భారతీయుల పొదుపు తగ్గింది, అప్పు పెరిగింది... ఎందుకిలా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, సౌతిక్ బిశ్వాస్
- హోదా, బీబీసీ ప్రతినిధి
దశాబ్దాలుగా, డబ్బును పొదుపు చేయడంలో భారతీయులను మించినోళ్లు లేరనే అభిప్రాయం ఉండేది. భవిష్యత్తు అవసరాల కోసం తమ సంపాదనలో వీలైనంత ఎక్కువ మొత్తం పొదుపు చేసుకునేవారు. అందుకోసం కచ్చితమైన ప్రణాళికలు వేసుకుని, కొన్ని ఖర్చులను తగ్గించుకునేవారు. కానీ, ఇప్పుడు ఆ ధోరణి పూర్తిగా మారిపోయినట్టు కనిపిస్తోంది.
రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) విడుదల చేసిన తాజా డేటా ప్రకారం, దేశంలోని కుటుంబాల నికర పొదుపు 47 ఏళ్ల కనిష్ఠానికి పడిపోయింది. మన దగ్గర ఉన్న మొత్తం డబ్బు, పెట్టుబడుల (బ్యాంకు డిపాజిట్లు, స్టాక్స్, బోనస్ లాంటివి) నుంచి అప్పులు, లోన్లను తీసేస్తే మిగిలేది నికర పొదుపు.
2023 ఆర్థిక సంవత్సరంలో దేశ జీడీపీలో సేవింగ్స్ విలువ 5.3 శాతానికి పడిపోయింది. 2022లో ఇది 7.3 శాతంగా ఉంది.
భారత్‌లో పొదుపు ఇంతగా తగ్గిపోవడం విచిత్రంగా అనిపిస్తోందని ఒక ఆర్థికవేత్త వ్యాఖ్యానించారు.
ఇదే సమయంలో కుటుంబాల అప్పులు అమాంతం పెరిగాయి. 2023 ఆర్థిక సంవత్సరంలో ఈ రుణాల మొత్తం దేశ జీడీపీలో 5.8 శాతంగా ఉంది. 1970ల తర్వాత ఈ రుణాలు ఇంతగా పెరగడం ఇది రెండోసారి.
రకరకాల అవసరాలకు రుణాలపై ఆధారపడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. దీంతో, అనివార్యంగా వారి పొదుపు తగ్గిపోతోంది. రుణాలు ఎంత ఎక్కువ తీసుకుంటే, ఆ లోన్లను తీర్చేందుకు తమ ఆదాయంలో అంత ఎక్కువ మొత్తం కేటాయించాల్సి ఉంటుంది. ఫలితంగా పొదుపు చేసేందుకు పెద్దగా డబ్బులు మిగలట్లేదు.
దేశంలో నాన్- మార్టగేజ్ లోన్ల (తనఖా లేని రుణాలు) వాటా భారీగా పెరుగుతోందని మోతిలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సంస్థకు చెందిన ఆర్థిక నిపుణులు నిఖిల్ గుప్తా చెప్పారు. అందులో వ్యవసాయ, వ్యాపార రుణాల వాటా సగానికి పైనే ఉందన్నారు.
(ఇక్కడో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. 2022లో భారత్‌లోని నాన్ మార్ట్‌గేజ్ రుణాల మొత్తం ఆస్ట్రేలియా, జపాన్‌లతో దాదాపు సమానంగా ఉండేది. అమెరికా, చైనా లాంటి చాలా ధనిక దేశాలను దాటేసింది)

ఫొటో సోర్స్, AFP
దేశంలోని కుటుంబాల మొత్తం రుణభారంలో క్రెడిట్ కార్డ్‌లు, కన్స్యూమర్ డ్యూరబుల్స్ (వాషింగ్ మెషీన్లు, ఏసీలు, టీవీలు, రిఫ్రిజిరేటర్లు, ఓవెన్లు, తదితరాలు), వివాహాలు, అత్యవసర వైద్యం కోసం తీసుకునే లోన్ల వాటా 20 శాతం లోపే ఉంది. కానీ, ఈ మధ్య కాలంలో ఇలాంటి రుణాల మొత్తం శరవేగంగా పెరుగుతోందని నిఖిల్ గుప్తా వివరించారు.
మరి, పొదుపు తగ్గి, రుణభారం పెరగడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ప్రపంచంలో 5వ అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఉన్న దేశం గురించి ఈ ధోరణి ఏం చెబుతోంది? ఇది భవిష్యత్తు బాగుంటుందనే ఆశాభావాన్ని సూచిస్తోందా? లేక ఆదాయంలో పతనం, ద్రవ్యోల్బణం, ఆర్థిక ఒత్తిళ్ల లాంటి సవాళ్లు ఎదురవుతాయని హెచ్చరిస్తోందా?
"దేశంలోని వినియోగదారుల్లో కొంత విశ్వాసం ఉంది. భవిష్యత్తులో తమ ఆదాయంలో పెరుగుదల బాగుంటుందని ఆశించేవారు, లేదంటే మున్ముందు ఏం జరుగుతుందన్న దాని గురించి ఆలోచించడం కంటే ప్రస్తుతం మెరుగైన జీవితాన్ని ఆస్వాదించాలని కోరుకుంటున్నవారు దేశంలో చాలామంది ఉన్నారు" అని నిఖిల్ గుప్తా చెప్పారు.
ఎక్కువ ఖర్చు చేయడమనే విషయంపై భారతీయల ఆలోచనా విధానంలో ఏమైనా మార్పు కనిపిస్తోందా? అనే ప్రశ్నకు సమాధానమిస్తూ.. ఈ ధోరణికి అసలు కారణం ఏంటన్నది స్పష్టంగా అర్థం కావట్లేదని నిఖిల్ అన్నారు. ఆర్‌బీఐ విడుదల చేసిన డేటాలో కొంత స్పష్టత లోపించిందని చెప్పారు.
రుణాలు తీసుకుంటున్నవారు ఎలాంటి ఉద్యోగాలు చేస్తున్నారు? ఎంతమంది, ఎన్ని లోన్లు తీసుకున్నారు? (ఒక వ్యక్తి అనేక రకాల లోన్లు తీసుకునే వీలుంటుంది.) ఆ లోన్లను దేనికి వాడుతున్నారు? తిరిగి ఎలా తీరుస్తున్నారు? వంటి విషయాలు తెలిస్తే, మరింత లోతుగా విశ్లేషించేందుకు వీలుంటుందని నిఖిల్ అన్నారు.
అయితే, గత దశాబ్ద కాలంలో అధిక మొత్తంలో రుణం తీసుకుంటున్నవారి (క్రెడిట్ డీపెనింగ్)తో పోలిస్తే, తక్కువ మొత్తంలో రుణాలు తీసుకునేవారి (క్రెడిట్ వైడెనింగ్) సంఖ్య గణనీయంగా పెరిగిందని నిఖిల్ గుప్తా, ఆయన సహచర ఆర్థిక నిపుణులు తనీషా లద్ధాల పరిశీలనలో తేలింది. కొద్దిమందే భారీ మొత్తంలో రుణాలు తీసుకోవడం కంటే ఎక్కువ మంది తక్కువ మొత్తంలో రుణాలు తీసుకోవడాన్ని మంచి పరిణామంగా భావిస్తారు.

ఫొటో సోర్స్, EPA
భారతీయులు తమకు వచ్చే ఆదాయంలో 12 శాతాన్ని లోన్లు తీర్చేందుకు కేటాయిస్తున్నారని వీరి పరిశీలనలో వెల్లడైంది. అది నార్డిక్ దేశాల(డెన్మార్క్, ఫిన్‌లాండ్, ఐస్‌లాండ్, నార్వే, స్వీడన్)తో సమానంగా ఉంది. చైనా, ఫ్రాన్స్, బ్రిటన్, అమెరికా దేశాలతో పోలిస్తే ఎక్కువగా ఉంది. భారత్‌లో ఈ శాతం ఎక్కువగా ఉండటానికి కారణం అధిక వడ్డీ రేట్లు, స్వల్పకాలిక రుణాలు కారణమని నిఖిల్ చెప్పారు.
దేశంలో ప్రజల పొదుపు తగ్గి, రుణాలు పెరగడంపై కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే, అలాంటి భయాలు అక్కర్లేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2023 సెప్టెంబర్‌లో అన్నారు. కోవిడ్ మహమ్మారి తర్వాత కార్లు కొనేందుకు, పిల్లల చదువులకు, ఇళ్లు కొనేందుకు చాలామంది తక్కువ వడ్డీ రేట్లను బాగా ఉపయోగించుకుంటున్నారని ఆమె చెప్పారు.
చాలామంది ఇళ్లు, వాహనాల లాంటివి కొనేందుకు లోన్లు తీసుకుంటున్నారని, అలాంటి రుణాలు తీసుకుంటున్నారంటే.. వారు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారని కాదని, భవిష్యత్తు మరింత మెరుగ్గా ఉంటుందనే భరోసాకు అది సంకేతమని ఆమె అన్నారు. ఉపాధి అవకాశాలు, ఆదాయం పెరుగుదల పట్ల ప్రజల్లో నమ్మకం కనిపిస్తోందన్నారు.
అయితే, పొదుపులు తగ్గి, రుణాలు పెరగడం పట్ల కొంత అప్రమత్తంగా ఉండాలని అజీం ప్రేమ్‌జీ విశ్వవిద్యాలయానికి చెందిన జికో దాస్‌గుప్తా, శ్రీనివాస రాఘవేంద్ర అన్నారు. ఈ అంశంపై వారు ది హిందూ పత్రికలో ఒక కథనం రాశారు.
జీ20 దేశాల్లో అతితక్కువ తలసరి ఆదాయం ఉన్న భారత్‌లో ప్రజలు అప్పులపై ఆధారపడుతున్న తీరు పట్ల మరో ఆర్థికవేత్త రథిన్ రాయ్ కూడా ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ధోరణి కారణంగా మున్ముందు రుణాలు మరింత భారంగా మారే అవకాశం ఉందన్నారు.
మరోవైపు, ప్రస్తుతం నమోదవుతున్న రుణాల పెరుగుదలతో మరీ అంతగా కంగారు పడాల్సిన అవసరం లేదని, ఈ ట్రెండ్ ఎక్కువకాలం ఇలాగే కొనసాగితే మాత్రం ఆందోళన చెందాల్సిందేనని నిఖిల్ గుప్తా, లద్ధా చెప్పారు.
ఇవి కూడా చదవండి:
బీబీసీ తెలుగును ఫేస్బుక్ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














