గన్నవరం నియోజకవర్గం అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది ఎందుకు?

గన్నవరం

ఫొటో సోర్స్, Yarlagadda/Vallabhaneni/FB

    • రచయిత, వడిశెట్టి శంకర్
    • హోదా, బీబీసీ కోసం

ఓవైపు అంతర్జాతీయ విమానాశ్రయం. మరోవైపు ఐటీపార్కు వంటి ఆధునిక హంగులు అద్దుకున్న అసెంబ్లీ నియోజకవర్గం గన్నవరం.

అక్కడ డెల్టా షుగర్స్ వంటి పరిశ్రమలకు తోడుగా వేగంగా విస్తరిస్తున్న ఆక్వా సాగు కూడా కనిపిస్తుంది. మెట్టకి, డెల్టాకి మధ్యన అటు విజయవాడ నగర శివార్లు, ఇటు గ్రామీణ కృష్ణా జిల్లా ఆనవాళ్లు కూడా కనిపిస్తాయి.

వ్యవసాయాభివృద్ధి ద్వారా పారిశ్రామికంగా అడుగులు వేసి, ఆక్వాలో ముందుకు సాగుతున్న గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గం రాజకీయంగానూ ఆసక్తికరంగా ఉంటుంది.

ఏపీలో నియోజకవర్గాల పునర్విభజన తర్వాత గడిచిన మూడు ఎన్నికల్లోనూ హోరా హోరీ పోరు సాగింది. ఫలితాలు కూడా ఆసక్తికరంగా ఉంటున్నాయి. దాంతో ఈసారి ఏమవుతుందోననే ఉత్కంఠ అక్కడి నాయకుల్లో కనిపిస్తోంది. అంతేకాదు, రాష్ట్రమంతా ఈ నియోజకవర్గం చుట్టూ చర్చ సాగుతోంది.

ఈ సారి కూడా 2019 నాటి ప్రత్యర్థులే బరిలో దిగారు. కానీ వారు వీరయ్యారు అన్నట్టుగా ఇరువురూ కండువాలు మార్చేసి ఎన్నికల కదనరంగంలోకి దిగారు.

ఆ ఎన్నికల్లో గెలిచిన టీడీపీ అభ్యర్థి వల్లభనేని వంశీ కృష్ణమోహన్ పార్టీ ఫిరాయించి, వైఎస్సార్సీపీలో చేరారు. ఈసారి ఆపార్టీ తరపున పోటీలో ఉన్నారు. ఆయన చేతిలో ఓటమి పాలయిన అప్పటి వైఎస్సార్సీపీ అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు టీడీపీలో చేరి, మరోసారి వంశీకి ప్రత్యర్థిగా పోటీలో దిగారు.

ఒకప్పుడు కమ్యూనిస్టు ఉద్యమ నేత పుచ్చలపల్లి సుందరయ్య వంటి వారు ఈ నియోజకవర్గంలో ప్రాతినిధ్యం వహించారు. అయితే, వర్తమానంలో అది హోరాహోరీ పోరుకు వేదికగా మారింది.

విమానాశ్రయం

ఫొటో సోర్స్, UGC

నియోజకవర్గ ముఖచిత్రం ఇదే

గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గం ప్రస్తుతం కృష్ణా జిల్లాలోని మచిలీపట్నం పార్లమెంట్ స్థానం పరిధిలో ఉంది. 1955 అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఈ నియోజకవర్గం ఏర్పడింది. తొలుత గన్నవరం, ఉంగుటూరు మండలాలతో పాటుగా కంకిపాడు, బాపులపాడు, ఉయ్యూరు మండలంలోని కొన్ని గ్రామాలు ఈ నియోజకవర్గం పరిధిలో ఉండేవి.

2009 ఎన్నికల సమయంలో జరిగిన పునర్విభజనతో రూపు మారింది. గన్నవరం, ఉంగుటూరుతో పాటుగా బాపులపాడు మండలం పూర్తిగా ఈ నియోజకవర్గం పరిధిలోకి వచ్చింది. వాటితో పాటుగా విజయవాడ రూరల్ మండలంలోని కొన్ని గ్రామాలను చేర్చారు. దాంతో అర్బన్, రూరల్ ఓటర్ల నియోజకవర్గంగా మారింది.

ఇక్కడ ఎన్‌హెచ్-16తో పాటుగా రైల్వే, ఎయిర్ లైన్ సదుపాయం కూడా అందుబాటులో ఉండటంతో రవాణా పరంగానూ, పారిశ్రామికంగానూ అభివృద్ధికి దోహదపడింది.

జనవరిలో విడుదల చేసిన ఓటర్ల జాబితాలో నియోజకవర్గంలో మొత్తం 2,77,393 మంది ఓటర్లుండగా అందులో 1,33,904 మంది పురుషులు కాగా, 1,43,474 మంది మహిళా ఓటర్లున్నారు. 15 మంది ఇతరులు. ఇక్కడ ఓటర్లుగా పురుషుల కన్నా మహిళలే ఎక్కువగా ఉండటం విశేషం.

పుచ్చలపల్లి సుందరయ్య

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, గన్నవరంలో మూడుసార్లు గెలిచిన ఏకైక నేతగా పుచ్చలపల్లి సుందరయ్య నిలిచారు.

మూడు సార్లు గెలిచింది ఆయనొక్కరే...

గన్నవరంలో ఇప్పటివరకూ 14 సార్లు ఎన్నికలు జరిగాయి. అందులో 10 మంది శాసనసభ్యులుగా గెలిచారు. వారిలో ముగ్గురు నాయకులు మాత్రం రెండేసి సార్లు విజయం సాధించారు. అందులో సిట్టింగ్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఒకరు. ఆయన వరుసగా 2014, 19 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా వైఎస్సార్సీపీ అభ్యర్థులను ఓడించారు.

అంతకుముందు 1999, 2009 ఎన్నికల్లో దాసరి బాలవర్థన రావు గెలిచారు. ఆయన టీడీపీ తరపున పోటీ చేసి విజయం సాధించారు. 1983, 1989 ఎన్నికల్లో ముసునూరి రత్నబోసు కూడా ఇక్కడి నుంచి గెలిచారు.

నియోజకవర్గం ఆవిర్భావం తర్వాత 1955, 1962 ఎన్నికల్లో ఇక్కడి నుంచి గెలిచిన కమ్యూనిస్టు ఉద్యమ నేత పుచ్చలపల్లి సుందరయ్య, ఆ తర్వాత 1978లో సైతం విజయం సాధించారు. దాంతో ఇప్పటివరకూ గన్నవరంలో మూడుసార్లు గెలిచిన ఏకైక నేతగా సుందరయ్య నిలిచారు.

ప్రస్తుతం పోటీలో ఉన్న వల్లభనేని వంశీ కూడా హ్యాట్రిక్ కోసం ప్రయత్నిస్తున్నారు.

యార్లగడ్డ వెంకట్రావు

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, గత ఎన్నికల్లో వైఎస్సార్సీపీ తరపున తొలిసారి పోటీ చేసి ఓడిపోయిన యార్లగడ్డ వెంకట్రావుని పార్టీలోకి ఆహ్వానించి టికెట్ కట్టబెట్టింది టీడీపీ.

టీడీపీకి గట్టి పట్టున్న సీటు

ఇప్పటి వరకూ కాంగ్రెస్ పార్టీ మూడు సార్లు, కమ్యూనిస్టు పార్టీ రెండు సార్లు గన్నవరం నుంచి విజయం సాధించాయి. సీపీఐ (ఎం) కూడా ఓసారి గెలిచింది.

టీడీపీ అభ్యర్తులు ఆరు సార్లు గెలిచారు. 1994 ఎన్నికల్లో గద్దె రామ్మోహన్ ఇక్కడి నుంచి ఇండిపెండెంట్‌గా బరిలోకి దిగి విజయం దక్కించుకున్నారు. కాంగ్రెస్ రెబల్‌గా పోటీచేసిన ముద్దరబోయిన వెంకటేశ్వరరావును 2004లో ఓటర్లు గెలిపించారు.

నియోజకవర్గాల పునర్విభజన తర్వాత గడిచిన మూడు ఎన్నికల్లోనూ ఇక్కడ పసుపు జెండా హవా కనిపించింది. 2009 నుంచి మూడు సార్లు కూడా టీడీపీదే విజయం. దాంతో నాలుగోసారి విజయం కోసం టీడీపీ గట్టిగా ఆశలు పెట్టుకుంది. గత ఎన్నికల్లో వైఎస్సార్సీపీ తరుపున తొలిసారి పోటీ చేసి ఓడిపోయిన యార్లగడ్డ వెంకట్రావుని పార్టీలోకి ఆహ్వానించి టికెట్ కట్టబెట్టింది.

మరోవైపు టీడీపీకి హ్యాట్రిక్ విజయాలు దక్కిన ఈ సీటుని ఈసారి తన ఖాతాలో వేసుకోవాలని వైఎస్సార్సీపీ ఆశిస్తోంది. స్థానికంగా బలమైన నాయకుడు, సిట్టింగ్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పోటీలో ఉండటంతో ఖాతా తెరుస్తామన్న ధీమాను వ్యక్తం చేస్తోంది.

వల్లభనేని వంశీ

ఫొటో సోర్స్, UGC

కుల రాజకీయాల ప్రభావం

గన్నవరంలో గడిచిన మూడు ఎన్నికల్లో కమ్మ నేతలే గెలుస్తున్నారు. ఓటర్ల సంఖ్య రీత్యా కాపు, యాదవ, కమ్మ , గౌడ, ఎస్సీ కులాలకు చెందిన వారి సంఖ్య గణనీయంగా ఉంటుంది. అయినప్పటికీ అక్కడ ఆర్థికంగా, సామాజిక పట్టున్న కమ్మ నేతలతే హవా. ఈసారి కూడా రెండు ప్రధాన పార్టీలు కమ్మ కులానికి చెందిన వారికే టికెట్లు కట్టబెట్టాయి.

1972 ఎన్నికల్లో గన్నవరం నుంచి ఎస్సీ నేత విజయం సాధించడం విశేషం. అప్పట్లో తప్పెట ఆనందబాయిని కాంగ్రెస్ బరిలో దింపి, సీపీఐ(ఎం) నాయకుడిని ఓడించింది.

కమ్మ నేతల పట్టు కనిపిస్తున్న ప్రస్తుత దశలో కాపుల మద్ధతు కూడగట్టిన వారికే అవకాశం ఉంటుందనే అభిప్రాయం ఉంది. బాపులపాడు, ఉంగుటూరు మండలాల్లో కాపు ఓటర్ల ప్రభావం ఎక్కువ. దాంతో వారి మద్ధతు కూడగట్టడం మీద ఇరు పార్టీలు దృష్టి సారించాయి.

జనసేన కారణంగా తమకే కాపులు మద్ధతిస్తారని టీడీపీ అభ్యర్థి అంచనా వేస్తుండగా, కాపులు చంద్రబాబుని నమ్మబోరని వైఎస్సార్సీపీ అంటోంది.

2014లో గన్నవరం నుంచి వైఎస్సార్సీపీ తరుపున పోటీ చేసిన డాక్టర్ దుట్టా రామచంద్రరావు మద్ధతు మీద వంశీ ఆధారపడినట్టు కనిపిస్తోంది.

గన్నవరం

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, గన్నవరంలో 2009 నుంచి మూడు సార్లు కూడా టీడీపీదే విజయం.

'జోరుగా బెట్టింగులు'

టీడీపీ తరపున రెండుసార్లు అవకాశం ఇచ్చినప్పటికీ గెలిచిన తర్వాత జగన్ పక్షాన చేరిన వంశీని ఓడించాలని టీడీపీ నేతలు పట్టుదలగా ఉన్నారు. ఆ పార్టీ శ్రేణులంతా గన్నవరంలో వంశీకి బ్రేకులు వేయడం మీద ప్రత్యేక దృష్టి సారించారు. దానికి అనుగుణంగా టీడీపీ అభ్యర్థికి మద్ధతుగా ప్రచారం హోరెత్తిస్తున్నారు.

చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యుల మీద ఘాటైన విమర్శలతో వార్తల్లో ఉండే వంశీ ఈసారి తన ప్రాభవాన్ని చాటుకోవడం ద్వారా సత్తా నిరూపించుకోవాలని ఆశిస్తున్నారు. దానికి తగ్గట్టుగా ఆయన కూడా ప్రచారం చేస్తున్నారు.

ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియలో ఇరు పార్టీలు భారీ సమీకరణాలతో గన్నవరం రాజకీయాలను మరింత వేడెక్కించారు. ఇరువురు నేతలు వాడీ వేడిగా విమర్శలు, ప్రతి విమర్శలతో దూసుకుపోతున్నారు.

గన్నవరం ఫలితాల మీద పలు చోట్ల బెట్టింగులు కూడా జోరందుకున్నాయని నియోజకవర్గానికి చెందిన డాక్టర్ పి అభినయ్ అన్నారు.

"గన్నవరంలో ఉండటంతో రాష్ట్రంలో అందరూ ఫోన్లు చేస్తున్నారు. ఎలా ఉంది రాజకీయం అనే వాళ్ళు ఎక్కువయ్యారు. నాతో పాటు చదువుకుని దేశ విదేశాల్లో స్థిరపడిన వాళ్లు కూడా చాలా ఏళ్ళ తర్వాత గన్నవరం రాజకీయాల గురించి ఆసక్తిగా అడుగుతుండటం ఆశ్చర్యమేస్తోంది. గత ఎన్నికల్లో ఇలా లేదు. కానీ ఈసారి అందరూ ప్రతిష్టాత్మకంగా భావిస్తుండటంతో మా సీటు మీద కన్ను పడింది. ఫలితాలు ఎలా ఉన్నప్పటికీ అన్ని వర్గాలు సంయమనంతో సాగాలని ఆశిస్తున్నాం" అని బీబీసీతో అభినవ్ తెలిపారు.

గన్నవరం చుట్టూ సాగుతున్న రాజకీయ చర్చ కారణంగా వివిధ ప్రాంతాల నుంచి కూడా వచ్చి నియోజకవర్గంలోని పరిస్థితులు, ప్రచార సరళిని గమనించే వారు పెరుగుతున్నారన్నది స్థానికుల మాట.

వీడియో క్యాప్షన్, ఆళ్ళగడ్డలో ఫ్యాక్షనిజం పోయిందా... వైసీపీ అభ్యర్థి గంగుల బ్రిజేంద్ర రెడ్డి ఏమంటున్నారు?

ఇవి కూడా చదవండి:

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)