పాకిస్తానీ యువతికి దిల్లీ వ్యక్తి గుండెను అమర్చిన చెన్నై వైద్యులు, ఇదెలా సాధ్యమైంది?

- రచయిత, శారద.వి
- హోదా, బీబీసీ ప్రతినిధి
‘‘కరాచీలో ఇళ్లు ఇరుకుగా ఉంటాయి. పెద్దగా రంగులేవీ ఉండవు.’’
చెన్నైలోని ఒక ఆసుపత్రి పదకొండో అంతస్థులో నిలబడి కిటికీలో నుంచి బయటకు చూస్తూ సనోబార్ రషీద్ ఈ మాట అన్నారు.
ఆమె కూతురు వయస్సు 19 ఏళ్లు. పేరు అయేషా. పది నెలల కిందట గుండె మార్పిడి కోసం వారు పాకిస్తాన్ నుంచి భారత్‌కు వచ్చారు. ఇప్పుడు అయేషా ముఖం సంతోషంతో వెలిగిపోతోంది.
అయేషాకు ఏడేళ్లున్నప్పుడు ఆమె గుండె 25 శాతం పాడైనట్లుగా నిర్ధరణ అయింది. క్రమంగా గుండె పనితీరు దెబ్బతింది. 2019లో ఒక సీనియర్ కార్డియాలజిస్టును సంప్రదించడానికి వారు చెన్నైకి వచ్చారు. అప్పుడు ఆమెకు గుండెపోటు వచ్చింది.
దీంతో అయేషాకు కృత్రిమ హార్ట్ బీట్ పరికరాన్ని అమర్చారు. కరాచీకి తిరిగి వెళ్లిన రెండేళ్ల తర్వాత అయేషా ఇన్‌ఫెక్షన్ బారిన పడ్డారు. గుండెలో కుడిభాగం విఫలమవ్వడం మొదలైంది. చివరకు గుండె మార్పిడి చేయడం ఒక్కటే మార్గమని వైద్యులు తేల్చారు.
‘‘పాకిస్తాన్‌లో ఈ సర్జరీని చేయలేం. భారత్ లేదా కెనడాలో మాత్రమే ఇది సాధ్యమవుతుందని డాక్టర్లు చెప్పారు. మాకు భారత్‌కు రావడమే మంచిదనిపించింది’’ అని సనోబార్ గుర్తుచేసుకున్నారు.
తర్వాత చెన్నైలోని ఒక వైద్యుడితో మాట్లాడితే, ‘‘భారత్ వచ్చి ట్రీట్‌మెంట్ తీసుకోండని మాకు చెప్పారు. కానీ, ఆ సమయంలో మా దగ్గర సరిపడా డబ్బు లేదు’’ అని ఆమె చెప్పారు.
మొదట ప్రయత్నించినప్పుడు వీసా రాలేదని, తర్వాత దొరకడంతో భారత్ కు రాగలిగామని ఆమె వెల్లడించారు.

‘‘అయేషా మొదటిసారి భారత్‌కు వచ్చినప్పుడు ఆమెకు గుండెపోటు వచ్చింది. అప్పుడు ఈసీఎంవో (కృత్తిమ గుండె పరికరం) అమర్చారు. ఆ కృత్రిమ పంపు పనితీరును పర్యవేక్షించే మౌలిక వసతులు పాకిస్తాన్‌లో లేవు. కొన్ని రోజుల తర్వాత ఆమెకు అమర్చిన రక్త నాళం నుంచి రక్తం లీక్ మొదలైంది. దీంతో మళ్లీ చికిత్స చేయాల్సిన అవసరం ఏర్పడింది’’ అని సీనియర్ కార్డియాలజిస్ట్ కేఆర్ బాలకృష్ణన్ చెప్పారు. ఎంజీఎం ఆసుపత్రిలో గుండె, ఊపిరితిత్తుల మార్పిడి యూనిట్ డైరెక్టర్‌గా ఆయన పనిచేస్తున్నారు. 2019 నుంచి అయేషాకు ఆయనే చికిత్స అందిస్తున్నారు.
‘‘చాలా తీవ్రమైన గుండె జబ్బుతో అయేషా ఇక్కడికి వచ్చారు. రెండు రోజులకు ఒకసారి ఆసుపత్రికి రావాల్సి ఉండేది. చాలా రోజుల పాటు ఆమె అపస్మారక స్థితిలోనే ఉన్నారు. అయేషా మా దగ్గరే చికిత్స తీసుకుంటున్నందున మాకు వీలైనంత మేరకు ఆమెకు సహాయం చేసేందుకు, ఆమెను రక్షించేందుకు మేం ప్రయత్నించాం’’ అని డాక్టర్ బాలకృష్ణన్ తెలిపారు.
దిల్లీకి చెందిన 69 ఏళ్ల వృద్దుడి గుండెను దానం చేసేందుకు ఆయన కుటుంబం ముందుకొచ్చింది.

ఫొటో సోర్స్, MGM HOSPITAL
ఎంజీఎం ఆసుపత్రి కార్డియో-లంగ్ ట్రాన్స్‌ప్లాంట్ యూనిట్ అసోసియేట్ డైరెక్టర్ కేజీ సురేశ్ రావు మాట్లాడుతూ, ‘‘భారత్‌లోని అవయవ మార్పిడి విధానం ప్రకారం, ఒక భారతీయుడు అవయవమార్పిడికి అర్హుడైతే ముందుగా అతనికే ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుంది. అందుకే అయేషా పది నెలల పాటు ఎదురుచూడాల్సి వచ్చింది. ఇప్పుడు కూడా గుండె మార్పిడి చేయించుకోవాల్సిన భారతీయులెవరూ లేకపోవడంతో అయేషాకు ఈ గుండె లభించింది’’ అని చెప్పారు.
ఒకవేళ ఈ గుండె సమయానికి దొరక్కపోయి ఉంటే అయేషా చనిపోయి ఉండేవారని ఆయన చెప్పారు. గ్రహీతలెవరూ లేకపోతే దానం చేసిన గుండె కూడా వృథా అయ్యేదని ఆయన అన్నారు.
‘‘అయేషాకు మార్పిడి చేయడానికి గుండె దొరికిందని తెలియగానే ఆమె సర్జరీ కోసం మేం అంతా సిద్ధం చేశాం. దిల్లీ నుంచి 5 గంటల్లో గుండెను ఆసుపత్రికి చేర్చారు. అయిదు గంటల పాటు కొట్టుకోవడం ఆగిపోయిన గుండె, కొత్త శరీరంలో అమర్చిన తర్వాత మళ్లీ కొట్టుకోవాల్సి ఉంటుంది. అయేషాకు వృద్ధుడి గుండెను అమర్చిన తర్వాత తొలిసారి అది కొట్టుకోగానే మాకు కలిగిన సంతోషం మాటల్లో చెప్పలేం’’ అని సురేశ్ రావు చెప్పారు.

ఫొటో సోర్స్, MGM HOSPITAL
చికిత్స డబ్బు ఎలా సమకూరిందో డాక్టర్ బాలకృష్ణన్ తెలిపారు.‘‘చికిత్సకు కావాల్సినంత డబ్బు అయేషా కుటుంబం దగ్గర లేదు. అయితే ఐశ్వర్యం అనే ఎన్జీవో అందించిన ఆర్థిక సహకారంతో పాటు ఎంజీఎం ఆసుపత్రిలో అవయవమార్పిడి చేయించుకున్నవారు ఇచ్చిన డబ్బులు, నా సొంత డబ్బుతో ఈ చికిత్స సాధ్యమైంది’’ అని ఆయన చెప్పారు.
ఐశ్వర్యం స్వచ్ఛంద సంస్థ సహాయంతో ఇప్పటి వరకు 12 వేలకు పైగా గుండె చికిత్సలు చేశారు. ఇందులో 175 గుండె మార్పిడి చికిత్సలు ఉన్నాయి.

ఫొటో సోర్స్, AYESHA RASHEED
తన ప్రాణాలను రక్షించిన వైద్యులకు అయేషా కృతజ్ఞతలు తెలిపారు.
‘‘సర్జరీ తర్వాత నా ఆరోగ్యం చాలా బాగుంది. రెండు నెలల తర్వాత మేం ఇంటికి వెళ్లిపోవచ్చని డాక్టర్లు చెప్పారు. ఇంటికి వెళ్లాక నా చదువు కొనసాగిస్తా. భవిష్యత్‌లో ఫ్యాషన్ డిజైనర్ కావాలనేది నా ఆశ’’ అని అయేషా చెప్పారు.
‘‘భారత్‌లో ఉంటే పాకిస్తాన్‌ను వదిలి వచ్చినట్లుగా అనిపించడం లేదు. ఇక్కడా, అక్కడా అంతా ఒకేలా ఉంది. తేడా లేదు’’ అని అయేషా అన్నారు.
చెన్నై మొత్తం తిరిగి చూశారా అని అయేషాను అడిగితే, ‘‘ఆరోగ్యం బాలేకపోవడంతో ఎక్కువగా ఆసుపత్రుల్లోనే గడపాల్సి వచ్చింది. కుదిరినప్పుడల్లా బీచ్‌కు వెళ్లాను. జీవితంలో తొలిసారి బీచ్‌ను ఇక్కడే చూశాను. షాపింగ్ మాల్‌కు వెళ్లాను. చెన్నైలో దోసె నాకు బాగా నచ్చింది’’ అని చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- ప్రాచీ నిగమ్: స్టేట్ టాపర్ అమ్మాయికి మీసాలు ఉన్నాయంటూ ఆన్ లైన్లో ట్రోలింగ్, బాధితురాలు ఏమన్నారు?
- ‘పరిశోధన నాది...కానీ నోబెల్ ప్రైజ్ నా బాస్ తీసుకున్నారు’: ఓ ఫ్రెంచ్ సైంటిస్ట్ ఆరోపణ
- అమెరికాలో భారతీయ విద్యార్థుల మరణాలు ఎందుకు పెరుగుతున్నాయి... అక్కడి ప్రభుత్వం ఏం చేస్తోంది?
- హైబీపీని తేలిగ్గా తీసుకోకండి...
బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















