ఇప్పటికింకా నా వయసు 2 ఏళ్ళే అంటున్న 101 ఏళ్ళ బామ్మ.. ఎందుకంటే..

ప్యాట్రిసియా
ఫొటో క్యాప్షన్, కంప్యూటర్ తన వయసును రెండేళ్ళుగానే లెక్కిస్తోందంటున్న ప్యాట్రిసియా
    • రచయిత, జో టిడే
    • హోదా, బీబీసీ ప్రతినిధి

101 సంవత్సరాలున్న బామ్మ వయసును గుర్తించడంలో ఓ విమానయాన బుకింగ్ వ్యవస్థ పొరపడుతోంది. ఆమెను ప్రతిసారి చిన్నపిల్లగా చూపుతోంది.

ఇంటిపేరు చెప్పడానికి ఇష్టపడని ప్యాట్రిసియా 1922లో జన్మించారు. కానీ ఆమె 2022లో పుట్టినట్టుగా అమెరికన్ విమానయాన వ్యవస్థలు లెక్కిస్తుండటంతో ఈ సమస్య ఏర్పడుతోంది.

తాజాగా తలెత్తిన ఈ సమస్యపై ఆ బామ్మతోపాటు విమాన సిబ్బంది కూడా నవ్వుకున్నారు. ఈ ఘటనకు బీబీసీ కూడా ప్రత్యక్ష సాక్షిగా నిలిచింది.

‘‘నేను వృద్ధురాలిని అయినా వారు నన్నింకా చిన్నపిల్ల అనుకోవడం తమాషాగా ఉంది’’ అని ఆమె చెప్పారు.

ప్యాట్రిసియా చికాగో నుంచి మిచిగాన్‌కు ప్రయాణిస్తున్న సందర్భంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఆ విమానంలోనే ఈ రిపోర్టర్ కూడా ప్రయాణిస్తున్నారు.

ప్యాట్రిసియా తన కుమార్తె క్రిస్‌తో కలిసి ప్రయాణిస్తున్నారు.

‘‘మా అమ్మాయి ఆన్‌లైన్‌లో టిక్కెట్లు బుక్ చేసింది. కానీ, ఎయిర్‌పోర్టులోని కంప్యూటర్ నా పుట్టిన సంవత్సరం 1922కు బదులుగా 2022 అని పొరపడింది’’ అని ఆమె చెప్పారు.

‘‘నిరుడు కూడా ఇలాగే జరిగింది. అప్పుడు కూడా నన్ను చిన్నపిల్లగానే భావించారు’’ అని ఆమె తెలిపారు.

చివరికి, ప్యాట్రిసియా టిక్కెట్ పెద్దల టిక్కెట్‌గానే బుక్ అయింది.

విమానాశ్రయ కంప్యూటర్ వ్యవస్థ గతంలోనూ పుట్టిన తేదీని సరిగా గుర్తించడంలో విఫలమైంది. దీనికి బదులుగా కంప్యూటర్ ఆటోమెటిక్‌గా వందేళ్ళ తరువాత సంవత్సరాన్ని గుర్తించింది.

ప్యాట్రిసియా నర్సుగా పనిచేశారు. ఆమె ఏటా చలికాలం నుంచి తప్పించుకునేందుకు, తన కుటుంబాన్ని చూసేందుకు రెండుసార్లు ప్రయాణిస్తుంటారు. కానీ ఈ రెండు సందర్భాలలోనూ అమెరికన్ ఎయిర్‌లైన్స్ సిబ్బంది ఎటువంటి గందరగోళానికి గురికాకుండా సాయపడుతున్నారని ఆమె చెప్పారు.

దీనిపై స్పందన కోసం అమెరికన్ ఎయిర్‌లైన్స్‌ను సంప్రదించగా, వారు స్పందించలేదు.

ఇది చూడటానికి తమాషాగా ఉన్నా, ఇది కొన్ని సమస్యలు సృష్టిస్తోంది కాబట్టి దీనిని సరి చేయాలని భావిస్తున్నట్టు ఈ శతాధిక వృద్ధురాలు చెబుతున్నారు.

ఓసారి విమాన సిబ్బంది, తన టిక్కెట్ ఆధారంగా ఎవరో రెండేళ్ళ చిన్నారి వస్తుందని భావించి, టెర్మినల్ లోపలకు తీసుకువెళ్ళడానికి ఎటువంటి ప్రయాణ సాధనాన్ని సిద్ధంగా ఉంచలేదు.

మరో సందర్భంలో ప్రయాణికులందరూ విమానం దిగిపోయినా, సిబ్బంది ప్యాట్రిసియా కోసం ఎటవంటి వీల్ చైర్ ఏర్పాటు చేయకపోవడంతో ప్యాట్రిసియా ఆమె కుమార్తె చాలాసేపు విమానంలోనే వేచి ఉండాల్సి వచ్చింది.

తన అసలు వయసును గుర్తిస్తే, తన కుమార్తె క్రిస్‌కు కూడా ఎంతో మేలు జరుగుతుందంటారు ప్యాట్రిసియా.

‘‘కంప్యూటర్‌లోని ఈ సమస్యను వీలున్నంత త్వరగా పరిష్కరించాలని కోరుకుంటున్నా. నన్ను చిన్నపిల్లగా భావించడం వల్ల, నాకు సంబంధించిన లగేజీనంతా మోసుకుంటూ నా కుమార్తె ఒక గేటు నుంచి మరో గేటుకు ఓ మైలు దూరం నడవాల్సి వస్తోంది’’ అని ఆమె చెప్పారు.

తరువాయి ప్రయాణం

ప్యాట్రిసియా 97 ఏళ్ళ వయసు వరకు ఒంటరిగానే ప్రయాణించారు. తరువాతే ఆమె తన కుటుంబంపై ఆధారపడటం మొదలుపెట్టారు.

‘‘ఇప్పుడు నాకు చూపు సరిగా ఆనడం లేదు. అందుకే ఒక్కదాన్నే ప్రయాణించాలనుకోవడం లేదు’’ అని చెప్పారు.

అయితే ఐటీ సమస్యలు తననేమీ ఆటంకపరచలేవని, వచ్చే శరదృతువులో ప్రయాణం కోసం ఎదురుచూస్తున్నట్టు ఆమె చెప్పారు.

వచ్చే శరదృతువునాటికి ఆమె వయసు 102 ఏళ్ళవుతుంది. అప్పటికైనా విమానయాన కంప్యూటర్ వ్యవస్థ ఆమె అసలు వయసును బహుశా గుర్తిస్తుందేమో.

ఇవి కూడా చదవండి:

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)