కుళాయి నీళ్లు తాగొచ్చా, ఫిల్టర్ వాటరే తాగాలా...ఎలా తేల్చుకోవాలి?

ఫిల్టర్ నీళ్లు

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, శాండీ ఓంగ్
    • హోదా, బీబీసీ ఫ్యూచర్

మన ఇంట్లో వాడే ఫిల్టర్లు కుళాయి నీటిలోని మలినాలను వడపోయగలవు. అయితే, వీటి అవసరం నిజంగా ఉందా, వీటి వల్ల ఊహించని నష్టం కూడా జరుగుతోందా?

కుళాయి నుంచి నేరుగా నీటిని తాగేందుకు షీమా చిన్-సీ ఇష్టపడరు. కుటుంబంతో తను జీవించే బ్రిటన్ నార్త్‌విక్‌లోని తన ఇంట్లో ఒక ఇన్-డోర్ వాటర్ ఫిల్టర్ ఉంది. బయటకు వెళ్లేటప్పుడు కూడా ఆమె బాటిల్‌తో నీరు తీసుకెళ్తుంటారు.

‘‘ఫిల్టర్ నీళ్ల రుచి బావుంటుంది’’ అని చిన్-సీ చెప్పారు. ‘‘కుళాయి నీటిలోని రసాయనాల వాసన నాకు తెలుస్తుంది. రుచి కూడా నేను కనిపెట్టగలను’’ అని ఆమె చెప్పారు.

ఇలా చెబుతుంటే చాలా మందికి కాస్త విడ్డూరంగా అనిపించొచ్చు. నిజానికి ఆమె భర్త కూడా ఈ విషయంలో ఒక పరీక్ష పెట్టారు. దీనిలో ఫిల్టర్ నీటికి, కుళాయి నీటికి మధ్య తేడాను రుచి చూసి ఆమె స్పష్టంగా చెప్పగలిగారు.

ఇలా ఆలోచించేవారు చిన్-సీ ఒక్కరే కాదు. అమెరికాలో 2,800 మందిపై ఒక పర్యావరణ సంస్థ ఒక అధ్యయనం చేపట్టింది. వీరిలో సగం మంది తమ కుళాయి నీరు సురక్షితం కాదని చెప్పారు. 35 శాతం మంది నీటిని ఫిల్టర్ చేసుకున్నాకే తాగుతామని వెల్లడించారు.

ఇలానే 2023లో బ్రిటన్‌లోని 500 మందిపై స్వీడిష్ ఫిల్టర్ కంపెనీ ట్యాప్‌వాటర్‌ పై ఒక అధ్యయనం చేపట్టింది. ఇందులో 42 శాతం మంది కుళాయి నీటిని నమ్మబోమని లేదా ఆ రుచి తమకు నచ్చదని చెప్పారు. వీరిలో 25 శాతం మంది తమ కుళాయి నీరు పరిశుభ్రంగా ఉండదని, వీటిలో మలినాలు, రసాయినాలు, బ్యాక్టీరియా ఉంటాయన్న భయం ఉందని చెప్పారు. మొత్తంగా లండన్‌లో జీవించే వీరిలో 54 శాతం కంటే ఎక్కువ మందే ఫిల్టర్‌ను ఉపయోగిస్తున్నామని వెల్లడించారు.

ప్రస్తుతం ఉత్తర అమెరికా, యూరప్, చైనాలలో వాటర్ ఫిల్టర్‌ల హవా నడుస్తోంది. 2022లో ప్రపంచ నీటి శుద్ధి మార్కెట్ విలువ 30 బిలియన్ డాలర్లుగా అంచనా. 2030 నాటికి ఇది 7 శాతం వృద్ధి నమోదు చేస్తుందని అంచనాలు ఉన్నాయి.

నీటిని వడపోయడంతో చాలా ప్రయోజనాలు ఉంటాయని, ముఖ్యంగా నీటిలోని సూక్ష్మజీవులు, విషపూరితాలను ఫిల్టర్ చేయొచ్చని వీటిని ఉపయోగించేవారు చెబుతుంటారు.

నీటిలో కాఠిన్యాన్ని (హార్డ్‌నెస్) కూడా తగ్గించొచ్చని, ఫలితంగా రుచి, వాసన కూడా మెరుగవుతాయని వివరిస్తుంటారు. అయితే, కుళాయి నుంచి వచ్చే నీటి కంటే ఫిల్టర్ వాటర్ తాగితే మన ఆరోగ్యం మెరుగ్గా ఉంటుందా?

ఫిల్టర్ వాటర్

ఫొటో సోర్స్, Getty Images

మార్కెట్‌లో ఇలా..

వాటర్‌ను ఫిల్టర్‌ చేయాలని భావించేవారికి మార్కెట్‌లో చాలా రకాలు అందుబాటులో ఉన్నాయి. జగ్గుల ఫిల్టర్‌లు (పిచర్ స్టైల్ ఫిల్టర్లు), ట్యాప్‌లకు అమర్చుకునేవి, బల్లపై పెట్టుకునేవి, రిఫ్రిజిరేటర్ ప్యూరిఫైయర్స్, సింక్ సెటప్స్ ఇలా చాలా రకాలు ఉన్నాయి. వీటి ధర వందల నుంచి వేలు, లక్షల వరకూ ఉంటుంది. ముఖ్యంగా నీటి ఉపయోగాన్ని పర్యవేక్షించే, ప్లంబింగ్ సమస్యలను గుర్తించే వైఫై ఫిల్టర్ల ధర ఇంకొంచెం ఎక్కువ ఉంటుంది.

సాధారణంగా ఫిల్టర్లను రెండు ప్రధాన రకాలుగా వర్గీకరిస్తారని అమెరికాలోని మిషిగన్‌లో స్వతంత్ర సర్టిఫికేషన్ సంస్థ నేషనల్ శానిటేషన్ ఫౌండేషన్ (ఎన్‌ఎస్‌ఎఫ్) ఫిల్టర్ సర్టిఫికేషన్ బాధ్యతలు చూస్తున్న కీల్ పోస్ట్‌మాస్ చెప్పారు. ‘‘వీటిలో మొదటి పాయింట్-ఆఫ్-యూస్ ఫిల్టర్లు. ఇవి మనం తాగేముందు నీటిని వడపోస్తాయి. రెండోది పాయింట్-ఆఫ్-ఎంట్రీ ఫిల్టర్లు. ఇవి ఇంట్లోని నీరు వచ్చే దగ్గరే వడపోస్తాయి’’ అని పోస్ట్‌మాస్ వివరించారు.

తయారుచేసే మెటీరియల్స్‌తోపాటు లోపల పనిచేసే టెక్నాలజీలు (అబ్సార్ప్షన్, అయాన్ ఎక్స్‌చేంజ్, రివర్స్ ఆస్మోసిస్, మెకానికల్ సెపరేషన్) వరకూ కూడా ఫిల్టర్‌లను భిన్న రకాలుగా వర్గీకరిస్తుంటారు.

‘‘ఒక్కో ఫిల్టర్ ఒక్కో లక్ష్యంతో పనిచేస్తుంది’’ అని నార్త్ కరోలినా స్టేట్ యూనివర్సిటీలోని సివిల్, కన్స్‌ట్రక్షన్, ఎన్విరాన్‌మెంటల్ ఇంజినీరింగ్ ప్రొఫెసర్ డెట్లెఫ్ నేప్ చెప్పారు.

ఇక్కడ మొదట మీ నీటిలో ఏముందో తెలుసుకోవాలి. అసలు మీ నీటికి ఫిల్టర్ అవసరమో లేదో గుర్తించాలి. ఆ తర్వాత నీటికి సరిపడా ఫిల్టర్‌ను ఎంచుకోవాలి.

ఫిల్టర్ వాటర్

ఫొటో సోర్స్, Getty Images

ఎలా తెలుస్తుంది?

ప్రపంచంలో మీరు ఏ ప్రాంతంలో జీవిస్తున్నారనే దానినిబట్టీ కూడా ఏ ఫిల్టర్ అవసరం అవుతుందో గుర్తించొచ్చు.

పరిశుభ్రమైన మంచినీటి కోసం ప్రజలు ఇబ్బందిపడే అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఈ.కొలి, లాజియోనెల్లా లాంటి బ్యాక్టీరియాలే ప్రధాన సమస్య అని మిషిగన్ హోప్ కాలేజీలోని గ్లోబల్ వాటర్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ కో-డైరెక్టర్, రసాయన శాస్త్ర ప్రొఫెసర్ బ్రెంట్ క్రూజెర్ చెప్పారు.

కలుషితమైన నీటితో డయేరియా వస్తుంది. నియంత్రించగలిగే ఈ సమస్యతో ఏటా పది లక్షల మంది చనిపోతున్నారు. వీరిలో సగంమంది ఐదేళ్లలోపు చిన్నారులే.

బ్యాక్టీరియాను అడ్డుకోవడంలో వాటర్ ఫిల్టర్లు మెరుగ్గా పనిచేస్తాయని క్రూజెర్ అన్నారు. ఆయన నేతృత్వంలోని పరిశోధకుల బృందం లాటిన్ అమెరికాలో కొన్నిచోట్ల ఈ సమస్యను పరిష్కరించి చూపించింది కూడా.

ఒక పరిశోధనలో భాగంగా డొమినికన్ రిపబ్లిక్‌లోని 16 గ్రామాల్లో వీరు ఫిల్టర్లు ఏర్పాటుచేశారు. దీంతో డయేరియా కేసులు 25.6 శాతం నుంచి 10 శాతానికి తగ్గాయి. ‘‘ఇక్కడ పిల్లలు స్కూలుకు, పెద్దలు పనికి మానేయాల్సిన పరిస్థితులు తగ్గాయి. దీనివల్ల కుటుంబాలు ఆర్థికంగానూ ప్రయోజనం పొందాయి’’ అని క్రూజెర్ వివరించారు.

సాధారణంగా పశ్చిమ దేశాల్లో కుళాయి నీటిపై పక్కా నియంత్రణ ఉంటుంది. అందుకే ఇక్కడి నీటిని సురక్షితమైనదిగానే భావిస్తారు. ఉదాహరణకు అమెరికాను తీసుకుంటే ఇక్కడ నీటిని సరఫరా చేసేవారు కొన్ని ప్రమాణాలను పాటించాల్సి ఉంటుంది. మంచినీటిలో కనిపించే 90పైగా మలినాలను వడపోసిన తర్వాత మాత్రమే ఇక్కడ నీటిని సరఫరా చేయాల్సి ఉంటుంది.

బ్రిటన్‌లోనూ నీటిని చాలాసార్లు వడపోస్తారు. ఆ తర్వాత అల్ట్రావయోలెట్ కాంతితో హానికర సూక్ష్మజీవులు లేకుండా ట్రీట్ చేస్తారు. ఆ తర్వాత క్లోరినేషన్ ఉంటుంది. చివరగా అన్నీ పూర్తయ్యాకే కుళాయిల్లోకి నీటిని వదులుతారు. యేల్ యూనివర్సిటీ ఎన్విరాన్‌మెంటల్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్‌లోని మంచినీటి విభాగంలో బ్రిటన్‌ మొదటి స్థానంలో ఉంది. ఫిన్లాండ్, ఐస్‌లాండ్, నార్వే, స్విట్జర్లాండ్, నెదర్లాండ్స్ కూడా బ్రిటన్‌తోపాటు తొలి స్థానంలోనే ఉన్నాయి.

‘‘ఈ దేశాల్లో మంచి నీటిని సరఫరా చేసేవారు తరచూ పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుంది. ఆ సమాచారాన్ని ప్రజలకు అందుబాటులోనూ ఉంచాలి’’ అని క్రూజెర్ తెలిపారు.

ఫిల్టర్ వాటర్

ఫొటో సోర్స్, Getty Images

అయితే, మున్సిపల్ నీటి వ్యవస్థ పెద్దగా ఉన్నంత మాత్రన, అంతా సవ్యంగా జరుగుతుందని అనుకుంటే పొరపాటేనని క్రూజెర్ చెప్పారు.

కుళాయి నీటిలో సీసం ఇంత కంటే తక్కువే ఉండాలని నిబంధనలు విధించొచ్చు. కానీ, ఇంటివరకూ వచ్చే నీటిలో ఆ స్థాయిలు అంతే ఉండేలా చూడటం చాలాచోట్ల కష్టమే. ముఖ్యంగా పాత ఇళ్లకు మంచి నీటి సరఫరాలో ఇది మరింత కష్టం.

‘‘తుప్పుపట్టిన కుళాయి గొట్టాలే ఇక్కడ ప్రధాన సమస్య. పాత పైపుల నుంచి సీసం నీటిలో కలుస్తుంటుంది’’ అని లండన్‌లో వైద్యురాలిగా పనిచేస్తున్న నిరూస కుమారన్ చెప్పారు. వెల్‌నెస్ సెంటర్ హెచ్‌యూఎం2ఎన్‌లో మెడికల్ డైరెక్టర్‌గానూ ఆమె పనిచేస్తున్నారు.

ఇలాంటి సందర్భాల్లో నీటి నుంచి సీసాన్ని తొలగించడంలో ఫిల్టర్‌లు మెరుగ్గా పనిచేస్తాయి. ముఖ్యంగా నీటిలో ఇతర రసాయనాలు, విష పదార్థాలను తొలగించడంలో ఇక్కడ ఫిల్టర్ల అవసరం ఉంటుందని కుమారన్ అన్నారు. ‘‘హార్మోన్ రిప్లేస్‌మెంట్ థెరపీ, గర్భనిరోధక మాత్రలు, కొన్ని మానసిక వ్యాధులకు ఇచ్చే మాత్రల అవశేషాలు కూడా కొన్నిసార్లు మన ఇంట్లోని నీటిలో కనిపిస్తాయి. మూత్రం ద్వారా ఇవి నీటిలో కలుస్తుంటాయి. ఉదాహరణకు మీరు మందులు వేసుకున్నాక మూత్రం పోస్తే అది నదిలోకి వెళ్తుంది. తర్వాత అదే మళ్లీ అటూఇటూ తిరిగి ఇంటిలోకి వస్తుంది. అప్పుడు దీనిలో ఆ మాత్రల అవశేషాలు కనిపించొచ్చు’’ అని ఆమె చెప్పారు.

ఫిల్టర్ వాటర్

ఫొటో సోర్స్, Getty Images

రసాయనాలను అడ్డుకోవడం ఎలా?

కుళాయి నీటిలో చాలా మందిని కలవరపెడుతున్న రసాయనాల్లో పీఎఫ్‌ఏఎస్‌లు ప్రధానమైనవి. వీటి పూర్తి పేరు పాలీఫ్లోరోఆల్కైల్. మనుషులు తయారుచేసే వీటినే ఫరెవర్ కెమికల్స్ అని కూడా పిలుస్తుంటారు. ఎందుకంటే ఇవీ పర్యావరణంలో ఎప్పటికీ అలానే ఉండిపోతుంటాయి. క్యాన్సర్, కాలేయ రుగ్మతలు, సంతాన సమస్యలు ఇలా సమస్యలతో పీఎఫ్ఏఎస్‌లకు సంబంధముందని పరిశోధనలు చెబుతున్నాయి.

‘‘ఈ రసాయనాలు తక్కువ స్థాయిలో ఉన్నప్పటికీ ప్రమాదమే. ఎందుకంటే ఇవి మన శరీరంలో పేరుకుంటాయి. ప్రస్తుతం ప్రపంచంలోని దాదాపు అన్నీచోట్లా నీటిలో పీఎఫ్‌ఏఎస్ కనిపిస్తున్నాయి’’ అని నేప్ చెప్పారు.

2023లో ఇంగ్లాండ్‌లో 18 నీటి కంపెనీలు తీసుకున్న నీటి శాంపిల్స్‌లో 17 చోట్ల ఏదోఒక పీఎఫ్ఏఎస్ రసాయనం ఉన్నట్లు తేలింది. అమెరికాలో 45 శాతం కుళాయి నీటి నమూనాల్లో ఈ రసాయనం ఉన్నట్లు తేలింది. అక్కడ ప్రతి పది మందిలో ఆరుగురు ఈ రసాయనాల పాలిట పడుతున్నారు.

అయితే, ఈ రసాయనాలను అడ్డుకోవడంలో ఫిల్టర్లు మెరుగ్గా పనిచేస్తాయి. 2020లో ప్రచురించిన ఒక రీసెర్చ్ పేపర్‌లో నేప్, ఆయనతో పనిచేస్తున్న బృందం సింక్‌ల కింద ఏర్పాటుచేసే రివర్స్ ఆస్మోసిస్, టు-స్టేజీ ఫిల్టర్లు ఈ సమస్యను పరిష్కరించగలవని పేర్కొంది.

సాధారణంగా మూడు దశల్లో పనిచేసే ఫిల్టర్‌ను తీసుకోవాలని పోస్ట్‌మాస్ సూచిస్తున్నారు. ‘యాక్టివేటెడ్ కార్బన్, అయాన్ ఎక్స్‌చేంజ్, రివర్స్ ఆస్మోసిస్’ల ఫిల్టర్‌లు తీసుకోవాలని చెబుతున్నారు.

ఫిల్టర్ వాటర్

ఫొటో సోర్స్, Getty Images

ముందు తెలుసుకోండి..

హానికర రసాయనాలను తొలగించడంలో ఫిల్టర్‌లు సాయం చేస్తూ ఉండొచ్చు. అయితే, అదే సమయంలో కొన్ని మేలు చేసే మినరల్స్‌ను కూడా ఇవి వడపోసేస్తుంటాయి. మెగ్నీషియం, కాల్షియంతోపాటు ఐరన్, మాంగనీస్‌లను కూడా ఇవి వేరుచేస్తుంటాయి. అదే సమయంలో దంతాల సమస్యను పరిష్కరించేందుకు మున్సిపాలిటీలు కలిపే ఫ్లోరైడ్‌ను కూడా ఫిల్టర్లు వడపోస్తుంటాయి.

మెరుగ్గా పనిచేస్తాయని నేప్ చెప్పే రివర్స్ ఆస్మోసిస్ ఫిల్టర్లు అయితే, దాదాపు అన్నీంటిని వడపోసేస్తుంటాయి. కొన్నిసార్లు ఈ ప్రక్రియ తర్వాత కొందరు మళ్లీ మినరల్స్‌ను కలుపుతుంటారు.

కొంతమంది ఫిల్టర్ నీటిలో కొంచెం ఉప్పు కూడా కలుపుతుంటారు. అయితే, ఇది పోయిన మినరల్స్‌ను తీసుకురాగలదని చెప్పే ఆధారలేమీ లేవు.

అయితే, ఈ కీలకమైన మినరల్స్‌ను మీరు ఆహారంలో భాగంగా తీసుకోవాల్సి ఉంటుందని కుమారన్ చెప్పారు. ‘‘మనకు అవసరమైన మినరల్స్ అన్నింటి కోసం కేవలం నీటిపైనే ఆధారపడకూడదు’’ అని ఆమె అన్నారు.

ఇక్కడ మరో సమస్య ఏమిటంటే, కొన్నిసార్లు ఈ ఫిల్టర్లు మేలు కంటే కీడే ఎక్కువ చేస్తుంటాయి. ముఖ్యంగా క్యాట్రిడ్జ్‌లను తరచూ మార్చనప్పుడు ఇలా జరుగుతుంటుంది.

స్పాంజ్‌లాంటి యాక్టివేటెడ్ కార్బన్ ఫిల్టర్లయితే ప్రమాదకర బ్యాక్టీరియాకు ఆవాసాలుగా మారతాయి. వీటిపై సింగపూర్‌లో ఒక అధ్యయనంలో నిర్వహించారు. దీనిలో కుళాయి నీటిని ఫిల్టర్ నీటితో సరిపోల్చారు. ఇక్కడ కుళాయి నీటిలో బ్యాక్టీరియా కౌంట్ 500 లోపలే ఉంది. ఇది సురక్షితమైన స్థాయే. అయితే, ఫిల్టర్ నీటి శాంపిల్స్‌లోని 60 శాతంలో ఈ స్థాయిలు 9,000 నుంచి 25,400 వరకూ ఉన్నాయి. ముఖ్యంగా నెల రోజులు వాడిన ఫిల్టర్‌లో ఈ స్థాయిలు ఎక్కువగా కనిపించాయి.

మరొక అధ్యయనంలో సింక్ కింద ఫిల్టర్లలోనూ బ్యాక్టీరియా స్థాయిలు ఎక్కువగా ఉంటున్నట్లు తేలింది. అందుకే ఇలాంటి ఫిల్టర్లలో నీటిని తీసుకునే ముందు పది సెకన్ల పాటు లోపలున్న నీటిని మొత్తం బయటకు పంపేయాలని, ఆ తర్వాతే వచ్చిన మంచినీటిని తాగాలని నిపుణులు సూచిస్తున్నారు.

‘‘మీరు ఫిల్టర్‌ను సరిగా చూసుకోకపోతే, అసలు దాని నుంచి ఎలాంటి ప్రయోజనాలను పొందలేరు. కొన్నిసార్లు కుళాయి నీళ్ల కంటే హానికరమైన నీటిని మీరు తాగుతున్నట్లే’’ అని నేప్ చెప్పారు.

వీడియో క్యాప్షన్, ప్రాణాలకు తెగించి 70 అడుగుల నూతిలోకి దిగుతున్న మహిళలు

అన్నింటికంటే ముఖ్యం అదే..

చివరగా, వాటర్ ఫిల్టర్‌ను ఉపయోగించాలా వద్దా అనేది మీ ప్రాంతంలో అందుబాటులో ఉంటే నీటి రకంతోపాటు ఆ నీటిలో ఏం ఉన్నాయో అర్థం చేసుకొని నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.

‘‘మీరు కొంచెం హోంవర్క్ చేస్తే, మీ ఇంట్లో తాగు నీటి నాణ్యత ఎలా ఉందో ఇట్టే తెలుసుకోవచ్చు’’ అని క్రూజెర్ అన్నారు. సాధారణంగా నీటిని సరఫరా చేసే కంపెనీలు చాలా ప్రాంతాల్లో ఈ విషయాన్ని ప్రజలకు వెల్లడించాల్సి ఉంటుంది. ఆ వివరాలను పరిశీలించినా నీటి గురించి మనం తెలుసుకోవచ్చు. ‘‘మీకు ఇంకా భయంగా ఉంటే మీరే నీటి పరీక్షల నిపుణులను నియమించుకోవచ్చు’’ అని ఆయన అన్నారు.

మీ కుళాయి నీరులో కలుషితాలు ఉన్నాయని మీరు భావిస్తే, వెంటనే మీ ఇంటికి సరిపడే మంచి ఫిల్టర్‌ను కొనుగోలు చేసుకోవాలి. అయితే, ప్రతి ఒక్కరికీ సరిపోయే ఫిల్టర్ ఏదో చెప్పడం కష్టమని, సర్టిఫైడ్ ఫిల్టర్‌లు తీసుకోవడమే దీనికి మార్గమని పోస్ట్‌మాస్ సూచించారు. ‘‘సర్టిఫైడ్ ఫిల్టర్ అయితే, అది సమర్థంగా పనిచేస్తుందని మీకు భరోసా ఉంటుంది’’ అని ఆయన అన్నారు.

అయితే, మీరు ఫిల్టర్ నీరు తాగుతున్నారా, లేదా? అనే విషయం కంటే శరీరంలో నీటి స్థాయిలు పడిపోకుండా చూసుకోవడం అనేది చాలా ముఖ్యమని కుమారన్ అన్నారు. ‘‘నా దగ్గరకు వచ్చే చాలా మంది డీహైడ్రేషన్ సమస్యతో బాధపడుతుంటారు. అందుకే తగిన స్థాయిలో నీటిని తీసుకోవడం ముఖ్యం’’ అని ఆమె చెప్పారు.

వీడియో క్యాప్షన్, అధికారులు మాటలు చెప్తున్నారు, తప్ప పనులు చేయడంలేదని వాపోతున్న గ్రామస్థులు

ఇవి కూడా చదవండి:

( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)