లిక్విడ్ నైట్రోజన్ అంటే ఏమిటి, దీన్ని తాగితే శరీరానికి ఏమవుతుంది?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, సిరాజ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
2017 ఏప్రిల్ 13న హరియాణాలోని గురుగ్రామ్‌లో ఓ పబ్‌కు స్నేహితులతో కలిసి 30 ఏళ్ల వ్యక్తి వెళ్లారు. అక్కడ ఒక కాక్‌టెయిల్ డ్రింక్ ఆయన దృష్టిని ఆకర్షించింది. దాని నుంచి తెల్లని పొగలు రావడంతోపాటు చల్లగా అనిపించడంతో మరోమారు ఆలోచించకుండా వెంటనే దాన్ని కొనుక్కుని తాగేశారు.
వెంటనే ఆయనకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఎదురైంది. కడుపు నొప్పి కూడా వచ్చింది. అయినప్పటికీ ఆయన పట్టించుకోకుండా మరో డ్రింక్ తీసుకున్నారు. కొద్దిసేపటికి ఆయన కడుపులో నొప్పి తీవ్రమైంది.
హుటాహుటిన ఆయనను దగ్గర్లోని ఆసుపత్రికి తీసుకెళ్లి ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో చేర్పించారు. సీటీ స్కాన్ చేయడంతో ఆయన కడుపులో రంధ్రమైనట్లు తేలింది. ఆపరేషన్ తర్వాత మళ్లీ కోలుకోవడానికి ఆయనకు పది రోజులు పట్టింది.
లిక్విడ్ నైట్రోజన్ కలిపిన కాక్‌టెయిల్‌ను తాగడంతో ఆయనకు ఇలా జరిగింది. ఈ ఘటన తర్వాత ఆహారం, పానీయాల్లో లిక్విడ్ నైట్రోజన్ ఉపయోగించకుండా హరియాణా ప్రభుత్వం ఆంక్షలు విధించింది.

ఫొటో సోర్స్, Getty Images
ఇటీవలే కొన్ని రోజుల క్రితం కర్ణాటకకు చెందిన ఓ యువకుడు లిక్విడ్ నైట్రోజన్ పొగలోంచి తీసిన బిస్కెట్లను తిన్న అనంతరం శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ఆ ఘటన తర్వాత ఫుడ్ సేఫ్టీ డిపార్ట్‌మెంట్ ఆహార పదార్థాలు, పానీయాల్లో నేరుగా లిక్విడ్ నైట్రోజన్ కలపి తీసుకోవడంపై ఆంక్షలు విధించింది.
ఇంతకీ లిక్విడ్ నైట్రోజన్ అంటే ఏమిటి, ఆహార పదార్థాల్లో దీన్ని ఎందుకు ఉపయోగిస్తున్నారు, ఇది శరీరంపై ఎలాంటి ప్రభావం చూపుతుంది?

ఫొటో సోర్స్, Getty Images
లిక్విడ్ నైట్రోజన్ అంటే ఏమిటి?
‘‘సాధారణంగా లిక్విడ్ నైట్రోజన్ ఉష్ణోగ్రత -196 డిగ్రీల సెల్సియస్ (-321 డిగ్రీల ఫారన్‌హైట్) వరకు ఉంటుంది. చాలా తక్కువ ఉష్ణోగ్రతలలో ఉండటంతో ఆహారాన్ని ఫ్రీజ్ చేయడానికి, పాడవకుండా చూసేందుకు దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తుంటారు’’ అని చెన్నై క్రిస్టియన్ కాలేజీలోని రసాయన శాస్త్ర విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ జ్ఞానమణి సైమన్ చెప్పారు.
‘‘మన వాతావరణంలో 78 శాతం వరకు ఉండేది నైట్రోజనే. ఇది రంగు, వాసన లేని గ్యాస్. క్రయోజనిక్ పద్ధతిలో -150 డిగ్రీల సెల్సియన్ వద్ద ఈ గ్యాస్‌ను ద్రవరూపంలోకి మారుస్తారు. లిక్విడ్ నైట్రోజన్‌కు మండే స్వభావం ఉండదు. ఇతర గ్యాస్‌లతోనూ ఇది చర్యలు జరపదు. దీన్ని విషపూరితంకాని వాయువుగా పరిగణిస్తారు’’ అని ఆయన చెప్పారు.
‘‘అయితే, నైట్రోజన్ ద్రవరూపంలో ఉండేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే -196 డిగ్రీల సెల్సియస్ అనేది చాలా తక్కువ ఉష్ణోగ్రత. కాబట్టి సరైన మాస్క్‌లు లేకుండా దీని జోలికి వెళ్తే, కొంచెం తగిలినా శరీరంలోని కణాలు ఫ్రీజ్ అయ్యే ముప్పుంటుంది’’ అని ఆయన వివరించారు.
సాధారణ గది ఉష్ణోగ్రతల వద్ద లిక్విడ్ నైట్రోజన్ ఇట్టే వాయువులా మారి గాలిలో కలిసిపోతుందని ఆయన చెప్పారు.
‘‘ఆహార పదార్థాలపై ఇది పొగ రూపంలో మనకు కనిపిస్తుంది. అయితే, దీన్ని ఎక్కువగా పీల్చితే, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తొచ్చు. ఎందుకంటే చుట్టుపక్కల ఉండే ఆక్సిజన్‌ను మనకు అందకుండా నైట్రోజన్ చేస్తుంది’’ అని ఆయన తెలిపారు.

లిక్విడ్ నైట్రోజన్ ఎందుకు ఉపయోగిస్తారు?
‘‘ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల్లో లిక్విడ్ నైట్రోజన్‌ను ఏళ్ల నుంచీ ఉపయోగిస్తున్నారు. మాంసం, చేపలను ప్రాసెస్ చేసేందుకు దీన్ని ఎక్కువగా వాడుతుంటారు’’ అని ఎంజీఎం హెల్త్‌కేర్ హాస్పిటల్‌లోని చీఫ్ డైటీషియన్ విజయశ్రీ చెప్పారు.
‘‘పెద్దయెత్తున చేపలను పట్టుకున్న తర్వాత లేదా మాంసాల తోలు తీసిన తర్వాత, లేదా ముక్కలు కోసిన తర్వాత వెంటనే ఫ్రీజ్ చేయడానికి లిక్విడ్ నైట్రోజన్‌ను ఉపయోగిస్తుంటారు. దీని వల్ల ఆహారంలోని సూక్ష్మజీవులన్నీ ఫ్రీజ్ అవుతాయి. దీంతో ఇది పాడయ్యే అవకాశం చాలా తక్కువ’’ అని ఆమె వివరించారు.
‘‘దీన్ని ఉపయోగించేటప్పుడు కూడా ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలను తప్పనిసరిగా పాలించాల్సి ఉంటుంది. ఇక్కడ మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఇలా ఫ్రీజ్ చేసిన ఆహారాలను ఫ్రీజ్ నుంచి తీసిన వెంటనే వండకూడదు. గది ఉష్ణోగ్రత వద్ద కొంతసేపు వీటిని అలానే ఉంచాలి’’ అని ఆమె తెలిపారు.
‘‘లిక్విడ్ నైట్రోజన్ పూర్తిగా ఆవిరయ్యే వరకూ అలానే ఉంచాలి. ఆ తర్వాత అధిక ఉష్ణోగ్రతల వద్ద వండుకుని తినాల్సి ఉంటుంది. దీన్ని ఆహారంలో కలిపి నేరుగా ఎప్పుడూ తీసుకోకూడదు’’ అని విజయశ్రీ హెచ్చరించారు.
ప్రసవ సమయంలో తల్లి బొడ్డు తాడు, ప్లసెంటాలోని మూల కణాలను భద్రపరచడంలోనూ (అంబిలికల్ కార్డ్ బ్లడ్ ప్రిజర్వేషన్)లోనూ లిక్విడ్ నైట్రోజన్‌ను ఉపయోగిస్తారు. లిక్విడ్ నైట్రోజన్ ట్యాంకులో కనిష్ఠ ఉష్ణోగ్రతల వద్ద ఈ మూల కణాలను నిల్వ చేస్తారు. భవిష్యత్‌లో పిల్లలకు వచ్చే అవకాశమున్న కొన్ని రకాల వ్యాధుల చికిత్సలో ఈ మూలకణాలు ఉపయోగపడే అవకాశముందని అమెరికన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ (ఏఏపీ) చెబుతోంది. పూర్తి కథనాన్ని చదివేందుకు ఈ లింక్‌పై క్లిక్ చేయండి.

ఫొటో సోర్స్, Getty Images
శరీరానికి ఏమవుతుంది?
ఆహారం, పానీయాలు పొగలు కక్కుతూ అందంగా కనిపించేలా చేసేందుకు లిక్విడ్ నైట్రోజన్‌ను చాలా దేశాల్లో వాడుతుంటారని, అయితే, దీని వల్ల కలిగే ముప్పులపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరముందని డైటీషియన్ విజయశ్రీ చెప్పారు.
‘‘కొన్నేళ్ల క్రితం ‘స్మోక్ పెటా’ అనే ఒక స్వీట్ సోషల్ మీడియాలో కనిపించింది. దాన్ని చూసిన వెంటనే దానిలో లిక్విడ్ నైట్రోజన్ కలిపారని అర్థమైంది. దాన్ని పొగలు కక్కుతూ ఉన్నప్పుడే నోటిలో వేసుకోవడం చాలా ప్రమాదకరం. కానీ, చాలా మంది దీన్ని సరదాగా చూస్తున్నారు’’ అని ఆమె తెలిపారు.
‘‘శరీరంలోకి ఒకేసారి ఎక్కువ లిక్విడ్ నైట్రోజన్ వెళ్తే, శరీరంలో కణాలను ఇది ఫ్రీజ్ చేస్తుంది. నిజానికి ఎవరైనా చనిపోయిన తర్వాత ఇలా ఫ్రీజ్ చేయాల్సి ఉంటుంది. బతికున్నప్పుడు ఇలా చేయడం చాలా ప్రమాదకరం’’ అని ఆమె అన్నారు.
‘‘సాధారణంగా లిక్విడ్ నైట్రోజన్‌తో కడుపు సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. కొన్నిసార్లు దీని వల్ల కడుపులో పుండ్లు రావచ్చు. లేదా పేగులు దెబ్బ తినొచ్చు. కొన్ని తీవ్రమైన కేసుల్లో ప్రాణాలు కూడా పోవచ్చు’’ అని ఆమె చెప్పారు.
‘‘శరీరంలో కణాలు ఫ్రీజ్ అయినప్పుడు, శరీరంలో ఇతర విధులు ప్రభావితం అవుతాయి. ద్రవ రూపంలోనే కాదు, దీని పొగ పీల్చడం కూడా ప్రమాదకరం’’ అని ఆమె వివరించారు.
‘‘ఈ పొగ వల్ల శ్వాస సమస్యలు తలెత్తినప్పుడు వెంటనే అక్కడి నుంచి దూరంగా వెళ్లిపోవాలి’’ అని ఆమె తెలిపారు.
‘‘లిక్విడ్ నైట్రోజన్ మొత్తం ఆవిరైన తర్వాత ఆ ఆహారాన్ని తీసుకోవాలి. కానీ, కొంతమంది అందంగా కనిపిస్తుందని అలానే తినేందుకు ప్రయత్నిస్తుంటారు. దీని వల్ల కలిగే ముప్పులపై వారికి అవగాహన కల్పించాలి’’ అని విజయశ్రీ చెప్పారు.

ఆంక్షలు ఇలా..
‘‘లిక్విడ్ నైట్రోజన్ అనేది తాగే పానీయం లేదా తినే ఆహారం కాదు. ఇదొక రసాయనం. ఆహార పదార్థాలను సున్నా కంటే తక్కువ డిగ్రీల సెల్సియస్ వద్ద ప్రాసెస్ చేయడానికి, ప్యాక్ చేయడానికి దీన్ని ఉపయోగిస్తారు’’ అని ఆహార భద్రతా విభాగం అధికారి సతీశ్ కుమార్ చెప్పారు.
‘‘లిక్విడ్ నైట్రోజన్ కలిసిన ఆహార పదార్థాల విషయంలో ఆహార భద్రతా విభాగం గతంలోనే సర్క్యులర్‌ను విడుదల చేసింది. మేం చెన్నైలో దీన్ని ఉపయోగిస్తున్న రెస్టారెంట్ల జాబితాను సిద్ధం చేస్తున్నాం. త్వరలోనే మేం ఆహార నమూనాలను తీసుకొని టెస్టులకు పంపిస్తాం’’ అని ఆయన తెలిపారు.
‘‘చాలా బార్లు, పార్టీ హాల్స్‌లో వీటిని ఉపయోగిస్తున్నారు. మేం టెస్టులు కూడా నిర్వహిస్తున్నాం. ఆహార భద్రతా విభాగం నిబంధనల ప్రకారం, లిక్విడ్ నైట్రోజన్ ఫుడ్ కాదు. దీన్ని నేరుగా ఆహారంలో కలిపి తీసుకోకూడదు’’ అని ఆయన వివరించారు.
‘‘కేవలం ప్రాసెసింగ్, ప్యాకింగ్ కోసం మాత్రమే దీన్ని ఉపయోగించుకోవాలి. నేరుగా ఆహారం కలిపి ఇస్తే కఠిన చర్యలు తీసుకుంటాం’’ అని ఆయన చెప్పారు.
హెచ్చరికలు..
నిరుడు కొన్ని దేశాల టిక్‌టాక్ వీడియోల్లో ‘డ్రాగన్స్ బ్రీత్’ అనే ట్రెండ్ కనిపించింది. దీనిలో భాగంగా లిక్విడ్ నైట్రోజన్ కలిసిన ఆహారాన్ని తీసుకుంటూ వీడియోలు తీసి కొందరు ఆన్‌లైన్‌లో పోస్ట్ చేశారు.
ఇండోనేసియాలో ఈ ట్రెండ్ మొదలైంది. ఇలా వీడియోలుచేసిన చాలా మంది పిల్లల్లో ఆరోగ్య సమస్యలు తలెత్తాయి. అనంతరం ఇండోనేసియా ప్రభుత్వం కఠినమైన నిబంధనలు, హెచ్చరికలు జారీచేసింది.
2018లో అమెరికాలోని ఫుడ్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డీఏ) కూడా లిక్విడ్ నైట్రోజన్‌పై హెచ్చరికలు జారీచేసింది.
‘‘లిక్విడ్ నైట్రోజన్ కలిసిన ఐస్‌క్రీమ్‌లు, కాక్‌టెయిల్స్, క్యాండీలు, బిస్కెట్లు ఇతర ఆహార పదార్థాలు శరీరంపై ప్రతికూల ప్రభావం చూపిస్తాయి’’ అని ఎఫ్‌డీఏ వెల్లడించింది.
‘‘లిక్విడ్ నైట్రోజన్ కలిసిన ఆహార పదార్థాలను నేరుగా తీసుకోకూడదు. ఆ పొగను కూడా పీల్చకూడదు’’ అని ఎఫ్‌డీఏ హెచ్చరించింది.
ఇవి కూడా చదవండి:
- నెజాక్ యూడా: ఇజ్రాయెల్ ఆర్మీలో అమ్మాయిలకు దూరంగా మసలే ఈ సైనికుల పటాలంపై అమెరికా ఆంక్షలు విధిస్తుందా?
- 4.7 కోట్ల ఏళ్లనాటి వాసుకి పాము అవశేషాలు వెలుగులోకి.. అసలేంటి ఈ పాము కథ?
- నీళ్లలో మీ మలం తేలుతుందా? అది చెప్పే ఆరోగ్య రహస్యాలు ఇవీ!
- వేడి వేడి చికెన్ సూప్ తాగితే జలుబు తగ్గుతుందా? నిపుణులు ఏం చెబుతున్నారు
- ‘గ్లూటెన్’ అంటే ఏమిటి? ఇది లేని ఆహారం మంచిదేనా?
బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
















