ఒక పాకిస్తానీ సైనికుడు ఇజ్రాయెల్ యుద్ధ విమానాన్ని ఎలా కూల్చేశారు... ఆ రోజు ఆకాశంలో ఏం జరిగింది?

ఫొటో సోర్స్, PAF
“విమానంలో మిసైల్ చిక్కుకుందా లేక మరేదైనా జరిగిందా? ఇలా నా మదిలో ఎన్ని ఆలోచనలు వచ్చాయో. ఆ ఒక్క సెకను నా జీవితంలో సుదీర్ఘంగా గడిచింది. అప్పుడే మిసైల్ దూసుకుపోయింది. అది ఇజ్రాయెల్ మిరాజ్‌ను ఢీకొనడానికి రెండు-మూడు సెకన్లు పట్టింది. వెంటనే మిరాజ్ పేలడం చూశాను" అని గగనతలంలో తనకు ఎదురైన అనుభవాన్ని సత్తార్ అల్వీ చెప్పారు.
ఈ సంఘటన 50 ఏళ్ల క్రితం అంటే 1974 ఏప్రిల్ 26న జరిగింది.
పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ పైలట్, ఫ్లైట్ లెఫ్టినెంట్ సత్తార్ అల్వీ సిరియన్ ఎయిర్ ఫోర్స్ ఫైటర్ విమానం మిగ్‌తో ఇజ్రాయెల్ 'మిరాజ్' విమానాన్ని కూల్చివేశారు.
పాకిస్తాన్ వైమానిక దళ పైలట్లు మరొక దేశం తరపున ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా పనిచేస్తున్నందున ఈ సంఘటనను పాకిస్తాన్ దౌత్యపరంగా ధ్రువీకరించడం లేదు.
ఇంతకీ పాక్ పైలట్లు సిరియాకు ఎందుకు వెళ్లారు? ఆ ఘటనను ఎందుకు కథలు, కథలుగా చెప్పుకొంటారు? అక్కడ ఏం జరిగింది?

ఫొటో సోర్స్, PAF
యుద్ధంలోకి ఎలా వెళ్లారు?
1973 అక్టోబర్‌లో అరబ్-ఇజ్రాయెల్ మధ్య యుద్ధం ప్రారంభమైనప్పుడు, యువ పైలట్ సత్తార్ అల్వీ రసల్‌పూర్‌లో శిక్షణ తీసుకుంటున్నారు.
శిక్షణ పొందుతున్న పైలట్లు తరచుగా సాయంత్రాలలో అరబ్-ఇజ్రాయెల్ యుద్ధం గురించి మాట్లాడుకునేవారు. ఒకరోజు అలాంటి సంభాషణే జరిగింది. అది కూడా సిరియాలోకి వెళ్లడానికి ఆహ్వానం అందింది.
సత్తార్ అల్వీ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ "మేం ఫైటర్ పైలట్లం, కాబట్టి స్వచ్ఛందంగా వెళ్లాలని సూచించారు. మీరు నిజంగా వెళ్లి పోరాడతారా? అని ఒకరడిగారు. నేను, అవునన్నాను. నా రూమ్‌మేట్ నేను కూడా వస్తా అన్నాడు'' అని తెలిపారు.
"అకాడమీ కమాండెంట్ ఇంటికి వెళ్లే సరికి అర్ధరాత్రి అయ్యింది. మీరు 'బార్' నుంచి వస్తున్నారా? అని కమాండెంట్ మమ్మల్ని అడిగారు. లేదని చెప్పాం. ఉదయం ఆఫీసుకు రమ్మన్నారు. మరుసటి రోజు కమాండెంట్ కార్యాలయంలో సిరియాకు వెళ్లడానికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన పాకిస్తానీ పైలట్లు మరోసారి తమ ప్రతిపాదనపై సీరియస్‌గా ఉన్నారా? అని ఆయన ప్రశ్నించారు" అని సత్తార్ అల్వీ గుర్తుచేసుకున్నారు.
"మేము కచ్చితంగా ఉన్నామని చెప్పాం. వారు మమ్మల్ని 10 నిమిషాలు వేచి ఉండమని అడిగారు, ఆపై పెషావర్ చేరుకోమని చెప్పారు, అక్కడ నుంచి విమానం మిమ్మల్ని తీసుకెళుతుందన్నారు" అని చెప్పారు.
"భుట్టోతో వైమానిక దళాధిపతి మాట్లాడినట్లు మాకు తర్వాత తెలిసింది. సిరియా అధ్యక్షుడు హఫీజ్ అల్-అస్సాద్, భుట్టోల మధ్య సంప్రదింపులు జరిగాయి" అని సత్తార్ అన్నారు.
"సల్వార్-కమీజ్, ఫ్లయింగ్ గేర్‌ని తీసుకొని పెషావర్ చేరుకున్నా. ఈ మిషన్‌లో నాతో పాటు స్వచ్ఛందంగా వచ్చిన మరో పద్నాలుగు మందిని చేర్చుకున్నారు. మమ్మల్ని చీఫ్ ఫోకర్ విమానంలో ఉంచారు. కొంత సమయం తరువాత చీఫ్ కూడా వచ్చారు. అయితే, మేం ఎక్కడికి వెళ్తున్నామో మాకు తెలియదు" అని సత్తార్ గుర్తు చేసుకున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
'ప్రభుత్వం బాధ్యత వహించదు'
ఈ సమయంలో జరిగిన మరో ముఖ్యమైన విషయం ఏంటంటే.. పాకిస్తానీ పైలట్‌లకు ఓ కాగితం ఇచ్చి సంతకం చేయమని అడిగారు.
"మేము పాకిస్తాన్ బయటికి సెలవుపై వెళుతున్నామని ఆ కాగితంపై రాసి ఉంది. ఒకవేళ ఏదైనా అవాంఛనీయ సంఘటన జరిగితే ప్రభుత్వం లేదా పాకిస్తాన్ వైమానిక దళం మాకు బాధ్యత వహించదు. మమ్మల్ని గుర్తించడానికి నిరాకరిస్తాయి" అని సత్తార్ అన్నారు.
మొత్తం 16 మంది పాకిస్థానీ పైలట్లను మొదట కరాచీకి, ఆపై 'సీ 130' విమానంలో బాగ్దాద్‌కు తీసుకెళ్లారు. బాగ్దాద్ నుంచి జోర్డాన్, తరువాత రోడ్డు మార్గంలో డమాస్కస్ చేరుకున్నారు.
వీరిలో ఎనిమిది మందిని ఈజిప్ట్‌కు పంపగా, మరో ఎనిమిది మందిని సిరియాలో ఉండాలని సూచించారు. సిరియాలో ఉండిపోయిన ఎనిమిది మంది పైలట్లలో సత్తార్ అల్వీ ఒకరు.
సత్తార్ అల్వీ, ఇతర పైలట్‌లను డమాస్కస్ నుంచి 30 నిమిషాల ప్రయాణం పట్టే దూరంలో ఉన్న డామిర్ ఎయిర్ బేస్‌కు తరలించారు, అక్కడ వారిని '67ఏ' పేరుతో నియమించారు.
అప్పగించిన బాధ్యతేంటి?
సిరియా వెళ్లిన పాకిస్థానీ పైలట్‌లకు భాష సమస్య వచ్చింది. సిరియా వైమానిక దళానికి చెందిన మిగ్-21 విమానాలపై రష్యన్ భాష రాసి ఉందని, రాడార్, ఏటీసీలో అరబిక్ భాషలో మాట్లాడుతున్నారని సత్తార్ అల్వీ గుర్తుచేసుకున్నారు.
"విమానం నడపడానికి తెలుసుకోవలసిన ముఖ్యమైన విషయాలను కాగితంపై రాసి, మా ఫ్లయింగ్ సూట్‌లలో దాచుకున్నాం. దీంతో మాకు భాష సమస్య రాలేదు. వారంలో అరబిక్ నేర్చుకున్నాం" అని అన్నారు.
పాకిస్థానీ పైలట్లకు ఎయిర్ డిఫెన్స్ బాధ్యతను కేటాయించారు. అంటే సిరియా గగనతలంలోకి ఏదైనా ఇజ్రాయెల్ విమానం ప్రవేశిస్తే, దానిని నిలువరించడం పాక్ పైలట్ల పని.
అదే సమయంలో ఇజ్రాయెల్‌తో ఈజిప్ట్ కాల్పుల విరమణకు అంగీకరించింది, అయితే గోలన్ హైట్స్‌లో మాత్రం సిరియా, ఇజ్రాయెల్ దేశాల మధ్య యుద్ధం కొనసాగింది.
"మేం ప్రతిరోజూ ఉదయం ఎయిర్ బేస్ వద్ద వేచి ఉంటాం. ఇలా ఏడు నెలల పాటు ఉన్నాం" అని సత్తార్ అల్వీ గుర్తుచేసుకున్నారు.
ఈ సమయంలో పాకిస్తానీ పైలట్‌లను చాలాసార్లు గగన తలంలోకి పంపారు, ఇజ్రాయెల్ విమానాల సమీపానికి చేరుకున్నారు. కానీ షూట్ చేయలేదు.

ఫొటో సోర్స్, PAF
'షాబాజ్ 8' వర్సెస్ ఇజ్రాయెలీ మిరాజ్
"ఇజ్రాయెల్ విమానాన్ని కూల్చివేసినా, లేకున్నా, పాకిస్తానీ పైలట్ మాత్రం ఇజ్రాయెల్ చేతిలో పడకూడదని పాకిస్తాన్ పైలట్లం అనుకున్నాం'' అని సత్తార్ అన్నారు.
దీన్ని దృష్టిలో ఉంచుకునే మా వ్యూహం రూపొందించుకున్నామని ఆయన తెలిపారు.
1974 ఏప్రిల్ 26న మధ్యాహ్నం 3:30 గంటలకు పాకిస్తాన్ పైలట్‌లకు సాధారణ రక్షణ మిషన్ కేటాయించారు.
"మేం మిషన్‌ను పూర్తి చేసి స్థావరానికి తిరిగి వస్తున్నప్పుడు, అకస్మాత్తుగా ఇజ్రాయెల్ విమానం ఉనికి గురించి రాడార్ తెలియజేసింది" అని సత్తార్ తెలిపారు.
ఆ సమయానికే సత్తార్ అల్వీతో సహా పాకిస్తాన్ పైలట్ల విమానంలో చాలా ఇంధనం వాడేశారు. 'షాబాజ్ 8' ఫార్మేషన్‌లో ఎనిమిది మంది పాకిస్తానీ పైలట్లు బయలుదేరారు, అందులో సత్తార్ వెనక విమానంలో ఉన్నారు. రాడార్ జామ్ కారణంగా పైలట్ల కమ్యూనికేషన్‌కు ఇబ్బంది తలెత్తింది.
రాడార్‌తో కమ్యునికేషన్ కోల్పోయే ముందు ఫార్మేషన్ కమాండర్స్ ప్రతి ఒక్కరూ ఇజ్రాయెల్ విమానాలు వస్తున్న దిశను చూడాలని పైలట్లకు చెప్పారు.
అది లెబనాన్ గగనతల సరిహద్దు, ఆ సమయంలో సత్తార్ అల్వీ భూమి వైపు మెరుస్తున్న ఒక వస్తువును చూశారు.
అది ఇజ్రాయెల్ మిరాజ్ యుద్ధ విమానం. ఆ సమయంలోనే సత్తార్ అల్వీ గ్రూపు ఫార్మేషన్ నుంచి విడిపోయి ఆ విమానం వైపు దూసుకెళ్లారు.
ఇంధనం అయిపోతుండటంతో.
"ఆ విమానం నన్ను దాటిపోయింది, కానీ నా కళ్ళు దాని వెనుక ఉన్న మరొక మిరాజ్ యుద్ధ విమానంపై పడ్డాయి" అని సత్తార్ గుర్తుచేసుకున్నారు.
"ఈ రెండో విమానం నన్ను దాటి వెళుతుండగా నేను అటు వైపునకు వెళ్లడానికి ఒక టెక్నిక్ ఉపయోగించా. మేము 'కత్తెర' అని పిలిచే అదే టెక్నిక్‌ను శత్రు విమానం కూడా ఉపయోగించింది. అంటే రెండు విమానాలు ముందు, వెనుక ఉంటాయి. తర్వాత కుడి, ఎడమ వైపునకు వెళతాయి, అనంతరం అవి శత్రువు వెనుకకు చేరుకుంటాయి, శత్రువును లక్ష్యంగా చేసుకుంటాయి" అని తెలిపారు.
సత్తార్ అల్వీ చెప్పిన దాని ప్రకారం, ఆయన తన విమానాన్ని సున్నా వేగంతో గాలిలో ఒక క్షణం ఆపివేశారు, దీంతో ఇజ్రాయెల్ మిరాజ్ అతనికి ఎదురుగా వచ్చింది. అప్పుడే సత్తార్ అల్వీకి ఓ సమస్య ఎదురైంది.
"విమానం చాలా దగ్గరగా ఉంది, నేను వెంటనే కాల్పులు జరిపినట్లయితే, దాని శిథిలాలు నా విమానంపై పడేవి. దూరం వెళ్లడానికి నేను కొంచెం వేచి ఉండాల్సి వచ్చింది" అని సత్తార్ అన్నారు.
సత్తార్ ప్రకారం.. కానీ సమయం తక్కువగా ఉంది. ఎందుకంటే ఇజ్రాయెల్ యుద్ధ విమానం ఆయన వైపు దూసుకొస్తోంది, సత్తార్ విమానంలో ఇంధనం కూడా అయిపోతోంది, అందుకే వెంటనే నిర్ణయం తీసుకోవాలి.
ఇజ్రాయెల్ యుద్ధ విమాన పైలట్ కెప్టెన్ లిట్జ్, సత్తార్ విమానాన్ని గమనించి, కింద నుంచి వెళ్లడానికి ప్రయత్నించారు.
అయితే, ఈ ప్రయత్నం లిట్జ్ విమానాన్ని షూట్ చేయడానికి అవసరమైన దూరాన్ని(సేఫ్ డిస్టెన్స్) సత్తార్ అల్వీకి కల్పించింది. సత్తార్ అల్వీ కాల్పులు జరపడానికి రష్యన్ మిసైల్‌ను ఎంచుకుని, బటన్‌ను నొక్కారు. కానీ అది పేలలేదు.
‘‘మిసైల్ అందులో చిక్కుకుపోయిందా లేక మరేమైనా జరిగిందా అని నా మనసులో ఆ క్షణంలో ఎన్ని సందేహాలు పుట్టుకొచ్చాయో చెప్పలేను’’ అని సత్తార్ అల్వీ అన్నారు.
నిజానికి బటన్ నొక్కిన ఒక్క క్షణంలోనే మిసైల్ దూసుకుపోవాల్సి ఉంది. సత్తార్ అల్వీకి ఆ ఒక్క సెకను తన జీవితంలో అతి సుదీర్ఘంగా గడిచినట్లనిపించింది.
"ఇజ్రాయెలీ మిరాజ్‌ను మిసైల్ తాకడానికి రెండు, మూడు సెకండ్ల సమయం పట్టింది. అనంతరం పెద్ద పేలుడు జరిగింది’’ అని సత్తార్ చెప్పారు.
ఈ మొత్తం దాదాపు 30 సెకన్లలో ముగిసింది. ఆ తర్వాత సత్తార్ అల్వీ తన విమానాన్ని సూపర్ సోనిక్ వేగంతో సిరియన్ ఎయిర్ బేస్ వైపు తీసుకెళ్లారు..
సత్తార్ అల్వీ విమానం రన్‌వేపై ల్యాండ్ అయినప్పుడు, ప్యూయల్ మీటర్ సున్నాకు కింద ఉంది.
'నా కాళ్లలో ప్రాణం లేదు'
‘విమానం ఆపి స్విచ్ ఆఫ్ చేయగానే నా కాళ్ల నుంచి ప్రాణం పోయినట్లు అనిపించింది’ అని సత్తార్ అల్వీ చెప్పారు. విమానంలో మిసైల్ కనిపించకుండా పోయిందని అక్కడి సిబ్బంది గమనించారు.
సత్తార్ అల్వీ కాక్‌పిట్ నుంచి బయటకు వచ్చిన వెంటనే ఒక కప్పు టీ అడిగాడు.
ఘర్షణ జరిగిన ప్రదేశం గురించి సత్తార్ అల్వీ సిరియన్ ఆర్మీకి తెలియజేశారు. తరువాత సిరియా సైనికులు హెలికాప్టర్‌లో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడ వారు గాయపడిన ఇజ్రాయెల్ పైలట్ కెప్టెన్ లిట్జ్‌ను అదుపులోకి తీసుకున్నారు.
సత్తార్ అల్వీ ఇజ్రాయెల్ పైలట్‌ని కలవాలనుకున్నారు. కానీ అప్పటికే కెప్టెన్ లిట్జ్ మరణించారు.
సిరియా ప్రభుత్వం సత్తార్ అల్వీని దేశపు అత్యున్నత గౌరవంతో సత్కరించింది. ఇజ్రాయెల్ పైలట్ కెప్టెన్ లిట్జ్ ఫ్లయింగ్ ఓవర్ఆల్స్ (కెప్టెన్ సూట్)ను ఆయనకు బహుమతిగా ఇచ్చారు.
సత్తార్ అల్వీ చెప్పిన దాని ప్రకారం, పాకిస్తాన్ ప్రభుత్వం చాలా సంవత్సరాలపాటు ఈ సంఘటనను అంగీకరించలేదు.
"నేను కూడా మౌనంగా ఉండిపోయా. ఎవరైనా నన్ను అడిగితే, నేను ఎప్పుడూ సిరియాకు వెళ్లలేదని చెబుతాను" అన్నారు సత్తార్ అల్వీ.
తరువాత కొంతకాలానికి సత్తార్ అల్వీకి పాకిస్తాన్ ప్రభుత్వం 'సితారా-ఎ-జురత్' అనే అవార్డును అందించింది.
ఇవి కూడా చదవండి:
- లోక్‌సభ ఎన్నికలు: ఒకనాడు 400కు పైగా స్థానాలలో గెలిచిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు 300 స్థానాలలో మాత్రమే ఎందుకు పోటీ చేస్తోంది?
- 4.7 కోట్ల ఏళ్లనాటి వాసుకి పాము అవశేషాలు వెలుగులోకి.. అసలేంటి ఈ పాము కథ?
- అడాల్ఫ్ హిట్లర్ కోసం ఆ మహిళలు కన్న వేలమంది ‘ఆర్య పుత్రులు’ ఏమయ్యారు?
- హెపటైటిస్: మొత్తం కేసులలో 11 శాతం భారత్‌లోనే.. అసలేమిటీ వ్యాధి, ఎందుకొస్తుంది, చికిత్స లేదా?
- SRH vs DC: ఏంటా కొట్టుడు! భయంతో హెల్మెట్లు పెట్టుకున్న బాల్ బాయ్స్..
బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














