అమెరికాలో భారతీయ విద్యార్థుల మరణాలు ఎందుకు పెరుగుతున్నాయి... అక్కడి ప్రభుత్వం ఏం చేస్తోంది?

నీల్ ఆచార్య

ఫొటో సోర్స్, Purdue Exponent Org

ఫొటో క్యాప్షన్, 19 ఏళ్ల నీల్ ఆచార్య పుర్దూ యూనివర్సిటీ క్యాంపస్‌లో చనిపోయారు
    • రచయిత, సవితా పటేల్
    • హోదా, శాన్ ఫ్రాన్సిస్కో

‘‘నాతో చదువుకునే విద్యార్థి చనిపోయాడని తెలిసి చాలా కుంగిపోయాను’’ అని సెయింట్ లూయీలోని వాషింగ్టన్ యూనివర్సిటీ విద్యార్థి జై సుశీల్ ఆవేదన వ్యక్తం చేశారు.

తోటి విద్యార్థి అమర్‌నాథ్ ఘోష్ మరణంతో జై సుశీల్ కదిలిపోయారు. భారత్‌కు చెందిన 34 ఏళ్ల క్లాసికల్ డ్యాన్సర్ అమర్‌నాథ్ ఘోష్ ఫిబ్రవరిలో చనిపోయారు. స్థానిక పోలీసులు దీన్ని హత్య కేసుగా దర్యాప్తు చేస్తున్నారు.

అమర్‌నాథ్ ఘోష్ మరణ వార్త యూనివర్సిటీ వాళ్లు చెప్పడం కంటే ముందు, భారత్‌లోని ఒక స్నేహితుని ద్వారా తనకు తెలిసిందని సుశీల్ చెప్పారు.

‘‘రెండు రోజుల తర్వాత యూనివర్సిటీ వాళ్లు ఈ విషయాన్ని మాకు చెప్పారు. వారి స్పందించిన తీరు విద్యార్థులెవరికీ నచ్చలేదు. భారతీయులు ఎలా ఉంటే మాత్రం ఏంటన్నట్లుగా వారి వైఖరి ఉంది’’ అని సుశీల్ అభిప్రాయపడ్డారు.

అమర్‌నాథ్ ఘోష్‌ను క్యాంపస్ బయట ఒక వీధిలో కాల్చి చంపారు. మృతుని గుర్తింపును ‘‘లా ఎన్‌ఫోర్స్‌మెంట్’’ ధ్రువీకరించిన తర్వాత, మృతుని బంధువులు అంగీకరించిన తర్వాత మాత్రమే ఆ విద్యార్థి మరణం గురించి వెల్లడిస్తామని యూనివర్సిటీ స్పష్టం చేసింది. ఈ ప్రక్రియ అంతా జరగడానికి సమయం పడుతుందని యూనివర్సిటీ చెప్పింది.

ఈ ఘటనను భయంకర విషాదంగా వాషింగ్టన్ యూనివర్సిటీ మార్కెటింగ్ అండ్ కమ్యూనికేషన్స్ వీసీ జూలీ ఫ్లోరీ అభివర్ణించారు.

‘‘అమర్‌నాథ్ సన్నిహితుల కోరిక మేరకు, ఈ విషాద వార్తను మాకు వీలైనంత త్వరగా మా కమ్యూనిటీకి తెలియజేశాం’’ అని జూలీ ఫ్లోరీ చెప్పరు.

మృతుని గుర్తింపును ధ్రువీకరించడానికి 48 గంటల సమయం పడుతుందని, కొన్ని కేసుల్లో మరింత ఎక్కువ కాలం పట్టొచ్చని సెయింట్ లూయిస్ పోలీస్ డిపార్ట్‌మెంట్ పేర్కొంది.

ఈ ఏడాది అమెరికాలో మృతి చెందిన భారత లేదా భారత మూలాలున్న 11 మంది విద్యార్థుల్లో అమర్‌నాథ్ ఘోష్ ఒకరు. ఈ మరణాలు అక్కడి భారత కమ్యూనిటీలో వ్యక్తిగత భద్రతపై భయాందోళనలు పెంచుతున్నాయి.

అమర్‌నాథ్ ఘోష్

ఫొటో సోర్స్, Nitya Vedantam

ఫొటో క్యాప్షన్, శాస్త్రీయ నృత్యంలో కోర్సు చేస్తోన్న అమర్‌నాథ్ ఘోష్ ఫిబ్రవరిలో సెయింట్ లూయీలో హత్యకు గురయ్యారు

ఈ మరణాల వెనుక హైపోథెర్మియా నుంచి ఆత్మహత్య, కాల్పులు జరగడం వంటి వివిధ కారణాలు ఉన్నాయి.

ఈ ఘటనలకు ఒకదానితో ఒకటి సంబంధం లేదని నిపుణులు అంటున్నారు. మరణ వార్తలు విన్నప్పుడల్లా క్యాంపస్‌లోని విద్యార్థులంతా భయాందోళన చెందుతున్నారు.

‘‘చీకటి పడ్డాక బయటకు వెళ్లడం మానేస్తున్నాం. చీకటి వేళల్లో నగరంలోని ప్రమాదకర ప్రాంతాల్లోకి వెళ్ళట్లేదు. అంతకన్నా మేమేం చేయగలం’’ అని సుశీల్ అంటున్నారు.

సుశీల్ తరహాలోనే మిగతా విద్యార్థులు కూడా తమ యూనివర్సిటీలు మరణ వార్తలను సకాలంలో చెప్పడం లేదని, భారత్‌లోని తమ బంధువులు, స్నేహితులు లేదా మీడియా ద్వారా ఈ విషయాలు తమకు తెలుస్తున్నాయని చెబుతున్నారు.

క్లీవ్‌ల్యాండ్ స్టేట్ యూనివర్సిటీ (సీఎస్‌ఈ) విద్యార్థి, 25 ఏళ్ల మొహమ్మద్ అబ్దుల్ అరాఫత్ ఈ నెల మొదట్లో శవంగా కనిపించారు. మార్చి నెలలో అదృశ్యమైన మొహమ్మద్ అబ్దుల్ అరాఫత్ మృతదేహాన్ని ఏప్రిల్‌లో గుర్తించారు. అరాఫత్, హైదరాబాద్‌కు చెందినవారు.

అరాఫత్ మరణవార్త బయటకు రావడానికి సరిగ్గా నాలుగు రోజుల ముందు మరో తెలుగు విద్యార్థి ఉమా సత్యసాయి చనిపోయారు. అతను కూడా క్లీవ్‌ల్యాండ్‌లోనే మృతి చెందారు.

అరాఫత్‌తో పాటే కాలేజీలో చేరిన మరో విద్యార్థి మాట్లాడుతూ, తన తల్లిదండ్రుల నుంచి వచ్చిన వాట్సాప్ మెసేజీ ద్వారా అరాఫత్ మరణం గురించి తనకు తెలిసిందని చెప్పారు. తన పేరు చెప్పడానికి ఆయన ఇష్టపడలేదు.

‘‘నేను ప్రతి క్షణం అప్రమత్తంగా ఉండాలని నా తల్లిదండ్రులు హెచ్చరించారు’’ అని ఆయన అన్నారు.

అమెరికా

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, అమెరికా యూనివర్సిటీల్లో చదువుకోడానికి ప్రతీ ఏడాది వేలమంది భారతీయ విద్యార్థులు అమెరికా వెళ్తుంటారు

2022-23లో అమెరికా యూనివర్సిటీల్లో దాదాపు 2,67,000 మంది భారతీయ విద్యార్థులు చేరారు. 2030 నాటికి ఈ సంఖ్య 10 లక్షలకు చేరుతుందని అంచనా.

‘‘అమెరికా డిగ్రీ సంపాదించాలనే కోరిక భారతీయుల్లో చాలా బలంగా ఉంది. ఇదే భారతీయుల్ని అమెరికా వైపు ఆకర్షిస్తోంది’’ అని న్యూయార్క్‌కు చెందిన విద్యా నిపుణులు రజికా భండారీ అన్నారు.

ఈ మరణాలన్నింటికీ సంబంధం ఉన్నట్లుగా చూపించే స్పష్టమైన నమూనాలేమీ లేవని న్యూజెర్సీలోని డ్రూ యూనివర్సిటీ అసోసియేట్ ప్రొఫెసర్ సంజయ్ మిశ్రా చెప్పారు. భారతీయులు అయినందునే ఈ మరణాలు సంభవిస్తున్నాయనే కల్పిత ఉచ్చులో పడకుండా ఉండటం చాలా ముఖ్యమని ఆయన సూచించారు.

‘‘ఇవన్నీ జాతి ఆధారంగా జరిగిన ఘటనలు అని నిరూపించే ఆధారాలేమీ కనిపించలేదు’’ అని ఆయన చెప్పారు.

‘‘పిల్లలకు దూరంగా భారత్‌లో ఉండి ఇలాంటి వార్తలు విన్నప్పుడల్లా చాలా భయమేస్తుంది’’ అని మీనూ అవాల్ అన్నారు. మీనూ అవాల్ కుమారుడు అమెరికాలోని సదరన్ కాలిఫోర్నియా యూనివర్సిటీలో చదువుతున్నారు.

ఎవరైనా దోపిడీకి పాల్పడితే వారిపై తిరిగి దాడి చేసేందుకు ప్రయత్నించవద్దని తన కుమారుడికి సూచించినట్లుగా ఆమె చెప్పారు.

‘‘దోపిడి దొంగలు అడ్డుకుంటే తన దగ్గర ఉన్న డబ్బు, వస్తువులన్నీ ఇచ్చేసి గొడవ పడకుండా వెళ్లిపోమ్మని మా అబ్బాయికి చెప్పాను’’ అని మీనూ తెలిపారు.

న్యూయార్క్ యూనివర్సిటీలో చదువుతున్న తన కూతురితో రోజూ మాట్లాడతానని, ఆమె స్నేహితుల ఫోన్ నంబర్లు కూడా తన దగ్గర ఉంచుకున్నానని జైపూర్‌కు చెందిన నీతూ మర్దా చెప్పారు.

‘‘తెలియని వ్యక్తులతో కలిసి ఒంటరిగా బయటకు వెళ్లొద్దని మా అమ్మాయికి చెబుతుంటా’’ అని ఆమె తెలిపారు.

అరాఫత్

ఫొటో సోర్స్, TWITTER

ఫొటో క్యాప్షన్, మొహమ్మద్ అబ్దుల్ అరాఫత్

వివిధ క్యాంపస్‌లకు చెందిన విద్యార్థులు తమ సొంత భద్రతా ప్రోటోకాల్స్‌ను పాటిస్తారు. మసాచుసెట్స్‌లోని టఫ్ట్స్ యూనివర్సిటీ దక్షిణాసియా సంఘం సహ అధ్యక్షులుగా అనుష్కా మదన్, ఇషికా గుప్తా వ్యవహరిస్తున్నారు.

రాత్రిపూట క్యాంపస్‌లో ఒంటరిగా నడవకూడదనే నిబంధనతో సహా తాము కొన్ని భద్రతా నియమాలను ఏర్పాటు చేసుకున్నట్లు వారు చెప్పారు.

‘‘నిజానికి బోస్టన్ చాలా సురక్షితమైనది. కానీ, ఇప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా మేం మరింత జాగ్రత్తగా ఉంటున్నాం. మా పరిసరాలను గమనిస్తున్నాం’’ అని ఇషికా తెలిపారు.

భౌతిక భద్రతతో పాటు ఈ ఘటనలతో విద్యార్థులపై గల మానసిక ప్రభావం గురించి కూడా యూనివర్సిటీలకు అవగాహన ఉంది.

‘‘విదేశీ విద్యార్థులు మానసిక ఆరోగ్య సమస్యలను ఎక్కువగా ఎదుర్కొంటున్నారన్నది స్పష్టంగా తెలుస్తుంది. ఆర్థిక, విద్యాపరమైన ఒత్తిళ్లను ఎదుర్కొంటున్నారు. ఇంటికి వేల మైళ్ల దూరంలో ఉన్నప్పుడు ఇది మరింత పెద్ద మానసిక భారం’’ అని రజికా భండారీ చెప్పారు.

విభిన్న ఆర్థిక, సాంస్కృతిక నేపథ్యాల నుంచి విదేశాలకు వెళ్లిన విద్యార్థుల అనుభవాలు విభిన్నంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.

‘‘తమ వారిని వదిలేసి, కొత్త సంస్కృతిలోకి అడుగుపెట్టినప్పుడు అంతర్జాతీయ విద్యార్థులు ప్రత్యేకమైన ఒత్తిడిని ఎదుర్కొంటారు’’ అని సీఎస్‌యూలోని ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆఫ్ కమ్యూనికేషన్స్ రీనా అరోరా సాంచెజ్ అన్నారు.

అమెరికాలోని భారత విద్యార్థులు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, 2022-23లో దాదాపు 2,67,000 మంది భారతీయ విద్యార్థులు అమెరికా యూనివర్సిటీల్లో చేరారు

అమెరికాలోని భారత ఎంబసీ తమను సంప్రదించడానికి విద్యార్థుల కోసం మార్గదర్శకాలు జారీ చేసింది. తరచుగా ఆన్‌లైన్, వ్యక్తిగత ఓపెన్ హౌజ్ సెషన్లను నిర్వహిస్తుంది.

భారత విద్యార్థులు ఎక్కువగా ఉండే ఇన్‌స్టిట్యూట్లకు తాము వెళ్లినట్లు ఇండియా క్లబ్ అధ్యక్షుడు ప్రథమ్ మెహతా చెప్పారు.

విద్యార్థుల కోసం క్యాంపస్‌లలో అందించే పలు థెరపీ సర్వీసులు అందుబాటులో ఉన్నాయని ప్రథమ్ తెలిపారు. అసురక్షితంగా భావించే విద్యార్థులను భారత కాన్సులేట్‌తో అనుసంధానించడంలో ఈ క్లబ్ సహాయపడుతుంది.

అలాగే పోలీస్ విభాగంతో యూనివర్సిటీ విద్యార్థులను అనుసంధానించే ఒక యాప్‌ను కూడా సీఎస్‌యూ అందిస్తోంది. క్యాంపస్‌తో పాటు విద్యార్థులు నివసించే హౌజింగ్ సొసైటీలకు ఉచితంగా భద్రతా సర్వీసు సేవలను ఈ యాప్ ద్వారా అందిస్తారు.

కాలేజీలను ఎన్నుకునేటప్పుడు విద్యార్థులు ముఖ్యంగా భద్రత, లా ఎన్‌ఫోర్స్‌మెంట్ వంటి అంశాలపై దృష్టి సారిస్తారని నిపుణులు చెబుతున్నారు.

ఫిబ్రవరిలో భారత్‌లో అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టి మాట్లాడుతూ, ‘‘భారతీయ విద్యార్థులు చదువుకోవడానికి అమెరికా ఒక సురక్షితమైన, అద్భుత ప్రదేశం. ఈ విషయాన్ని భారతీయులు గుర్తించేలా చేసేందుకు మేం పట్టుదలతో పనిచేస్తున్నాం’’ అని అన్నారు.

కానీ, ఇటీవలి మరణాలు భద్రతా అంశాన్ని తీవ్రంగా మార్చాయి.

‘‘విదేశాల్లో చదువుకోవాలనే కోరిక భారతీయ విద్యార్థుల్లో చాలా ఎక్కువగా ఉందనే సంగతి అమెరికా యూనివర్సిటీలకు తెలుసు. అదే సమయంలో వారు వ్యక్తిగత భద్రత గురించి భయాందోళనలో ఉన్నారనే విషయం కూడా యూనివర్సిటీలకు తెలుసు’’ అని భండారీ చెప్పారు.

అనిశ్చితి ఉన్నప్పటికీ చాలా మంది విద్యార్థుల ఉన్నత చదువులకు గమ్యస్థానం అమెరికానే.

సవాళ్లు ఉన్నాయని తెలిసినప్పటికీ జైపూర్‌కు చెందిన స్వరాజ్ జైన్ ఈ ఆగస్టులో న్యూయార్క్ యూనివర్సిటీకి వెళ్తున్నారు.

‘‘అందరూ అక్కడి తుపాకీ హింస, నేరాల గురించి మాట్లాడుతున్నారు. నేను చాలా జాగ్రత్తగా ఉండాలి’’ అని స్వరాజ్ అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)