అడవుల్లో తీరొక్క కాయలు, పండ్లు తినాల్సిన ఈ జంతువులు ఏం తింటున్నాయంటే..

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, వెడెలీ చీబెలుషి, నటాషా బూటీ
- హోదా, బీబీసీ న్యూస్
యుగాండా అడవుల్లోని జంతువులు వైరస్‌లున్న గబ్బిలాల మలాన్ని తింటున్నాయని తాజా అధ్యయనంలో వెల్లడైంది. వాటి సాధారణ ఆహార వనరులు లేకుండాపోవడంతో, ఇవి కడుపు నింపుకోవడం కోసం గబ్బిలాల మలాన్ని తింటున్నట్టు పరిశీలకులు గుర్తించారు.
చింపాజీలు, కోతులు, జింకలు తినే గబ్బిలాల మలంలో కోవిడ్-19కు కారణమైన వైరస్‌తో పాటు 27 రకాల వైరస్‌లు ఉన్నట్టు తేలింది.
వన్య ప్రాణుల నుంచి మానవుల్లోకి కొత్త వైరస్‌లు ఎలా వ్యాప్తి చెందుతున్నాయో ఈ అధ్యయనం తెలియజేస్తుందని పరిశోధకులు చెప్పారు.
స్టిర్లింగ్ విశ్వవిద్యాలయం, విస్కాన్సిన్-మాడిసన్ విశ్వవిద్యాలయం కలిసి చేపట్టిన అధ్యయనంలో ఈ వన్యప్రాణులను పర్యవేక్షించారు.
బుడోంగో అడవుల్లోని చెట్ల గుహల్లో నుంచి చింపాజీలు గబ్బిలాల మలాన్ని తింటున్నట్లు స్కాట్లాండ్‌లోని స్టిర్లింగ్ విశ్వవిద్యాలయం, నేచురల్ సైన్స్ ఫ్యాకల్టీ డాక్టర్ పావెల్ ఫెడరెక్ గుర్తించిన తర్వాత ఆరేళ్ల ప్రాజెక్టును చేపట్టారు.
2017 జూలైలో ఆయన కెమెరాలను ఏర్పాటు చేశారు. ఇతర వన్యప్రాణులు కూడా మలాన్ని తింటున్నట్లు ఈ కెమెరాల్లో రికార్డయింది.
నేచర్ జర్నల్‌లో ప్రచురితమైన అధ్యయనంలో, ఒకప్పుడు జంతువులకు ఆహారంగా ఉన్న తాటి చెట్లు అంతరించిపోవడంతో ప్రస్తుతం గ్వానో(గబ్బిలాల మలం) వీటిని అత్యంత కీలకమైన మినరల్స్‌కు ప్రత్యామ్నాయ వనరుగా ఉంటుందని తెలిసింది.

ఫొటో సోర్స్, Getty Images
పొగాకు ఆకులను ఎండబెట్టేందుకు బుడోంగోలోని స్థానికులు ఈ చెట్లను వాడుతున్నారు. ఆ తర్వాత ఆ పాగాకును అంతర్జాతీయ కంపెనీలకు విక్రయిస్తున్నారు.
ఆరు నెలల పాటు జంతువులు తినే గ్వానో శాంపుల్స్‌ను పరిశోధకులు సేకరించారు.
వీటిపై ల్యాబ్‌లో చేపట్టిన పరిశీలనలో, పలు రకాల వైరస్‌లు ఉన్నట్లు గుర్తించారు. వాటిలో కోవిడ్-19 మహమ్మారికి సంబంధించిన వైరస్ SARS-CoV-2 కూడా ఉంది.
‘‘అయితే, గ్వానోలో గుర్తించిన బీటాకరోనోవైరస్‌నే మనుషులకు వ్యాపించిందా అన్నది ఇంకా తెలియలేదు’’ అని యూనివర్సిటీ ఆఫ్ స్టెర్లింగ్ పత్రికా ప్రకటనలో తెలిపింది.
‘‘మేం గుర్తించిన 27 వైరస్‌లలో పావు వంతు వైరస్‌లు క్షీరదాలకు చెందినవి. మిగిలిన వైరస్‌లు కీటకలు, ఇతర అకశేరుకాలకు చెందినవి’’ అని అమెరికాలోని విస్కాన్సిన్-మాడిసన్ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ టోని గోల్డ్‌బెర్గ్ బీబీసీకి చెప్పారు.
‘‘ అన్ని 27 వైరస్‌లు సైన్స్‌కు కొత్తవి. వీటి వల్ల మనుషులు లేదా ఇతర జంతువులపై ఎలాంటి ప్రభావం ఉంటుందో ఇంకా మనకు తెలియదు. కానీ, ఒక వైరస్ గురించి అయితే ప్రతి ఒక్కరికీ తెలిసిందే. అదే సార్స్ కరోనావైరస్ 2’’ అని అన్నారు.

ఫొటో సోర్స్, GETTY IMAGES
‘‘పొగాకుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిమాండ్ వల్ల, అడవుల నరికివేత ఎలా ఉందో మా పరిశోధన తెలియజేస్తుంది. వన్యప్రాణులు బయటికి వచ్చి, గబ్బిలాల మలంలో ఉన్న వైరస్‌లు మనుషులకు విస్తరించేందుకు ఎలా కారణమవుతుయో, వైరస్‌ల ముప్పును ఎలా పెంచుతున్నాయో ఈ పరిశోధన చెబుతుంది’’ అని యూనివర్సిటీ ఆఫ్ స్టెర్లింగ్‌లో జంతువుల ప్రవర్తనపై అధ్యయనం చేసే నిపుణులు డాక్టర్ పావెల్ ఫెడరెక్ చెప్పారు.
‘‘మేం చేపట్టిన ఇలాంటి అధ్యయనాలు వన్యప్రాణుల నుంచి వన్యప్రాణులకు, వన్యప్రాణుల నుంచి మనుషులకు వైరస్‌లు ఎలా సోకుతున్నాయో తెలియజేస్తున్నాయి. దీని వల్ల భవిష్యత్‌లో ఈ మహమ్మారులను నిర్మూలించే మన సామర్థ్యాలను మెరుగుపరుచుకునేందుకు వీలుంటుంది’’ అని తెలిపారు.
పలు జీవుల మధ్య వ్యాప్తి చెందుతున్న వైరస్‌లకు అడ్డుకట్ట వేసి, భవిష్యత్‌లో మహమ్మారులు వ్యాప్తి చెందకుండా నిర్మూలించేందుకు తమ పరిశోధనలో కనుగొన్న అంశాలు ఉపయోగపడతాయని పరిశోధకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
- మెక్సికో: అజ్జెక్ ఆదిమ జాతి కట్టిన భారీ పుర్రెల బురుజు చెప్తున్న రహస్యాలేమిటి?
- ఇజ్రాయెల్ ఒక చిన్న ఆపరేషన్‌తో ఇరాన్‌కు బలమైన హెచ్చరిక పంపిందా?
- వెయ్యేళ్ల నాటి ఈ అస్థిపంజరం కోసం నాజీలు, సోవియట్లు ఎందుకు పోరాడారు?
- గాజా యుద్ధం: ఇజ్రాయెల్‌కు ఆయుధాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి?
- ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు: వైసీపీకి చిక్కవు, టీడీపీకి దొరకవు
- 'ఇంట్లో చొరబడి చంపేస్తాం' అన్న మోదీ వ్యాఖ్యలపై అమెరికా ఏమందంటే..
బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














