చిలీ: ‘నరకం అంటే ఏంటో మాకు భూమ్మీదే కనిపిస్తోంది’ అని స్థానికులు ఎందుకు అంటున్నారు?

చిలీలో కార్చిచ్చు.

ఫొటో సోర్స్, JAVIER TORRES / GETTY

ఫొటో క్యాప్షన్, కార్చిచ్చుకు అత్యంత ప్రభావిత పట్టణాలలో ఒకటైన వినా డెల్ మార్ కొండలలో ఇళ్ళు మంటల్లో చిక్కుకున్నాయి.

చిలీలోని వల్పరైసో ప్రాంతంలో మొదలైన అటవీ కార్చిచ్చులో 51 మంది మరణించారని స్థానిక అధికారులు తెలిపారు.

ఈ క్రమంలో అత్యవసర పరిస్థితి విధిస్తున్నట్లు అధ్యక్షుడు గాబ్రియెల్ బోరిక్ ప్రకటించారు. ఈ విపత్కర పరిస్థితిని ఎదుర్కోవడానికి అవసరమైన అన్ని వనరులను అందుబాటులో ఉంచామని చెప్పారు.

చిలీలో సంభవించిన అత్యంత ఘోరమైన కార్చిచ్చుల్లో ఇదొకటని స్థానికులు, అధికారులు చెబుతున్నారు.

ఈ ప్రమాదంలో చిక్కుకున్న వారిలో చాలామంది వేసవి నుంచి ఉపశమనం పొందేందుకు తీర ప్రాంతానికి వచ్చినవారే ఎక్కువగా ఉన్నారు.

అత్యవసర వైద్య సేవలు తప్ప మిగిలిన వాటిని ప్రస్తుతానికి నిలిపేయాలని, ఫీల్డ్ హాస్పిటల్స్‌ను ఏర్పాటు చేయాలని ఆ దేశ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తమ సిబ్బందిని ఆదేశించింది.

ఆరోగ్య సర్వీసులపై ఒత్తిడి తగ్గించేందుకు మెడిసిన్ విద్యార్ధుల సేవలను వినియోగించుకోవాలని ఆ ఆదేశాలలో పేర్కొన్నారు.

చిలీ అగ్ని ప్రమాదం

ఫొటో సోర్స్, EPA-EFE/REX/SHUTTERSTOCK

ఫొటో క్యాప్షన్, కార్చిచ్చుకు చాలా ఇళ్లు కాలిపోయాయి.

రెస్క్యూ సర్వీసులు అత్యంత తీవ్ర ప్రభావం ఉన్న ప్రాంతాలను చేరుకోవడానికి చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. రాబోయే కొద్దిగంటల్లో మరణాల సంఖ్య పెరగొచ్చని ఆ దేశ హోంశాఖమంత్రి కరోలినా తోహా చెప్పారు.

అత్యవసర సర్వీసుల బృందాలు మంటల్లో చిక్కుకున్న అనేక ప్రాంతాలకు చేరుకోలేక పోతున్నాయని, అందువల్ల బాధితులు ఎందరు, నష్టం ఎంత అన్నది చెప్పడం కష్టంగా మారిందని కరోలినా వెల్లడించారు.

కార్చిచ్చు ఉన్న ప్రదేశాలకు దూరంగా ఉండాలని ప్రభుత్వం ప్రజలకు సూచించించింది.

ఎల్ ఒలివర్‌లోని 61 ఏళ్ల స్థానికుడు రోడ్రిగో పుల్గర్ ఈ ప్రమాద తీవ్రతను వివరిస్తూ పరిస్థితి చూస్తే నరకంలో ఉన్నట్లు ఉందని ఏఎఫ్‌పీ వార్తా సంస్థతో అన్నారు.

‘‘మా నాన్న పొరుగున ఉన్నవారికి సాయం చేసేందుకు వెళ్లారు. ఈ లోగా మా ఇల్లు కాలిపోయింది’’ అని ఆయన వెల్లడించారు.

"మాపై బూడిద వర్షంలా కురుస్తోంది" అని పుల్గర్ అన్నారు.

ఎల్ ఒలివర్‌లో నివసిస్తున్న చాలామంది వృద్ధులేనని, తన పక్కింట్లో ఓ వృద్ధురాలిని బయటకు తీసుకురాలేకపోవడంతో ఆమె మరణించారని పుల్గర్ వివరించారు.

చిలీ అగ్ని ప్రమాదం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, వినా డెల్ మార్ కొండలలో మంటల అనంతర దృశ్యాలు.

ఈ కార్చిచ్చు కారణంగా దాదాపు 3,000 నుంచి 6,000 ఇళ్లు దెబ్బతిన్నాయని గృహనిర్మాణ మంత్రిత్వ శాఖ తెలిపింది.

శనివారం, వినా డెల్ మార్, లిమాచే, క్విల్‌ప్యూ, విల్లా అలెమనా ప్రాంతాలలో కర్ఫ్యూ విధించారు.

ఆదివారం సుమారు 1,400 మంది అగ్నిమాపక సిబ్బందిని మోహరిస్తున్నట్లు హోంమంత్రి వెల్లడించారు. అత్యవసర సేవలతో పాటు సైనిక సిబ్బందిని కూడా మోహరించారు. మంటలకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.

ఇప్పటికే సున్నితంగా ఉన్న పరిస్థితి మరింత తీవ్రతరం కాకుండా ఉండటానికి, వాల్పరైసో సమీపంలోని వేడిని, నిప్పును ఉత్పత్తి చేసే యంత్రాలతో పనిని నిలిపేయాలని ప్రభుత్వం ఆదేశించింది.

రాజధాని శాంటియాగోకు 116 కిమీ దూరంలో ఉన్న వాల్పరైసో తీరప్రాంత పట్టణం వేసవిలో చాలా మంది పర్యాటకులను ఆకర్షిస్తుంది.

45 మంది మంటల్లో చిక్కుకుని మరణించారని, 6గురు కాలిన గాయాలతో ఆసుపత్రులలో మరణించారని స్థానిక మీడియా రిపోర్ట్ చేసింది.

గత సంవత్సరం కూడా చిలీలోని కొన్ని ప్రాంతాలలో ఘోరమైన కార్చిచ్చులు సంభవించాయి.

వీడియో క్యాప్షన్, ఉప్పెన సినిమాలో కనిపించిన రామాలయం ఇప్పుడు లేదెందుకు? ఈ ఊరిని సముద్రం మింగేస్తోందా?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)