ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు: ఏ మహిళా అభ్యర్థి దగ్గర ఎన్ని కేజీల బంగారం ఉంది? వీళ్లను మించిన ‘గోల్డ్ మ్యాన్’ ఎవరు?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, అరుణ్ శాండిల్య
- హోదా, బీబీసీ తెలుగు
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ గడువు పూర్తయింది. 175 అసెంబ్లీ స్థానాలు, 25 లోక్‌సభ స్థానాలకు కలిపి వేల సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యాయి.
ఎమ్మెల్యే, ఎంపీగా పోటీ చేయడానికి నామినేషన్లు దాఖలు చేసినవారంతా తమ నామినేషన్లతో పాటు తమపై ఉన్న కేసులు, తమ ఆస్తుల వివరాలను వెల్లడిస్తూ అఫిడవిట్లు సమర్పించారు.
ఈ అఫిడవిట్లలో తమ స్థిర, చర ఆస్తుల వివరాలన్నీ పొందుపరిచారు. ఎక్కడెక్కడ ఇళ్లున్నాయి? ఎక్కడెక్కడ స్థలాలున్నాయి? ఏఏ కార్లున్నాయి? ఎంత బంగారం ఉందన్న వివరాలు వెల్లడించారు.
ఈ అఫిడవిట్ల ఆధారంగా.. ప్రధాన పార్టీల నుంచి పోటీ చేస్తున్న మహిళా అభ్యర్థుల వద్ద ఎంత బంగారం ఉందన్నది పరిశీలిస్తే ఆసక్తికర అంశాలు వెలుగుచూశాయి.
కొందరు అభ్యర్థుల వద్ద కేజీల కొద్దీ బంగారం ఉండగా మరికొందరు గ్రాములకే పరిమితమయ్యారు. ఏ మహిళా అభ్యర్థి దగ్గర ఎక్కువ బంగారం ఉందో ఈ కథనంలో చూద్దాం.. అంతేకాదు.. మహిళా అభ్యర్థులందరినీ మించి కేజీల కొద్దీ బంగారం తన పేరిట కలిగి ఉన్న ఓ పురుష అభ్యర్థి ఉన్నారు.. ఆయనెవరు? ఆయన దగ్గర ఎంత బంగారం ఉందో తెలియాలంటే ఈ కథనం చివరి వరకు చదవండి..
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మహిళా నేతలంటే చాలాకాలంగా రాజకీయాల్లో ఉన్న నాయకురాళ్లు, వివిధ ప్రభుత్వాలలో మంత్రులుగా పనిచేసినవారు, నిత్యం మీడియాలో కనిపించేవారు, వివాదాస్పద వ్యాఖ్యలు చేసేవారు వెంటనే గుర్తుకొస్తారు.
ప్రస్తుత ఎన్నికలలో వైసీపీ, ఎన్డీయే కూటమిలోని టీడీపీ, జనసేన, బీజేపీల నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థులు.. కొందరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల అఫిడవిట్లను పరిశీలించగా తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేస్తున్న ఓ మహిళా అభ్యర్థి వద్ద మిగతా అందరు మహిళా అభ్యర్థుల కంటే ఎక్కువ బంగారం ఉన్నట్లు తేలింది.
ఆమె తరవాత జగన్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన వైసీపీ మహిళా నేత వద్ద ఎక్కువ బంగారం ఉంది.

ఫొటో సోర్స్, reddeppagri_madhavi_reddy

ఫొటో సోర్స్, ECI
కడప అసెంబ్లీ బరిలోని టీడీపీ మహిళా నేతకు 6.5 కేజీల బంగారం
కడప అసెంబ్లీ నియోజకవర్గంలో తొలిసారి పోటీ చేస్తున్న తెలుగుదేశం పార్టీ అభ్యర్థి రెడ్డప్పగారి మాధవి రెడ్డి కొన్నాళ్లుగా తన ప్రసంగాలతో వార్తల్లో నిలుస్తున్నారు.
ఆమె నామినేషన్ దాఖలు చేసిన తరువాత ఆమె ఆస్తుల వివరాలూ చర్చనీయమవుతున్నాయి.
తన పేరిట రూ. 5.4 కోట్ల విలువైన 6,438 గ్రాములు అంటే 6 కేజీల 438 గ్రాముల బంగారం ఉన్నట్లు అఫిడవిట్లో వెల్లడించారామె.
తన భర్త వద్ద బంగారం, వెండి ఏమీ లేవని అఫిడవిట్లో తెలిపారు.

ఫొటో సోర్స్, K.V. Usha Shricharan

ఫొటో సోర్స్, ECI
వైసీపీ మహిళా మంత్రి దగ్గర 5 కేజీల బంగారం, 78 కేజీల వెండి
పెనుకొండ నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్న ఉషశ్రీ చరణ్ తన దగ్గర 5 కేజీల 27 గ్రాముల బంగారు ఆభరణాలు ఉన్నాయని వాటి విలువ రూ. కోటి 25 లక్షల 93 వేలు ఉంటుందని వెల్లడించారు. దాంతో పాటు రూ. 37 లక్షల 44 వేల విలువైన 78 కేజీల వెండి ఉన్నట్లు పేర్కొన్నారు.
ఇక ఆమె భర్త శ్రీచరణ్ దగ్గర 1 కేజీ 607 గ్రాముల బంగారు ఆభరణాలు ఉన్నాయని, వాటి విలువ రూ. 39.39 లక్షలు ఉంటుందని తెలిపారు. ఆయన దగ్గర రూ. 23 లక్షల విలువైన 48 కేజీల వెండి కూడా ఉన్నట్లు ఉషశ్రీ చరణ్ తన అఫిడవిట్లో పేర్కొన్నారు.
ఈ భార్యాభర్తలిద్దరి వద్ద మొత్తం 6 కేజీల 634 గ్రాముల బంగారం, 126 కేజీల వెండి ఉంది.

ఫొటో సోర్స్, butta renuka
బుట్టా రేణుక, కిల్లి కృపారాణి, మేకతోటి సుచరిత, పిడుగురాళ్ల మాధవి, గొట్టిపాటి లక్ష్మి
వీరు కాకుండా మరికొందరు మహిళా అభ్యర్థుల దగ్గర కూడా కేజీల కొద్దీ బంగారం ఉంది.
ఎమ్మిగనూరులో వైసీపీ నుంచి పోటీ చేస్తున్న బుట్టా రేణుక వద్ద రూ. 2.45 కోట్ల విలువైన 2 కేజీల 375 గ్రాముల బంగారు ఆభరణాలున్నాయి. ఆమె భర్త దగ్గర 435 గ్రాములు బంగారం ఉంది.
టెక్కలి నియోజకవర్గంలో కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్న మాజీ కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి తన దగ్గర 215 తులాల(సుమారు 2.5 కేజీలు) బంగారం, 5 కేజీల వెండి ఉన్నట్లు వెల్లడించారు.
దర్శిలో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న గొట్టిపాటి లక్ష్మి వద్ద 1960 గ్రాములు, ఆమె భర్త వద్ద 480 గ్రాముల బంగారం ఉన్నాయి.
మాజీ హోం మంత్రి, తాడికొండ వైసీపీ అభ్యర్థి మేకతోటి సుచరిత తన దగ్గర 1450 గ్రాములు(సుమారు ఒకటిన్నర కేజీలు) బంగారం, తన భర్త దగ్గర 500 గ్రాములు(అర కేజీ) బంగారం ఉన్నట్లు తెలిపారు.
గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పిడుగురాళ్ల మాధవి తన వద్ద 1325 గ్రాముల బంగారం, తన భర్త వద్ద 127 గ్రాముల బంగారం ఉన్నట్లు వెల్లడించారు.

ఫొటో సోర్స్, vanga geetha
పవన్ కల్యాణ్‌పై పోటీ చేస్తున్న వంగా గీతకు 2 కేజీల బంగారం.. గౌతు శిరీష, లోకం మాధవి దగ్గర ఎన్ని కేజీలున్నాయంటే..
పలాసలో టీడీపీ నుంచి పోటీ చేస్తున్న గౌతు శిరీష దగ్గర 1100 గ్రాములు, ఆమె భర్త యార్లగడ్డ వెంకన్న చౌదరి దగ్గర 3513 గ్రాముల స్వర్ణాభరణాలున్నాయి. ఇద్దరి దగ్గర కలిపి 4 కేజీల 600 గ్రాములు స్వర్ణాభరణాలున్నాయి.
నెల్లిమర్లలో ఎన్డీయే కూటమి అభ్యర్థిగా బరిలో నిలిచిన జనసేన నాయకురాలు, వ్యాపారవేత్త లోకం మాధవి తన దగ్గర రూ. 1.25 కోట్ల విలువైన 1992 గ్రాముల బంగారం ఉన్నట్లు అఫిడవిట్లో ప్రకటించారు.
పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై పోటీ చేస్తున్న వైసీపీ అభ్యర్థి వంగా గీత తన దగ్గర 2 కేజీలు, తన భర్త దగ్గర 300 గ్రాముల బంగరాం ఉన్నట్లు వెల్లడించారు. ఇద్దరి వద్ద ఉన్న ఆభరణాల విలువ సుమారు రూ. 1.4 కోట్లు ఉంటుందని అఫిడవిట్లో వెల్లడించారు.
మాడుగులలో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఈర్లి అనురాధ తన దగ్గర కేజీ బంగారం, తన భర్త వద్ద 370 గ్రాముల బంగారం ఉన్నట్లు తెలిపారు. ఈమె జగన్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసి ప్రస్తుతం అనకాపల్లి లోక్‌సభ సీటుకు వైసీపీ నుంచి పోటీ చేస్తున్న బూడి ముత్యాలనాయుడు కుమార్తె.

ఫొటో సోర్స్, roja selvamani
రోజా దగ్గర ఎంత బంగారం ఉందో తెలుసా?
జగన్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన సినీ నటి ఆర్కే రోజా తన దగ్గర 986 గ్రాములు, తన భర్త దగ్గర 485 గ్రాముల బంగారం ఉన్నట్లు అఫిడవిట్లో తెలిపారు.
పుట్టపర్తి టీడీపీ అభ్యర్థి పల్లె సింధూర రెడ్డి తన దగ్గర కేజీ బంగారం, తన భర్త వద్ద 130 తులాలు(1.3 కేజీలు) ఉన్నట్లు తెలిపారు.
కాగా పెనుకొండలో మంత్రి ఉష శ్రీచరణ్‌పై పోటీ చేస్తున్న తెలుగుదేశం అభ్యర్థి సవిత తన దగ్గర 987 గ్రాములు, భర్త దగ్గర 60 గ్రాముల బంగారం ఉన్నట్లు పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, pamula pushpa srivani
తక్కువ బంగారం ఉన్నది వీరికే..
జగన్ ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా పనిచేసి, ప్రస్తుతం కురుపాంలో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పాముల పుష్పశ్రీవాణి తన దగ్గర 80 గ్రాములు, తన భర్త దగ్గర 50 గ్రాముల బంగారం ఉన్నట్లు తెలిపారు.
రంపచోడవరంలో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మిరియాల శిరీష తన దగ్గర 50 గ్రాముల బంగారం ఉన్నట్లు ప్రకటించారు.

ఫొటో సోర్స్, YS Sharmila Reddy
ఎంపీ అభ్యర్థులలో..
ఏపీలో లోక్‌సభ సీట్లకు పోటీ చేస్తున్నవారిలో రాజమండ్రి అభ్యర్థి, బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి తన దగ్గర 1679 గ్రాముల బంగారం ఉన్నట్లు ప్రకటించారు.
విశాఖ ఎంపీ అభ్యర్థి, వైసీపీ నేత బొత్స ఝాన్సీ తన దగ్గర 325 తులాలు, భర్త బొత్స సత్యనారాయణ దగ్గర 31 తులాల బంగారు ఆభరణాలున్నాయని వెల్లడించారు. అంటే ఇద్దరి దగ్గర కలిపి సుమారు 3.5 కేజీల బంగారం ఉంది.
అరకు లోక్‌సభ స్థానంలో పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి కొత్తపల్లి గీత వద్ద 2 కేజీలు, ఆమె భర్త దగ్గర 820 గ్రాముల బంగారం ఉంది.
నరసాపురం లోక్‌సభ స్థానం వైసీపీ అభ్యర్థి గూడూరి ఉమాబాల తన దగ్గర 1602 గ్రాములు, భర్త దగ్గర 206 గ్రాముల స్వర్ణాభరణాలున్నాయని తెలిపారు.
ఇక కడప పార్లమెంటు స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వైఎస్ షర్మిల రెడ్డి తన వద్ద రూ. 3.69 కోట్ల విలువైన స్వర్ణాభరణాలున్నాయని, భర్త దగ్గర రూ. 81.6 లక్షల విలువైన స్వర్ణాభరణాలున్నాయని తెలిపారు. వాటి బరువు ఎంతో వెల్లడించలేదు.

ఫొటో సోర్స్, cm ramesh
మహిళా అభ్యర్థులను మించిపోయారు వీరు..
కాగా కేజీల కొద్ది బంగారు ఆభరణాలున్న మహిళా అభ్యర్థులను మించి బంగారం కలిగి ఉన్న పురుష అభ్యర్థులు కొందరున్నారు. వారిలో మొదటి స్థానంలో ఉన్నది అనకాపల్లి పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి సీఎం రమేశ్. ఆయన దగ్గర 6.92 కేజీలు, ఆయన భార్య దగ్గర 8.19 కేజీల బంగారం ఉంది. ఇద్దరి దగ్గర కలిపి 13 కేజీల బంగారం ఉంది. వీటి విలువ సుమారు రూ. 10 కోట్లుగా పేర్కొన్నారు.
టెక్కలిలో టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడిపై పోటీ చేస్తున్న వైసీపీ నేత దువ్వాడ శ్రీనివాస్ వద్ద 4 కేజీల 616 గ్రాముల బంగారం ఉంది. ఆయన భార్య పేరిట 360 గ్రాముల బంగారం ఉంది.

ఫొటో సోర్స్, nandamuri balakrishna
ఈ అభ్యర్థులు ‘బంగారం లాంటి భర్తలు’
ఇక విజయవాడ వెస్ట్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న బీజేపీ నేత సుజనా చౌదరి వద్ద 310 గ్రాముల బంగారమే ఉన్నప్పటికీ ఆయన భార్య దగ్గర మాత్రం 11 కేజీల 477 గ్రాముల బంగారం ఉంది. దీని విలువ రూ. 10 కోట్లు పైనే.
కాకినాడ లోక్‌సభ సీటుకు పోటీ చేస్తున్న చలమలశెట్టి సునీల్ వద్ద 500 గ్రాముల బంగారం ఉండగా ఆయన భార్య హిమబిందు దగ్గర 8 కేజీల బంగారం ఉంది.
గన్నవరం టీడీపీ అభ్యర్థి యార్లగడ్డ వెంకటరావు వద్ద ఉన్నది 138 గ్రాముల బంగారమే అయినా ఆయన భార్య పేరిట 5 కేజీల 687 గ్రాముల బంగారం ఉంది.
ఇక హిందూపురం టీడీపీ అభ్యర్థి, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ భార్య దగ్గర 3 కేజీల 800 గ్రాముల బంగారం ఉంది.
కుప్పంలో పోటీ చేస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు వద్ద గ్రాము బంగారం కూడా లేకపోయినప్పటికీ ఆయన భార్య భువనేశ్వరి వద్ద 3 కేజీల 435 గ్రాముల బంగారం ఉంది.
అలాగే పులివెందులలో పోటీ చేస్తున్న వైసీపీ అధినేత జగన్ దగ్గరా బంగారం లేదు. ఆయన భార్య భారతి దగ్గర 6 కేజీల 427 గ్రాములు, కుమార్తెలు హర్షిణి రెడ్డి వద్ద 4 కేజీల 187 గ్రాములు, వర్ష రెడ్డి వద్ద 3 కేజీల 457 గ్రాముల బంగారం ఉన్నట్లు అఫిడవిట్లో వెల్లడించారు.
అసెంబ్లీ సెషన్స్‌కు వచ్చేటప్పుడు పది వేళ్లకు పది ఉంగరాలతో కనిపించే విజయనగరం ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్ర స్వామి ఇప్పుడు అదే నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.
ఆయన తన దగ్గర కేజీ, తన భార్య దగ్గర 2 కేజీల బంగారం ఉన్నట్లు అఫిడవిట్లో వెల్లడించారు.
ఇవి కూడా చదవండి:
- ప్రిసిల్లా హెన్రీ: హాలీవుడ్ సినిమాను తలపించే ఓ 'సెక్స్' సామ్రాజ్యాధినేత్రి కథ
- దక్షిణాది రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ స్థానం ఎక్కడ?
- సూర్యగ్రహణం సమయంలో కొన్ని జంతువులు ఎందుకు వింతగా ప్రవర్తిస్తాయి?
- ఒళ్లంతా కణితులు, బొడిపెలు.. ఏమిటీ వ్యాధి? ఎందుకు వస్తుంది?
- హైదరాబాద్‌కు కూడా భవిష్యత్తులో బెంగళూరులాగా నీటి కష్టాలు తప్పవా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















