ఈ అరుదైన పాములు 2,000 కి.మీ. దాటి సూరత్ ఎలా చేరుకున్నాయి?

డెండ్రెలాఫిస్ ప్రోయార్కోస్

ఫొటో సోర్స్, DIKANSH PARMAR

    • రచయిత, జయ్ శుక్లా
    • హోదా, బీబీసీ ప్రతినిధి

పదేళ్ల క్రితం గుజరాత్ సూరత్‌లోని ఒక అరుదైన పాము కనిపించడంతో జంతు ప్రేమికులు, శాస్త్రవేత్తలు తాము కొత్త జాతి పామును కనుక్కొన్నామని భావించారు. అయితే, ఈ వార్తలో నిజం, అబద్ధం రెండూ ఉన్నాయి.

ఆ వార్తలో నిజముంది. ఎందుకంటే ఇలాంటి పాము గుజరాత్‌లో ముందెన్నడూ కనిపించలేదు. ఆ వార్తలో అబద్ధం కూడా ఉంది. అదేమిటంటే ఇదేమీ కొత్త జాతి కాదు.

2015 నుంచి నేటి వరకూ ఆ జాతికి చెందిన ఏడు పాములు సూరత్ చుట్టుపక్కల ప్రాంతాల్లో కనిపించాయి.

ఇలాంటి పాములు భారత్‌లోని ఈశాన్య రాష్ట్రాలతోపాటు బంగ్లాదేశ్, మియన్మార్, చైనా, లావోస్, వియత్నాంలలో కనిపిస్తుంటాయి.

భారత్‌లోని దార్జీలింగ్, అరుణాచల్ ప్రదేశ్, మణిపుర్, నాగాలాండ్, మేఘాలయ, మిజోరం, అస్సాంలలో ఈ పాము కనిపిస్తుంటుంది.

అయితే, అంత దూరం నుంచి ఈ పాము సూరత్‌కు ఎలా వచ్చిందోనని శాస్త్రవేత్తలు ఆశ్చర్యం వ్యక్తంచేస్తున్నారు.

ఇది అరుదైన జాతి కావడంతో దీనిపై చాలా పరిశోధనలు మొదలయ్యాయి. ఈ పాముల డీఎన్ఏతోపాటు ఇవి ఎక్కడెక్కడ జీవిస్తాయి? వీటి లక్షణాలు ఏమిటి? లాంటి అంశాలపై పరిశోధనలు జరిగాయి.

ఈ పరిశోధనలో ఆ పాము సూరత్‌కు చెందినదికాదని తేలింది. తాజాగా న్యూజీలాండ్‌లో జూటాక్సా జర్నల్‌లో దీనిపై ఒక కథనం ప్రచురితమైంది.

డెండ్రెలాఫిస్ ప్రోయార్కోస్

ఫొటో సోర్స్, DIKANSH PARMAR

ఆ పాము ఎలా ఉంటుంది?

ఆ పాము పేరు ‘ఈస్టర్న్ బ్రాంజ్‌ బ్యాక్ ట్రీ స్నేక్’. దీని శాస్త్రీయ నామం డెండ్రెలాఫిస్ ప్రోయార్కోస్.ఇవి విషపూరిత సర్పాలు కాదు. మనుషులకు వీటి వల్ల ఎలాంటి హానీ ఉండదు.

భారత్‌లోని బ్రాంజ్ బ్యాక్‌ జాతికి చెందిన 11 భిన్న రకాల పాములు కనిపిస్తుంటాయి.

వీటి పైభాగం రాగి రంగులో కనిపిస్తుంది. అందుకే గుజరాతీలో దీన్ని ‘తామ్రపీఠ్ సాప్’ అని పిలుస్తున్నారు.

ఇవి 1150 మి.మీ.ల వరకూ పొడవు పెరుగుతుంటాయి. సాధారణంగా చెట్లు, పొదల్లో ఇవి జీవిస్తుంటాయి.

గుజరాత్‌లోనూ కొన్ని బ్రాంజ్‌ బ్యాక్ జాతుల పాములు జీవిస్తాయి. అయితే, వాటిని కామన్ బ్రాంజ్ బ్యాక్ ట్రీ స్నేక్స్‌గా పిలుస్తుంటారు. వీటి శాస్త్రీయ నామం డెండ్రెలాఫిస్ ట్రిస్టిస్. అయితే, ఈస్టర్న్ బ్రాంజ్ బ్యాక్ ట్రీ స్నేక్ మాత్రం గుజరాత్‌లో కనిపించదు.

ఇదే జాతికి చెందిన పాములు గత పదేళ్లలో ఏడు మాత్రమే బయటపడ్డాయి. ఈ ఏడు ఈస్టర్న్ బ్రాంజ్ బ్యాక్ ట్రీ స్నేక్స్‌లో ఆరు మగవి, ఒకటి ఆడది.

ఈ పాములు సాధారణంగా ప్రశాంతంగా కనిపిస్తాయని పరిశోధకులు చెబుతున్నారు. ఇవి ఆహారంగా కప్పలు, బల్లులు, ఇతర కీటకాలను తీసుకుంటాయి.

డెండ్రెలాఫిస్ ప్రోయార్కోస్

ఫొటో సోర్స్, DIKANSH PARMAR

తేడా ఏమిటి?

ఈస్టర్న్ బ్రాంజ్ బ్యాక్ ట్రీ స్నేక్ నాలుక గులాబీ రంగులో ఉంటుంది. మిగతా బ్రాంజ్ బ్యాక్ ట్రీ స్నేక్‌ల నాలుక నీలం రంగులో కనిపిస్తుంది.

ఈస్టర్న్ బ్రాంజ్ బ్యాక్ ట్రీ స్నేక్ కళ్ల నుంచి గొంతు వరకూ నల్లని చారలు కనిపిస్తాయి. సాధారణ బ్యాంజ్ బ్యాక్ ట్రీ స్నేక్‌లలో ఈ తరహా చారలు ఉండవు.

ఈస్టర్ బ్రాంజ్ బ్యాక్ ట్రీ స్నేక్ కింద వైపు పొలుసులు ఒకే రీతిలో ఉంటాయి. సాధారణ బ్రాంజ్ బ్యాక్ పాములకు ఈ పొలుసులు రెండుగా చీలినట్లుగా కనిపిస్తాయి.

ఈ పాముల గురించి సూరత్‌కు చెందిన పాముల పరిశోధకులు దికాన్ష్ పర్మార్ బీబీసీతో మాట్లాడారు. ‘‘ఆ పాము సూరత్ లాంటి ప్రాంతాల్లో కనిపించడం చాలా అరుదు. దాని కళ్లు, నోరు, తల, పొలుసులు, రంగు, నాలుకలను మేం పరిశీలించాం. డీఎన్ఏ పరీక్షలు కూడా చేపట్టాం’’ అని ఆయన చెప్పారు.

మరోవైపు కర్నాటకకు చెందిన జంతు పరిశోధన సంస్థ ‘కళింగ ఫౌండేషన్’ డైరెక్టర్ ఎస్ఆర్ గణేశ్ బీబీసీతో మాట్లాడుతూ.. ‘‘ఈస్టర్ బ్రాంజ్ బ్యాక్ స్నేక్‌ల ఆవాసం సూరత్ కాదు. ఇవి సాధారణంగా ఈశాన్య భారత్‌తోపాటు ఆ పొరుగున్న దేశాల్లో కనిపిస్తాయి’’ అని చెప్పారు.

ప్రస్తుతం ఈ పాములపై పరిశోధన చేపడుతున్న వారిలో దికాన్ష్ పర్మార్, ఎస్‌ఆర్ గణేశ్‌లతోపాటు ముంబయిలోని ఠాక్రే వైల్డ్‌లైప్ ఫౌండేషన్‌కు చెందిన ఇషాన్ అగర్వాల్, సౌత్‌ఈస్ట్ ఆసియన్ హెర్పెటాలజీ సొసైటీ నిపుణుడు జర్మన్ జెర్నాట్ వోగెల్ కూడా ఉన్నారు.

ఈ పాముకు చెందిన భిన్న లక్షణాలను వీరు పరిశీలించి, 11 రకాల ఇతర పాములతో దీన్ని పోల్చిచూశారు. ఈ పరిశోధన ఫలితాలు జూటాక్సా జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.

‘‘గుజరాత్‌లో ఇప్పటివరకూ 64 జాతుల పాములను గుర్తించారు. తాజా పాములను కూడా వాటికి కలిపితే ఈ సంఖ్య 65కు పెరుగుతుంది’’ అని దికాన్ష్ పర్మార్ చెప్పారు.

డెండ్రెలాఫిస్ ప్రోయార్కోస్

ఫొటో సోర్స్, ZOOTAXA

2000 కి.మీ. ఎలా దాటుకుని వచ్చింది?

గత పదేళ్లలో సూరత్‌లోని అభ్వా, పిప్లోడ్, వేసు, నవ్‌సారీ బజార్, ఉధానా లాంటి ప్రాంతాల్లో ఈ పాములు కనిపించాయి.

ఇవి ఇక్కడకు ఎలా వచ్చాయనే అంశంపై దికాన్ష్ పర్మార్ మాట్లాడుతూ.. ‘‘ఈ పాములు కేవలం జనవరి నుంచి జూన్ మధ్యలో మాత్రమే కనిపించాయి. శీతాకాలంలో ఇవి సుప్తావస్థలోకి వెళ్లిపోతాయి. ఏదైనా సురక్షిత ప్రాంతానికి వెళ్లి తలదాచుకుంటాయి’’ అని చెప్పారు.

‘‘అలా సుప్తావస్థలోకి వెళ్లినప్పుడు ఐదు లేదా ఆరు పాములను ఏదైనా వస్తువుల రవాణాతో కలిపి ఇక్కడికి తీసుకొచ్చి ఉండొచ్చు’’ అని ప్రయాస్ ఎన్విరాన్‌మెంట్ చారిటబుల్ ట్రస్ట్‌కు చెందిన మెహుల్ ఠాకుర్ చెప్పారు.

గుజరాత్‌లో ఈ పాములు ఎక్కువగా ఇళ్లకు పరిసరాల్లోనే కనిపించాయని, కాబట్టి, అటవీ ప్రాంతాల్లో ఇవి జీవించే అవకాశం తక్కువని ఎస్ఆర్ గణేశ్ చెప్పారు.

సాధారణంగా ఈశాన్య ప్రాంతాల నుంచి వెదురుకర్రలు, మొక్కలను సూరత్‌కు తీసుకొస్తుంటారని, ఈ పాములు కూడా వాటిలో కలిసి ఇక్కడికి వచ్చేసి ఉండొచ్చని దికాన్ష్ అన్నారు.

గుజరాత్‌తోపాటు మధ్యప్రదేశ్, గ్వాలియర్‌లోనూ ఈ పాములు బయటపడ్డాయని గణేశ్ చెప్పారు. ‘‘అయితే, ఇవన్నీ వేడి ఎక్కువగా ఉండే ప్రాంతాలు. ఇవి ఆ పాములకు ఆవాసంగా సరిపడవు. ఎందుకంటే అవి కాస్త ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండే ప్రాంతాల్లో జీవిస్తాయి. ఇక్కడ గుడ్లు పెట్టడం, తమ సంఖ్యను రెట్టింపు చేసుకోవడం లాంటి వాటికి అవకాశాలు చాలా తక్కువ’’ అని ఆయన అన్నారు.

వీడియో క్యాప్షన్, ‘ఒకప్పుడు పామును చూస్తే భయంతో పారిపోయేదాన్ని.. ఇప్పుడు ఎలాంటి పాములనైనా పట్టేస్తాను’

ఇవి కూడా చదవండి:

( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)