SRHvsDC: ఐపీఎల్‌లో మరోసారి రికార్డులు బద్దలు కొట్టిన సన్ రైజర్స్, 5 ఓవర్లకే 103 పరుగులు

ఐపీఎల్

ఫొటో సోర్స్, Getty Images

దిల్లీలో అరుణ్‌జైట్లీ స్టేడియం వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్, దిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్‌లో మరోసారి రికార్డులు బద్దలయ్యాయి.

టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న దిల్లీ క్యాపిటల్స్ జట్టు బౌలింగ్‌లో ఎస్‌ఆర్‌హెచ్ బ్యాటర్లు అతి వేగంగా పరుగులు తీశారు. తొలి పది ఓవర్లలో జట్టు స్కోరు అత్యంత వేగంగా 158 పరుగులకు చేరుకుంది.

ఓపెనింగ్ జోడీగా బరిలోకి దిగిన ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మలు ఓవర్‌కు 20 పరుగుల చొప్పున కొడుతూ దిల్లీ బౌలర్లపై చెలరేగి ఆడారు.

ఇరువురూ బౌండరీలే లక్ష్యంగా బౌలర్లపై విరుచుకుపడటంతో పలు రికార్డులు నమోదయ్యాయి.

ట్రావిస్ హెడ్ కేవలం 16 బంతుల్లోనే అర్థ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మరోవైపు ఐపీఎల్ ‌లో అతి తక్కువ బంతుల్లోనే 100 పరుగులు చేసిన జట్టుగా కూడా హైదరాబాద్ జట్టు నిలిచింది. ఐదు ఓవర్లలోనే ఆ జట్టు 103 పరుగులు సాధించింది.

గతంలో ఈ రికార్డు చెన్నై సూపర్ కింగ్స్ పేరిట ఉంది. ఆ జట్టు 6 ఓవర్లలో 100 పరుగులు సాధించింది.

అలాగే పవర్ ప్లేలో అత్యధిక స్కోరు (125 పరుగులు) సాధించిన జట్టుగా ఎస్ఆర్‌హెచ్ నిలిచిందని టైమ్స్ నౌ తెలిపింది. గతంలో ఈ రికార్డు (6 ఓవర్లకు 105 పరుగులు) కేకేఆర్ జట్టు పేరిట ఉంది.

ఐపీఎల్

ఫొటో సోర్స్, Getty Images

ఎస్ఆర్‌హెచ్ ఓపెనర్ల ధాటికి పవర్ ప్లేలో లలిత్ యాదవ్ 2 ఓవర్లలో 41 పరుగులు, ఎన్రిక్ నార్ట్జ్ ఒక ఓవర్ వేసి 22 పరుగులు, ముఖేశ్ కుమార్ ఒక ఓవర్ వేసి 22 పరుగులు సమర్పించుకున్నారు.

అభిషేక్ శర్మ 12 బంతుల్లో 6 సిక్సర్లు, 2 ఫోర్ల సాయంతో 46 పరుగులు సాధించి ఔట్ కాగా, మరో ఓపెనర్ ట్రావిస్ 32 బంతుల్లో 6 సిక్సర్లు, 11 ఫోర్ల సాయంతో 89 పరుగులు కొట్టి వెనుదిరిగాడు.

అయితే, 10 వ ఓవర్ నుంచి సన్ రైజర్స్ జట్టు స్కోరు మందగించింది. వరస వికెట్లు పడటంతో తరువాత వచ్చిన ఆటగాళ్లు నెమ్మదిగా ఆడారు. సన్ రైజర్స్ జట్టులో షాబాజ్ అహ్మద్ 59 పరుగులు, నితీశ్ కుమార్ రెడ్డి 37, క్లాసెన్ 15, అబ్దుల్ సమద్ 13 పరుగులు చేశారు.

మొత్తం మీద 20 ఓవర్లకు 7 వికెట్లు కోల్పోయిన సన్ రైజర్స్ జట్టు 266 పరుగులు చేసింది. దీంతో ఐపీఎల్‌లో నాలుగో అత్యధిక స్కోరును నమోదు చేసింది. ఇప్పటికే రెండు అత్యధిక స్కోర్లు నమోదు చేసిన సన్ రైజర్స్ జట్టు మూడోసారి 260కి పైగా పరుగులు సాధించింది.

దిల్లీ క్యాపిటల్స్ జట్టులో కుల్దీప్ యాదవ్‌కు 4 వికెట్లు, ముకేశ్ కుమార్, అక్షర్ పటేల్‌లకు చెరో వికెట్ దక్కాయి.

ఇవి కూడా చదవండి:

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)