రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ఆ తప్పు వల్లే గెలవలేకపోతోందా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, భరత్ శర్మ
- హోదా, బీబీసీ ప్రతినిధి
‘బెంగళూరులో కరవు పరిస్థితి ఉందని చెప్పింది ఎవరు? ఆర్‌సీబీ అభిమానుల కళ్లలోకి చూడండి, కేవలం నీరు మాత్రమే కనిపిస్తోంది.’
‘బెంగళూరులో నీటి సంక్షోభాన్ని పరిష్కరించేందుకు ఆర్‌సీబీ ప్రయత్నిస్తోంది. ఎందుకంటే ప్రతి మ్యాచ్‌లోనూ టీమ్ అభిమానులు ఏడుస్తుంటారు. ఆర్‌సీబీ అద్భుతంగా ఆలోచిస్తోంది.’
సోషల్ మీడియాలో ఈ రెండు జోకులూ చాలా మందిలో నవ్వులు పూయిస్తున్నాయి. కానీ, మీరు బెంగళూరుకు చెందిన వారైనా లేదా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) అభిమానులైనా మీ హృదయాన్ని గాయపరిచే దారుణమైన వెక్కిరింపులివీ.
ఐటీ క్యాపిటల్, ‘టెక్ సిటీ ఆఫ్ ఇండియా’గా పిలుచుకునే బెంగళూరులో ఇటీవల మంచినీటి కుళాయిలు ఎండిపోయాయి. చాలా మంది నీటి ఎద్దడిని ప్రత్యక్షంగా చూశారు.
ఈ నగరంలో చిన్న ఇల్లు కూడా కోట్ల రూపాయల విలువ చేస్తుంది. అయితే, ఇక్కడ ప్రస్తుతం తీవ్రమైన నీటి సమస్య వేధిస్తోంది.
ఇక్కడి లోక్‌సభ ఎన్నికల ప్రచారంలోనూ ‘టెక్ సిటీ’ని ‘ట్యాంకర్ సిటీ’గా మార్చేశారని రాజకీయ నాయకులు చెణుకులు విసురుతున్నారు. ఎన్నికల అంశాల్లో నీరు ప్రధానమైనదిగా మారిపోయింది.
నీటి సమస్య పరిష్కారం లానే ఇక్కడ ఏళ్ల నుంచీ బెంగళూరువాసులు ఎదురుచూస్తున్నది మరొకటి ఉంది. అదే గొప్ప విజయం. అదే ఐపీఎల్‌లో గెలుపు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లోని మంచి టీమ్‌లలో ఒకటిగా చెప్పుకునే ఆర్‌సీబీ ఎందుకు విజయం సాధించలేకపోతోంది?
ఈ ప్రశ్నకు ఎన్ని సమాధానాలు చెప్పినా ప్రేక్షకులు మాత్రం సమాధాన పడలేకపోతున్నారు. దీనికి కారణాలేమిటో ఇప్పుడు చూద్దాం..

ఫొటో సోర్స్, Getty Images
ఆర్‌సీబీ జాతకమిదీ..
ఆర్‌సీబీ అనగానే రాహుల్ ద్రవిడ్, కెవిన్ పీటర్సన్, అనిల్ కూంబ్లే, డేనియెల్ వెట్టోరీ, షేన్ వాట్సన్ లాంటి పెద్దపెద్ద క్రికెటర్ల పేర్లు వినిపిస్తుంటాయి. విరాట్ కోహ్లీ, క్రిస్ గేల్, ఏబీ డెవిలియర్స్‌ల త్రయంతోపాటు డు ప్లెసిస్, కోహ్లీ, గ్లెన్ మ్యాక్స్‌వెల్‌ల త్రయం గురించి కూడా అభిమానులు చాలా మాట్లాడుకుంటారు. వీరు కప్పు తెచ్చిపెడతారని అభిమానులు బలంగా నమ్మేవారు. కానీ, అది సాధ్యం కాలేదు. అసలు ఈ కథ ఎక్కడి నుంచి మొదలైందో, అక్కడి నుంచే చూద్దాం.
అది 2007. ప్రపంచంలోని చాలా ప్రాంతాల్లో 20-20 మ్యాచ్‌లకు మంచి ఆదరణ లభిస్తోంది. స్టేడియంలకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య బాగా పెరుగుతోంది. అదే ఏడాది సెప్టెంబరులో భారత్‌లోనూ అదే పరిణామాలు పునరావృతం అయ్యాయి.
బీసీసీఐ అదే ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)ను మొదలుపెట్టింది. లిక్కర్ నుంచి విమానయాన సంస్థల వరకూ అన్నింటా వ్యాపారాలున్న విజయ్ మాల్యా దాదాపు 120 మిలియన్ డాలర్లతో బెంగళూరు ఫ్రాంచైజీని కొనుగోలు చేశారు.
నేడు ఆర్‌సీబీ.. డియాజియో గ్రూప్‌కు చెందిన యునైటెడ్ స్పిరిట్స్ లిమిటెడ్ (యూఎస్‌ఎల్) జట్టు.
ఆల్కహాల్ ఉత్పత్తుల్లో ప్రపంచంలోని ప్రముఖ సంస్థల్లో యూఎస్‌ఎల్ కూడా ఒకటి. చాలా బ్రాండ్ల స్పిరిట్స్, వైన్ కేటగిరీలను సంస్థ విక్రయిస్తోంది. 12 కోట్ల కేసుల స్కాచ్ విస్కీ, ఐఎంఎఫ్ఎల్ విస్కీ, బ్రాందీ, రమ్, వోడ్కా, జిన్, వైన్‌లను కంపెనీ విక్రయిస్తోంది. జానీ వాకర్, వ్యాట్ 69, బ్లాక్ అండ్ వైట్, స్మిర్నాఫ్ లాంటి బ్రాండ్లను కూడా దిగుమతి చేసుకుంటుంది, తయారుచేస్తుంది కూడా.
యూఎస్‌ఎల్ పోర్టుఫోలియోలో 18 బ్రాండ్లు ఉన్నాయి. మిలియన్ల కొద్దీ కేసుల ఆల్కహాల్‌ను సంస్థ విక్రయిస్తోంది. వీటిలో కొన్ని ప్రముఖ బాండ్లు అయితే, ఏటా కోటి కేసుల కంటే ఎక్కువే అమ్ముడుపోతుంటాయి. ఈ కంపెనీ చైర్మన్ పేరు ప్రథమేశ్ మిశ్ర.

ఫొటో సోర్స్, Getty Images
ఇప్పుడు జట్టు యజమాని గురించి, జట్టు గురించి మాట్లాడుకుందాం. జట్టు కెప్టెన్సీ దక్షిణాఫ్రికాకు చెందిన ఫాఫ్ డు ప్లెసిస్ వద్ద ఉంది. హెడ్ కోచ్ ఆండీ ఫ్లవర్. ఆయన జింబాబ్వేకు చెందినవారు. బౌలింగ్ కోచ్‌గా ఆస్ట్రేలియన్ ఆడమ్ గ్రిఫిత్ కొనసాగుతున్నారు. శ్రీధరన్ శ్రీరామ్ బ్యాటింగ్, స్పిన్ బౌలింగ్ కోచ్.
జట్టు యజమానులు, కోచ్‌ల గురించి మాట్లాడుకున్న తర్వాత, ప్రస్తుతం ఫీల్డ్‌లో జట్టు ప్రతిభను పరిశీలిద్దాం. 2009, 2011, 2016లలో ఈ జట్టు ఫైనల్స్‌కు చేరుకుంది. కానీ, కప్పును మాత్రం సాధించలేకపోయింది. ఈ సీజన్లను కొంతవరకు విజయవంతమైనట్లు చెప్పుకుంటే మిగతా సీజన్లలో మాత్రం జట్టు గడ్డు పరిస్థితులను చవిచూసింది.
ముఖ్యంగా 2008, 2012, 2013, 2014, 2017, 2018, 2019, 2023 సీజన్లు అయితే, లీగ్ స్టేజీలోనే ఆర్‌సీబీ ఆగిపోయింది.
మొదటి ఐపీఎల్‌ను 2008లోనే ఆర్‌సీబీ ఆడింది. 16 ఏళ్లు గడుస్తున్నప్పటికీ ట్రోఫీని ముద్దాడే అవకాశం ఒక్కసారి కూడా జట్టుకు రాలేదు. ప్రస్తుత 17వ సీజన్‌లోనూ విజయాల కంటే అపజయాలను ఎక్కువ మూట కట్టుకుంటూ పాయింట్స్ టేబుల్‌లో అట్టడుగున కపిపిస్తోంది. ఆడిన ఎనిమిది మ్యాచ్‌లలో ఏడు ఓడిపోవడంతో రెండే పాయింట్లతో చివరి స్థానంలో ఆర్‌సీబీ కనిపిస్తోంది.

ఫొటో సోర్స్, ANI
ఎందుకు గెలవలేకపోతోంది?
ఎందుకు ఆర్‌సీబీ ఐపీఎల్ ట్రోఫీని గెలవలేకపోతోంది? దీనికి సమాధానం కాస్త కఠినంగా ఉండొచ్చు. ఎందుకంటే తప్పుల నుంచి కొత్త విషయాలు నేర్చుకునేందుకు జట్టు సిద్ధంగాలేదు. కేవలం బ్యాట్స్‌మన్‌ల సాయంతోనే కప్పు గెలవాలని జట్టు చూస్తోందని, కానీ, అది అసాధ్యమని నిపుణులు చెబుతున్నారు.
ఈ విషయంపై క్రికెట్ నిపుణులు, రచయిత అయాజ్ మెమన్ బీబీసీతో మాట్లాడారు. ‘‘చరిత్రను గమనిస్తే జట్టులో స్టార్లకేమీ కొదువలేదు. కానీ, కొన్నిసార్లు మాత్రమే జట్టు ప్లేఆఫ్స్ వరకూ చేరుకుంది. ట్రోఫీని గెలవలేకపోవడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. కాంబినేషన్ల విషయంలో సరైన నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారు. ప్రతి సీజన్‌లోనూ అవే తప్పులు పునరావృతం అవుతున్నాయి’’ అని ఆయన అన్నారు.
ప్రస్తుత సీజన్‌లోనూ కాంబినేషన్ సరిగాలేదని, అసలు జట్టులో మంచి స్పిన్ బౌలర్లే లేరని, జట్టులో ఇదే అత్యంత ప్రధానమైన బలహీనతని మెమన్ చెప్పారు.
స్లో బౌలింగ్‌తోనైనా ఇండియన్ పిచ్‌లపై మ్యాచ్‌లు గెలవచ్చు. అయినప్పటికీ శ్రీలంక బౌలర్ హసరంగ, ఇండియన్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్‌లను ఆర్‌సీబీ జట్టులోకి తీసుకోలేదు.
2024 వేలంలో రూ.20 కోట్ల కంటే ఎక్కువే ఆర్‌సీబీ ఖర్చుపెట్టింది. కానీ, ఒక్క స్పిన్ బౌలర్‌ను కూడా జట్టులోకి తీసుకోలేదు. తీసుకున్న ఆరుగురిలో ముగ్గురు ఫాస్ట్ బౌలర్లు, ఇద్దరు ఆల్ రౌండర్లు, ఒక బ్యాట్స్‌మన్ ఉన్నారు. అంతే..

ఫొటో సోర్స్, Getty Images
వేలం సమయంలోనే ఆర్‌సీబీ చేసిన తప్పును ప్రముఖ క్రికెట్ నిపుణుడు, జర్నలిస్టు, రచయిత విజయ్ లోక్‌పల్లి ఎత్తిచూపారు.
‘‘ఏదైనా మ్యాచ్ లేదా టోన్నమెంట్‌లో విజయం సాధించాలంటే బౌలర్లు, బ్యాట్స్‌మెన్ సరైన కాంబినేషన్‌లో ఉండాలి. కానీ, ఆర్‌సీబీ దగ్గర బ్యాట్స్‌మన్ మాత్రమే ఉన్నారు. వేలం సమయంలోనే సరైన కాంబినేషన్స్ ఉండేలా చూసుకోవాలి’’ అని ఆయన అన్నారు.
‘‘మ్యాచ్‌ను గెలవడానికి బౌలర్లు కావాలి. మీరు 300 రన్లు కొట్టారు అనుకోండి. ప్రత్యర్థి జట్టును ఆ స్కోరు కొట్టకుండా అడ్డుకునేందుకు బౌలర్లు ఉండాలి కదా. లేదంటే అంత స్కోర్ కొట్టి ఏం ఉపయోగం?’’ అని ఆయన ప్రశ్నించారు.

ఫొటో సోర్స్, ANI
కొన్నిసార్లు బ్యాటర్లు కూడా..
ఇతర లోపాలపైనా ఆర్‌సీబీ దృష్టిపెట్టాల్సి ఉంటుంది. డేటాను పరిశీలిస్తే, ఆ లోపాలేమిటో ఇట్టే అర్థం అవుతుంది. ఐపీఎల్ చరిత్రలో ఆర్‌సీబీకి చెందిన ఆరుగురు బ్యాటర్లు మాత్రమే వెయ్యి రన్ల మార్కును దాటారు. వీరిలో విరాట్ కోహ్లీ మాత్రమే ఇండియన్ బ్యాట్స్‌మన్. ఏబీ డెవిలియర్స్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, క్రిస్ గేల్, జాక్వెస్ కల్లిస్, ఫాఫ్ డు ప్లెసిస్‌లు కూడా ఈ ఘనత సాధించినవారిలో ఉన్నారు.
అదే సమయంలో ఐపీఎల్‌లో విజయవంతమైన జట్లలో ఒకటిగా చెప్పుకునే చెన్నై సూపర్ కింగ్స్‌లో ఈ ఘనత సాధించినవారు 12 మంది ఉన్నారు. వీరిలో ఏడుగురు భారతీయులు. అలానే ముంబయి ఇండియన్స్‌లోనూ పది మంది వెయ్యి మార్కు దాటారు. వీరిలోనూ ఏడుగురు భారతీయులు.
దేశీయ ఆటగాళ్లను ఎంచుకోవడంలో సీఎస్‌కే, ముంబయి ఇండియన్స్‌ను చూసి ఆర్‌సీబీ నేర్చుకోవాలని నిపుణులు చెబుతున్నారు.
‘‘దీన్ని మేనేజ్‌మెంట్ లేదా కల్చర్.. ఏదైనా అనుకోండి. సీఎస్‌కే దీన్ని భిన్నంగా చూస్తుంది. ముంబయి ఇండియన్స్ కూడా అంతే. పెద్దపెద్ద పేర్ల వెనుక వెళ్లాల్సిన పనిలేదు. ప్రతిభ ఉంటే చాలు.. జట్టులోకి తీసుకోవచ్చు. ముంబయి ఇండియన్స్ కూడా అదే చేస్తోంది. ఈ విధానాన్నే రాజస్థాన్ రాయల్స్ కూడా కొంతవరకు అనుసరిస్తోంది’’ అని మెమన్ అన్నారు.
‘‘ఆర్‌సీబీ చేసిన తప్పులనే పదేపదే చేస్తోంది. దాదాపు శక్తిమొత్తాన్ని ఒకే అంశంపై ధారపోస్తోంది.’’ సీనియర్ జర్నలిస్టు ధర్మేంద్ర పంత్ కూడా ఇదే విషయాన్ని చెప్పారు.
‘‘కేవలం కొంతమంది స్టార్‌లపైనే ఆర్‌సీబీ ఆధారపడుతోంది. సరైన సమయాల్లో వీరు ఒత్తిడి వల్ల సరిగా ఆడలేకపోతున్నారు. ఇక రెండో లోపం ఏమిటంటే.. జట్టులో బ్యాలెన్స్ లేదు. ఒక్క మంచి స్పిన్నర్‌ను కూడా వీరు జట్టులోకి తీసుకోలేదు. అసలు చాహల్‌ను ఎందుకు జట్టు నుంచి తప్పించారో తెలియడం లేదు’’ అని ఆయన అన్నారు.
‘‘టాప్ ఆర్డర్‌లో ఆర్‌సీబీ దగ్గర మంచి బ్యాట్స్‌మన్ ఉన్నారు. వీరు బాగా ఆడినప్పుడు మిడిల్ ఆర్డర్‌కు అంత అవకాశమేమీ రావడం లేదు. ఒక్కోసారి మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మన్ తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్నారు. సాధారణంగా డు ప్లెసిస్, కోహ్లీ, మ్యాక్స్‌వెల్ పెవీలియన్‌లో నిలబడతారు. దినేశ్ కార్తీక్ కూడా ప్రయత్నిస్తుంటారు. కానీ, వీరి ఒక్కరి వల్లే మ్యాచ్‌లు గెలవలేరు కదా?” అని ఆయన ప్రశ్నించారు.

ఫొటో సోర్స్, Getty Images
దురదృష్టం కూడా తోడై..
ఆర్‌సీబీకి కొంత దురదృష్టం కూడా వెంటాడుతోంది. ఐపీఎల్‌కు ముందు అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడారంటూ విమర్శకుల మన్ననలు అందుకున్న గ్లెన్ మ్యాక్స్‌వెల్ ఈ సీజన్‌లో ఘోరంగా విఫలం అయ్యాడు.
దీనిపై విజయ్ లోక్‌పల్లి మాట్లాడుతూ.. ‘‘అదే ఇన్నింగ్స్‌ను మళ్లీ పునరావృతం చేయడం కష్టం. ఇదే అసలు సమస్య. అదే జోరును కొనసాగించడమనేది ఏ బ్యాట్స్‌మన్‌కైనా కాస్త కష్టమే. ప్రతి మ్యాచ్‌లోనూ అతడు 200 కొట్టాలని అభిమానులు ఆశిస్తారు. కానీ, అలా జరగదు’’ అని అన్నారు.
మ్యాక్స్‌వెల్ తరహాలోనే కోహ్లీ కూడా ఒక్కడే ఆర్‌సీబీని గెలుపువైపు నడిపించలేడు. ఆర్‌సీబీ మేనేజ్‌మెంట్ ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి.
ఈ విషయంపై అయాజ్ మెమన్ మాట్లాడుతూ.. ‘‘కోహ్లీ మంచి బ్యాట్స్‌మన్. కానీ, ఇది టీమ్ గేమ్. జట్టు మొత్తంగా ఆశించిన స్థాయిలో రన్లు కొట్టలేకపోతోంది. 220, 230లు కొట్టే పిచ్‌లో టీమ్ స్కోర్ 180కే పరిమితం అవుతోంది. ఇక్కడ కోహ్లీ ఒక్కడే 70 నుంచి 80 కొడుతున్నాడు. కానీ, ఇదేమీ జట్టుకు సాయం కావడం లేదు. ఇక్కడ బాధ్యత అందరికీ సమానంగా పంచడం లేదు. ఒకవేళ స్కోర్ కొడుతున్నా, ప్రత్యర్థి జట్ల స్కోర్‌ను నిలువరించే బౌలర్లే ఉండటం లేదు’’ అని చెప్పారు.
కోహ్లీ పరిస్థితిని విజయ్ లోక్‌పల్లి లోతుగా విశ్లేషించారు. ‘‘ఆర్‌సీబీకి కోహ్లీ ముఖ్యమైనవాడు. కోహ్లీ మంచి రన్లు కూడా కొడుతున్నాడు. కానీ, ఇక్కడ భారత జట్టులో కోహ్లీ పాత్ర వేరు. ఆర్‌సీబీలో కోహ్లీ పాత్ర వేరు. భారత జట్టులో కోహ్లీ అవుట్ అయితే, ఆయనకు ముందు, ఆ తర్వాత వచ్చే బ్యాటర్లు స్కోర్‌ను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తుంటారు. కానీ, ఆర్‌సీబీలో అలా కాదు. ఇక్కడ కోహ్లీ అవుట్ అయితే, ఆ జట్టును ముందుకు తీసుకెళ్లేవారే కనిపించడం లేదు’’ అని ఆయన అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
బలమైన బ్రాండ్, బలహీనమైన జట్టు..
మరికొన్ని విషయాల్లోనూ ఆర్‌సీబీ తడబడుతున్నట్లు కనిపిస్తోంది. జట్టులోని విదేశీ ప్లేయర్లు ఎలాంటి ప్రభావమూ చూపడం లేదు. డు ప్లెసిస్ గతంలో మంచి ఇన్నింగ్స్ ఆడారు. కానీ, గత సీజన్ నుంచి ఆయన పెద్దగా ప్రభావం చూపలేకపోతున్నారు. కామెరాన్ గ్రీన్ అత్యుత్తమ యువ క్రీడాకారుల్లో ఒకరు. ముంబయి జట్టు నుంచి అతడు ఆర్‌సీబీలోకి వచ్చాడు. అతడు కూడా తనేంటో నిరూపించుకోలేదు. బౌలర్లు మహమ్మద్ సిరాజ్ లేదా లాకీ ఫెర్గుసన్ కూడా ప్రభావం చూపడం లేదు. నిజానికి జట్టు క్రికెట్‌పై కంటే మరెక్కడైనా దృష్టి పెడుతోందా?
ఫేమ్‌లో బెంగళూరు జట్టు మరే జట్టుకూ తీసిపోదు. ప్రస్తుతం బ్రాండ్ వేల్యూపైనే జట్టు ఎక్కువ దృష్టి పెడుతోందని విశ్లేషణలు వస్తున్నాయి.
అసలు ఆర్‌సీబీ బ్రాండ్‌పై అంత దృష్టి ఎందుకు పెడుతోంది? దీనిపై బ్రాండ్ ఎక్స్‌పర్ట్, బెంగళూరుకు చెందిన హరీశ్ బిజూర్ బీబీసీతో మాట్లాడారు. ‘‘ఐపీఎల్ అంటే క్రికెట్ మాత్రమే కాదు. ఐపీఎల్ అంటే ఎంటర్‌టైన్మెంట్’’ అని ఆయన అన్నారు.
‘‘ఐపీఎల్ అంటే క్రికెట్ మాత్రమే కానప్పుడు, దృష్టంతా దానిపైనే ఎందుకు పెట్టాలి? సగం దృష్టి క్రికెట్‌పై మరో సగం దృష్టి ఎంటర్‌టైన్మెంట్‌పై పెడితే సరిపోతుంది. నేడో లేదా రేపో జట్టు గెలుస్తుంది. కానీ, బ్రాండ్ గుర్తింపు పెరగాలంటే విజయాలు ఉండాల్సిన అవసరంలేదని గుర్తు పెట్టుకోవాలి’’ అని ఆయన చెప్పారు.
బ్రాండ్ విలువలో ఐపీఎల్‌కు మంచి పేరుంది. 2024లో దీని బ్రాండ్ వేల్యూ 28 శాతం పెరిగి 10.7 బిలియన్ డాలర్లకు చేరుకుంది. బ్రాండ్ ఫైనాన్స్ రిపోర్టు ప్రకారం, బ్రాండ్ వేల్యూలో 87 మిలియన్ డాలర్ల విలువతో ముంబయి టీమ్ మొదటి స్థానంలో ఉంది. సీఎస్‌కే, కేకేఆర్‌ల తర్వాత 70 మిలియన్లతో ఆర్‌సీబీ నాలుగో స్థానంలో ఉంది.
ఎలా సంపాదిస్తోంది?
టీమ్ గెలవనప్పుడు ఆదాయం ఎలా వస్తోంది? ఈ ప్రశ్నంపై బిజూర్ మాట్లాడుతూ.. ‘‘ఐబాల్, స్టేడియం, టీవీ, ఇంటర్నెట్‌ల నుంచి ఆర్‌సీబీకి ఆదాయం వస్తోంది’’ అని చెప్పారు.
‘‘కొన్న టీమ్‌ల కంటే ఆర్‌సీబీకి ఎక్కువ ఆదాయం రావడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ముంబయి ఇండియన్స్ జట్టు తీసుకుంటే వీరి ప్రధాన మార్కెట్ ముంబయి. కానీ, ఆర్‌సీబీ అలా కాదు. వీరి మార్కెట్ ప్రపంచం మొత్తం ఉంటుంది. ఇక్కడ విదేశీ ప్లేయర్లు ఎక్కువగా ఉండటం తొలి అంశం అయితే, బెంగళూరులో చాలా దేశాల ప్రజలు జీవించడం మరో కారణం. వీరంతా జట్టును తమ జట్టుగా భావిస్తుంటారు’’ అని బిజూర్ అన్నారు.
అయితే, బ్రాండ్‌పై మాత్రమే దృష్టి పెట్టడాన్ని క్రికెట్ నిపుణులు తప్పుపడుతున్నారు.
దీనిపై విజయ్ లోక్‌పల్లి మాట్లాడుతూ.. ‘‘బ్రాండ్ అంటే ఏమిటి? అసలు మీరు ఐపీఎల్‌లో గెలవకపోతే బ్రాండ్ ఏమిటి. ఇక్కడ సీఎస్‌కే ఒక బ్రాండ్, ముంబయి ఇండియన్స్ ఒక బ్రాండ్. వీరిద్దరూ ఐదేసి సార్లు టైటిల్‌ను గెలిచారు. మీరు ఆర్‌సీబీని ఎందుకు అభిమానించాలి. కేవలం రెండు సార్లే ఫైనల్‌కు వెళ్లినందుకా?’’ అని ఆయన ప్రశ్నించారు.
మహిళలు నిరాశ పరచలేదు
అయితే, ఈ ఏడాది మార్చిలో జరిగిన విమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) టోర్నమెంట్‌లో దిల్లీ మహిళల జట్టుపై విజయం సాధించి బెంగళూరు మహిళల టీమ్ ట్రోఫీని తీసుకెళ్లింది.
లీగ్ దశలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మహిళల జట్టు మూడో స్థానంలో నిలిచింది. అయితే, చివరకు వచ్చేసరికి స్మృతి మంధాన జట్టు నిరాశపరచలేదు.
ఎలిమినేషన్ మ్యాచ్‌లో ఐదు రన్ల తేడాతో ముంబయి ఇండియన్స్ జట్టును మంధాన జట్టు ఓడించింది. అనంతరం క్రికెట్ విమర్శకుల విశ్లేషణలను తప్పని రుజువు చేస్తూ టైటిల్‌ను గెలిచింది.
ఇవి కూడా చదవండి:
- లోక్‌సభ ఎన్నికలు: ఒకనాడు 400కు పైగా స్థానాలలో గెలిచిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు 300 స్థానాలలో మాత్రమే ఎందుకు పోటీ చేస్తోంది?
- 4.7 కోట్ల ఏళ్లనాటి వాసుకి పాము అవశేషాలు వెలుగులోకి.. అసలేంటి ఈ పాము కథ?
- అడాల్ఫ్ హిట్లర్ కోసం ఆ మహిళలు కన్న వేలమంది ‘ఆర్య పుత్రులు’ ఏమయ్యారు?
- హెపటైటిస్: మొత్తం కేసులలో 11 శాతం భారత్‌లోనే.. అసలేమిటీ వ్యాధి, ఎందుకొస్తుంది, చికిత్స లేదా?
- SRH vs DC: ఏంటా కొట్టుడు! భయంతో హెల్మెట్లు పెట్టుకున్న బాల్ బాయ్స్..
బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

















