ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీల తయారీకి కావాల్సిన ఈ మెటల్ కోసం సముద్రగర్భంలో వేట... పోటీలో భారత్

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, నవీన్ సింగ్ ఖడ్కా
- హోదా, బీబీసీ వరల్డ్ సర్వీస్
సముద్ర గర్భంలో ఖనిజాల అన్వేషణపై భారత్ దృష్టి సారించింది.
పర్యావరణ హిత భవిత కోసం ఈ ఖనిజాలను వెలికి తీయడం భారత్‌కు కీలకంగా మారింది.
హిందూ మహాసముద్రంలో అన్వేషణ సాగించడానికి ఇప్పటికే భారత్ వద్ద రెండు డీప్ సీ ఎక్స్‌ప్లోరేషన్ లైన్సెన్సులు ఉన్నాయి.
ఎంతో కీలకమైన ఈ సముద్ర ఖనిజాల కోసం ప్రపంచవ్యాప్తంగా శక్తిమంతమైన దేశాలు పోటీ పడుతున్న వేళ ఈ రేసులోకి భారత్ కూడా చేరింది.
సముద్ర గర్భంలో వేలాదిమీటర్ల దిగువన పెద్ద ఎత్తున ఉన్న కోబాల్ట్, నికెల్, కాపర్, మాంగనీస్ తదితర ఖనిజాలను దక్కించుకునేందుకు చైనా, రష్యాలతోపాటు భారత్ కూడా పోటీ పడుతోంది.
వాతావరణ కాలుష్యాన్ని ఎదుర్కోవడంలో ప్రత్యామ్నాయంగా భావిస్తున్న సౌర, వాయు విద్యుత్, ఎలక్ట్రికల్ వాహనాలు, బ్యాటరీ టెక్నాలజీలో ఈ ఖనిజాల పాత్ర కీలకం.
సముద్రంలో ఖనిజాల వెలికితీతకు సంబంధించి ఐక్యరాజ్య సమితికి చెందిన అంతర్జాతీయ సీబెడ్ అథార్టీ (ఐఎస్ఏ) 31 ఎక్స్‌ప్లోరేషన్ లైసెన్సులు మంజూరు చేసింది. వీటిల్లో 30 లైసెన్సులు క్రియాశీలకంగా ఉన్నాయి.
ఈ వారంలో మైనింగ్ లైసెన్సు విధి విధానాలు చర్చించేందుకు దీనికి సంబంధించిన సభ్య దేశాలు జమైకాలో సమావేశమవుతున్నాయి.
భారత్ చేసుకున్న కొత్త దరఖాస్తులను ఐఎస్ఏ ఆమోదిస్తే, భారత్ కు సముద్ర ఖనిజాల అన్వేషణకు ఉన్న లైసెన్సులు రష్యాతో సమానంగానూ, చైనా కంటే ఒకటి తక్కువగానూ ఉన్నట్టవుతుంది.
హిందూ మహాసముద్రం మధ్య భాగంలో కాపర్, జింక్, బంగారం, వెండి తదితర నిల్వలు ఉండే హైడ్రోథెర్మల్ వెంట్స్ సమీపంలోని చిమ్నీ తరహా దిబ్బలను, పాలిమెటాలిక్ సల్ఫైడ్స్‌ను తవ్వేందుకు భారత్ తన దరఖాస్తులో అనుమతి కోరింది.
దీనికి సంబంధించి ఐఎస్ఏ న్యాయ, సాంకేతిక కమిషన్ కొన్ని కామెంట్స్, ప్రశ్నలతో కూడిన జాబితాను భారత ప్రభుత్వానికి పంపినట్టు బీబీసీ పరిశీలించిన ఓ డాక్యుమెంట్ ద్వారా తెలిసింది.
అలాగే సెంట్రల్ ఇండియన్ ఓషన్‌లోని అఫాన్సీ నికిటిన్ వద్ద ఉన్న కోబాల్ట్, ఫెర్రోమాంగనీస్ నిల్వలను వెలికితీసేందుకు భారత్ మరో దరఖాస్తు చేసుకుంది.
అయితే ఈ ప్రాంతాన్ని ఇప్పటికే ఓ దేశం కోరుకుందని, దీనిపై భారత్ ప్రతి స్పందనను కూడా అడిగినట్టుగా ఐఎస్ఏ గుర్తించింది.
ఈ దరఖాస్తులకు ఆమోదం లభిస్తుందా లేదా అనే విషయాన్ని పక్కన పెడితే , సముద్రపు అడుగున ఉన్న కీలకమైన ఖనిజాల వెలికితీత రేసులో వెనకపడిపోకూడదని భారత్ నిర్ణయించుకున్నట్టుగా స్పష్టమవుతోంది.
‘‘హిందూ మహాసముద్రంలో పెద్ద ఎత్తున విస్తరించిన అద్భుతమైన ఖనిజ నిల్వలు సముద్రపు అగాథాలను తవ్వితీసేందుకు భారత్‌ను పురిగొల్పుతున్నాయి’’ అని అమెరికా కేంద్రంగా పనిచేసే జియో పొలిటికల్ అండ్ సప్లై చైన్ ఇంటెలిజెన్స్ ప్రొవైడర్ అయిన హారిజన్ అడ్వైజర్ సహ వ్యవస్థాపకుడు నాథన్ పికార్సిక్ చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
చైనాకు దీటుగా
హిందూ మహాసముద్రంలోని పర్వత ప్రాంతాల వద్ద పాలిమెటాలిక్ సల్ఫైడ్స్ ను వెలికి తీసేందుకు ఇప్పటికే ఇండియా, చైనా, జర్మనీ, సౌత్ కొరియా వద్ద లైసెన్సులు ఉన్నాయి.
భారత్‌కు చెందిన నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ హిందూ మహాసముద్రంలో 5.270 మీటర్ల లోతున ఖనిజాలను వెలికితీసే యంత్రాల సామర్థ్యాన్ని 2022లో పరీక్షించింది. ఈ సందర్భంగా కొన్ని పాలిమెటాలిక్ నాడ్యూల్స్ (బంగాళదుంప ఆకారంలో సముద్రపు అడుగున లభించే శిలలు. వీటిల్లో నాణ్యమైన మాంగనీస్, కోబాల్ట్, నికెల్, కాపర్ ఉంటాయి) ను సేకరించింది.
సముద్రపు లోతుల్లో ఖనిజాల వెలికితీపై భారత్ ప్రణాళికకు సంబంధించి బీబీసీ అడిగిన ప్రశ్నలకు భూవిజ్ఞాన మంత్రిత్వశాఖ స్పందించలేదు.
‘‘భారత్ అంతిమంగా తన సొంత హక్కుల విషయంలో ఎంత శక్తిమంతంగా ఉన్నదో చాటిచెప్పాలని భావిస్తున్నట్టుంది. అలాగే లోతైన సముద్ర జలాల్లో ఖనిజాన్వేషణలో చైనాకంటే తాము వెనుకబడి లేమని చెప్పేందుకు ప్రయత్నిస్తునట్టు కనిపిస్తోంది’’ అని జర్మనీలోని పాట్స్‌డమ్‌లో గల రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సస్టెయినబులిటీ లో సముద్రాల నిర్వహణపై పనిచేసిన ప్రదీప్ సింగ్ చెప్పారు.
అమెరికా దూరం

ఫొటో సోర్స్, GETTY IMAGES
అంతర్జాతీయ జలాల్లో ఖనిజాన్వేషణ రేసులో అమెరికా పాల్గొనడం లేదు. ఐక్యరాజ్య సమితి కన్వెన్షన్ సముద్ర చట్టాన్ని అమెరికా ఆమోదించలేదు. ఈ చట్టమే ఐఎస్ఏ ఏర్పాటుకు దారితీసింది. అయితే ఖనిజాన్వేషణ రేసులో లేనప్పటికీ దీనికి బదులుగా అమెరికా తన దేశీయ జలాల నుంచి ఖనిజాలు సేకరించడం, అలాగే తన మిత్రదేశాలు అంతర్జాతీయ జలాల నుంచి వెలికితీసిన ఖనిజాలను శుద్ధి చేయడమనే పని పెట్టుకుంది.
సముద్రపు లోతుల్లో ఖనిజాల వెలికితీతను సమర్థించేవారు భూమిపై ఖనిజాల తవ్వకం గరిష్ఠస్థాయికి చేరుకుందని చెబుతున్నారు. దీనివల్ల నాసిరక ఖనిజాల ఉత్పత్తి జరుగుతోందని చెబుతున్నారు.అలాగే అనేఖ ఖనిజవనరుల ప్రాంతాలు పర్యావరణ సమస్యల్లో చిక్కుకున్నాయని తెలిపారు.
అయితే, సముద్ర గర్భంలో తవ్వకాలు అనేవి భూమిపై చివరి ఆప్షన్ అని, ఈ ఖనిజాల తవ్వకం మానవాళికి కోలుకోలేని నష్టం కలగచేస్తుందని పర్యావరణ ప్రచారకర్తలు చెబుతున్నారు.
సముద్ర గర్భంలో జీవావరణ వ్యవస్థల గురించి సమాచారం లేనందున తవ్వకాలను ఆపేయడమో, తాత్కాలిక విరామం ప్రకటించడమో చేయాలని యూకే, జర్మనీ, బ్రెజిల్, కెనడా సహా దాదాపు 20కు పైగా దేశాలు డిమాండ్ చేస్తున్నాయి.
క్లీన్ ఎనర్జీ టెక్నాలజీ డిమాండ్‌ను అందుకోవడానికి 2050 నాటికల్లా కీలకమైన ఖనిజాల తవ్వకం ఐదురెట్లు పెరగాలని ప్రపంచ బ్యాంక్ అంచనా వేసింది.
భారత్ తన ఇంధన అవసరాలలో సగభాగాన్ని పునరుత్పాదకశక్తి ద్వారా తీర్చుకునేందుకు వీలుగా 2030 నాటికల్లా 500 గిగావాట్స్ పునరుత్పాదక శక్తిని ఉత్పత్తి చేయాలనే స్వల్పకాలిక లక్ష్యాన్ని విధించుకుంది. అలాగే 2070 నాటికల్లా కర్బన ఉద్గాలను సున్నా స్థాయికి చేర్చాలనే లక్ష్యాన్ని పెట్టుకుంది.
ఈ లక్ష్యాన్ని చేరుకునేందుకు భారత్‌కు సముద్ర గర్భం సహా వీలున్న ప్రతిమార్గంలోనూ కీలకమైన ఖనిజాలను వెలికితీయాల్సిన అవసరం ఉందని నిపుణులు చెబుతున్నారు.
చైనా ఆధిపత్యం

ఫొటో సోర్స్, @ESSO_INCOIS
ప్రస్తుతం అవనిలోని ఖనిజాల వెలికితీతపై కొన్ని దేశాలు ఆధిపత్యం చాటుతున్నాయి. లిథియం ఉత్పత్తిల్లో ఆస్ట్రేలియా, కాపర్ ఉత్పత్తిలో చీలీ, చైనా గ్రాఫైట్, స్మార్ట్ ఫోన్, కంప్యూటర్లలో వినియోగించే రేర్ ఎర్త్ మూలకాల ఉత్పత్తిలో ఆధిపత్యం చూపుతున్నాయి.
కానీ ఖనిజాల శుద్ధిలో చైనా అధిపత్యంపై భౌగోళిక రాజకీయ ఆందోళనలు ఉన్నాయి. ఇంటర్నేషనల్ రెన్యూవబుల్ ఎనర్జీ ఏజెన్సీ ప్రకారం దశాబ్దాల తరబడి ఖనిజ శుద్ధి సాంకేతికతలో చైనాకు ఎదురులేకుండా ఉంది. సహజ గ్రానైట్, డైస్పొరిసియం శుద్ధిపై నూరుశాతం నియంత్రణ చైనాదే. అలాగే కోబాల్ట్ పై 70 శాతం, శుద్ధి చేసిన లిథియం, మాంగనీస్ పై దాదాపు 60 శాతం ఆధిపత్యాన్ని కలిగి ఉందని తెలిపింది.
దీనికితోడు ఇటీవల కొన్ని ప్రాసెసింగ్ టెక్నాలజీల ఎగుమతిని బీజింగ్ నిషేధించింది.
‘‘రాజకీయ లబ్ధి కోసం మార్కెట్ శక్తిని ఆయుధంగా మార్చుకోవాలని చూస్తున్న ఆధిపత్య సరఫరా దారుకు వ్యతిరేకంగా మేం పోరాడుతున్నాం’’ అని ‘కీలక ఖనిజాలు, శుద్ధ శక్తి సదస్సు’లో యూఎస్ ఎనర్జీ సెక్రటరీ జెన్నిఫర్ గ్రాన్‌హోం అన్నారు.
మరోపక్క ఖనిజ శుద్ధి రంగంలో చైనా ఆధిపత్యానికి ప్రతిగా అమెరికా, అనేక పశ్చిమ దేశాలు ఖనిజ భద్రత భాగస్వామ్యాన్ని 2022లో ప్రారంభించాయి. ‘‘కీలక ఖనిజాల సరఫరా గొలులో పెట్టుబడులకు’ ఈ భాగస్వామ్యం ఉత్ప్రేరకంగా నిలుస్తోంది. ప్రస్తుతం ఇండియా కూడా ఇందులో భాగస్వామి.
లోతైన సముద్ర గర్భ మైనింగ్ సాంకేతికతను అభివృద్ధి చేయడంపై రష్యాతో ఒక ఒప్పందంపై ఇండియా సంతకం చేసింది.
‘‘పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు కీలక ఖనిజాలను వెలికి తీసి, శుద్ధి చేసి వినియోగించడాన్ని వేగవంతం చేస్తున్నాయి’’ అని పికార్సిక్ చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- ఆమె 58 ఏళ్ల వయసులో మళ్లీ తల్లయింది, రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్రం వివరణ కోరింది...చట్టం ఏం చెబుతోంది?
- మనిషి మెదడులోకి పురుగులు ఎలా వస్తాయి?
- పొట్టలో ఏలిక పాములు ఎలా చేరతాయి, వాటిని ఎలా తొలగించాలి?
- 'కలుపు దెయ్యాల'ను 141 ఏళ్ల కిందట భూమిలో పాతిపెట్టినా చావలేదు... అవి ఇలాఎంతకాలం జీవిస్తాయి?
- మహిళలకు సున్తీ: ఇప్పటి వరకు ఉన్న నిషేధాన్ని తొలగించడంపై గాంబియా మహిళలు ఏమంటున్నారు?
బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














