సిగరెట్ తాగేవారి పక్కన ఉంటే ఊపిరితిత్తుల క్యాన్సర్ వస్తుందా? పాసివ్ స్మోకింగ్ చేసే చేటు ఏమిటి?

పాసివ్ స్మోకింగ్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, పొగ తాగేవారితోపాటు పక్కనే ఉండి పీల్చేవారికీ అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి
    • రచయిత, సిరాజ్
    • హోదా, బీబీసీ

‘ధూమపానం ఆరోగ్యానికి హానికరం’ అనే సంగతి అందరికీ తెలిసిందే. దీనివల్ల ఊపిరితిత్తుల క్యాన్సర్, గుండె జబ్బులు, పక్షవాతం లాంటి జబ్బులు వస్తాయి.

ధూమపాన ప్రమాదాల గురించి సిగరెట్ పాకెట్ల మీద పెద్దగా ముద్రించి ఉంటుంది. అలాగే పొగాకు అలవాటు కారణంగా జరిగే నష్టాలను పెద్ద ఎత్తున ప్రచార చిత్రాల రూపంలో టీవీలలో, సినిమా థియేటర్లలో చూస్తుంటాం.

కానీ అసలు జీవితంలో సిగరెట్టే తాగనివారు కూడా ధూమపానకారణంగా వచ్చే వ్యాధుల బారిన పడతారంటే నమ్మగలరా? సిగరెట్ తాగనివారికి కూడా ఇలాంటి వ్యాధులు రావడానికి కారణం సిగరెట్లు తాగే వారి పక్కన ఉండటమే. దీనినే సెకండ్ హ్యాండ్ స్మోకింగ్, పాసివ్ స్మోకింగ్ అంటారు.

పొగాకు సంబంధిత అలవాట్లు కారణంగా ఏటా ప్రపంచ వ్యాప్తంగా 80 లక్షల మంది చనిపోతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక చెబుతోంది. పొగాకు ఉత్పత్తులను నేరుగా వాడేవారు 70 లక్షల మంది చనిపోతుంటే 10 నుంచి 13 లక్షలమంది పాసివ్ స్మోకింగ్ కారణంగా మృత్యువాత పడుతున్నారు. వీరిలో మహిళలే అధికం.

పొగాకుకు సంబంధించిన ఏరకమైన అలవాటైన ప్రాణాంతకమేనని, పొగాకుకు సంబంధించి సేఫ్ డోస్ అనేది ఏమీ లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది.

దీనికి తోడు పొగాకు మహమ్మారి ప్రపంచ ప్రజారోగ్యాన్ని కుదిపేస్తున్న వాటిల్లో ఒకటి.

సిగరెట్లు తాగేవారందరికీ ఆ అలవాటు తమ శరీరానికి ఎంతటి చేటు చేస్తుందో తెలుసు. కానీ అసలు పొగతాగనివారు కూడా ఈ ప్రమాదాల బారిన పడటానికి కారణమేంటి? దాన్నుంచి తప్పించుకోవడమెలా? సురక్షితంగా ఉండటమెలా?

పాసివ్ స్మోకింగ్

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, కుటుంబంలో ఒక వ్యక్తి సిగరెట్ తాగితే ఆ ఇంట్లోని వారందరూ పాసివ్ స్మోకర్లే అవుతారు

ఏమిటీ పాసివ్ స్మోకింగ్?

‘‘ఒక వ్యక్తి నేరుగా సిగరెట్ తాగడం యాక్టివ్ స్మోకింగ్ అయితే, పక్కనే ఉండి ఆ పొగను పీల్చే వ్యక్తి పాసివ్ స్మోకర్ అవుతారు’ అని మద్రాస్‌లోని అపోలో క్యాన్సర్ సెంటర్ లో ఫిజిషియన్, సీనియర్ కన్సల్టెంట్ అజయ్ నరసింహన్ చెప్పారు.

‘‘దీని వల్ల సిగరెట్ తాగే వ్యక్తికి ఎటువంటి నష్టం కలుగుతుందో, పక్కన ఉండి ఆ పొగ పీల్చిన వ్యక్తికి కూడా అంతే నష్టం జరుగుతుంది. సహజంగా భర్త సిగరెట్‌కు బానిస అయితే, అతనితో జీవించే భార్య కూడా దీని బారిన పడే ప్రమాదం ఉంటుంది. ఏళ్ళ తరబడి పక్కనే ఉండి అనివార్యంగా పొగపీల్చాల్సి రావడం వల్ల ఆమె కూడా ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది’’ అని ఆయన వివరించారు.

‘‘వారు ఆ సిగరెట్ పొగ పీల్చడం చేటు చేస్తుందనే విషయం తెలియక ఏళ్ళ తరబడి దానిని పీల్చుతుంటారు. ఇందులోని విషాదం ఏమిటంటే ఈ పాసివ్ స్మోకర్లందరూ తమ తప్పేమీ లేకుండానే సిగరెట్ దుష్ప్రభావాల బారిన పడతారు’’ అని తెలిపారు డాక్టర్ అజయ్ నరసింహన్.

పాసివ్ స్మోకింగ్

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, పాసివ్ స్మోకింగ్ బాధితులు ఎక్కువగా మహిళలే

పాసివ్ స్మోకింగ్ సమస్యలేంటి?

‘‘ వైద్య పరిభాషలో చెప్పాలంటే పొగాకు వినియోగం కారణంగా వచ్చే ఊపిరితిత్తుల క్యాన్సర్, తీవ్రమైన శ్వాస సంబంధిత సమస్యలు, గుండె జబ్బులు, పక్షవాతం, గొంతు క్యాన్సర్, అస్త్మా తదితర బబ్బులన్నీ సిగరెట్ పొగ పీల్చేవారికి వస్తాయి’’

మహిళలు అసంకల్పిత ధూమపానానికి గురవుతుంటారు.

కుటుంబంలో ఎవరైనా సిగరెట్ తాగితే, అది అతని కుటుంబంపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుందని చెప్పారు ఆంకాలజిస్ట్ అనిత.

‘‘కొన్ని నెలల కిందట ఊపిరి తిత్తుల క్యాన్సర్ చికిత్స కోసం నా దగ్గరకు ఓ మహిళ వచ్చారు. ఆమె వయసు 45 సంవత్సరాలు. స్కానింగ్ తీయిస్తే ఊపిరితిత్తుల్లో అడెనోకార్సినోమా (క్యాన్సర్) కనిపించింది. దిగ్భ్రాంతి కలిగించే విషయం ఏమిటంటే ఆమె ఏనాడూ పొగ తాగి ఎరుగరు. కానీ ఆమె భర్తకు పొగతాగే అలవాటు ఉంది. భర్త ఇంట్లోనే ఎక్కువ సమయం గడుపుతూ పొగతాగుతూ ఉండేవారు’’

‘‘చాలా ఏళ్ళపాటు ఆ మహిళ ఇంట్లో భర్త వల్ల సిగరెట్ పొగను పీల్చడంతో, ఆమె శ్వాసపరమైన ఇబ్బందులకు గురయ్యారు. కానీ ఆమె డాక్టర్ ను సంప్రదించలేదు’’

‘‘ఒకరోజు ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది ఎక్కువ కావడంతో ఓ డాక్టర్‌ను సంప్రదించారు. తరువాత నా దగ్గరకు వచ్చారు. నీ భార్యకు వచ్చిన క్యాన్సర్‌కు మీరే కారణమని నేను ఆ ఆమె భర్తకు చెప్పినప్పుడు ఆయన నిశ్శబ్దంగా ఉండిపోయారు. ప్రపంచమంతటా తమ జీవితంలో ఒక్కరోజు కూడా సిగరెట్‌ను ముట్టని చాలా మంది మహిళలు ఊపిరి తిత్తుల క్యాన్సర్, పక్షవాతం, గుండెజబ్బుల ప్రమాదాలను ఎదుర్కొంటున్నారు. దీనికి కారణం ఆ పక్కన ఉన్న వారు సిగరెట్లు తాగడమే. పొగతాగేవారంతా ఎటువంటి పశ్చాత్తాపం లేకుండా స్టైల్‌గా సిగరెట్లు పీల్చేస్తుంటారు’’ అని చెప్పారు అనిత.

‘‘కరోనా కాలంలో చాలామంది ఇళ్ళకే పరిమితమయ్యారు. చాలా ఇళ్ళల్లో భర్తలు సిగరెట్టో, బీడీనో తాగుతుంటే భార్య, పిల్లలు పక్కనే చేరి మాట్లాడుకుంటూ ఉంటారు. కానీ అదెంత ప్రమాదకరమో వారికి తెలియదు. అందుకే పాసివ్ స్మోకింగ్ పై అందరికీ అవగాహన రావాలి’’ అని ఆమె వివరించారు.

‘‘ప్రత్యేకించి పిల్లలకు సిగరెట్ పొగ శరీరంపై ఎనలేని చికాకును కలిగిస్తుంది. పొగలోని నికోటిన్ అణువులు ఊపిరితిత్తుల్లోకి చేరి శ్వాసకోశ వ్యవస్థపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి’’ అని చెప్పారు డాక్టర్ అజయ్ నరసింహన్.

పాసివ్ స్మోకింగ్

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఎంత ప్రమాదం?

అసంకల్పితంగా పొగ పీల్చడంలోని సమస్యలు, దీనివల్ల ఇబ్బంది పడేవారు ఏ సమయంలో వైద్య సాయం పొదాలనే విషయంపై అడయార్ క్యాన్సర్ సెంటర్‌ సైకో అంకాలజీ ప్రొఫెసర్ సురేంద్రన్ వీరయ్యతో మాట్లాడాం.

‘పొగాకు సంబంధిత వ్యాధి లక్షణాలు కనిపించినా, చాలామంది మాకేం చెడు అలవాట్లు లేవు కదా అని నిర్లక్ష్యం చేస్తారు. అందుకే చాలామంది పాసివ్ స్మోకర్లు వ్యాధి ముదిరిన తరవాతే డాక్టర్ ను కలుస్తారు’’ అని వీరయ్య చెప్పారు.

‘‘పొగాకు వల్ల విడుదలయ్యే పొగ వెంటనే అక్కడ నుంచి పోదు. అది రెస్టారెంట్ కావచ్చు, ఇల్లు, ఆఫీసు ఎక్కడైనా ఆ పొగ వెంటనే పోదు. అక్కడే గాలిలో చుట్టుకుపోయి ఉంటుంది. ఇంత పరిమాణంలోనే పొగ పీల్చాలనే ప్రామాణికత ఏమీ లేదు. ఎంత తాగినా సమస్యే. దీనివల్ల ఆయాసం కూడా వస్తుంది’’ అని ఆయన వివరించారు.

‘‘ఉదాహరణకు రైళ్ళలో ధూమపానం నిషేధం. కానీ కొంతమంది టాయ్‌లెట్స్‌కు వెళ్ళి సిగరెట్ తాగుతారు. వారు బయటకు వచ్చాకా కూడా పొగలోని విషతుల్య అణువులు అక్కడే ఉంటాయి. అంటే మనకు తెలియకుండా పొగ కారణంగా విడదులయ్యే విషపదార్థాలు అంతటా ఉంటాయన్నమాట. చాలామంది ప్రజలు ఈ విపత్తును అర్థం చేసుకోలేకపోతున్నారు’’ అని సుందరేశన్ తెలిపారు.

‘‘గర్భవతులెవరైనా ఈ పొగ పీల్చితే, అది నేరుగా పిండంపై ప్రభావం చూపుతుంది. ఇలా ఎక్కువ కాలం పీల్చడం వల్ల నెలల నిండకముందే ప్రసవం జరుగుతంది. పుట్టిన పిల్లలకు అనేక సమస్యలు ఉంటాయి’’

పాసివ్ స్మోకింగ్ వల్ల ఊపిరితిత్తుల క్యాన్సర్ నుంచి గుండెజబ్బుల దాకా అనేక సమస్యలు వస్తాయి.

మీరు కనుక సిగరెట్లు తాగేవారితో ఉంటే కచ్చితంగా మీరు అతనిని వైద్యపరీక్షలకు తీసుకువెళ్ళాలి’’ అని సురేంద్రన్ వీరయ్య చెప్పారు.

పాసివ్ స్మోకింగ్

ఫొటో సోర్స్, GETTY IMAGES

పరిష్కారం ఏమిటి?

‘‘పాసివ్ స్మోకింగ్ పై అవగాహన కలిగించడమే ఉత్తమ పరిష్కారం. టీ స్టాళ్ళ దగ్గర సిగరెట్ తాగే మిత్రుడితో సిగరెట్ తాగని స్నేహితుడు కలిసి టీ తాగుతూ కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. సిగరెట్ తాగడం మంచి పనికాదని అందరూ గ్రహించాలి’’ అని సురేంద్రన్ వీరయ్య చెప్పారు.

‘‘దీనిపై పిల్లలు, మహిళలు జాగ్రత్తగా ఉండాలి. పొగపీల్చడం వల్ల కలిగే నష్టాల గురించి శాస్త్రీయ ఆధారాలు లభిస్తున్నా ప్రజలలో చైతన్యం కలగడం లేదు’’ .

‘‘బహిరంగ ప్రదేశాలలో పొగపీల్చడాన్ని నిషేధిస్తూ చట్టాలున్నా, వాటిని తేలికగా ఉల్లంఘించేస్తున్నారు. అందుకే ప్రతి ఒక్కరు దీనిపై అవగాహన పెంచుకోవాలి. స్వచ్ఛమైన గాలిని పీల్చే హక్కు అందరికీ ఉంటుంది.సాధ్యమైనంతవరకు పొగ తాగడాన్ని విడనాడాలి. మనం పొగాకు రహిత భారత్ వైపు పయనించాలి. ఇవ్వన్నీ చేయకుండా పరిష్కారం దొరకదు’’ అని సురేంద్రన్ వీరయ్య తెలిపారు.

చట్టాలు ఏం చెబుతున్నాయి?

పొగాకు ఉత్పత్తుల వినియోగంపై 2014లో భారత్ చట్టం చేసింది. దీని తరువాత సిగరెట్ పెట్టెపై ‘పొగతాగడం ఆరోగ్యానికి హానికరం’ అనే పదాలు రాయాలని సూచించారు.

అయితే ప్రభుత్వ ఉత్తర్వులపై సిగరెట్ తయారీదారులు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. 2016లో సుప్రీం కోర్టు ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించింది.

పొగతాగే అలవాటును మాన్పించడాన్ని అనేక రకాలైన ఆంక్షలను అమల్లోకి తెచ్చారు. గుట్కాను నిసేధించడం, బహిరంగ ప్రదేశాలలో సిరెట్లు తాగడం, పొగాకు ఉత్పత్తుల ప్రచారాలపై నిషేధం, 18 ఏళ్ళ లోపు పిల్లలకు పొగాకు ఉత్పత్తులను విక్రయించడం, పాఠశాలలు, కళాశాలల సమీపంలో పొగాకు ఉత్పత్తుల విక్రయాన్ని నిషేధించారు.

ఇవి కూడా చదవండి:

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)