అమెరికా యూనివర్సిటీల్లో విద్యార్థుల నిరసనలు ఎందుకు?

అమెరికాలో విద్యార్థుల ఆందోళనలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,
    • రచయిత, సామ్ కాబ్రాల్
    • హోదా, బీబీసీ న్యూస్

గాజాలో యుద్ధానికి వ్యతిరేకంగా అమెరికాలోని పలు కాలేజీ క్యాంపస్‌లలో విద్యార్థులు నిరసన తెలుపుతున్నారు. వందలాది మంది నిరసనకారులను పోలీసులు అరెస్టు చేశారు.

అక్టోబరు 7న హమాస్ దాడి, ఇజ్రాయెల్ ప్రతీకార దాడులను నిరసిస్తూ గాజాలో జరుగుతున్న యుద్ధానికి వ్యతిరేకంగా అమెరికాలో విద్యార్థులు ర్యాలీలు, భైఠాయింపులు, నిరాహార దీక్షలు ప్రారంభించారు.

అమెరికా విద్యాసంస్థలు ఇజ్రాయెల్‌తో సంబంధాలను తెంచుకోవాలని, వారి కంపెనీల నుంచి అమెరికా వైదొలగాలంటూ నిరసనకారులు డిమాండ్ చేస్తున్నారు.

ఇజ్రాయెల్‌లో లేదా ఇజ్రాయెల్ సంస్థలతో వ్యాపారం చేస్తున్న అమెరికా కంపెనీలు గాజాపై జరుగుతున్న యుద్ధంలో భాగస్వాములుగా ఉన్నాయని విద్యార్థి నేతలు ఆరోపిస్తున్నారు.

అమెరికాలో విద్యార్థుల ఆందోళనలు

ఫొటో సోర్స్, REUTERS

కొలంబియా యూనివర్సిటీలో ఏం జరిగింది?

ఏప్రిల్ నెల ప్రారంభంలో కొలంబియా వర్సిటీ ప్రెసిడెంట్ మినోచే షఫిక్ క్యాంపస్‌లో యాంటీ సెమిటిజం గురించి కాంగ్రెస్ ఎదుట సాక్ష్యం చెప్పిన తర్వాత, వందలాది మంది విద్యార్థులు న్యూయార్క్ సిటీ క్యాంపస్‌లో నిరసన మొదలుపెట్టారు.

గాజాలో కాల్పుల విరమణకు వారు డిమాండ్ చేశారు. ఇజ్రాయెల్ నుంచి వైదొలగాలని పిలుపునిచ్చారు.

ఈ ఆందోళన స్కూల్ పాలసీలను ఉల్లంఘించిందని, నిరసనకారులను చెదరగొట్టి, శిబిరాలు తొలగించేందుకు నగరంలోని పోలీసు శాఖను పిలిపించామని విశ్వవిద్యాలయం తెలిపింది.

నిబంధనలు అతిక్రమించినందుకు 100 మందికి పైగా విద్యార్థులను అరెస్టు చేశారు.

అయితే, విద్యార్థులు మళ్లీ వర్సిటీ చేరుకొని, ఆందోళనలు చేపట్టారు. ఈ నిరసనలు మూడో వారం కూడా కొనసాగాయి. దీంతో ఆఫ్‌లైన్ క్లాసులు నిలిచిపోయాయి.

విద్యార్థి నాయకులతో జరిగిన చర్చలు విఫలమయ్యాయి, పలువురు నిరసనకారులను వర్సిటీ అధికారులు సస్పెండ్ చేశారు.

కాగా, మంగళవారం విద్యార్థులు యూనివర్సిటీ భవనమైన హామిల్టన్ హాల్‌కు చేరుకోవడంతో నిరసన తీవ్రమైంది.

బుధవారం పోలీసులు క్యాంపస్‌లోకి వెళ్లి, నిరసనకారులను అదుపులోకి తీసుకున్నారు.

వీడియో క్యాప్షన్, గాజా యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ.. కొన్ని యూనివర్సిటీల్లో కొనసాగుతున్న నిరసన ప్రదర్శనలు....
అమెరికాలో విద్యార్థుల ఆందోళనలు

విద్యార్థులు ఎక్కడెక్కడ నిరసనలు చేస్తున్నారు?

ఈ నిరసనలు అమెరికా వ్యాప్తంగా వ్యాపించాయి. వీటిలో:

ఈశాన్య ప్రాంతం: జార్జ్ వాషింగ్టన్, బ్రౌన్, యేల్, హార్వర్డ్, ఎమర్సన్, ఎన్‌వైయూ, జార్జ్‌టౌన్, అమెరికన్, మేరీల్యాండ్ వర్సిటీ, జాన్స్ హాప్కిన్స్, టఫ్ట్స్, కార్నెల్, పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయం, ప్రిన్స్‌టన్, టెంపుల్, నార్త్ ఈస్టర్న్, ఎంఐటీ, ది న్యూ స్కూల్, రోచెస్టర్ వర్సిటీ, పిట్స్‌బర్గ్ విశ్వవిద్యాలయం.

పశ్చిమ తీరం: హంబోల్ట్‌లోని కాలిఫోర్నియా స్టేట్ పాలిటెక్నిక్, దక్షిణ కాలిఫోర్నియా వర్సిటీ, లాస్ ఏంజిల్స్‌లోని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, బర్కిలీలోని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, యూనివర్శిటీ ఆఫ్ వాషింగ్టన్.

మధ్య పశ్చిమ ప్రాంతం: నార్త్ వెస్టర్న్ వర్సిటీ, సెయింట్ లూయిస్‌లోని వాషింగ్టన్ వర్సిటీ, ఇండియానా వర్సిటీ, ఒహియో స్టేట్ వర్సిటీ, మిచిగాన్ వర్సిటీ, మిన్నెసోటా విశ్వవిద్యాలయం, మయామి విశ్వవిద్యాలయం, యూనివర్సిటీ ఆఫ్ ఒహియో, కొలంబియా కాలేజ్ చికాగో, చికాగో యూనివర్సిటీ

దక్షిణం: ఎమోరీ, వాండర్‌బిల్ట్, షార్లెట్‌లోని యూనివర్శిటీ ఆఫ్ నార్త్ కరోలినా, చాపెల్ హిల్‌లోని యూనివర్శిటీ ఆఫ్ నార్త్ కరోలినా, కెన్నెసా స్టేట్ వర్సిటీ, ఫ్లోరిడా స్టేట్ వర్సిటీ, వర్జీనియా టెక్, జార్జియా విశ్వవిద్యాలయం, ఏథెన్స్

నైరుతి (సౌత్ వెస్ట్): ఆస్టిన్‌లోని టెక్సాస్ విశ్వవిద్యాలయం, రైస్, అరిజోనా స్టేట్ వర్సిటీ.

ఆస్ట్రేలియా, కెనడా, ఫ్రాన్స్, ఇటలీ, యూకేలోని పలు యూనివర్సిటీ క్యాంపస్‌లలో కూడా పాలస్తీనా అనుకూల నిరసనకారులు గత వారం రోజులుగా నిరసన తెలియజేస్తున్నారు.

అమెరికాలో విద్యార్థుల ఆందోళనలు

ఫొటో సోర్స్, AFP via Getty Images

విశ్వవిద్యాలయాలు ఏం చేస్తున్నాయి?

కొందరు విద్యార్థి నేతలతో చర్చలు జరుపుతుండగా మరికొందరు అల్టిమేటంలు జారీ చేయడంతో వర్సిటీ అధికారులు పోలీసులను రప్పించారు. టెక్సాస్, ఉటా, వర్జీనియాలలో సోమవారం పలు అరెస్టులు జరిగాయి.

కానీ బోస్టన్‌లో నార్త్‌వెస్టర్న్ యూనివర్శిటీ, నిరసనకారుల మధ్య ఒప్పందం కుదిరింది, దీంతో అక్కడి శిబిరంలో నిరసనలు తగ్గాయి.

ఇదే క్రమంలో ఈ నిరసనలలోని కొన్నింటిలో యాంటీసెమిటిజం రిపోర్టులను హైలైట్ చేస్తూ మిగతా కాలేజీలు కూడా నిరసన తెలపాలని అక్కడి జాతీయ రాజకీయ నాయకులు పిలుపునిచ్చారు.

అనేక క్యాంపస్‌లలోని యూదు విద్యార్థులు తమకు అసౌకర్యంగా, భయంగా అనిపించిన కొన్ని సంఘటనల గురించి బీబీసీకి వివరించారు.

వీటిలో హమాస్‌కు మద్దతుగా నినాదాలు, భౌతిక వాగ్వాదాలు, బెదిరింపుల వరకు ఉన్నాయి.

ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా బహిష్కరణ, ఉపసంహరణ, ఆంక్షల (బీడీఎస్) ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని పాలస్తీనా అనుకూల క్యాంపస్ గ్రూపులు సంవత్సరాలుగా పిలుపునిస్తున్నాయి.

గతంలో కొన్ని నిర్దిష్ట ఆర్థిక సంబంధాలను తెంచుకున్నప్పటికీ, ఏ అమెరికా విశ్వవిద్యాలయం కూడా బీడీఎస్ ఫ్రేమ్‌వర్క్‌కు కట్టుబడి లేదు.

ఇజ్రాయెల్ నుంచి వైదొలగడం గాజాలో పరిస్థితిని నేరుగా ప్రభావితం చేయకపోవచ్చని, అయితే, దీనితో లాభపడుతున్న వారి గురించి, వారి కారణాల గురించి అవగాహన కల్పిస్తుందని అభిప్రాయపడుతున్నారు.

వియత్నాం యుద్ధాన్ని ఎందుకు గుర్తు చేసుకుంటున్నారు?

వియత్నాం యుద్ధంలో అమెరికా ప్రమేయానికి వ్యతిరేకంగా 1960ల చివరలో జరిగిన ఆందోళనలను కొలంబియా, ఇతర చోట్ల పలువురు నిరసనకారులు హైలైట్ చేశారు.

అప్పుడు జరిగిన ఆందోళనల్లో వేలాది మందిని అరెస్టు చేశారు, పోలీసులతో హింసాత్మక ఘర్షణలు జరిగాయి. 1970లో నేషనల్ గార్డ్ కాల్పులు జరపడంతో ఒహియోలో నలుగురు విద్యార్థులు చనిపోయారు.

వారి మరణాలు దేశవ్యాప్తంగా విద్యార్థులు సమ్మెకు దిగేలా ప్రేరేపించాయి, వందలాది విశ్వవిద్యాలయాలు మూసివేశారు.

వీడియో క్యాప్షన్, కొలంబియా వర్సిటీ విద్యార్థుల అరెస్టులపై సర్వత్రా నిరసనలు

ఇవి కూడా చదవండి:

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)