కిడ్నీ ప్రాబ్లమ్ ఉందని తెలుసుకోవడం ఎలా?

ఫొటో సోర్స్, Getty Images
ఇండియన్ సొసైటీ ఆఫ్ నెఫ్రాలజీ ప్రచురించిన తాజా అధ్యయనం ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా 840 మంది మిలియన్ల (84 కోట్లు) మంది దీర్ఘకాలిక మూత్రపిండాల వ్యాధి (క్రానిక్ కిడ్నీ డిసీజ్ - సీకేడీ)తో బాధపడుతున్నారు. అంటే, ప్రతి పది మందిలో దాదాపు ఒకరికి కిడ్నీ వ్యాధి ఉంది.
ఇటీవలి కాలంలో మరణాలకు కారణమవుతున్న 10 ప్రధాన వ్యాధులలో క్రానిక్ కిడ్నీ డిసీజ్ 7వ స్థానంలో ఉంది. ఒక్క భారత్‌లోనే ఏటా 2 లక్షల నుంచి 2.5 లక్షల మంది కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్నట్లు ఇండియన్ సొసైటీ ఆఫ్ నెఫ్రాలజీ ప్రచురించిన జర్నల్‌లో పేర్కొన్నారు.
అలాగే, భారత్‌లోని వయోజనులైన జనాభాలో 8 నుంచి 10 శాతం మంది ఈ దీర్ఘకాలిక మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్నట్టు ఆ సంస్థ పేర్కొంది.
దీనికి ప్రధాన కారణం కిడ్నీ సంబంధిత వ్యాధులను ప్రాథమిక దశలో గుర్తించకపోవడమేనని, సమస్య తీవ్రమైన తర్వాతే ఇది బయటపడుతోందని ఎంజీఎం హెల్త్‌కేర్ హాస్పిటల్ సీనియర్ యూరాలజిస్ట్ మిల్లీ మాథ్యూ చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
కిడ్నీలు ఎలా పనిచేస్తాయి?
శరీరంలోని అతి ముఖ్యమైన అవయవాల్లో కిడ్నీలు కూడా ఉన్నాయి. రక్తంలోని వ్యర్థాలను, శరీరానికి అనవసరమైన మినరల్స్‌ను మూత్రం ద్వారా బయటికి పంపించి, స్వచ్ఛమైన రక్తాన్ని శరీరమంతటా పంపిణీ చేస్తాయి.
అయితే, మన జీవనశైలి, తీసుకునే ఆహారం, అలవాట్లు, వంశపారంపర్య సమస్యలు, అనవసరమైన మందుబిళ్లలు తీసుకోవడం, ఇతర ఆరోగ్య సమస్యలు కిడ్నీల పనితీరుపై ప్రభావం చూపుతాయి.
కిడ్నీ పనితీరు మందగించి, శరీరంలోని వ్యర్థాల తొలగింపు విధులు సక్రమంగా నిర్వహించలేనప్పుడు మాత్రమే పలు రకాల కిడ్నీ వ్యాధులు వచ్చే అవకాశం ఏర్పడుతుంది. మరో ప్రమాదమేంటంటే, తొలిదశలో ఎలాంటి లక్షణాలు కనిపించకుండానే ఈ వ్యాధులు ముదిరిపోతాయి.
రోజురోజుకీ వ్యాధి ముదురుతున్నప్పుడు ఒక్కొక్కటిగా లక్షణాలు కనిపించడం మొదలవుతుందని, ఆ తర్వాత వైద్య పరీక్షల ద్వారా వ్యాధి ఏ స్థాయిలో ఉంది, ఎలాంటి వ్యాధితో ఇబ్బంది పడుతున్నారో తెలుసుకోవచ్చని డాక్టర్ మిల్లీ మాథ్యూ చెబుతున్నారు.
మీకు ఎలాంటి కిడ్నీ వ్యాధులు రావొచ్చు? వస్తే ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి?

ఫొటో సోర్స్, Getty Images
దీర్ఘకాలిక మూత్రపిండాల వ్యాధి (సీకేడీ)
దీర్ఘకాలిక మూత్రపిండాల వ్యాధి(సీకేడీ)కి గురైతే చాలాకాలం బాధపడాల్సి వస్తుంది. మధుమేహం(డయాబెటిస్ లేదా షుగర్), అధిక రక్తపోటు (హైబీపీ) ఉన్నవారిలో చాలా సాధారణంగా కనిపించే వ్యాధి ఇది.
ప్రారంభ దశలో లక్షణాలు కనిపించవు. వీటిని పూర్తిగా నయం చేయడం కష్టం. సరైన వైద్య చికిత్స ద్వారా మరింత తీవ్రతరం కాకుండా అదుపులో ఉంచుకోవచ్చు.
ఈ వ్యాధి లక్షణాలు:
- వికారంగా ఉండడం, వాంతులు
- ఆకలి లేకపోవడం
- పాదాలు, చీలమండ వద్ద వాపు
- తక్కువగా శ్వాస తీసుకోవడం
- నిద్రలేమి
- ఎక్కువగా లేదా తక్కువగా మూత్రవిసర్జన

ఫొటో సోర్స్, Getty Images
కిడ్నీలో రాళ్లు
కిడ్నీలో పేరుకుపోయే ఉప్పు లేదా ఇతర ధాతువుల స్ఫటికాలను మూత్రపిండాల్లో రాళ్లుగా పిలుస్తారు. సాధారణంగా ఒకటి లేదా రెండు రాళ్లు ఏర్పడినప్పుడు ఎలాంటి లక్షణాలు కనిపించకపోవచ్చని డాక్టర్ చెప్పారు.
అయితే, ఇది తీవ్రతరమయ్యే అవకాశం ఉందన్నారు. నీళ్లు తక్కువగా తాగడం, ఊబకాయం, జీవనశైలి సమస్యలు, ఆహారం కారణంగా ఈ సమస్య వస్తుంది.
లక్షణాలు:
- మూత్రవిసర్జన సమయంలో నొప్పి
- మూత్రంలో రక్తం
- మూత్రనాళంలో అడ్డంకులు
- రాయి ఉన్న భాగంలో నొప్పి

ఫొటో సోర్స్, Getty Images
డయాబెటిక్ నెఫ్రోపతి
డయాబెటిస్ ఉన్న ప్రతి ముగ్గురిలో ఒకరి కిడ్నీ వైఫల్యానికి దారితీస్తున్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా కిడ్నీవ్యాధులకు డయాబెటిస్ ప్రధాన కారణం. షుగర్ నియంత్రణలో లేని వ్యక్తుల్లో ఈ డయాబెటిక్ కిడ్నీ వ్యాధి వస్తుంది.
లక్షణాలు:
- కాళ్లు ఉబ్బడం
- మూత్రవిసర్జనలో నురుగు రావడం
- నీరసంగా ఉండడం
- బరువు తగ్గడం
- దురదలు
- వికారం, వాంతులు

ఫొటో సోర్స్, Getty Images
హైపర్‌టెన్సివ్ నెఫ్రోస్ల్కెరోసిస్
మధుమేహంతో పాటు మూత్రపిండాలను ప్రభావితం చేసే మరో సమస్య అధిక రక్తపోటు. హైబీపీ కిడ్నీల్లోని రక్తనాళాలను దెబ్బతీస్తుంది, తద్వారా కిడ్నీల పనితీరుపై ప్రభావం పడుతుంది.
ఇది రక్తం నుంచి అనవసరమైన వ్యర్థాలు, ధాతువుల తొలగింపు విధులను ప్రభావితం చేస్తుంది. ఫలితంగా మూత్రపిండాల పనితీరు దెబ్బతింటుంది. అనవసరమైన ఫ్లూయిడ్స్ రక్తనాళాల్లో పేరుకుపోతాయి, దీనివల్ల బీపీ మరింత పెరుగుతుంది.
లక్షణాలు:
- వికారం, వాంతులు
- తలతిరగడం
- నీరసంగా ఉండడం
- తలనొప్పి
- మెడనొప్పి

ఫొటో సోర్స్, Getty Images
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ కిడ్నీ వ్యాధి కాకపోయినప్పటికీ, ఇది కిడ్నీలపై ప్రభావం చూపుతుంది. బాక్టీరియా కారణంగా మూత్రనాళంలో యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ కలుగుతుంది.
ఈ ఇన్ఫెక్షన్ మూత్రనాళం కింది భాగంలో ఉంటే కిడ్నీలు దెబ్బతినే అవకాశం తక్కువ. అయితే, ఇన్ఫెక్షన్ పేరుకుపోయి పైభాగానికి చేరితే కిడ్నీకి హాని జరుగుతుంది.
లక్షణాలు:
- వెన్నునొప్పి
- జ్వరం
- మూత్రవిసర్జన సమయంలో నొప్పి
- పొత్తికడుపు నొప్పి
- మూత్రంలో రక్తం
- వికారం, వాంతులు

ఫొటో సోర్స్, Getty Images
పాలిసిస్టిక్ కిడ్నీ డిసీజ్
పాలిసిస్టిక్ కిడ్నీ డిసీజ్ ఒక కిడ్నీ వ్యాధి. ఇది కిడ్నీలలోని తిత్తులకు సంబంధించినది. కాలక్రమేణా ఇవి పెరిగి మూత్రపిండాల వైఫల్యానికి దారితీస్తాయి. ఇది దాదాపు జన్యుపరంగా సంక్రమించే వ్యాధి.
లక్షణాలు:
- పొత్తికడుపు పైభాగంలో నొప్పి
- పొత్తికడుపు పక్కన నొప్పి
- వెన్నునొప్పి
- మూత్రంలో రక్తం
- తరచుగా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్లకు గురవడం

ఫొటో సోర్స్, Getty Images
IgA నెఫ్రోపతి
ఇదో రకం కిడ్నీ వ్యాధి. బాల్యం, లేదా కౌమార దశలో మొదలవుతుందని డాక్టర్ మిల్లీ మాథ్యూ చెప్పారు. మూత్రం వచ్చేటప్పుడు దానితో పాటు రక్తం కూడా వస్తుంది. దీన్ని నేరుగా చూడడం ద్వారా గుర్తించడం కష్టం. వ్యాధి నిర్ధరణ పరీక్ష ద్వారా ఈ వ్యాధిని గుర్తించవచ్చు.
ఇది కిడ్నీలోని ఫిల్టర్ల(గ్లోమెరులి) లోపల ఇమ్యునోగ్లోబిన్ ఏ(ఐజీ ఏ) ప్రొటీన్ పేరుకుపోవడం వల్ల వస్తుంది.

ఫొటో సోర్స్, Getty Images
కిడ్నీ వైఫల్యం
కిడ్నీ వైఫల్యంతో బాధపడుతున్న వారికి వ్యాధి ముదిరిన తర్వాతే లక్షణాలు కనిపిస్తాయి. వ్యాధి తీవ్రతను 5 స్థాయిలుగా వ్యవహరిస్తారు. అందులో నాలుగో దశ వరకూ ఎలాంటి లక్షణాలు లేకుండా బాగానే కనిపిస్తారు.
కిడ్నీల పనితీరు 100 నుంచి 10 శాతం వరకూ పడిపోయినప్పుడు మాత్రమే వ్యాధి లక్షణాలు కనిపిస్తాయి.
లక్షణాలు:
- ఆకలి లేకపోవడం
- వాంతులు
- బాగా నీరసంగా ఉండడం
- శరీరం ఉబ్బడం
- నిద్రలేమి
- ఉబ్బసం
ఇవి కూడా చదవండి:
- 'ఇంట్లో చొరబడి చంపేస్తాం' అన్న మోదీ వ్యాఖ్యలపై అమెరికా ఏమందంటే...
- సైబర్ బానిసలు: ‘నా కళ్ళ ముందే ఆ ఇద్దరు అమ్మాయిలను 17మంది రేప్ చేశారు, నన్ను 16 రోజులు చిత్ర హింసలు పెట్టారు’
- 'భారత గూఢచార సంస్థ' పాకిస్తాన్లో 20 మందిని చంపేసిందా, ది గార్డియన్ పత్రిక కథనంపై పాక్ ఏమంటోంది?
- కచ్చతీవుకు బదులుగా భారత్ తీసుకున్న 'వాడ్జ్ బ్యాంక్' ప్రాంతం అంత విలువైనదా?
- రెండు లక్షల 25 వేలు పలికిన ఆరు రూపాయల సాధారణ కోడి గుడ్డు, ఎందుకు?
బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















