స్పెయిన్: భార్యపై అవినీతి కేసుతో పదవి నుంచి తప్పుకుంటానన్న ప్రధాని, అసలింతకీ ఏం జరిగింది?

ఫొటో సోర్స్, REUTERS/Yves Herman
- రచయిత, పౌల్ కిర్బీ
- హోదా, బీబీసీ న్యూస్
భార్యపై వచ్చిన అవినీతి ఆరోపణలపై కోర్టు ప్రాథమిక విచారణ జరపడానికి నిర్ణయించడంతో స్పెయిన్ ప్రధాని పెడ్రో సాంచెజ్ తను ఆ పదవిలో కొనసాగాలా వద్దో నిర్ణయించుకుంటానని ప్రకటించారు.
‘‘నేను ప్రభుత్వాన్ని నడపాలా లేక ఈ గౌరవాన్ని వదులుకోవాలా అనే విషయాన్ని తక్షణం తేల్చుకోవాల్సిన అవసరం ఉంది.’’ అని ఆయన ఓ ప్రకటనలో తెలిపారు.
సాంచెజ్ భార్య బెగోనా గోమెజ్ పై వచ్చిన అవినీతి ఆరోపణలపై స్పందిస్తామని
కోర్టు తెలిపింది. తన భార్య తన గౌరవాన్ని కాపాడుకుంటారని, ఆమె న్యాయవ్యవస్థతో కలిసి పనిచేస్తారని సాంచెజ్ చెప్పారు.
అవినీతికి వ్యతిరేకంగా ప్రచారం చేసే మానోస్ లిమ్పియాస్ (క్లీన్ హ్యాండ్స్) అనే సంస్థ
బెగోనాపై ఫిర్యాదు చేసింది.
ఈ సంస్థ అనేక హైప్రొఫైల్ కోర్టు కేసులలో పాల్గొంది. దీనికి రైట్ వింగ్‌కు చెందిన ఓ వ్యక్తి నాయకత్వం వహిస్తున్నారు.
స్పెయిన్‌లో రాజకీయాలను మలుపు తిప్పేందుకు లెఫ్ట్ వింగ్ , రైట్ వింగ్ నాయకులు గట్టిగా ప్రయత్నిస్తున్న నేపథ్యంలో తాను పదవిలో కొనసాగడం సరైనదా కాదా అని ఆలోచిస్తున్నట్టు, తన భవిష్యత్తు గురించి ఏప్రిల్ 29న మీడియా ముందు వెల్లడిస్తానని స్పెయిన్ ప్రధాని చెప్పారు.

ఫొటో సోర్స్, JAVIER SORIANO/AFP
‘ఎక్స్’లో సాంచెజ్ ఇచ్చిన ఓ సుదీర్ఘ ప్రకటనలో తనను రాజకీయంగా, వ్యక్తిగతంగా బలహీన పరిచేందుకు తన భార్యను లక్ష్యంగా చేసుకున్నారని ఇది ‘వేధింపుల వ్యూహం’లో భాగమని పేర్కొన్నారు.
బెగోనా గోమెజ్ పలుకుబడిని ఉపయోగించి అవినీతికి పాల్పడ్డారా లేదా అనే విషయంపై ఏప్రిల్ 16న దర్యాప్తు ప్రారంభించామని ప్రకటించిన కోర్టు మరే విరాలు వెల్లడించలేదు.
బెగోనా గోమెజ్‌కు ప్రైవేటు కంపెనీలతో ఉన్న సంబంధాలు, ఆ కంపెనీలు ఏమైనా కాంట్రాక్టులు, ప్రజాధనాన్ని పొందాయా అనే విషయాలపై విచారణ దృష్టి సారించినట్టు ఈఐ కాన్ఫిడెన్షియల్ వెబ్‌సైట్ పేర్కొంది.
ముఖ్యంగా పర్యాటక సంస్థ గోబాలియా, గోమెజ్ 2020లో నడిపిన ఐఈ ఆఫ్రికా సెంటర్ అనే ఫౌండేషన్ ‘స్పాన్సర్‌షిప్ అగ్రిమెంట్’లో పాలుపంచుకోవడాన్ని ఉదహరించింది.
2020లో గ్లోబాలియ తన ఎయిర్ లైన్స్ కు 475 మిలియన్ పౌండ్ల బెయిల్ అవుట్ ప్యాకేజీ పొందింది.
యూరప్‌లో కోవిడ్ 19 సంక్షోభ సమయంలో కంపెనీలకు ప్రభుత్వం రెస్క్యూ ప్యాకేజీలు ప్రకటించింది.
ఈ ఆరోపణలపై వివరణ ఇవ్వాలని స్పెయిన్ పార్లమెంట్‌లో బుధవారం పాపులర్ పార్టీ డిమాండ్ చేయగా, తనకు న్యాయంపై నమ్మకం ఉందని ప్రధాని చెప్పారు.
మనస్తాపంతో ప్రధాని పార్లమెంట్‌ను వీడి మాడ్రిడ్‌లోని నివాసానికి వెళ్లినట్టు స్పానిష్ మీడియా తెలిపింది.
తనను పదవి నుంచి దించేందుకు పాపులర్ పార్టీ నాయకుడు అల్బెర్టో నూనెజ్ ఫిజు అతి మితవాద నాయకుడు వోక్స్‌తో కలిసి పనిచేస్తున్నారని కొన్ని గంటల తరువాత ప్రధాని ఆరోపించారు.
‘‘నేనేమీ అమాయకుడిని కాను. బెగోనా నా భార్య కాబట్టి ఆమెను లక్ష్యంగా చేసుకున్నారు. ఆమె ఎటువంటి అక్రమాలకు పాల్పడ లేదు. వారికి కూడా ఈ విషయం తెలుసు. ’’ అని సాంచెజ్ తెలిపారు.
2018 నుంచి అధికారంలో ఉన్న సాంచెజ్‌కు మిత్రపక్షాలు మద్దతుగా నిలిచాయి. కానీ జూన్‌లో జరగనున్న యూరోపియన్ పార్లమెంట్ ఎన్నికల ముంగిట ఆయన పదవిలో కొనసాగాలా వద్దా అనే సందిగ్థంలో పడటం సోషలిస్టు పార్టీకి ఆందోళన కలిగిస్తోంది.
ఈశాన్య స్పెయిన్‌లోని కేటలోనియా ప్రాంతంలో వచ్చే నెలలో ఎన్నికలు జరగున్నాయి.
ఆయన బార్సిలోనాలో గురువారం ఎన్నికల ప్రచారం ప్రారంభించాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి:
- బ్రాయిలర్ చికెన్ సంతాన సమస్యలకు దారితీస్తుందా? నిపుణులు ఏం చెబుతున్నారు?
- 4.7 కోట్ల ఏళ్లనాటి వాసుకి పాము అవశేషాలు వెలుగులోకి.. అసలేంటి ఈ పాము కథ?
- ఎర్త్ రైజ్: 1968 నాటి ఈ ఫోటో ప్రపంచాన్నే మార్చేసింది..
- హెపటైటిస్: మొత్తం కేసులలో 11 శాతం భారత్‌లోనే.. అసలేమిటీ వ్యాధి, ఎందుకొస్తుంది, చికిత్స లేదా?
- ఏపీ పవర్ పాలిటిక్స్‌లో కనిపించని నాలుగో సింహం ఆ కులం
బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














