మనలో ‘రెండో గుండె’ ఉందని మీకు తెలుసా? అది ఎలా పని చేస్తుందంటే...

సోలియస్ కండరం
ఫొటో క్యాప్షన్, నిల్చుని చేసే ఏ పనికైనా సోలియస్ అత్యంత ముఖ్యమైంది.
    • రచయిత, రాఫెల్ అబుచైబే
    • హోదా, బీబీసీ న్యూస్ వరల్డ్

సాధారణంగా మన శరీరంలోని ఈ కండరం గురించి చాలా తక్కువ మందికి తెలుసు. కానీ, దీని ప్రాముఖ్యం అంతా ఇంతా కాదు. కేవలం నిల్చోవడం, నడవడం కోసమే కాదు, దీని అవసరం ఇంకా చాలా ఎక్కువ.

ఆ కండరం పేరు సోలియస్. ఇది పిక్కలలో ఉండే శక్తిమంతమైన కండరం. శరీరంలోని పలు రకాల అవయవాల్లో ఇదీ ఒకటి. మనం నిటారుగా నిల్చునేందుకే కాకుండా, దీని లోపల ఉండే రెండు ముఖ్యమైన సిరలు, రక్తసరఫరాలో కీలక పాత్ర పోషిస్తాయి.

అందుకే, దీన్ని మనిషికున్న ‘రెండో గుండె’ అని చెప్పవచ్చు.

అవయవ కూర్పే దీని ప్రత్యేకత అని బార్సిలోనా యూనివర్సిటీలోని స్కూల్ ఆఫ్ స్పోర్ట్స్ మెడిసిన్ స్పెషలిస్ట్ డాక్టర్ కార్లెస్ పెడ్రెట్ బీబీసీతో అన్నారు.

‘‘ఇది చాలా పెద్ద కండరం. కండర ద్రవ్యరాశి దీనికి ఎక్కువగా ఉంటుంది. స్వచ్ఛమైన కండర కణజాలంతో ఇది రూపొందింది. ఇతర కండరాల మాదిరిగా బంధన కణజాలం దీనికి ఎక్కువగా ఉండదు’’ అని ఆయన అన్నారు.

సోలియస్ కండరం

ఫొటో సోర్స్, Getty Images

స్థిరత్వం

‘‘నడవడం లేదా నిల్చోవడం వంటి ఏ పనికైనా సోలియస్ చాలా ముఖ్యమైంది’’ అని టెక్సాస్‌లోని యూనివర్సిటీ ఆఫ్ హ్యూస్టన్‌కు చెందిన డాక్టర్ మార్క్ హామిల్టన్ చెప్పారు.

శరీరంలోని అవయవాలు వాటి పనితీరు బట్టి, వివిధ రకాల ఫైబర్లతో రూపొందుతాయి.

శరీరాకృతిని నిర్వహించే కండరాల కోసం, వెన్నెముకను నిటారుగా ఉంచడం కోసం శరీరం స్లో-ట్విచ్ ఫైబర్లు(అంటే ఎరుపు కండరాల ఫైబర్లను) వాడుతుంది.

ఇవి అకస్మాత్తుగా జరిపే కదలికల కోసం రూపొందనప్పటికీ, వీటికి రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది. ఎక్కువ సమయం పాటు నిల్చునేందుకు లేదా నడిచేందుకు ఉపయోగపడతాయి.

మరోవైపు మీ చేతుల్లో, కాళ్లలో, లేదా అరిచేతుల్లో ఉండే కండరాలలో ఫాస్ట్-యాక్టింగ్ ఫైబర్లు ఉంటాయి. ఇవి వాటి సామర్థ్యం మేరకు పెద్ద సంఖ్యలో కదలికలను వెనువెంటనే చేపడుతూ రిలాక్స్ అవుతుంటాయి.

మీరు నిటారుగా నిల్చునేందుకు ఉపయోగపడే సోలియస్ నిర్మాణాత్మక కండరం. స్లో-ట్విచ్ టిస్యూతోనే ఈ కండరం రూపొందింది. అలసట పొందకుండా ఎక్కువగా ఎనర్జీని ఉత్పత్తి చేసే సామర్థ్యం దీనికి ఉంటుంది.

‘‘సోలియస్‌లో ఎక్కువ మొత్తంలో కండరాల ఫైబర్ ఉంటుంది. ఈ కండరాల ఫైబర్‌నే ఎనర్జీ ఉత్పత్తికి కీలకం. దీన్నే మిటోచోండ్రియా అంటారు. పెద్ద మొత్తంలో ఉండే మిటోచోండ్రియా వల్ల, ఈ ఎనర్జీని ఉత్పత్తి చేయగలుగుతాం’’ అని డాక్టర్ పెడ్రెట్ అన్నారు.

శరీర బరువులో ఒక శాతం మాత్రమే ఉండే ఈ కండరం శరీరంలో ఇతర చాలా అవయవాలతో పోల్చినప్పుడు అత్యధికంగా ఎనర్జీ కలిగి ఉండేందుకు కారణం ఈ ఫైబర్ల సాంద్రతే.

రక్తసరఫరా వ్యవస్థ

ఫొటో సోర్స్, Getty Images

రక్త సరఫరా వ్యవస్థ

సోలియస్ చాలా ముఖ్యమైన విధిని నిర్వర్తిస్తుంది. శరీరమంతా రక్తాన్ని సరఫరా చేసేందుకు గుండెకు ఇది సాయం చేస్తుంది.

ఇతర కండరాలతో పోలిస్తే సోలియస్ పనితీరు చాలా భిన్నంగా ఉంటుందని డాక్టర్ హామిల్టన్ చెప్పారు.

పిక్కల(మడపై భాగంలో) లోపల, సోలియస్‌లో పెద్ద పెద్ద సిరలు ఉంటాయి.

దీని గురించి మీరు ఆలోచిస్తే, మీ కాలి పిక్కలు, మడెమ, పాదాలలో రక్త సరఫరాకు ఆటంకం కలుగుతుంటుంది. ఈ సమస్య వృద్ధులలో కనిపిస్తుంటుంది. కానీ, యువత కూడా ఈ సమస్యను ఎదుర్కొంటుంటారు.

కానీ, సోలియస్ లోపల ఉండే ఈ సిరలలో ఉండే స్వభావం వల్ల, కండరాలు సంకోచించినప్పుడు అవి కంప్రెస్ అవుతుంటాయి. కంప్రెస్ అయినప్పుడు, ఆ సిరలు ఫిల్ అవుతూ, ఖాళీ అవుతుంటాయి. ఆ తర్వాత రక్తాన్ని తిరిగి గుండెకు సరఫరా చేస్తుంటాయి.

సాధారణంగా, మీరు వేసే ప్రతి అడుగు కాళ్లలో ఉండే రక్తాన్ని తిరిగి గుండెకు పంపించేందుకు సాయపడుతుంటుంది. పాదాలలో, గ్యాస్ట్రోక్నెమియస్ కండరాలను కలిగి ఉండే ఈ వ్యవస్థను పోప్లిటియల్ పంప్ అంటారు.

శరీరంలో ఉండే అన్ని ఇతర కండరాల మాదిరి, సోలియస్‌ను కూడా ఆరోగ్యకరంగా ఉంచాల్సినవసరం ఉంటుంది. ఫాస్ట్ ఫైబర్ కండరాల మాదిరిగా కాకుండా, సోలియస్ చాలా నిదానంగా, స్థిరంగా పనిచేస్తుంటుంది.

పరిగెత్తడం

ఫొటో సోర్స్, Getty Images

‘‘సోలియస్ కండరానికి ఎక్కువగా పనిచెప్పడం వల్ల అది ఆరోగ్యకరంగా ఉంటుందని చాలా మంది భావిస్తుంటారు. అన్నింటితో పోలిస్తే ఇది కాస్త భిన్నమైంది. నిరంతర పనితీరు దీనికి కావాలి. అయితే, దీనిపై ఎక్కువగా ఒత్తిడి పెట్టకూడదు’’ అని నడక ఎలా ఉండాలనే దానిపై డాక్టర్ ఫెడ్రెట్ పలు సూచనలు చేశారు.

నిశ్చల జీవనశైలి చెడు చేస్తుంది. అలాగే బలవంతంగా పని చెప్పడం కూడా కండరాలపై ప్రభావం చూపుతుంది. మన కండరాల విషయానికి వచ్చే సరికి, ఇది గోల్డెన్ రూల్. ‘‘వృద్ధాప్యంలో కూడా ప్రజలు మంచి మానసిక ఆరోగ్యాన్ని పొందుతారు. ఇది నిజం. కానీ, మంచి కండరాల వ్యవస్థే నాణ్యమైన జీవితాన్ని అందించగలదు’’ అని చెప్పారు. కండరాలు నిరంతరం స్థిరంగా పనిచేయడం వల్ల శరీర ఆరోగ్యం మెరుగవుతుంది.

కండరాల వ్యవస్థను మెరుగ్గా నిర్వహించడం ద్వారా మొత్తంగా మెటబాలిక్ సిస్టమ్ బాగా పనిచేస్తుంది. వ్యాధులు వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. మెదడు చురుగ్గా పనిచేస్తుంది. దీని వల్ల మతిమరుపు వ్యాధి రాకుండా చూసుకోవచ్చు. మానసిక ఆరోగ్యం కూడా చక్కగా ఉంటుంది.

ఇవి కూడా చదవండి:

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)