స్టార్మీ డేనియల్స్: డోనల్డ్ ట్రంప్‌‌ దోషిగా తేలిన ‘హష్ మనీ’ కేసులో కీలక వ్యక్తి అయిన ఈ మహిళ ఏం చెప్పారు?

ట్రంప్, స్టార్మీ డేనియల్స్ ఫోటో

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ట్రంప్, స్టార్మీ డేనియల్స్

అడల్ట్ చిత్రాల నటి స్టార్మీ డేనియల్స్‌కు డబ్బు చెల్లించి, ఆ చెల్లింపుల వివరాలను రికార్డుల్లో చూపించలేదనే ఆరోపణలపై అమెరికా మాజీ అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ దోషిగా తేలారు.

డేనియల్స్‌కు డబ్బు చెల్లించేందుకు తన బిజినెస్ రికార్డులను కూడా తారుమారుచేశారనే ఆరోపణలపై క్రిమినల్ విచారణను ఎదుర్కొని, దోషిగా తేలిన తొలి అమెరికా మాజీ అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్.

తానూ, ట్రంప్‌ శృంగారంలో పాల్గొన్నామని, ఈ విషయాన్ని బయటకు చెప్పకుండా దాచేందుకు 2016 ఎన్నికల ముందు లక్షా 30 వేల ( సుమారు రూ. 10.8 కోట్లు) అమెరికన్ డాలర్లను ట్రంప్ మాజీ లాయర్ ద్వారా తనకు అందినట్లు డేనియల్స్ గతంలో ప్రకటించారు.

తరువాత లాయర్ మైకేల్ కోహెన్ పలు అభియోగాలపై జైలుపాలయ్యారు.

2018లో ఈ అభియోగాలు వెలుగులోకి వచ్చినప్పటి నుంచి, డేనియల్‌తో తాను శృంగారంలో పాల్గొన్నాననే విషయాన్ని ట్రంప్ కొట్టిపారేస్తూ వచ్చారు.

డోనల్డ్ ట్రంప్ సెక్స్ కేస్

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, స్టార్మీ డేనియల్స్ అసలు పేరు స్టెఫానీ క్లిఫర్డ్. హాలివుడ్ చిత్రాలలోనూ నటించారు

ఎవరీ స్టార్మీ డేనియల్స్

45 ఏళ్ళ డేనియల్స్ అసలు పేరు స్టెఫానీ క్లిఫర్డ్. ఆమె లూసియనాలో జన్మించారు. శృంగార చిత్రాల నటి, దర్శకురాలు డేనియల్స్. సినీ రంగంలో ఆమె ప్రతిభకు గాను అనేక అవార్డులు గెలుచుకున్నారు.

దీంతోపాటు 2000లో వచ్చిన ‘40 ఇయర్స్ ఓల్డ్ వర్జిన్’, ‘నాక్డ్ అప్’ అనే చిత్రాలు సహా హాలీవుడ్ ప్రధాన స్రవంతి చిత్రాలలో కనిపించారు.

ఆమె రాజకీయాలలోనూ దూసుకుపోయారు. ట్రంప్‌లానే తనను తానే రిపబ్లికన్‌గా ప్రకటించుకున్నారు.

డేనియల్ వాదనేంటి?

తానూ, ట్రంప్ ఓ చారిటీ గోల్ఫ్ టోర్నమెంట్ సందర్భంగా 2006 జులైలో కలుసుకున్నామని డేనియల్స్ ఓ మీడియా ఇంటర్వ్యూలో చెప్పారు.

సాయంత్రం తనతో డిన్నర్‌కు రావాలని ట్రంప్ ఆహ్వానించారని, తనకు ఇష్టం లేకపోయినా, తన పబ్లిసిస్ట్ ( పబ్లిసిటీ కోసం పని చేసే వ్యక్తి) సూచన మేరకు ఆయనతో భోజనం చేసేందుకు అంగీకరించానని డేనియల్స్ అప్పట్లో వెల్లడించారు.

గోల్ఫ్ టోర్నమెంట్‌కు ట్రంప్ భార్య మెలనియా ట్రంప్ హాజరు కాలేదు. ఆ సమయంలో ఆమె బాలింత.

కాలిఫోర్నియా, నెవాడా మధ్యనున్న లేక్ తాహో వద్ద నున్న హోటల్ గదిలో తాను, ట్రంప్ సెక్స్‌లో పాల్గొన్నట్టు తెలిపారు.

హోటల్ రూమ్ దగ్గర ట్రంప్ పైజమాతో వచ్చి పలకరించారని, తాను బాత్ రూమ్‌కు వెళ్లి వచ్చే సరికి, బాక్సర్ షార్ట్, టీ షర్ట్ వేసుకుని బెడ్ మీద కూర్చుని కనిపించారని ఆమె వెల్లడించారు. తాము ఇద్దరం పరస్పర అంగీకారంతో ఈ చర్యలో పాల్గొన్నట్లు ఆమె తెలిపారు. ఆ సమయంలో తాము కండోమ్ కూడా ఉపయోగించలేదని చెప్పారు.

అయితే ఈ ఆరోపణలను ట్రంప్ లాయర్ ఆ సమయంలో కొట్టిపారేశారు.

ఆరోజు రాత్రి మీరిద్దరూ సెక్స్‌లో పాల్గొన్న విషయం ఎవరికీ చెప్పొద్దని ట్రంప్ మీకు చెప్పారా అనే ప్రశ్నకు బదులిస్తూ ‘‘ఆయన దీని గురించి ఆలోచిస్తున్నట్లుగా కనిపించ లేదు. ఆయనో అహంకారి’’ అని డేనియల్స్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.

ట్రంప్, స్టార్మీ డేనియల్స్

ఫొటో సోర్స్, EPA

ఫొటో క్యాప్షన్, కోర్టు నుంచి బయటకు వస్తున్ స్టార్మీ డేనియల్స్

బెదిరింపులు..చెల్లింపులు

ట్రంప్‌ తనతో శృంగారంలో పాల్గొన్న విషయాన్ని బయటకు చెప్పకుండా నోరుమూసుకుని ఉండేందుకు 2016 ఎన్నికల ముందు ట్రంప్ లాయర్ కోహెన్ ‘హష్-మనీ’ కింద 1,30,000 డాలర్లు ఇచ్చినట్టు డేనియల్స్ తెలిపారు. ఆ ఎన్నికలలో ట్రంప్ గెలిచారు.

తన కుటుంబానికి ఏమవుతుందోననే ఆందోళనతో తాను ఆ డబ్బు తీసుకున్నట్టు డేనియల్స్ చెప్పారు. తనను నోరుమూసుకుని ఉండాలంటూ కేసులతోనూ, భౌతికదాడులకు సంకేతాలతోనూ బెదిరించారని చెప్పారు.

2018లో లాస్ వెగాస్ పార్కింగ్ ప్రాంతంలో తన పసిపాపతో ఉన్నప్పుడు ఓ గుర్తుతెలియని వ్యక్తి తన వద్దకు వచ్చి ట్రంప్‌ గురించి మర్చిపొమ్మని బెదిరించారని చెప్పారు.

తనకు ట్రంప్‌తో ఉన్న శృంగార సంబంధంపై ‘టచ్’ మేగజైన్‌కు ఇంటర్వ్యూ ఇవ్వడానికి అంగీకరించిన కొద్దిసేపటికే ఈ ఘటన జరిగిందని తెలిపారు.

‘‘ఈ పసిపాప చాలా అందంగా ఉంది. ఆమె తల్లికి ఏమైనా జరిగితే అదెంత బాధాకరం.’’ అని ఆ గుర్తు తెలియని వ్యక్తి తనతో అన్నారని సీబీఎస్ 60 మినిట్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో డేనియల్ చెప్పారు.

ఈ ఎపిసోడ్ ప్రసారం కావడానికి ముందు డేనియల్ తో కుదుర్చుకున్న రహస్య ఒప్పందం, లేదా ‘హష్ అగ్రిమెంట్’ను డేనియల్ ఉల్లంఘించారని, ఇందుకు ఆమె 20 మిలియన్ డాలర్ల నష్టపరిహారం కేసు ఎదుర్కోవాల్సి వస్తుందని కోహెన్‌కు సంబంధించిన ఓ డొల్ల కంపెనీ ఆమెను బెదిరించింది.

ఈ విషయాన్ని డేనియల్స్ ‘సీబీఎస్ షో’లో మాట్లాడుతూ తాను జాతీయ టెలివిజన్‌లో మాట్లాడటం ద్వారా మిలియన్ డాలర్ల జరిమానా ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నానని, కానీ, తనను తాను రక్షించుకోవడానికి ఇది చాలా అవసరమ’’ని చెప్పారు.

అయితే 2018 వరకు ఆమె ఇంటర్వ్యూ పూర్తిగా ప్రసారం కాలేదు.

డోనాల్డ్ ట్రంప్

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, ట్రంప్ పై 34 అభియోగాలు మోపారు

హష్ -మనీ చెల్లింపు అక్రమమా?

రహస్య ఒప్పందం కింద ఒకరికి నష్టపరిహారం చెల్లించడం చట్టవిరుద్ధం కాదు. కానీ ట్రంప్ ఖాతాల్లో కోహెన్‌కు చెల్లించిన డబ్బు ఎలా భర్తీ అయిందనే విషయంపైనే ప్రాసిక్యూటర్లు దృష్టి సారించారు.

ఈ చెల్లింపులను లీగల్ ఫీజులుగా పేర్కొనడం ద్వారా వ్యాపార రికార్డులను తారుమారు చేశారని ట్రంప్ పై అభియోగాలు నమోదయ్యాయి.

అధ్యక్ష ఎన్నికలకు కొద్దిరోజుల ముందు ఇవి వెలుగులోకి వచ్చాయి.

‘‘హానికారక సమాచారం ప్రజలకు తెలియకుండా ఉండేందుకు నేరాలను కప్పిపుచ్చేందుకు ట్రంప్ ప్రయత్నించారని’’ డిస్ట్రిక్ట్ అటార్నీ అల్విన్ బ్రాగ్ ఆరోపించారు.

2018 ఆగస్టులో పన్నుల ఎగవేత, డేనియల్స్‌కు చెల్లింపుల విషయంలో ప్రచార ఆర్థిక నిబంధనలను అతిక్రమించిన కేసులో దోషిగా తేలడంతో ట్రంప్ మాజీ లాయర్ కోహెన్ జైలు పాలయ్యారు.

అయితే ఈ చెల్లింపులతో ట్రంప్‌కు ఎలాంటి సంబంధం లేదని తొలుత కోహెన్ చెప్పారు.

కానీ తరువాత ట్రంపే 1,30,000 డాలర్ల హుష్ చెల్లింపులు చేయాల్సిందిగా ఆదేశించారని అంగీకరించారు.

ఈ డబ్బును ట్రంప్ లెక్కల్లో ఎలాగోలా సెట్ చేశారని కూడా చెప్పారు.

మరోసారి అధ్యక్ష పదవి కోసం ట్రంప్ పోటీ

ఫొటో సోర్స్, GETTY IMAGE

ఫొటో క్యాప్షన్, అధ్యక్ష ఎన్నికల్లో పోటీపడుతున్న ట్రంప్

ట్రంప్ ఏం చెబుతూ వచ్చారు?

వ్యాపార రికార్డులను తారుమారు చేశారనే 34 నేరారోపణలలో తాను నిర్దోషినని ట్రంప్ మన్‌హట్టన్ క్రిమినల్ కోర్టులో వాదించారు.

డేనియల్స్‌కు జరిపిన చెల్లింపులపై ఆయన మీద అభియోగాలు నమోదయ్యాయి. అలాగే తమ మధ్యనున్న లైంగిక సంబంధాల విషయంపై నోరు మెదపకుండా ఉండేందుకు మాజీ ప్లేబాయ్ మోడల్‌ కరేన్ మెక్‌డౌగల్‌కు కూడా ఆయన డబ్బు చెల్లించడంపైనా విచారణ కొనసాగుతోంది.

తన కేసు విచారణ ప్రారంభం కావడానికి ముందు ట్రంప్ తన సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్ ‘ట్రూత్’లో తన కేసును విచారించే జడ్జిని లక్ష్యంగా చేసుకున్నారు. దానిని డెమెక్రాట్ల నేతృత్వంలో సాగే ‘విచ్ హంట్’గా పేర్కొన్నారు.

ట్రంప్ మద్దతుదారులు, మతపరమైన మితవాదులు కూడా ట్రంప్ గత ప్రవర్తనను, ఆయనపై మహిళలు మోపిన అభియోగాలను కొట్టిపారేశారు.

ఇవి కూడా చదవండి:

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)