ఏపీ, తెలంగాణల్లో గ్రూప్ పరీక్షలంటే వాయిదాలు, లీకులేనా...సివిల్స్ నుంచి ఏమీ నేర్చుకోలేమా?

టీఎస్‌పీఎస్సీ
ఫొటో క్యాప్షన్, తెలుగు రాష్ట్రాల్లో పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసే జాబ్ క్యాలెండర్ కోసం లక్షల మంది అభ్యర్థులు ఎదురుచూస్తుంటారు.
    • రచయిత, అమరేంద్ర యార్లగడ్డ
    • హోదా, బీబీసీ ప్రతినిధి

2023లో సివిల్స్ రాసిన ప్రిలిమినరీ అభ్యర్థుల సంఖ్య దాదాపు 13లక్షలు. అలాగే తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో గ్రూప్స్ పరీక్షలు రాస్తున్న అభ్యర్థులు 3 నుంచి 4 లక్షల మంది ఉన్నారు.

యూపీఎస్సీ(యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్) నిర్వహించే పరీక్షలతో పోలిస్తే ఆయా రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ కమిషన్లు నిర్వహించే పరీక్షలకు తక్కువ సంఖ్యలోనే అభ్యర్థులు హాజరవుతుంటారు.

అయినప్పటికీ, ఆంధ్రప్రదేశ్, తెలంగా‌‍ణలలో తరచూ గ్రూప్స్ పరీక్షల నిర్వహణ వివాదమవుతోంది.

ఈ వివాదాల వల్ల కోర్టులు పరీక్షలను రద్దు చేస్తున్నాయి. ఇది నిరుద్యోగ యువతకు చాలా ఇబ్బందికరంగా మారుతోంది.

సివిల్స్ పరీక్షలు పక్కాగా నిర్వహిస్తుంటే గ్రూప్స్‌ పరీక్షల దగ్గరకు వచ్చేసరికి ఈ గందరగోళమెందుకు? అనే ప్రశ్న వినిపిస్తోంది.

నిరుద్యోగ యువత

ఏపీలో ఏం జరిగింది..?

ఆంధ్రప్రదేశ్‌లో 2018లో 167 పోస్టులకు గ్రూప్-1 నోటిఫికేషన్ ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్.

ఆ సమయంలో 1,14,473 మంది ఈ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 2019 మే 26న జరిగిన ప్రిలిమ్స్ పరీక్షకు దాదాపు 59వేల మంది హాజరు కాగా 8,351 మంది మెయిన్ పరీక్షకు అర్హత సాధించారు. వారిలో 6,807 మంది పరీక్ష రాశారు.

ఆ తర్వాత కరోనా కారణంగా డిజిటల్ మూల్యాంకనం చేయించారు. దానిపై కోర్టులో కేసు వేయడంతో మళ్లీ మ్యానువల్‌గా మూల్యాంకనం చేశారు. దీంతో రెండుసార్లు మూల్యాంకనం చేశారంటూ కొందరు అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించారు.

విచారణ అనంతరం హైకోర్టు, మెయిన్స్ పరీక్షను రద్దు చేసింది.

ఆ నోటిఫికేషన్‌లో నాడు విజయం సాధించిన అభ్యర్థులు నేడు ఉద్యోగాలు చేసుకుంటున్నారు.

‘‘పరీక్ష కోసం ఎంత కష్టపడ్డానో నాకు తెలుసు. అన్నీ వదిలేసి రాత్రీ పగలూ కష్టపడ్డా. నోటిఫికేషన్ నుంచి ఉద్యోగం వరకు చేరుకోవడానికి ఆరేళ్లు పట్టింది. జీవితంలో సెటిల్ అయ్యాయని అనుకునేసరికి, ఇప్పుడు పరీక్ష రద్దు అంటున్నారు. ఇక మా జీవితాలు ఏం కావాలి’’ అని 2018 నోటిఫికేషన్‌లో ఉద్యోగం సాధించిన ఓ అభ్యర్థి బీబీసీతో తన ఆవేదనను పంచుకున్నారు.

2018 తర్వాత 2023లో మరో నోటిఫికేషన్ ఇచ్చారు.

2024 మార్చి 17న ప్రిలిమినరీ పరీక్ష పూర్తయ్యింది. ప్రశ్నాపత్రాల్లో అనువాద దోషాలు వచ్చినట్లు అభ్యర్థులు చెబుతున్నారు.

తెలంగాణ

తెలంగాణలో రెండుసార్లు రద్దు

తెలంగాణ ఏర్పడిన తర్వాత తొలిసారిగా 2022లో 503 పోస్టులతో గ్రూప్–1 నోటిఫికేషన్ వచ్చింది. అదే ఏడాది అక్టోబరులో జరిగిన ప్రిలిమినరీ పరీక్షకు 2,33,248 మంది హాజరయ్యారు.

అయితే, పరీక్ష పేపర్ లీకేజీ కారణంగా ఒకసారి పరీక్ష రద్దయితే, బయోమెట్రిక్ అటెండెన్స్ తీసుకోలేదన్న వివాదంతో రెండోసారి పరీక్షను రద్దు చేశారు.

గ్రూప్ –2 పరీక్షలు కూడా గతేడాది నవంబరులో జరగాల్సి ఉండగా, వాయిదా వేశారు. దీనిపై పలువురు ఔత్సాహకులు తమ ఆవేదనను బీబీసీతో పంచుకున్నారు.

ఎన్నికల ముందు హడావుడిగా ఒకేసారి నోటిఫికేషన్లు ఇస్తుండటం గందరగోళానికి కారణమవుతోందని మహబూబ్‌నగర్‌కు చెందిన శ్రీనివాస్ రాథోడ్ అన్నారు.

‘‘టీఎస్పీఎస్సీ బోర్డు గానీ, ఏపీపీఎస్సీ బోర్డు గానీ సరైన స్పష్టతతో ఉండటం లేదు. నిబం‌ధనలలో ముందుగా బయోమెట్రిక్ అని చెబుతారు. తర్వాత మ్యానువల్ అటెండెన్స్ తీసుకుంటారు. అంతేకాకుండా బోర్డులోని కొందరు ఉద్యోగులు పేపర్లు అమ్ముకుంటున్నారు. ఈ విషయంలో భద్రత వ్యవస్థ సరిగా ఉండటం లేదు. అంతిమంగా ఏం జరిగినా, నష్టపోయేది మాత్రం నిరుద్యోగులే కదా..’’ అని శ్రీనివాస్ రాథోడ్ అన్నారు.

‘‘‌‍పరీక్షల నిర్వహణ యూపీఎస్సీ తరహాలో, రాజకీయ ప్రమేయం లేకుండా ఉండాలి’’ అని గ్రూప్స్‌కు సిద్ధమవుతున్న మరో అభ్యర్థి చిట్యా సుమన్ అన్నారు.

యూపీఎస్సీ

సివిల్స్...గ్రూప్స్ పరీక్షలలో తేడా ఏమిటంటే..

15 ఏళ్ల కిందట అంటే, 2009లో 4,09,110 మంది సివిల్స్ పరీక్ష రాశారు.

2022లో 11.52లక్షల మంది పరీక్ష రాయగా, 2023లో దాదాపు 13 లక్షల మంది పరీక్ష రాసినట్లు యూపీఎస్సీ ప్రకటించింది.

రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ కమిషన్‌తో పోలిస్తే సివిల్స్ రాసే అభ్యర్థుల సంఖ్య దాదాపు రెండు, మూడు రెట్లు ఎక్కువే అయినా, పరీక్షల నిర్వహణలో వివాదాలు చాలా అరుదు.

‘‘నేను గత 20 ఏళ్లు యూపీఎస్సీ పరీక్షలను గమనిస్తున్నాను. సివిల్స్ పరీక్ష వాయిదా పడటం కేవలం రెండుసార్లే జరిగింది. కరోనా కారణంగా ఓసారి వాయిదా వేస్తే, ఇప్పుడు సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రెండోసారి వాయిదా వేశారు’’ అని చెప్పారు సీఎస్బీ ఐఏఎస్ అకాడమీ డైరెక్టర్ ఎం.బాలలత.

ఎం. బాలలత
ఫొటో క్యాప్షన్, ఎం. బాలలత

‘‘యూపీఎస్సీలో పారదర్శకత, జవాబుదారీతనం, క్రమశిక్షణ, పర్యవేక్షణ ఉంటాయి. ప్రతిదీ షెడ్యూల్ ప్రకారమే జరుగుతుంది. కానీ, రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ కమిషన్‌కు వచ్చేసరికి అలా కాదు. ఇక్కడ ఐదేళ్లకో, లేదా పదేళ్లకో పరీక్షలు జరుగుతుంటాయి.

ఇక్కడ పోస్టు అమ్మేశారంటే, దానిని సాధారణంగా భావిస్తారు. కొందరు అభ్యర్థులు పోస్టులు కొనుక్కోవచ్చనే భావనలో ఉంటున్నారు.

స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేసరికి లోకల్ వాళ్లే ఉంటారు కదా. వాళ్లను ఏదో విధంగా మేనేజ్ చేయవచ్చు అన్న భావన బలంగా ఉంది’’ అన్నారు.

ఘంటా చక్రపాణి
ఫొటో క్యాప్షన్, టీఎస్పీఎస్సీ మాజీ ఛైర్మన్ ఘంటా చక్రపాణి.

రాజకీయ జోక్యం.. పైరవీలు..

స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విషయంలో రాజకీయ జోక్యం, పైరవీలు ఎక్కువగా ఉంటున్నాయనే విమర్శలున్నాయి.

రాజ్యాంగంలోని ఆర్టికల్ 315 ప్రకారం, కేంద్ర, రాష్ట్రాల స్థాయిలో పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ వేర్వేరుగా ఉండాలి. కేంద్ర పరిధిలోని యూపీఎస్సీలో సభ్యుల నియామకం రాష్ట్రపతి ఆమోదంతో జరిగితే, రాష్ట్రాల దగ్గరకు వచ్చేసరికి గవర్నర్ ఆమోదంతో జరుగుతుంది.

యూపీఎస్సీ, స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రాజ్యాంగంలో ఒకటే పార్ట్‌లో ఉండటంతో సహజంగానే రెండింటి మధ్య పోలికను చూస్తుంటామని టీఎస్పీఎస్సీ మాజీ ఛైర్మన్ ఘంటా చక్రపాణి బీబీసీతో అన్నారు.

‘‘యూపీఎస్సీకి ఉండే స్వయం ప్రతిపత్తి, వనరులను రాష్ట్ర ప్రభుత్వాలు స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌కు ఇవ్వడం లేదు. ఆంధ్ర, తెలంగాణ అనే కాదు, దేశంలోని ప్రతి రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇదే తరహా సమస్యలు ఎదుర్కొంటోంది.

స్టేట్ పబ్లిక్ సర్వీ స్ కమిషన్‌లో నిర్వహణ లోపాల వల్ల సమస్యలు వస్తుంటాయి. అది ఇన్‌స్టిట్యూషన్ వైఫల్యం కాదు. ప్రభుత్వం సరైన దృక్పథంతో రాజ్యాంగ వ్యవస్థను కాపాడలేకపోవడంతో సమస్యలు వస్తున్నాయి’’ అని చెప్పారు.

రాష్ట్రాల విషయంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే, ఆ పార్టీకి విధేయులుగా ఉన్న వ్యక్తులను నియమిస్తున్నారు.

ఏపీపీఎస్సీలో ఇదే తరహాలో నియామకాలు చేశారన్న విమర్శలున్నాయి.

దీనికితోడు ప్రభుత్వం మారితే సభ్యులు, ఛైర్మన్‌ను మార్చివేస్తుంటారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఛైర్మన్ సహా సభ్యులంతా కొత్తవారు నియమితులయ్యారు.

‘‘ప్రభుత్వాన్ని సమన్వయం చేసే శక్తి లేకపోవడం, పర్యవేక్షించే తీరిక లేకపోవడం, కమిషన్‌కు స్వేచ్ఛనివ్వాలనే ఆలోచన లేకపోవడం వల్ల పబ్లిక్ సర్వీస్ కమిషన్లు బద్నాం అవుతున్నాయి.

కేరళ తప్ప ఎక్కడా స్వయం ప్రతిపత్తి గల కమిషన్లు లేవు. ఈ మధ్య కేరళలో కూడా ఫైనాన్షియల్ ప్రతిపత్తిని ప్రభుత్వం తొలగించింది’’ అని ఘంటా చక్రపాణి చెప్పారు.

నిరుద్యోగ యువత
ఫొటో క్యాప్షన్, యూపీఎస్సీ మాదిరిగానే స్టేట్ పబ్లిక్ కమిషన్‌లకు కూడా స్వయంప్రతిపత్తి కల్పించాలని అన్నారు ఘంటా చక్రపాణి.

స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎలా ఉండాలి?

రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ కమిషన్లు ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా స్వయం ప్రతిపత్తితో ఉండాలనేది ఎప్పట్నుంచో వినిపిస్తున్న వాదన. మూడు విధాలుగా స్వయం ప్రతిపత్తిని కల్పిస్తేనే కమిషన్ పనితీరు మెరుగుపడుతుందని ‌‍ఘంటా చక్రపాణి అన్నారు.

‘‘ఫైనాన్షియల్, అడ్మినిస్ట్రేటివ్, అటానమీతోపాటు ప్రభుత్వ వ్యవస్థలను సమన్వయం చేసే స్వతంత్ర కమిషన్ ఉండాలి. కేంద్ర ప్రభుత్వం యూపీఎస్సీని పూర్తిగా స్వతంత్ర వ్యవస్థగా ఏర్పాటు చేసి, దాని సమగ్రతను కాపాడుతూ వస్తోంది. ఏటా ఎన్ని పోస్టులు ఖాళీ అవుతున్నాయనే విషయంపై ఎప్పటికప్పుడు నిర్దేశిత సమయం ప్రకారం యూపీఎస్సీకి రిపోర్టు చేస్తుంటారు. దాని ప్రకారం యూపీఎస్సీ పోస్టుల భర్తీకి నిర్ణయం తీసుకుంటుంది. అలాగే యూపీఎస్సీకి ఎంత ఖర్చు పెట్టుకోవాలనే విషయంపై స్వతంత్రత ఉంది. రాష్ట్రాల విషయానికి వస్తే, ఆ అవకాశం ఉండదు’’ అని చెప్పారు.

యూపీఎస్సీ, స్టేట్ పీఎస్సీ భర్తీ చేసే ఉద్యోగాలలో వ్యత్యాసం ఉంటుందని చెప్పారు ఘంటా చక్రపాణి.

“యూపీఎస్సీ ఏడాదిలో భర్తీ చేసే అన్ని ఉద్యోగాలు కలిపితే రెండు వేల పోస్టుల వరకు ఉంటాయి. అందుకు కమిషన్‌లో రెండు వేల మంది ఉద్యోగులు ఉంటారు.

కానీ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కు వచ్చేసరికి 300నుంచి 200 మంది ఉద్యోగులే ఉన్నారు. ఇక్కడ భర్తీ చేసే ఉద్యోగాలు మాత్రం 30వేల వరకు ఉంటాయి.’’ అని వివరించారు.

పబ్లిక్ సర్వీస్ కమిషన్
ఫొటో క్యాప్షన్, గ్రూప్స్ పరీక్షలకు సన్నద్ధం అవుతున్న లక్ష్మీ ప్రసన్న

నిరుద్యోగ యువత ఏం కోరుకుంటోంది..?

గ్రూప్స్ సహా వివిధ పరీక్షలలో కొన్ని మార్పులు చేయాలని నిరుద్యోగ యువత కోరుకుంటోంది.

కొందరు యువతీయువకులతో బీబీసీ మాట్లాడింది. ఈ సందర్భంగా వారు వ్యక్తం చేసిన అ‌భిప్రాయాలు ఇలా ఉన్నాయి.

  • డిజిటల్ వ్యాల్యుయేషన్ కాకుండా మ్యానువల్ వ్యాల్యుయేషన్ చేయాలి.
  • ఓఎంఆర్ షీటుపై సంతకంతోపాటు బయోమెట్రిక్ అటెండెన్స్ తీసుకోవాలి.
  • ప్రతి పరీక్ష హాలులో గోడ గడియారాలు అమర్చాలి.
  • క్వశ్చన్ పేపర్లో ఎలాంటి అనువాద తప్పులు ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
  • పరీక్ష అయిన వెంటనే కార్బన్ ప్రింట్ తీసుకునే వీలుండాలి.
  • ఓఎంఆర్ షీటుపై పేపర్ కోడ్ అంకెలతో కాకుండా ఏ, బీ, సీ, డీ తరహాలో ఉండాలి.

‘‘గ్రూప్ పరీక్షలన్నీ ఒకేసారి కాకుండా ఒకదాని తర్వాత ఒకటి నిర్వహించాలి. దీనివల్ల సెలెక్టెడ్ అ‌‍భ్యర్థులు తర్వాత పరీక్షకు డ్రాప్ అవుతారు. పరీక్ష ముగిసిన వారం రోజుల్లో ‘కీ’ ఇవ్వాలి. అలాగే 45 రోజుల్లో ఫలితాలను ప్రకటించాలి. అప్పుడే వేరొక పరీక్షపై ధ్యాస పెట్టే వీలుంటుంది’’ అని గ్రూప్స్‌కు సన్నద్ధం అవుతున్న లక్ష్మీ ప్రసన్న, నవ్యలు అన్నారు.

కోర్టు కేసుల విషయంలో వీలైనంత త్వరగా పరిష్కరించేలా ఏపీపీఎస్సీ లేదా టీఎస్పీఎస్సీ చొరవ తీసుకోవాలన్నారు.

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్
ఫొటో క్యాప్షన్, ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీలలో మార్పులు అవసరమని గ్రూప్స్‌కు సన్నద్ధం అవుతున్న నవ్య అన్నారు.

పరీక్ష క్యాలెండర్ లేకపోవడమే సమస్యా?

ఏటా నిర్వహించే పరీక్షలు, ఉద్యోగాలతో కూడిన క్యాలెండర్‌ను విడుదల చేయాలి.

ఈ తరహా ఏర్పాట్లు తెలుగు రాష్ట్రాలలో కనిపించడం లేదు.

ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి రావడానికి ముందు ఏటా జాబ్ క్యాలెండర్ ఇస్తామని ప్రకటించింది వైసీపీ. కానీ, జాబ్ క్యాలెండర్ ఏటా విడుదల చేయలేదని నిరుద్యోగులు చెబుతున్నారు.

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని హామీ ఇచ్చింది. అయితే, నోటిఫికేషన్లు ఇచ్చినప్పటికీ, క్యాలెండర్ మాత్రం రాలేదు.

ఎం.బాలలత మాట్లాడుతూ,‘‘ఉద్యోగాల భర్తీ విషయంలో యూపీఎస్సీ చాలా స్ట్రిక్ట్‌గా ఉంటుంది. ఆయా శాఖల వారీగా ఖాళీలు ముందుగానే యూపీఎస్సీకి చేరుతుంటాయి. రాష్ట్రాల విషయానికి వస్తే ఆర్థిక, జనరల్ అడ్మినిస్ట్రేషన్ కలిసి క్లియర్ చేయాలి. ప్రభుత్వం జీవో విడుదల చేయాలి.. ఇలా చాలా తతంగం ఉంటుంది. ఎన్నిఖాళీలు ఉన్నాయి? ఎన్ని భర్తీ అయ్యాయి? అనే విషయంపై స్పష్టత ఉండదు. అలా కాకుండా ఎప్పటికప్పుడు ఖాళీల సమాచారం సిద్ధం చేసుకుని దానికి తగ్గట్టుగా భర్తీ ప్రక్రియ ఉండాలి’’ అని చెప్పారు బాలలత.

‘‘కేరళలో ఎవరైనా ఉద్యోగి రిటైర్ అవుతుంటే, అదే రోజు కొత్త ఉద్యోగి ఆ స్థానంలో భర్తీ అయ్యేలా వ్యవస్థను రూపొందించారు. అది అన్ని రాష్ట్రాల్లో రావాలి ’’ అని ఘంటా చక్రపాణి అన్నారు.

వీడియో క్యాప్షన్, ఏపీ, తెలంగాణల్లో గ్రూప్ పరీక్షలంటే వాయిదాలు, లీకులేనా...సివిల్స్ నుంచి ఏమీ నేర్చుకోలేమా?

ఇవి కూడా చదవండి:

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)