అన్నారు ఇజ్రాయెల్ రక్షణశాఖ మంత్రి బెన్నీ గంట్జ్. అమెరికా కనుక ఇలాంటి నిర్ణయం తీసుకుంటుంటే దాన్ని పునరాలోచించాలని ఆయన అమెరికా విదేశాంగమంత్రి ఆంటోనీ బ్లింకెన్‌కు ఫోన్ చేసి కోరారు.

ఇజ్రాయెల్ ప్రస్తుతం యుద్ధం చేస్తోందని, ఇలాంటి సమయంలో సైన్యంలోని ఓ యూనిట్ మీద ఆంక్షలు విధించడం ‘ఇజ్రాయెల్ ప్రతిష్టను దెబ్బ తీస్తుందని’ గంట్జ్ చెప్పారు.

“ఆర్మీ యూనిట్లు అంతర్జాతీయ చట్టానికి లోబడి నడుచుకుంటాయని అలాంటి వాటిపై ఆంక్షలు విధించడం న్యాయం కాదు” అని ఆయన చెప్పారు.

అమెరికా ఆంక్షలు విధించడానికి బదులు పాలస్తీనా అథారిటీ నిధులను జప్తు చేసి ఇజ్రాయెల్‌కు ఇవ్వాలని ఇజ్రాయెల్ జాతీయ భద్రత మంత్రి ఇటామర్ బెన్ గివిర్ పిలుపిచ్చారు.

“పాలస్తీనా బ్యాంకుల మీద కఠినమైన ఆంక్షలు విధించేందుకు ప్రణాళిక సిద్దం చేయండి” అని ఆయన ప్రధానమంత్రిని కోరారు.

ఇజ్రాయెల్, అమెరికా, గాజా , యుద్దం

ఫొటో సోర్స్, Nahal Haredi

ఫొటో క్యాప్షన్, ఇజ్రాయెల్ సైన్యంలో ప్రత్యేక గుర్తింపు పొందిన బెటాలియన్

ఎలాంటి ఆంక్షలు విధించినా సరే అవి “ఇజ్రాయెల్ శత్రువులైన పాలస్తీనీయన్ అథారిటీకి మేలు చేస్తాయి” అని బెన్ గ్విర్ అన్నారు.

సరిహద్దు భద్రత దళంలో హరేడి బెటాలియన్‌ను ప్రారంభించాలని అనుకుంటున్నట్లు ఆయన ఫిబ్రవరిలో చెప్పారు. సనాతన ధర్మాన్ని ఆచరించే యువకులను సైన్యంలో పని చేయడానికి సమానంగా జాతీయ దళంలో నియమించాలని భావిస్తున్నట్లు చెప్పారు.

నెజాక్ యూడా బెటాలియన్ మీద ఆంక్షలు విధించడం “ సిద్ధాంతపరమైన తప్పిదమని ” వార్ క్యాబినెట్ మినిస్టర్ గడి ఈసెన్‌కోట్ అన్నారు.

ఇజ్రాయెల్, సైన్యం, యుద్దం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, జుదాయిన్ ఎడారిలో పురాతన కొండ మీద ప్రార్థన చేస్తున్న నెజాక్ యుడా బలగాలు

“ఇది పూర్తిగా పిచ్చితనం. ప్రత్యేక పాలస్తీనా దేశాన్ని మాపైన రుద్దే ప్రయత్నం” అని అన్నారు ఇజ్రాయెల్ ఆర్థిక మంత్రి బెజ్లాల్ స్మోట్రిచ్

“నెతన్యాహు ప్రభుత్వం అక్రమ విధానాలు, రాజకీయ వైఫల్యాల వల్ల ఇజ్రాయెల్ సైన్యం, సైన్యాధిపతులు బాధితులుగా మారుతున్నారు” అని ప్రతిపక్ష నేత యాయిర్ లాపిడ్ ఆరోపించారు. “నెజాక్ యూడాబ్రిగేడ్ మీద ఆంక్షలు విధించాలనే ఆలోచన పెద్ద పొరపాటు. అలాంటి పొరపాటు అసలు చెయ్యవద్దు” అని గట్టిగా చెప్పారాయన.

నెజాక్ యూడా బ్రిగేడ్‌ను పూర్తిగా తొలగించాలని ఇజ్రాయెల్ లేబర్ పార్టీ అధ్యక్షుడు మెరావ్ మైఖేలి పిలుపిచ్చారు. ఈ బెటాలియన్ ఏళ్ల తరబడి హింసాత్మక కార్యకలాపాలకు, అవినీతికి మారు పేరు అని ఆయన అన్నారు.

నెజాక్ యుడా, ఇజ్రాయెల్ ఆర్మీ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, 2014లో శిక్షణ తీసుకుంటున్న నెజాక్ యూడా దళ సభ్యులు

నెజాక్ యూడా బ్రిగేడ్ ఎవరు?

హరెడి యూదుల్లో అనేక మంది సైన్యంలో చేరడాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే వారు ఎక్కువ సమయం టోరాలు( హిబ్రు బైబిల్‌లో మొదటి ఐదు పుస్తకాలు) నేర్చుకునేందుకే కేటాయిస్తారు. అంతే కాకుండా మతపరమైన గ్రంథాలను చదువుతారు. అందుకే వారు సైన్యానికి దూరంగా ఉండాలని భావిస్తారని హరేడి యూదుల చీఫ్ రబ్బి ఇజ్జాక్ యోసఫ్ చెప్పారు.

హరెడి రబ్బీలు సభ్యులుగా ఉండే లాభాపేక్ష లేని నహల్ హరెడి అనే సంస్థ 1999లో ప్రారంభించారు.

మతపరమైన విద్యాసంస్థల్లో చదువుకోని హరేడి యువకుల్ని సైన్యంలో చేర్చుకోవాలని ఈ సంస్థ రక్షణశాఖను, ఇజ్రాయెల్ సైన్యాన్ని కోరింది.

దీంతో సైన్యంలో నెట్జా యెహుడా బెటాలియన్ ఏర్పడింది. ఇందులో వేల మంది హరేడి యూదులు సైనికులుగా ఉన్నారు.

“హరేడి యువకులు తమ జీవన విధానంతో రాజీ పడకుండా, తమ విధానాలు, నిబంధనలకు కట్టుబడి ఇజ్రాయెల్ సైన్యంలో ఉన్నత పదవులు నిర్వహిస్తున్నారు. మేము ఇది అమలయ్యేలా చూస్తున్నాం” అని ద నహల్ హరేడి ఆర్గనైజేషన్ చెప్పింది.

నెజాక్ యూడా, ఇజ్రాయెల్, పాలస్తీనా, అమెరికా

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, జెరూసలేం అమ్యూనియేషన్ హిల్ ప్రాంతంలో బాధ్యతలు చేపడుతున్ననెజాక్ యూడా సైనికులు

1999లో తొలిసారి 30 మంది హరేడి సైనికులతో కలిసి “ నహల్ హరేడి”, “నెట్జా యెహుదా” లేదా “ బెటాలియన్ 97” ఏర్పడింది. మొదట పౌర సేవలతో మొదలైన ఈ సంస్థ ప్రయాణం తర్వాతి కాలంలో సైన్యంలో హరేడియంను పరిచయం చేస్తూ కొనసాగింది.

ఇజ్రాయెల్ సైన్యం తొలిసారిగా హరేడి పోరాట దళాన్ని ఏర్పాటు చేసి రమల్లా, జెనిన్‌లో ఆ దళాలను మోహరించింది. 2019లో ఇజ్రాయెల్ సైన్యం నెజాక్ యూడా బెటాలియన్‌ను రమల్లా, జెనిన్ పంపాలని నిర్ణయించినట్లు హిబ్రూ వార్తా పత్రిక యోడియోత్ అహ్రనోత్ కథనాలు ప్రచురించింది.

“వరుస వైఫల్యాలు” అంటూ ఆ పత్రిక కథనాలు రాసిన తర్వాత ఇజ్రాయెల్ సైన్యం అధికార ప్రతినిధి తొలిసారిగా నెట్జా యెహుడా బెటాలియన్‌ను ‘పరిశీలన’ కోసం జెనిన్ పంపిస్తున్నట్లు చెప్పారు.

ఇజ్రాయెల్, పాలస్తీనా, అమెరికా ఆంక్షలు

ఫొటో సోర్స్, Netzah Yehuda Brigade website

ఫొటో క్యాప్షన్, ఇజ్రాయెల్ సైన్యంలో నెజాక్ యుడా సభ్యులకు ప్రత్యేక గుర్తింపు

2022 డిసెంబర్ నుంచి నెజాక్ యూడా బెటాలియన్‌లో సభ్యులను ఇజ్రాయెల్ సైన్యం నుంచి ప్రత్యేకంగా పరిగణించేవారు. ఈ బెటాలియన్‌లో సైనికుల ప్రవర్తన దృష్ట్యా వారిని వెస్ట్ బ్యాంక్ పంపడాన్ని ఆర్మీ వ్యతిరేకించినప్పటికీ ప్రభుత్వం వారిని వెస్ట్‌బ్యాంక్ పంపించింది.

అప్పటి నుంచి ఈ బెటాలియన్ ఉత్తర ఇజ్రాయెల్‌లో తన కార్యకలాపాలు నిర్వహిస్తోంది.

జెరూసలేం పోస్ట్ కథనం ప్రకారం ఈ ఏడాది తొలినాళ్లలో ఈ బెటాలియన్ గాజా యుద్ద క్షేత్రంలోకి దూకింది.

నెజాక్ యూడా బెటాలియన్ అంతర్భాగంగా ఉన్న ఫిర్ బ్రిగేడ్ గాజాతో పాటు లెబనాన్, సిరియాలో కూడా పోరాడగలదని ఇజ్రాయెల్ ఆర్మీ మాజీ కమాండర్ అవివ్ కొచ్చావి చెప్పారు.

ప్రస్తుతం నెజాక్ యూడా బెటాలియన్‌లో శిక్షణ తీసుకోవడం లేదా యుద్ధక్షేత్రంలో పోరాడుతున్న సైనికులు వెయ్యి మంది ఉన్నారు.

ఈ బెటాలియన్‌లో సైనికులు ఇజ్రాయెల్ సైన్యంలో రెండు సంవత్సరాల 8 నెలల కాలం సేవలు అందిస్తారు.

ఈ బెటాలియన్‌లో సైనికులు పురుష సైనికులతో కలిసి పని చేసినంతగా మహిళా సైనికులతో కలవరు. సైన్యంలో ఉన్నప్పటికీ వారు ప్రార్థన చేసుకోవడానికి, మతపరమైన గ్రంధాల అధ్యయనానికి అవసరమైనంత సమయం కేటాయిస్తారని టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్ తెలిపింది.

అమెరికా, ఇజ్రాయెల్ ఆర్మీ, పాలస్తీనీయులు, మానవహక్కులు

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, గోడ మీద అంటించిన చిత్రంలో ఒమర్ అస్సాద్

ఈ బెటాలియన్ మీద విమర్శలు ఎందుకు?

నెజాక్ యూడా బ్రిగేడ్ సభ్యులు 79 ఏళ్ల పాలస్తీనియన్- అమెరికన్‌ను ఒమర్ అస్సాద్‌ను ఓ చెక్ పాయింట్ దగ్గర అరెస్ట్ చేసే సమయంలో హత్య చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. సైనికులు ఆయన చేతికి బేడీలు వేశారని, ఆయన నోరు నొక్కేసి, నేలపై పడేశారని అస్సాద్ కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఆయన నేలపై పడిపోయాక చనిపోయినట్లు గుర్తించారు.

“ఇది దళాల నైతిక వైఫల్యం, నిర్ణయం తీసుకోవడంలో తప్పు జరిగింది. ఓ వ్యక్తి గౌరవ మర్యాదలకు తీవ్రమైన భంగం కలిగింది. ”. అస్సాద్ మరణంపై ఇజ్రాయెల్ సైన్యం విచారణ జరిపిన తర్వాత చేసిన వ్యాఖ్యలివి.

ఈ సంఘటన తర్వాత నెజాక్ యూడా బలగాలను వెనక్కి రప్పించారు. ఆ యూనిట్ కమాండర్, సైనికుల పటాలం కమాండర్‌ను తొలగించారు. ఈ సంఘటనకు కారకులుగా భావిస్తున్న సైనికులపై దర్యాప్తుకు ఆదేశించారు. అయితే అది ఒక కొలిక్కి రాకుండానే ముగించారు.

పాలస్తీనా పౌరుల మీద జరిగిన అనేక హింసాత్మక దాడుల్లో నెజాక్ యూడా బెటాలియన్‌లో పని చేస్తున్న సైనికుల ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు రావడంతో 2022లో అమెరికన్ స్టేట్ డిపార్ట్‌మెంట్ విచారణ మొదలు పెట్టింది. ఇందులో ఒమర్ అస్సాద్ మరణం కూడా ఉన్నట్లు హారెట్జ్ న్యూస్ పేపర్ కథనం వెల్లడించింది.

అక్టోబర్ 7న ఇజ్రాయెల్ గాజా స్ట్రిప్ మీద యుద్దానికి దిగిన తర్వాత పాలస్తీనీయుల మీద దాడులకు పాల్పడినందుకు గాను కొందరు యూదు సెటిలర్ల మీద అమెరికా మూడు విడతల్లో ఆంక్షలు విధించింది.

లీహే చట్టం, అమెరికా, డెమోక్రాట్లు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, మానవ హక్కుల ఉల్లంఘనలకు పాల్పడిన విదేశాలకు సాయం నిలిపివేయాలనే బిల్లు తయారు చేసిన అమెరికన్ మాజీ సెనేటర్ పాట్రిక్ లీహే

ఈ బెటాలియన్ మీద అమెరికా ప్రయోగించాలని అనుకుంటున్న లీహే చట్టంలో ఏముంది?

ఏదైనా విదేశీ ప్రభుత్వాలు మానవ హక్కుల ఉల్లంఘనలకు పాల్పడినట్లు తేలితే అమెరికన్ ప్రభుత్వం ఆయా దేశాలకు అందిస్తున్నసాయాన్ని ఆపేయవచ్చని లీహే చట్టంలో పేర్కొన్నట్లు అమెరికన్ స్టేట్ డిపార్ట్‌మెంట్ చెబుతోంది.

అమెరికన్ రక్షణ శాఖ చెబుతున్న దాన ప్రకారం సాయంతో పాటు ఆయా దేశాల సైన్యాలకు అందిస్తున్న శిక్షణ కార్యక్రమాలను కూడా నిషేధించవచ్చు.

మానవ హక్కుల ఉల్లంఘనలకు పాల్పడిన వారిని చట్ట ప్రకారం శిక్షించినట్లైతే అమెరికా అందిస్తున్న సాయాన్ని తిరిగి పునరద్దరించవచ్చు.

“విదేశీ భద్రతా బలగాల్లో ఏదైనా యూనిట్ మానవహక్కుల్ని యథేచ్చగా ఉల్లంఘించినట్లు నిర్థరించదగిన సమాచారం ఉంటే ఆ యూనిట్లకు లీహే చట్టం వర్తిస్తుంది” అని అమెరికన్ స్టేట్ డిపార్ట్‌మెంట్ చెబుతోంది.

రాజకీయాలు, భద్రత, ఇతర అంశాల విషయంలో మానవహక్కులకు సంబంధించి విచారణ జరపవచ్చు

హక్కుల ఉల్లంఘన గురించి అమెరికా ప్రభుత్వం పంపించిన అధికారులు ప్రజలు విచారించడం, రహస్య పత్రాలను పరిశీలించవచ్చు.

అమెరికన్ ప్రభుత్వం “చిత్రహింసలు పెట్టడం, హత్యలు చెయ్యడం, కిడ్నాప్ చెయ్యడం, అత్యాచారాలకు చట్టపరమైన ముద్ర వెయ్యడం లాంటి వాటిని మానవ హక్కుల ఉల్లంఘనగా పరిగణిస్తోంది.

అలాంటి నేరాలు నిరూపణ అయిన చోట లీహే చట్టాన్ని అమలు చేయవచ్చు.

1990 చివర్లో ఈ చట్టాన్ని రూపొందించిన సెనేటర్ పాట్రిక్ లీహే పేరు మీదుగా ఈ చట్టాన్ని లీహే చట్టం అని పిలుస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)