గురుపట్వంత్ సింగ్ పన్నూ హత్యకు ‘కుట్ర’.. వాషింగ్టన్ పోస్ట్ తాజా కథనంపై భారత్ ఏమన్నది?

సిక్కు వేర్పాటువాద నేత గురుపట్వంత్ సింగ్ పన్నూ హత్యకు కుట్ర పన్నడంలో భారత ఇంటలిజెన్స్ ఏజెన్సీ ‘రా’ అధికారుల పాత్ర ఉందని అమెరికా వార్తా పత్రిక వాషింగ్టన్ పోస్ట్ తన కథనంలో పేర్కొంది.
ఈ కథనంపై భారత విదేశాంగ శాఖ స్పందించింది.
‘‘ఓ తీవ్రమైన విషయంపై ఈ కథనం నిరాధార, అసంమజస ఆరోపణలు చేస్తోంది’’ అని ఈ మేరకు విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి మంగళవారం ఓ ప్రకటన విడుదల చేసింది.
‘‘వ్యవస్థీకృత నేరగాళ్ళు, ఉగ్రవాదుల నెట్‌వర్క్‌కు సంబంధించి భద్రతాపరమైన ఆందోళనలతో అమెరికా పంచుకున్న సమాచారం ఆధారంగా భారత్ దీనిపై విచారణ జరపడానికి ఓ ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. ఇలాంటి విషయాలపై ఊహాగానాలతో, బాధ్యతారహితమైన ప్రకటనలు చేయడం వల్ల ఒరిగేదేమీ ఉండదు’’ అని తెలిపింది.

ఫొటో సోర్స్, GETTY IMAGES
వాషింగ్టన్ పోస్ట్ ఏం రాసింది?
నిరుడు జూన్ 22న అమెరికాలోని శ్వేతసౌధం వద్ద ప్రధాని మోదీకి ఘనస్వాగతం లభించింది. ‘‘అదే సమయంలో భారత ఇంటలిజెన్స్ ఏజెన్సీ ‘రా’కు చెందిన అధికారి ఒకరు గురుపట్వంత్ సింగ్ పన్నూను హత్య చేసేందుకు అమెరికాలో కిరాయిహంతకులతో మాట్లాడారు. ఆ అధికారి పేరు విక్రమ్ యాదవ్ అని, న్యూయార్క్‌లోని పన్ను నివాసానికి సంబంధించిన సమాచారాన్ని ఆయన తమలపాలకుల సేకరణదారులకు ఇచ్చారు’’ అని కొందరు అధికారులను ఉటంకిస్తూ ఆ పత్రిక రాసింది.
పన్నూ ఇంట్లో ఎప్పుడు ఉంటే అప్పుడు పని మొదలు పెట్టడానికి ఆదేశాలు వస్తాయని చెప్పినట్టు తెలిపింది.
ఈ కేసుకు సంబంధించి యాదవ్ గుర్తింపు, అతనికి ఉన్న సంబంధాలు ఇప్పటిదాకా వెల్లడి కాలేదని ఆ వార్తా కథనం పేర్కొంది. అయితే అమెరికా అధికారులు భగ్నం చేసిన ఈ హత్యా ప్రణాళికను ‘రా’ ఆదేశించిందని చెప్పడానికి ఆయన పేరు బటయకు రావడమే నిదర్శనమని తెలిపింది.
కొంతమంది ప్రస్తుత, మాజీ పాశ్చాత్య భద్రతాధికారులు తెలిపిన ప్రకారం తమ విస్తృత దర్యాప్తులో భాగంగా సీఐఏ, ఎఫ్‌బీఐ చూపు కొందరు ‘రా’ ఉన్నతాధికారులపై కూడా పడింది.
పన్నూను లక్ష్యంగా చేసుకున్న ఆపరేషన్‌కు అప్పటి ‘రా’ అధిపతి సమంత్ గోయల్ అనుమతి ఇచ్చారని వాషింగ్టన్ పోస్ట్ తన కథనంలో అంచనా వేసింది.
విదేశాలలో ఉన్న సిక్కు తీవ్రవాదులను ఏరివేయాలనే ఒత్తిడి గోయల్‌పై ఉందని కొందరు మాజీ భారత భద్రతాధికారులు చెప్పారని వాషింగ్టన్ పోస్టు రాసింది.
పన్నూ హత్యకు కుట్ర పన్నడానికి ముందు జూన్ 18న కెనడాలోని వాంకోవర్‌లో హర్‌దీప్ సింగ్ నిజ్జర్‌ను కాల్చి చంపారు. ఈ హత్యలోనూ భారత్ పాత్ర ఉందని ఆరోపణలు వచ్చాయి. కానీ భారత్ వాటిని ఖండించింది.
మోదీ ప్రభుత్వం టెర్రరిస్టులుగా ప్రకటించిన కనీసం 11 మంది సిక్కు, కశ్మీర్ వేర్పాటు వాదులు పాకిస్తాన్‌లో హతమయ్యారని వాషింగ్టన్ పోస్ట్ తెలిపింది.
బహుశా ‘రా’ ప్రణాళిక గురించి జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోబాల్‌కు తెలిసే ఉంటుందని వాషింగ్టన్ పోస్ట్ పేర్కొంది కానీ ఎటువంటి ఆధారాలు చూపలేదు.

ఫొటో సోర్స్, EPA
నిఖిల్ గుప్తాపై ఆరోపణలు
సిక్కువేర్పాటువాది గురుపట్వంత్ సింగ్ పన్నును హతమార్చేందుకు భారత్‌కు చెందిన నిఖిల్ గుప్తా ఓ వ్యక్తిని కిరాయికి కుదుర్చుకున్నారని, ఇందుకు ప్రతిగా లక్షడాలర్లు ఇచ్చినట్టు కిందటేడాది నవంబర్‌లో అమెరికా ఆరోపించింది.
నిఖిల్ గుప్తాకు భారత ప్రభుత్వ అధికారి నుంచి ఆదేశాలు అందాయని అమెరికా కోర్టులో సమర్పించిన పత్రాలలో పేర్కొన్నారు.
అమెరికా విజ్ఞప్తి మేరకు చెక్ రిపబ్లిక్‌లో నిఖిల్ గుప్తాను అరెస్ట్ చేశారు. భారత ప్రభుత్వ అధికారి ఆదేశాల మేరకు పన్నును హతమార్చేందుకు నిఖిల్ గుప్తా కిరాయిహంతకుడిని ఏర్పాటు చేసినట్టు అమెరికా ఆరోపించింది.
ఉన్నతస్థాయిలో అమెరికా ఈ విషయం భారత్ వద్ద లేవనెత్తింది. ఆ సమయంలో విదేశీ వ్యవహారా శాఖ అధికార ప్రతినిధిగా ఉన్న ఆరిందమ్ బాగ్చీ ఓ ప్రకటన విడుదల చేస్తూ ‘‘ఈ ఆరోపణలను భారత్ తీవ్రంగా పరిగణిస్తోందని, వీటిపై విచారణ జరిపి, ప్రతి అంశాన్ని కూలంకషంగా లోతైన దర్యాప్తు చేసేందుకు ఓ ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు’’ తెలిపారు.
‘‘అమెరికాతో ద్వైపాక్షిక భద్రతా సహకార చర్చల్లో మేమీ విషయాన్ని మాట్లాడాం. వ్యవస్థీకృత నేరాలు, ఉగ్రవాదులు, ఆయుధ వ్యాపారుల మధ్యనున్న సంబంధాలకు సంబంధించి కొన్ని విషయాలను అమెరికా పంచుకుంది. దీనిపై ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసి విచారణ జరిపిస్తాం’’ అని చెప్పారు.

ఫొటో సోర్స్, SOCIAL MEDIA
ఎవరీ పన్ను?
అమెరికాలో నివసించే గురుపత్వంత్ సింగ్ ఓ లాయర్, ‘సిఖ్స్ ఫర్ జస్టిస్’ వ్యవస్థాపకుడు.
ఖలిస్థాన్ ఏర్పాటు కోసం ఆయన ‘రిఫరెండం -2020’ ప్రచారాన్ని ప్రారంభించారు. దీనికి మద్దతుగా పంజాబ్‌తోపాటు, ప్రపంచవ్యాప్తంగా నివసించే సిక్కులు ఆన్‌లైన్‌లో ఓటు వేయాలని కోరారు. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం ఖలిస్తానీ అనుకూలమనే పేరుతో 40 వెబ్‌సైట్లపై నిషేధం విధించింది.
అయితే ‘సిఖ్స్ ఫర్ జస్టిస్’ తనను తాను మానవ హక్కుల సంస్థగా అభివర్ణించుకున్నప్పటికీ భారత్ దానిని ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది.
పన్ను నుంచి బెదిరింపు ఫోన్ కాల్స్, వీడియో కాల్స్ రావడంపై భారత్‌లో అనేక కేసులు నమోదయ్యాయి. జులై 2020లో భారత్ ఆయనను ఉగ్రవాదిగా ప్రకటించింది.
పంజాబ్‌లో ఉగ్రవాదాన్ని పునరుద్ధరించడం ద్వారా పన్ను దేశాన్ని అస్థిరపరచాలని చూస్తున్నారని, జాతి వ్యతిరేక కార్యకలాపాల్లోనూ, ఖలిస్థాన్ ఉద్యమంలోనూ ఆయన పాల్గొంటున్నారని హోంమంత్రిత్వశాఖ పేర్కొంది.
అంతకుముందు జులై 10, 2019న హోం మంత్రిత్వశాఖ ‘సిఖ్స్ ఫర్ జస్టిస్’ను ఉపా చట్టం కింద నిషేధించింది.

ఫొటో సోర్స్, SIKH PA
నిజ్జర్ హత్య, కెనడా ఆరోపణలు
కిందటేడాది జూన్‌లో ఖలీస్థానీ అనుకూల నాయకుడు హర్‌దీప్ సింగ్ నిజ్జర్ కెనడాలో హత్యకు గురయ్యారు.
అయితే ఈ హత్యలో భారత ఏజెన్సీల పాత్ర ఉండి ఉండొచ్చని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో కెనడా పార్లమెంట్‌లో ప్రకటించారు.
నిజ్జర్ హత్యకు సంబంధించిన సమాచారాన్ని కెనడా భారత్‌తో పంచుకుందని, ట్రూడో చెప్పారు.
నిజ్జర్ హత్యకు సంబంధించి కెనడా నుంచి వచ్చిన సమాచారంలో ‘నిర్దుష్ట,‘సంబంధిత’ అంశాలపై దృష్టి సారించేందుకు సిద్ధంగా ఉందని భారత్ ప్రకటించింది.
కానీ కెనడా ఆరోపణలు నిరాధరమైనవని భారత్ తెలిపింది.
దీని తరువాత కెనడా భారత్ దౌత్యవేత్తలను బహిష్కరించగా, దీనికి ప్రతిగా భారత్ కూడా కెనడా దౌత్యవేత్తలను భారత్ విడిచి వెళ్ళాల్సిందిగా ఆదేశించింది.
భారత్‌లో దౌత్యవేత్తల సంఖ్యను తగ్గించుకోవాల్సిందిగా భారత్ కోరడంతో కెనడా 41మంది దౌత్యవేత్తలను వెనక్కి పిలుచుకుంది.
ఇవి కూడా చదవండి:
- మనలో ‘రెండో గుండె’ ఉందని మీకు తెలుసా? అది ఎలా పని చేస్తుందంటే...
- కెటామైన్: ‘మూత్రం పోయకుండా 50 మీటర్లు కూడా నడవలేను’
- అడవుల్లో తీరొక్క కాయలు, పండ్లు తినాల్సిన ఈ జంతువులు ఏం తింటున్నాయంటే..
- ఈ అరుదైన పాములు 2,000 కి.మీ. దాటి సూరత్ ఎలా చేరుకున్నాయి?
- కుళాయి నీళ్లు తాగొచ్చా, ఫిల్టర్ వాటరే తాగాలా...ఎలా తేల్చుకోవాలి?
బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














