డోనల్డ్ ట్రంప్: 2024లో అధ్యక్ష ఎన్నికల్లో నేను ‘మళ్లీ పోటీ చేసే అవకాశం చాలా చాలా చాలా ఉంది’

అమెరికా అధ్యక్ష పదవికి 2024లో జరిగే ఎన్నికల్లో తాను పోటీ చేయటానికి ‘‘చాలా చాలా చాలా అవకాశం’’ ఉందని మాజీ అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ చెప్పారు.

లైవ్ కవరేజీ

  1. ఇమ్రాన్ ఖాన్ మీద కాల్పులు: ఘటనా స్థలంలో 11 బులెట్ షెల్స్ స్వాధీనం

    ఇమ్రాన్ ఖాన్ మీద కాల్పులు జరిగిన ప్రాంతం

    పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ మీద జరిగిన ప్రాణాంతక దాడిపై దర్యాప్తు ప్రారంభమైంది.

    వజీరాబాద్‌లో గురువారం సాయంత్రం ఇమ్రాన్ మీద దాడి జరిగిన ప్రాంతాన్ని దర్యాప్తు అధికారులు సీల్ చేశారు.

    ఇమ్రాన్ లాంగ్ మార్చ్ కోసం ఉపయోగించిన కంటెయినర్‌ చుట్టూ బారికేడ్లు పెట్టి, ఎవరూ రాకుండా నిరోధించారు.

    ఇరువైపులా రాకపోకలు సాగించే వీలున్న ఆ రోడ్డులో ఒకవైపు ట్రాఫిక్‌ను నిలిపివేశారు.

    ఘటనా స్థలంలో 11 బులెట్ షెల్స్‌ను దర్యాప్తు బృందం స్వాధీనం చేసుకుంది.

    కంటెయినర్ ముందు, వెనుక ఉన్న ఉక్కు రేకులను దర్యాప్తు బృందం కత్తిరించింది. ఆ రేకులో బులెట్లు దిగాయని, అందుకే వాటిని కత్తిరించామని పోలీసులు తెలిపారు.

    ఆ బులెట్లు ఏ తరహా తుపాకీ నుంచి పేల్చారో తెలుసుకోవటానికి ఈ బులెట్లను ఫోరెన్సిక్ పరీక్షలకు పంపిస్తామన్నారు.

    అవి అదుపులో ఉన్న నిందితుడి తుపాకీ నుంచి కాల్చిన బులెట్లేనా, లేదంటే వేరే తుపాకీ నుంచి కాల్చిన బులెట్లా అనేది ఫోరెన్సిక్ దర్యాప్తులో తెలుస్తుంది.

    ఇమ్రాన్ ఖాన్ మీద కాల్పులు జరిగిన ప్రాంతం
    ఇమ్రాన్ ఖాన్ మీద కాల్పులు జరిగిన ప్రాంతం
  2. ఇజ్రాయెల్ ఎన్నికల్లో నెతన్యాహు కూటమి గెలుపు.. మళ్లీ ప్రధాని కానున్న బెంజమిన్

    బెంజమిన్ నెతన్యాహు

    ఫొటో సోర్స్, Reuters

    ఇజ్రాయెల్‌ పార్లమెంటు ఎన్నికల్లో మాజీ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు సారథ్యంలోని లికుడ్ పార్టీ కూటమి గెలుపొందింది. దీంతో ఆయన మరోసారి ప్రధానమంత్రి పదవి చేపట్టనున్నారు.

    పార్లమెంటులోని మొత్తం 120 స్థానాలకు మంగళవారం జరిగిన ఎన్నికల తుది ఫలితాలు గురువారం రాత్రి వెల్లడయ్యాయి. నెతన్యాహుకు చెందిన లికుడ్ పార్టీ, దాని మితవాద, మతవాద మిత్రపక్షాలు ఉమ్మడిగా 64 సీట్లు గెలుచుకున్నాయి.

    దీంతో.. దాదాపు ఏడాది కిందట తన ప్రత్యర్థుల చేతుల్లో పదవి కోల్పోయిన నెతన్యాహు నాటకీయంగా అధికారంలోకి తిరిగివచ్చారు.

    ప్రధానమంత్రిగా వరుసగా 12 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న నెతన్యాహు 2021లో ఆ పదవి కోల్పోయారు. ఆయన అవినీతి, మోసం, నమ్మకద్రోహం ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసులో వచ్చే సోమవారం కూడా విచారణ జరుగనుంది.

    తాజా ఎన్నికల్లో నెతన్యాహు గెలవటంతో ఆయనకు ప్రస్తుత ప్రధానమంత్రి యాయిర్ లాపిడ్ శుభాకాంక్షలు తెలిపారు.

    ఇజ్రాయెల్ ఎన్నికలు

    ఫొటో సోర్స్, Reuters

    అంతకుముందు నెతన్యాహు తన మద్దతుదారులతో మాట్లాడుతూ.. ‘‘ఎలాంటి మినహాయింపులు లేకుండా ఇజ్రాయెల్ పౌరులందరిని సంక్షేమాన్ని చూసుకునే ప్రభుత్వాన్ని’’ తాము ఏరుపాటు చేస్తామని చెప్పారు.

    ‘‘మేం భద్రతను పునరుద్ధరిస్తాం. జీవన వ్యయాన్ని తగ్గిస్తాం. శాంతి వలయాన్ని మరింతగా విస్తరిస్తాం. ఇజ్రాయెల్‌ను ఎదుగుతున్న శక్తిగా పునురద్ధరిస్తాం’’ అని పేర్కొన్నారు.

    ఇజ్రాయెల్ మీడియా కథనాల ప్రకారం.. ఎన్నికల తుది ఫలితాల్లో నెతన్యాహుకు చెందిన లికుడ్ పార్టీకి 32 సీట్లు, ప్రధాని లాపిడ్‌కు చెందిన యేష్ అటిడ్ పార్టీకి 24 సీట్లు, రెలిజియస్ జియోనిజం కూటమికి 14 సీట్లు, నేషనల్ యూనిటీ పార్టీకి 12 సీట్లు లభించాయి.

    అలాగే షాస్ పార్టీకి 11 సీట్లు, టోరా జుడాయిజం పార్టీకి 7 సీట్లు వచ్చాయి. యిజ్రాజెల్ బీటీను పార్టీకి 6 సీట్లు, అరబ్ రామ్ పార్టీకి 5 సీట్లు, హదాష్ టాల్ పార్టీకి 5 సీట్లు, లేబర్ పార్టీకి 4 సీట్లు చొప్పున లభించాయి.

  3. రష్యా ఇంధన ఉగ్రవాదానికి పాల్పడుతోంది: జెలియెన్‌స్కీ

    అంధకారంలో యుక్రెయిన్ జనం

    ఫొటో సోర్స్, Getty Images

    రష్యా ‘ఇంధన ఉగ్రవాదా’నికి పాల్పడుతోందని యుక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలియెన్‌స్కీ ఆరోపించారు.

    యుక్రెయిన్ ఇంధన వనరుల మీద రష్యా దాడుల వల్ల దేశంలో 45 లక్షల మంది జనం విద్యుత్ లేకుండా అంధకారంలో నివసించే పరిస్థితి వచ్చిందని ఆయన చెప్పారు.

    రష్యా ఇటీవలి వారాల్లో యుక్రెయిన్ విద్యుత్ కేంద్రాల మీద భారీ స్థాయిలో క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేసింది.

    యుక్రెయిన్ దక్షిణ ప్రాంతంలో కీలకమైన ఖేర్సన్ నగరం నుంచి రష్యా బలగాలను ఉపసంహరించుకునే అవకాశం ఉందని అధికారులు చెప్తున్న నేపథ్యంలో ఆ దాడులు జరిగాయి.

    యుద్ధరంగంలో వరుసగా ఓటములు చవిచూసిన తర్వాత రష్యా ఇటీవలి వారాల్లో.. యుద్ధరంగాలకు దూరంగా ఉన్న నగరాల్లో విద్యుత్ సదుపాయాల మీద దాడులు పెంచింది.

    అంధకారంలో యుక్రెయిన్

    ఫొటో సోర్స్, EPA

    ఒక్క గత నెలలోనే దేశంలోని విద్యుత్ స్టేషన్లలో మూడో వంతు ధ్వంసమైనట్లు జెలియెన్‌స్కీ చెప్తున్నారు.

    ఈ పరిస్థితుల్లో ప్రజలు విద్యుత్‌ను పొదుపుగా వినియోగించటానికి ప్రయత్నించాలని యుక్రెయిన్ ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది.

    ‘‘ఈరోజు రాత్రి దాదాపు 45 లక్షల మంది వినియోగదారులు తాత్కాలికంగా విద్యుత్ లేకుండా ఉన్నారు’’ అని గురువారం రాత్రి జెలియెన్‌స్కీ పేర్కొన్నారు.

    ‘‘రష్యా ఇంధన ఉగ్రవాదానికి పాల్పడుతుండటం.. మా శత్రువు బలహీనతను చూపుతోంది. వారు యుద్ధరంగంలో యుక్రెయిన్‌ను ఓడించలేరు. కాబట్టి వాళ్లు మా ప్రజలను ఈ విధంగా దెబ్బతీయటానికి ప్రయత్నిస్తున్నారు’’ అని ఆయన విమర్శించారు.

  4. 2024 అధ్యక్ష పదవికి ‘నేను మళ్లీ పోటీ చేసే అవకాశం చాలా చాలా చాలా ఉంది’: డోనల్డ్ ట్రంప్

    డోనల్డ్ ట్రంప్

    ఫొటో సోర్స్, Getty Images

    అమెరికా అధ్యక్ష పదవికి 2024లో జరిగే ఎన్నికల్లో తాను పోటీ చేయటానికి ‘‘చాలా చాలా చాలా అవకాశం’’ ఉందని మాజీ అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ చెప్పారు.

    వచ్చే వారం జరుగబోయే మధ్యంతర ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థులకు ఓటు వేయాలను కోరుతూ ట్రంప్ ఐదు ప్రచార సభలు నిర్వహిస్తున్నారు.

    ఇందులో భాగంగా అయోవాలోని సియాక్స్ సిటీలో గురువారం రాత్రి తొలి సభలో ట్రంప్ మాట్లాడారు. 2020 ఎన్నికల్లో విస్తృత ఎన్నికల మోసం వల్ల తాను ఓడిపోయాననే తన నిరాధార ఆరోపణను ఆయన పునద్ఘాటించారు.

    అధ్యక్ష పదవికి ‘‘నేను రెండు సార్లు పోటీ చేశాను. మొదటిసారి కన్నా రెండోసారి మరింత బాగా రాణించాను. 2020లో కన్నా 2022లో లక్షలాది ఓట్లు ఎక్కువ తెచ్చుకున్నాను. అమెరికా చరిత్రలో ఏ సిటింగ్ ప్రెసిడెంట్ కన్నా ఎక్కువ ఓట్లు సంపాదించాను’’ అని చెప్పుకొచ్చారు.

    ‘‘ఇప్పుడు మన దేశాన్ని విజయవంతంగా, సురక్షితంగా, గొప్పగా చేయటానికి నేను మళ్లీ పోటీ చేయటానికి చాలా చాలా చాలా అవకాశం ఉంది’’ అని ట్రంప్ పేర్కొన్నారు.

    ‘‘చాలా త్వరగా.. సిద్ధంగా ఉండండి’’ అంటూ మద్దతుదారుల కేరింతల మధ్య ఆయన చెప్పారు.

    2022 ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి అయిన ట్రంప్.. సిటింగ్ ప్రెసిడెంట్‌గా నిజంగానే అత్యధిక ఓట్లు సంపాదించారు. ఆయనకు 7.2 కోట్ల ఓట్లు వచ్చాయి. ఆ ఎన్నికల్లో గెలిచిన ఆయన ప్రత్యర్థి, డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్‌కు 8.1 ఓట్లు లభించాయి.

  5. గుడ్ మార్నింగ్!

    బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం.

    స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల లైవ్ అప్‌డేట్స్ కోసం ఈ పేజీని చూస్తూ ఉండండి.