నెహ్రూ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించిన ఈ ఎంపీ ఎవరు, ఎన్నికల్లో గెలిచిన ప్రతిసారీ ఆయన ఎందుకు రాజీనామా చేశారు?

Lal Shyam Shah లాల్ శ్యామ్ షా
    • రచయిత, భాగ్యశ్రీ రౌత్
    • హోదా, బీబీసీ కోసం

తూర్పు పాకిస్తాన్ (ప్రస్తుత బంగ్లాదేశ్) నుంచి 1960లలో పారిపోయి వస్తున్న ప్రజలకు మధ్య భారతంలోని గిరిజన ప్రాంతాల్లో ఆశ్రయం కల్పించాలని అప్పటి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆ నిర్ణయం కారణంగా నాటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ ప్రభుత్వంపై అక్కడి గిరిజనుల్లో ఆగ్రహం పెరిగింది.

అయితే, స్వాతంత్ర్యం వచ్చిన ఒకటిన్నర దశాబ్దం తర్వాత కూడా నెహ్రూ అగ్రస్థానంలో ఉన్నారు. కాంగ్రెస్‌ను ఎదిరించే సాహసం ఎవరూ చేయలేదు. అందుకే, గిరిజనుల్లో కోపం ఉన్నా, దానిని బహిరంగంగా వ్యక్తం చేయలేకపోయారు.

కానీ, అప్పుడు చందా (ప్రస్తుతం మహారాష్ట్రలోని చంద్రాపూర్) లోక్‌సభ నియోజకవర్గానికి చెందిన ఒక స్వతంత్ర ఎంపీ నేరుగా రాజీనామా చేసి నెహ్రూ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.

1964లో అప్పటి లోక్‌సభ స్పీకర్ సర్దార్ హుకం సింగ్‌కు సుదీర్ఘ లేఖ ద్వారా ఎంపీ పదవికి రాజీనామా సమర్పించారు. ఆ ఎంపీ పేరు లాల్ శ్యామ్ షా.

లాల్ శ్యామ్ షా మొత్తం ఆరు ఎన్నికల్లో పోటీ చేశారు. మూడుసార్లు ఓడిపోయారు. మూడు ఎన్నికల్లో గెలిచారు. కానీ, గెలిచిన ప్రతిసారీ రాజీనామా చేశారు.

ఐదేళ్లలో మూడుసార్లు రాజీనామా..

'లాల్ శ్యామ్ షా: ఏక్ ఆదివాసీ కి కహానీ' పేరుతో రచయిత, ప్రముఖ పాత్రికేయుడు సుదీప్ ఠాకూర్ రాసిన పుస్తకంలో లాల్ శ్యామ్ షా రాజకీయ జీవిత విశేషాలను వివరించారు.

లాల్ శ్యామ్ షా 1919 మే 1న చందా (ప్రస్తుతం చంద్రపూర్) జిల్లాలోని ఔంధీ (ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్‌లో ఉంది)లోని ఘోటియా కన్హర్‌లో జన్మించారు.

వారి కుటుంబానికి భారీ ఎత్తున భూములు ఉండేవి. ఈ ప్రాంతంలోని గిరిజనులు ఆయనను మహారాజ్ అని పిలిచేవారు.

దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక 1951లో తొలిసారి సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. అప్పుడు చౌకీ అసెంబ్లీ స్థానం నుంచి మొదటిసారి ఎన్నికల్లో పోటీ చేశారు. కాంగ్రెస్‌కు చెందిన సుజనీ రామ్‌ ఆయన ప్రత్యర్థి. ఆ ఎన్నికల్లో లాల్ శ్యామ్ ఓడిపోయారు. సుజనీ రామ్ గెలిచారు. కానీ, ఆ తర్వాత ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి.

నిజానికి, ఆ ఎన్నికల్లో పోటీ చేసేందుకు మూడో అభ్యర్థి ప్రయాగ్‌సింగ్‌ అనే వ్యక్తి కూడా నామినేషన్ వేశారు. కానీ, గిరిజన ధ్రువీకరణ పత్రం విషయంలో అభ్యంతరాల కారణంగా ఆయన అభ్యర్థిత్వాన్ని అధికారులు తిరస్కరించారు. దాంతో, ఆయన ఆ ఎన్నికల్లో ఆయన పోటీ చేయలేకపోయారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే, ప్రయాగ్‌సింగ్ ఆ ఫలితాన్ని సవాలు చేస్తూ, ఆ ఎన్నికను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

నాగ్‌పూర్‌లో ఆ కేసు విచారణ నడిచింది. చివరగా, ప్రయాగ్ సింగ్ గిరిజన సర్టిఫికేట్‌ను అధికారులు ధృవీకరించారు. దాంతో, ఎన్నికల సంఘం 1952 నవంబర్ 15న సుజనీ రామ్ ఎన్నికను రద్దు చేసింది.

దాంతో, ఆ నియోజకవర్గంలో మళ్లీ ఉప ఎన్నికలు జరిగాయి. 1952లో జరిగిన ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ మళ్లీ సుజనీ రామ్‌కు టికెట్ ఇచ్చింది. లాల్ శ్యామ్ షా కూడా పోటీ చేశారు. ఈసారి లాల్ శ్యామ్ దాదాపు 4,000 ఓట్లతో విజయం సాధించారు.

కానీ, ఎమ్మెల్యేగా ఎన్నికైన వెంటనే ఆయన హఠాత్తుగా రాజీనామా చేశారు. అందరూ ఆశ్చర్యపోయారు. ఆయన రాజీనామాకు కారణం ఏంటో ఎవరికీ అర్థం కాలేదు.

ఆ తర్వాత 1952 డిసెంబర్‌లో మూడోసారి చౌకీ శాసనసభ స్థానానికి ఉప ఎన్నిక జరిగింది. అప్పుడు కూడా సుజనీరామ్, లాల్ శ్యామ్ షా తలపడ్డారు.

ఈసారి కూడా లాల్ శ్యామ్ షా ఒకే ఏడాది రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి రికార్డు సృష్టించారు. కానీ, ఆ తర్వాత కూడా ఆయన రాజీనామా చేశారు.

Lal Shyam Shah లాల్ శ్యామ్ షా

లాల్ శ్యామ్ షా గిరిజన నాయకుడు. ఆయన ప్రభావం పాత మధ్యప్రదేశ్‌లోని గిరిజన ప్రాంతంలో ఎక్కువగా ఉండేది. ఇందులో ప్రస్తుత గడ్చిరోలి, మహారాష్ట్రలోని చంద్రపూర్, రాజ్‌నంద్‌గావ్, దుర్గ్, బాలోర్, కాంకేర్, బస్తర్, నారాయణపూర్, ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ ఉన్నాయి.

ఆయనకు హిందీ, గోండి, మరాఠీలతో పాటు ఇంగ్లీషులోనూ మంచి పట్టు ఉండేది. ప్రభుత్వ పనుల్లో ఇంగ్లీషును నేర్పుగా ఉపయోగించేవారు.

గిరిజన ప్రాంతాల్లో అక్రమంగా చెట్లను నరకడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. ఆ అంశాన్ని అసెంబ్లీలో లేవనెత్తారు. ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో మరోసారి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. 1956 జనవరి 30న తన రాజీనామాను అసెంబ్లీ స్పీకర్‌కు సమర్పించారు.

అయితే, ఆయన రాజీనామాను ఆమోదించకుండా అడ్డుకోవాలంటూ ఆదివాసీ సేవా మండలి సభ్యులు అప్పటి రాష్ట్రపతి రాజేంద్రప్రసాద్‌ను అభ్యర్థించారు. కానీ, తన రాజీనామాను ఆమోదించాల్సిందేనంటూ లాల్ శ్యామ్ పట్టుబట్టారు. దాంతో, ఎట్టకేలకు ఆయన రాజీనామా ఆమోదం పొందింది.

దాంతో, ఐదేళ్లు పూర్తికాకముందే నాలుగోసారి చౌకీ అసెంబ్లీ స్థానానికి ఎన్నికలు జరిగాయి.

అయితే, నాలుగోసారి లాల్ శ్యామ్ షా పోటీ చేయలేదు. కానీ పదేపదే రాజీనామాలు చేయడంతో ఒకే నియోజకవర్గంలో ఐదేళ్లలో నాలుగుసార్లు ఎన్నికలు నిర్వహించాల్సి వచ్చింది.

లోక్‌సభ ఎన్నికల్లో...

శాసనసభకు రాజీనామా చేసిన తర్వాత ఆయన సెంట్రల్ ఇండియాలో పర్యటించారు. అడవుల్లో అక్రమంగా చెట్లను నరికివేయడాన్ని వ్యతిరేకిస్తూ ఆయన చేసిన ఆందోళన మరింత ఉధృతమైంది.

గిరిజనులకు ప్రత్యేక గోండ్వానా రాష్ట్రం కావాలని లాల్ శ్యామ్ షా డిమాండ్ చేశారు. అందుకు గిరిజనులను జాగృతం చేసేందుకు బాధ్యతను తీసుకున్నారు.

అందులో భాగంగా 1957 లోక్‌సభ ఎన్నికల్లో చందా లోక్‌సభ నియోజకవర్గం (ప్రస్తుతం చంద్రాపూర్) నుంచి పోటీ చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు.

కానీ, ఆ ఎన్నికల ఫలితాలను లాల్ శ్యామ్ షా బాంబే హైకోర్టులో సవాల్ చేశారు. అయితే, తీర్పు కాంగ్రెస్‌కు అనుకూలంగా వచ్చింది.

పార్లమెంటు

ఫొటో సోర్స్, Getty Images

పార్లమెంటులో ఒక రోజు..

ఆ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత కూడా లాల్ శ్యామ్ షా హవా కొనసాగింది. గోండ్వానా ప్రత్యేక రాష్ట్రం కోసం ఆయన ఉద్యమాన్ని మరింత విస్తృతం చేశారు.

ఆ తర్వాత 1962 ఏప్రిల్‌లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఆయన గెలిచారు. అయితే, దాదాపు ఐదు నెలల తర్వాత పార్లమెంటు రెండోసారి సమావేశమైనప్పుడు ఆయన ప్రమాణ స్వీకారం చేశారు.

అప్పుడు తూర్పు పాకిస్తాన్ (బంగ్లాదేశ్) నుంచి భారత్‌కు వచ్చిన శరణార్థులకు మధ్య భారతదేశంలోని గిరిజన ప్రాంతాలలో ఆశ్రయం కల్పించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇది ఇక్కడి గిరిజనుల హక్కులపై ప్రభావం చూపుతుందని, శరణార్థుల వల్ల స్థానిక గిరిజనుల సమస్యలు పెరుగుతాయంటూ కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని ఆయన వ్యతిరేకించారు.

గిరిజనుల హక్కులను కాపాడాలంటూ లోక్‌సభ సభ్యత్వానికి లాల్ శ్యామ్ షా రాజీనామా చేశారు. ఈ రాజీనామాను 1964లో స్పీకర్ ఆమోదించారు. ఆయన లోక్‌సభకు ఒక్కరోజు మాత్రమే హాజరయ్యారని సుదీప్ ఠాకూర్ తన పుస్తకంలో తెలియజేశారు.

ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమం..

1960 అక్టోబర్‌లో రాయ్‌పూర్‌లో కాంగ్రెస్ సమావేశం జరిగింది. అప్పుడు లాల్ శ్యామ్ షా నేతృత్వంలో వేలాది మంది ఆదివాసీలు భారీ కవాతు నిర్వహించారు. చంద్రాపూర్, గడ్చిరోలి వంటి ప్రాంతాల నుంచి కాలినడకన రాయ్‌పూర్ చేరుకున్నారు.

జవహర్‌లాల్‌ నెహ్రూను కలిసి తమ డిమాండ్లను తెలియజేయాలనుకున్నారు. వారి డిమాండ్లలో ఒకటి గోండ్వానా రాష్ట్ర డిమాండ్ కాగా రెండోది భిలాయ్ ఉక్కు కర్మాగారంలో గిరిజనులకు ఉద్యోగాలు ఇవ్వాలనేది.

వందల కిలోమీటర్లు కాలినడకన వెళ్లి వచ్చిన గిరిజనులను ప్రధాని నెహ్రూ వచ్చి కలవాలని షా కోరారు. అప్పుడు వారి డిమాండ్ల పట్ల నెహ్రూ సానుకూలంగా స్పందించారని పుస్తకంలో పేర్కొన్నారు.

వీడియో క్యాప్షన్, ఎమర్జెన్సీ నిర్ణయం వెనుక ఏం జరిగింది?

ఎమర్జెన్సీ సమయంలో అరెస్టు...

ఇందిరా గాంధీ ప్రభుత్వం 1975 జూన్ 26న దేశంలో ఎమర్జెన్సీని ప్రకటించింది. మెయింటెనెన్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ (మిసా) కింద ప్రతిపక్ష నేతలను అరెస్ట్ చేశారు.

లాల్ శ్యామ్ షా కూడా అరెస్టయ్యారు. ఆయన్ను రాజ్‌నంద్‌గావ్‌ (ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్‌లో ఉంది) సెంట్రల్ జైలులో ఉంచారు.

రాజకీయ జీవితంలో చురుగ్గా ఉన్నప్పటికీ ఆయన ఏ పార్టీతోనూ పొత్తులు, సంబంధాలు పెట్టుకోలేదు. అయినప్పటికీ ఆయన్ను అప్పుడు అరెస్టు చేశారు. 1976 సెప్టెంబర్ 9న జైలు నుంచి ఆయన విడుదలయ్యారు.

లాల్ శ్యామ్ షా గిరిజనుల హక్కుల కోసం ఎన్నో ఉద్యమాలు చేశారు. 1980లలో ‘జంగల్ బచావో-మానవ్ బచావో’ ఉద్యమం ప్రజాదరణ పొందింది. నీరు, అడవి, భూమిపై గిరిజనుల హక్కుల కోసం పోరాడారు.

ఎమర్జెన్సీ తర్వాత ఇందిరా గాంధీపై దేశంలో అసంతృప్తి పెరిగింది. అప్పుడు లాల్ శ్యామ్ షా జనతా పార్టీ అభ్యర్థులకు మద్దతు ఇచ్చారు.

ఆ తర్వాత రాజ్‌నంద్‌గావ్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. అవే ఆయనకు చివరి ఎన్నికలు. కానీ, అప్పుడు ఓడిపోయారు. ఆ తర్వాత కూడా గిరిజనుల కోసం ఉద్యమించారు.

1988న మార్చి 10న అనారోగ్యంతో రాజ్‌నంద్‌గావ్‌లోని ఆసుపత్రిలో లాల్ శ్యామ్ షా తుది శ్వాస విడిచారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)